పౌరసత్వ గుర్తింపు పత్రాల కోసం ఎడతెగని పోరాటం చేస్తున్న శ్రీలంక భిక్కుని సన్యాసినిలు

  • సరోజ్ పతిరణ
  • బీబీసీ న్యూస్ సింహళ
శ్రీలంక బౌద్ధ సన్యాసినులు

ఈ యువ సన్యాసిని తన కథను కన్నీళ్లతో చెప్తోంది.

ఈమె పేరు అమునువటి సమంతభద్రిక తేరీ. ''అవసరమైన పత్రాలన్నీ నా దగ్గరున్నాయి. కానీ నాకు గుర్తింపు కార్డు ఇవ్వటానికి బౌద్ధ వ్యవహారాల విభాగం తిరస్కరించింది'' అని వివరించింది.

ఆమె కన్నీళ్లు పెట్టుకోవటంలో ఆశ్చర్యం లేదు. శ్రీలంకలో జీవించటానికి ఒక గుర్తింపు కార్డు చాలా కీలకం. ఓటు వేయటం మొదలుకుని బ్యాంకు ఖాతా తెరవటం వరకూ.. పాస్‌పోర్టు పొందటం నుంచి ఉద్యోగానికి దరఖాస్తు చేయటానికి.. చివరికి పరీక్షలు రాయటానికి కూడా అది అవసరం.

కానీ సమంతభద్రికకు గుర్తింపు కార్డు పొందే అర్హత లేదు. ఆమె వంటి మహిళలకు గుర్తింపు కార్డు హక్కును 2004లో రద్దు చేశారు. వీరికి 'భిక్కునిలు' అనే గుర్తింపు కార్డులు జారీ చేయటం ఆపివేయాలని, వారిని అసలు గుర్తించనే వద్దని దేశంలో పలుకుబడిగల మతపెద్దలు ప్రభుత్వానికి చెప్పటం దానికి కారణం.

అప్పటి నుంచీ బౌద్ధ భిక్కునిల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారు సేవ చేసే సమాజం వారిని ఎంతో ఆదరిస్తుంది. కానీ ఆ సమాజానికి గల హక్కులు మాత్రం వారికి లేవు.

''మమ్మల్ని ఏదో వేరే గ్రహం నుంచి వచ్చినట్లు చూస్తున్నారు. అన్ని రకాలుగా మా మీద వివక్ష చూపుతున్నారు'' అని దేశంలో ఉన్నత సన్యాసినుల్లో ఒకరైన కోత్మలీ శ్రీ సుమేధ భిక్కుని బీబీసీకి చెప్పారు. ''మేం కూడా ఇదే మట్టి మీద పుట్టాం. బుద్ధిడి కుమార్తెలం. ఇది లింగ వివక్ష తప్ప ఇంకేమీ కాదు'' అంటారామె.

1998లో ఉన్నత సన్యాసిని హోదా పొందిన 20 మందిలో ఆమె ఒకరు.

ఫొటో క్యాప్షన్,

సుదీర్ఘ పోరాటం తర్వాత సమంతభద్రిక స్కూల్ ఫైనల్ పరీక్షలు రాయగలిగింది

'వారి ఆలోచనలు ఎంత క్రూరంగా ఉన్నాయో?'

శ్రీలంకలో 1,000 సంవత్సరాలుగా భిక్కునిలు ఎవరూ లేరు. ఈ దీవి దేశం మీద యుద్ధం చేసిన రాజులు.. ప్రధానంగా దక్షిణ భారత హిందూ రాజుల దాడులు, అణచివేత వల్ల భిక్కునిల వారసత్వం అంతరించిపోయింది.

వేయి సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా 1998లో నూతన భిక్కునిలను మతపరంగా ఏర్పాటుచేశారు. ఆ సంవత్సరం చివరికి 150 మంది భిక్కునిలు ఉంటే.. ఇప్పుడు 4,000 మందికి పైగా ఉన్నారని అంచనా. వారిలో ఆరేళ్ల వయసు చిన్నారులు కూడా ఉన్నారు.

కానీ ఈ పరిణామం పట్ల కొందరు అసంతృప్తిగా ఉన్నారు. శ్రీలంకలో ఆచరించే బౌద్ధ సంప్రదాయంలో మతపరంగా ఉన్నతస్థాయి హోదా గల సన్యాసినులు ఎవరూ లేనందున.. బుద్ధుడు మళ్లీ ఆవిర్భవించే వరకూ భిక్కునిల శ్రేణిని పునఃస్థాపించజాలమని ప్రధాన మత గురువులు వాదించారు. అసలు భిక్కునిల మనుగడనే మరికొందరు వ్యతిరేకించారు.

''మహిళలతో సన్యాసినుల సభకు బుద్ధుడు వాస్తవంగా అనుమతి ఇచ్చినప్పటికీ.. ఈ ప్రపంచంలో స్త్రీలు చాలా బలహీనమైన వారని, ఇతరులు వారిని వేధిస్తారని ఆయన సంశయించారు'' అని మాంటా భనీ అనే బౌద్ధ సన్యాసి 1998లో బీబీసీతో పేర్కొన్నారు.

ఆరేళ్ల తర్వాత.. గుర్తింపు కార్డు హక్కును రద్దు చేశారు.

సమంతభద్రిక తాను స్కూలు చివరి పరీక్షలు రాయటానికి వీలుగా జాతీయ గుర్తింపు కార్డు (నేషనల్ ఐడెంటిటీ కార్డు - ఎన్ఐసీ) పొందాలని అనుకున్నారు. ఆ గుర్తింపు కార్డు లేని వారు ఎవరూ 'అడ్వాన్స్‌డ్ లెవల్' పరీక్షలు రాయటానికి వీలు లేదు.

''ప్రధాన మత గురువుల అనుమతి లేనిదే తాను జాతీయ గుర్తింపు కార్డును జారీ చేయలేనని బౌద్ధ వ్యవహారాల కమిషనర్ చెప్పారు'' అని ఆమె బీబీసీకి తెలిపారు. శ్రీలంక వాయువ్య ప్రాంతంలో మారుమూలన గల పోతుహర పట్టణంలో ఒక ఆలయంలో ఆమె బీబీసీతో మాట్లాడారు.

''నాకు చాలా బాధ కలిగింది. ఆ పరీక్ష రాయలేనని అనుకున్నాను. అప్పుడు మేం నేషనల్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లాం. వాళ్లు కూడా తిరస్కరించారు. ఆ సమయంలో నా గురు భిక్కుని, నా సోదరి భిక్కుని ఇద్దరూ ఏడ్చేశారు'' అని వివరించారు.

ఫొటో క్యాప్షన్,

శ్రీలంకలో బౌద్ధ సన్యాసినులకు గుర్తింపు కార్డులు జారీ చేయటం లేదు.. దీనివల్ల వీరు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు

ఒకవేళ సమంతభద్రిక గనుక బాలుడు అయివున్నట్లయితే.. పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. పదహారేళ్ల వయసు దాటిన ప్రతి బౌద్ధ సన్యాసికీ.. వాళ్లు ఆ సభలో చేరినప్పుడు వారికి ఇచ్చిన పేర్లతో జాతీయ గుర్తింపు కార్డు జారీ చేస్తారు. వారి జన్మస్థలం పేరుతో పాటు, ప్రత్యేక బౌద్ధ నామంతో ఆ గుర్తింపు కార్డు ఉంటుంది.

''ఈ దేశంలో మమ్మల్ని ఎందుకు వేరేగా చూస్తున్నారు? వారి ఆలోచనలు ఎంత క్రూరమైనవి?'' అని అడుగుతున్నారు హల్పనదెనియె సూపెసాల భిక్కుని.

సూపెసాల దేకాందువెల భిక్కుని ట్రైనింగ్ పిరివేనలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కలుతర జిల్లాలోని ఈ సంస్థ ఇటీవలే గుర్తింపు పొందింది. ఆమె శ్రీలంక విద్యా మంత్రిత్వశాఖలో సన్యాసినుల సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు.

''ఈ దేశంలో మరెవరినీ.. మరే ఇతర మతపరమైన లేదా జాతిపరమైన సమాజాన్నీ మమ్మల్ని చూసినట్లుగా అన్యాయంగా చూడటం లేదు. ఈ దేశంలో కనీస పౌర హక్కును మా నుంచి హరించారు'' అంటారామె.

భిక్కునిలకు సమాన హక్కుల కోసం ఆమె ఇతర సన్యాసినులు చాలా మందితో కలిసి సుదీర్ఘ పోరాటం చేశారు.

కానీ.. విజయవంతంగా గుర్తింపు కార్డు సాధించుకున్న వారి కార్డులు చెల్లకుండా చేశారు.

ఒక సన్యాసిని తన గుర్తింపు కార్డును 2015లో రెన్యువల్ చేయించుకున్నపుడు.. దాని మీద ''భిక్కుని'' అనే పదం మాయమైపోయింది.

''తమిళంలో 'భిక్కుని' అని ఉంచారు కానీ సింహళ భాషలో ఆ పదం లేదు'' అని దీర్ఘ కాలంగా ఉద్యమిస్తున్న తాళవతుగోడ ధమ్మదీపనీ భిక్కుని బీబీసీకి చెప్పారు.

'అక్రమ వలసలు'

శ్రీలంకలో అత్యధికులకు ఈ సన్యాసినుల దుస్థితి గురించి తెలికపోయినా.. వీరికి మద్దతుగా నిలుస్తున్న వారూ ఉన్నారు.

శ్రీలంకలో భిక్కుని సభను పునఃప్రతిష్టించినట్లు చెప్పే డాక్టర్ ఇనమలువె శ్రీ సుమంగళ తేరో వీరికి అండగా ఉన్నారు. అత్యంత ప్రముఖ ప్రధాన మతగురువులను ఆయన తీవ్రంగా విమర్శిస్తుంటారు.

భిక్కుని సభను వ్యతిరేకించేవారు.. బుద్ధుని బోధనలను సరిగా పాటించటం లేదని ఆయన ఆరోపిస్తారు. బుద్ధుడి సమయంలో ప్రధాన మతగురువులు ఎవరూ లేరని ఆయన గుర్తుచేస్తారు.

బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన బోధనలను పాటించాలని సన్యాసులందరికీ చెప్పారు కానీ.. ప్రధాన మతగురువుల సలహాలను పాటించాలని చెప్పలేదని ఆయన వాదిస్తారు.

బౌద్ధ సన్యాసినుల ఉద్యమానికి మద్దతు ఇచ్చే ఉదారవాద సన్యాసులు చాలా మంది ఉన్నారు. అయితే.. ఈ సన్యాసినులకు సమాన హక్కులు ఉండటానికి తాము అంగీకరించినట్లయితే అత్యంత సంప్రదాయవాద భక్తుల్లో తమ ప్రభావం, ప్రజాదరణ తగ్గిపోతుందని భావిస్తున్న వారూ ఉన్నారు.

శ్రీలంక సన్యాసినులు గత రెండు దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తూ, వినయంగా వ్యవహరిస్తూ భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.

అయినప్పటికీ వారిని రెండో తరగతి పౌరులుగానో అంతకన్నా హీనంగానో చూస్తున్నారు.

''మమ్మల్ని అక్రమ వలసల తరహాలో చూస్తున్నారు. ఇది శతాబ్దాల కిందట హిందూ బ్రాహ్మణుల అణచివేత వైఖరి వంటిది'' అని సుపేసల బీబీసీతో పేర్కొన్నారు.

సమంతభద్రిక ఎట్టకేలకు పరీక్షలకు హాజరవగలిగింది. అందుకోసం శ్రీలంక విద్యాశాఖ మంత్రి నుంచి ప్రత్యేక అనుమతి అవసరమైంది. ఆమె గురువు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేయటంతో ఆయన జోక్యం చేసుకున్నారు.

అయినాకానీ.. ఆమెకు ఇప్పటివరకూ గుర్తింపు కార్డు లేదు. కాబట్టి.. ఆమె 18 ఏళ్ల వయసు నిండినపుడు ఓటు వేయలేరు.

బుద్ధిడి బోధనల ప్రకారమే తమ వైఖరి ఉంది కానీ లింగ వివక్షతో సంబంధమేమీ లేదని ప్రధాన మతగురువుల అధికార ప్రతినిధి మేదగమ ధమ్మానంద తేరో ఉద్ఘాటించారు.

అయితే.. మధ్యే మార్గంలో ''పూజ్యులు'' అని చేర్చటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని బౌద్ధ వ్యవహారాల కమిషనర్ జనరల్ సునంద కరియప్పెరుమ బీబీసీ సింహళతో చెప్పారు.

ప్రధాన మతగురువుల నుంచి సలహా తీసుకోవాలనే చట్టబద్ధమైన కట్టుబాటు ఏదీ లేనప్పటికీ.. కొన్ని వివాదాల్లో కోర్టు ఆదేశాలను అనుసరించి ''సంప్రదాయం చట్టంగా మారింది'' అని ఆయన అంగీకరిస్తారు.

ఇప్పుడు ఈ సన్యాసినిలు కోర్టును ఆశ్రయిస్తున్నారు. శ్రీలంక మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టులకు పిటిషన్లు సమర్పించటం ద్వారా చట్టపరమైన పరిష్కారం కోరారు.

నిజానికి.. బౌద్ధ వ్యవహారాల మంత్రిత్వశాఖ శ్రీలంక రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని శ్రీలంక మానవ హక్కుల కమిషన్ 2015లోనే తీర్పు చెప్పింది.

కానీ ఇప్పటివరకూ ఏదీ మారలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)