నదియా విటామ్: ఈ 23 ఏళ్ల ఎంపీ సగం జీతం చాలంటున్నారెందుకు?

నదియా

ఫొటో సోర్స్, Nadia Whittome

నదియా విటామ్.. బ్రిటన్ పార్లమెంటులో అత్యంత పిన్నవయస్కురాలైన ఎంపీ. మొన్నటి ఎన్నికలకు ముందు ఆమె ఎవరో కూడా చాలామందికి తెలియదు.

కానీ, ఈ 23 ఏళ్ల ఎంపీ తాజాగా తన ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

తన జీతంలో భారీ మొత్తాన్ని స్థానిక ప్రజలకు ఇస్తానని ఆమె ప్రకటించారు.

ఇంగ్లిష్ మిడ్‌లాండ్స్‌లోని నాటింగ్‌హామ్ ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె తన విజయానికి ముందు బీబీసీతో మాట్లాడుతూ తాత్కాలిక ఉద్యోగాల కోసం వెతుకుతున్నానని చెప్పారు.

80 వేల పౌండ్ల (సుమారు రూ. 73.98 లక్షల) తన వార్షిక వేతనంలో 35 వేల పౌండ్లు (సుమారు రూ.32.36 లక్షలు) మాత్రమే తీసుకుంటానని ప్రకటించారామె.

బ్రిటన్ 'జాతీయ గణాంక కార్యాలయం' లెక్కల ప్రకారం అక్కడ సగటు కార్మికుడి వేతనం ఏడాదికి 35 వేల పౌండ్లని.. కాబట్టి తానూ ఏడాదికి అంతే తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశానని ఆమె చెప్పారు.

మిగతా మొత్తాన్ని తన నియోజకవర్గంలో నిధులు లేక ముందుకు సాగని పనుల పూర్తికి, స్ట్రైక్ ఫండ్స్, ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారామె.

దాతృత్వం కోసం కాదు..

తానేమీ దాతృత్వం చాటుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేయడం లేదని.. ఆర్థిక సంక్షోభం తరువాత కోతల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వరంగ ఉద్యోగులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారామె.

35000 పౌండ్లే తాను తీసుకుంటున్నాననంటే ఎంపీలు అంతకంటే ఎక్కువ జీతానికి అర్హులు కారని కాదని.. అయితే, టీచింగ్ అసిస్టెంట్లు, నర్సులు, ఫైర్ ఫైటర్లు వంటివారు ఇంతే పొందుతున్నారని అన్నారు.

వారికి దక్కాల్సినంత వేతనం దక్కినప్పుడు తాను కూడా ఎక్కువ జీతం తీసుకుంటానని.. తన నిర్ణయం వేతనాలపై చర్చకు దారితీస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.

విద్వేష నేరాల బారిన పడినవారికి సహాయకారిగా గతంలో వ్యవహరించిన నదియా న్యాయశాస్త్ర పట్టభద్రురాలు. నాటింగ్‌హామ్ ఈస్ట్ నుంచి లేబర్ పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు.

అంతకుముందు అక్కడి నుంచి ఎంపీగా ఉన్న క్రిస్ లెస్లీ లేబర్ పార్టీని వీడడంతో నదియాకు అవకాశం దొరికింది.

''కొన్ని నెలల కిందట వరకు నేనిలా ఎంపీనవుతానని ఊహించలేదు. అన్నీ చకచకా జరిగిపోయాయి'' అన్నారామె.

రాజకీయాల్లోకి రావాలని నదియా 2013లో అనుకున్నారు. ఆర్థిక సంక్షోభం తరువాత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలపై పోరాడేందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారామె.

''నా పొరుగువారు, స్నేహితులు, కుటుంబసభ్యులు తిండికి కూడా కష్టపడుతున్న సంగతి చూశాను'' అన్నారు.

''న్యూయార్క్ నుంచి నాటింగ్‌హామ్ వరకు ప్రగతిశీల కొత్త తరం కీలక భూమిక పోషిస్తోంది. మాది శ్రామిక వర్గం, నల్ల రంగు మహిళలం.. అణచివేత, దోపిడీ, విద్వేష నేరాల వల్ల కలిగే బాధ నాకు తెలుసు'' అన్నారామె.

భిన్నాభిప్రాయాలు

ఆమె పార్లమెంటుకు ఎన్నికైన తరువాత సోషల్ మీడియాలో పెద్దసంఖ్యలో నెటిజనులు ఆమెను అభినందించారు.

అయితే, తన జీతంలో అధిక భాగాన్ని వదులుకోవాలన్న ఆమె నిర్ణయం మాత్రం అందరినీ ఆకట్టుకోలేదు.

కొందరు నేతల నుంచీ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కానీ, నదియా మాత్రం తాను తీసుకున్న నిర్ణయం ఎంపీల విలువను తగ్గించేదేమీ కాదని అన్నారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)