స్టాక్ మార్కెట్: ఇదోరకం మోసం.. కొన్ని సెకన్ల ముందు సమాచారం తెలుసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు

సేవింగ్స్, గడియారం, డబ్బులు, పొదుపు బ్యాంకు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఫైనాన్స్, స్పోర్ట్స్‌ రంగాల్లో సెకన్ల సమయాన్ని ఆదా చేసుకుంటూ కొందరు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు

తాజాగా బ్రిటన్‌కు చెందిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు ఉన్నతాధికారుల మీడియా సమావేశానికి సంబంధించిన ఆడియో ఫీడ్‌ను మార్కెట్ ట్రేడర్లు రహస్యంగా విన్నారని, స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అత్యంత సున్నితమైన సమాచారం కొన్ని సెకన్ల ముందే వాళ్లకు తెలిసిపోయిందని ఆ ప్రకటనలో తెలిపింది.

మార్కెట్‌ను ప్రభావితం చేసే సున్నితమైన సమాచారం మిగతా ట్రేడర్ల కంటే కొన్ని సెకన్ల ముందు తెలిసినా కోట్లు సంపాదిస్తారు. తమ ఆడియో లీక్‌ను హెడ్జ్ ఫండ్స్‌‌ నిర్వాహకులు అలాగే వాడుకున్నారని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పేర్కొంది.

ఏం జరిగింది?

భారత్‌లో రిజర్వ్ బ్యాంక్ ఎలాగో, యూకేలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అలాంటిది. కాబట్టి, ఈ బ్యాంకు తీసుకునే నిర్ణయాల ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద చాలానే ఉంటుంది.

అంతర్గత సమావేశాలలో ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాల గురించి తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తుంటారు.

దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది? ద్రవ్యోల్బణం, వృద్ధి రేటులో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? కీలకమైన వడ్డీ రేట్లలో ఏమైనా మార్పులు చేస్తున్నారా? లాంటి విషయాలను బ్యాంకు గవర్నర్ తరచూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంటారు.

అలాంటి సున్నితమైన సమాచారం బయటకు రాగానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే దేశ కరెన్సీ మారకం విలువ, మార్కెట్‌లో షేర్ల విలువలో భారీగా హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు చెందిన ఆడియో ఫీడ్ లీకేజీతో అలాగే జరిగింది. ఆ సమావేశానికి సంబంధించిన వివరాలు వీడియో రూపంలో (బ్రాడ్‌కాస్టింగ్) ప్రజలకు చేరే లోపే, హెడ్జ్ ఫండ్స్ నిర్వాహకులకు తెలిసిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన సెంట్రల్ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఒకటి

చాలా బ్యాంకులు ప్రెస్ కాన్ఫరెన్సులను వీడియో రూపంలో ప్రసారం చేస్తాయి. అదే సమయంలో, ఆడియో బ్యాకప్‌ కూడా తీస్తారు. అలా తీసిన బ్యాకప్ ఫీడ్‌ను 'దుర్వినియోగం' చేశారని బ్యాంకు తెలిపింది. ఆ లీక్‌ వల్ల బ్యాంకు ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాలను అందరికంటే 5 నుంచి 8 సెకన్ల ముందే ఆ ట్రేడర్లు విన్నారు.

దాదాపు ఏడాది కాలంగా బ్యాంకు మీడియా సమావేశాల ఆడియోను ట్రేడర్లు దొంగచాటుగా వింటున్నట్లు తెలుస్తోందని ది టైమ్స్ వార్తా పత్రిక రాసింది.

"ఆ ఆడియో ఫీడ్‌ను వినియోగించడం అక్రమం. బ్యాంకుకు తెలియకుండా, అనుమతి లేకుండా ఆ సమాచారాన్ని ట్రేడర్లకు దొడ్డిదారిన చేరవేయడంపై విచారణ జరుపుతున్నాం" అని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

'అదో వ్యాపారం'

ట్రేడర్ల దగ్గర డబ్బులు తీసుకుని ఆడియో సమాచారాన్ని వారికి గుట్టుచప్పుడు కాకుండా చేరవేస్తున్నారని, ఆ బేరసారాలకు సంబంధించిన కొన్ని పత్రాలు కూడా దొరికాయని టైమ్స్ పేర్కొంది.

ఇలా ఆడియో లీక్‌ చేసేందుకు ఒక్కో మీడియా సమావేశానికి ఒక్కో క్లయంట్ దగ్గరి నుంచి 2,500 పౌండ్ల నుంచి 5,000 పౌండ్ల దాకా వసూలు చేస్తున్నారు.

యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ కెనడాల ప్రెస్ కాన్ఫరెన్సుల నుంచి కూడా స్కాక్ మార్కెట్ ట్రేడర్లకు ఇలాగే సమాచారం లీకవుతోందని కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఇలాంటి ఉదంతాలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images

మైక్రోవేవ్ నెట్‌వర్కు

చాలా తరచుగా ట్రేడింగ్ చేసే ట్రేడర్లు మార్కెట్‌లో కదలికలను ఇతరుల కంటే అత్యంత వేగంగా తెలుసుకోవాలి కాబట్టి, అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్లను, హైస్పీడ్ ఇంటర్నెట్ వాడుతుంటారు.

ఒకవేళ మిగతా కంపెనీలు కేబుల్ ఆధారిత నెట్‌వర్కులను వాడుతుంటే, వీళ్లు మాత్రం అత్యంత వేగంగా సమాచారాన్ని బదిలీ చేసే సూక్ష్మ తరంగ (మైక్రోవేవ్) నెట్‌వర్కులను వినియోగిస్తారు.

ఆ రెండు నెట్‌వర్కుల ద్వారా సమాచారం బదిలీ వేగంలో కొంత తేడా ఉంటుంది. అలా ఒక సెకను ముందుగా సమాచారం తెలిసినా ట్రేడర్లు కోట్లు సంపాదించొచ్చు.

2010లో అమెరికా స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలడానికి ఈ తరహా ట్రేడింగ్ జిమ్మిక్కులే కారణమని నిపుణులు చెబుతుంటారు. అప్పుడు కొన్ని నిమిషాల వ్యవధిలోనే అమెరికా స్టాక్ మార్కెట్‌లో షేర్ల విలువ ట్రిలియన్ డాలర్లు పడిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images

'క్రీడల బెట్టింగ్'

ఒక్క స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్ మాత్రమే కాదు, క్రీడల మీద బెట్టింగులు నిర్వహించేవారు కూడా కొందరు ఇలాగే చేస్తారు.

మ్యాచ్ గెలుపు ఎటువైపు వెళ్తోందన్న విషయాన్ని మిగతా వారికంటే సెకన్ల ముందే తెలుసుకునేందుకు బుకీలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.

జూదగాళ్లు వేసే ఎత్తులలో కోర్ట్‌సైడింగ్ ఒకటి. ఈ టెక్నిక్‌తో జూదగాళ్లు ఎంతో మందిని నిలువునా ముంచేస్తున్నారని ఒక ప్రొఫెషనల్ జూదగాడు బీబీసీతో చెప్పారు. తన అసలు పేరును బయటపెట్టొద్దని, జోయ్‌ అని మారుపేరుతో పిలవాలని ఆయన కోరారు.

కీలకమైన టెన్నిస్ టోర్నమెంట్ల మీద ఆయన ఆన్‌లైన్‌లో బెట్టింగులు పెడుతూ ఉంటారు. ఇదంతా ఇతరులను మోసం చేయడమేనని జోయ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)