జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?

  • అలెస్సియా సెరాంటోలా
  • బీబీసీ వరల్డ్ సర్వీస్
జపాన్ ప్రాధమిక పాఠశాల విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

జపాన్‌లో బడికి వెళ్లటానికి నిరాకరిస్తున్న చిన్నారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ పరిస్థితిని 'ఫుటోకో' అని వ్యవహరిస్తున్నారు.

ఇలాంటి పిల్లల సంఖ్య పెరుగుతూ ఉండటం.. పాఠశాల వ్యవస్థకు ప్రతిబింబమా? లేకపోతే ఆ పిల్లల్లోనే ఏదైనా సమస్య ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

యుటా వయసు పదేళ్లు. అతడి బడికి గత వానాకాలంలో గోల్డెన్ వీక్ సెలవులు ఇచ్చారు. అతడి కుటుంబమంతా విహార యాత్రకు వెళ్లింది. అప్పుడు తన తల్లిదండ్రులతో చెప్పాడు.. ఇక బడికి వెళ్లటం తనకు ఇష్టం లేదని.

యుటా కొన్ని నెలలుగా చాలా అయిష్టంగా ప్రాధమిక పాఠశాలకు వెళ్లేవాడు. చాలాసార్లు అసలు వెళ్లనని మారాం చేసేవాడు. స్కూలులో అతడిని గేలిచేస్తూ బెదిరించేవారు. క్లాస్‌మేట్లతో గొడవులు జరుగుతుండేవి.

అప్పుడు అతడి తల్లిదండ్రుల ముందు మూడు మార్గాలున్నాయి: ఒకటి.. పరిస్థితులు మెరుగుపడతాయనే ఆశతో యుటాకు మంచి మాటలు చెప్పి స్కూలుకు పంపించటం. రెండు.. బడి మానిపించి ఇంట్లోనే విద్యాబుద్ధులు నేర్పించటం. మూడు.. అతడిని 'ఫ్రీ స్కూల్' (స్వేచ్ఛా పాఠశాల)కు పంపించటం. వాళ్లు మూడో మార్గం ఎంచుకున్నారు.

ఇప్పుడు యుటా స్కూలుకు వెళ్లే రోజుల్లో తను ఏం చేయాలనుకుంటే అది చేస్తూ గడుపుతున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు.

ఫొటో సోర్స్, STEPHANE BUREAU DU COLOMBIER

జపాన్‌లోని చాలా మంది 'ఫుటోకో'ల్లో యుటా ఒకరు.

ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా 30 రోజుల కన్నా ఎక్కువ రోజులు స్కూలుకు వెళ్లని పిల్లలకు జపాన్ విద్యా మంత్రిత్వశాఖ పెట్టిన పేరు ఇది.

ఈ పదాన్ని.. గైర్హాజరయ్యేతత్వం, చదువుపట్ల సోమరితనం, బడి అంటే భయం, బడిని వ్యతిరేకించటం అని పలు రకాలుగా తర్జుమా చేస్తున్నారు.

ఫుటోకో పట్ల ఆలోచనా తీరు కొన్ని దశాబ్దాలుగా మారింది. గతంలో బడికి వెళ్లటానికి నిరాకరించటాన్ని 'టోకోక్యోషి' అని వ్యవహరించేవారు. దాని అర్థం ప్రతిఘటన అని. 1992 వరకూ ఇది ఒక మానసిక వ్యాధిగా పరిగణించేవారు. కానీ.. 1997లో ఈ పదజాలం మరింత తటస్థమైన 'ఫుటోకో'గా మారింది. దీని అర్థం హాజరుకాకపోవటం అని.

ప్రాధమిక, ఉన్నత పాఠశాలల్లో గైర్హాజరు రికార్డు స్థాయికి పెరిగిందని అక్టోబర్ 17వ తేదీన ప్రభుత్వం ప్రకటించింది. ఒక సంవత్సరంలో 30 రోజులు, అంతకన్నా ఎక్కువ రోజుల పాటు పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య 2017లో 1,44,031గా ఉంటే.. 2018లో 1,64,528కి పెరిగింది.

ఫొటో సోర్స్, STEPHANE BUREAU DU COLOMBIER

ఫొటో క్యాప్షన్,

తమగవ ఫ్రీ స్కూల్‌లో చిన్నారులు తాము కోరుకున్న విధంగా వ్యవహరించే స్వేచ్ఛ ఉంటుంది

జపాన్‌లో ఫుటోకో సంఖ్య పెరుగుతుండటంతో దానికి ప్రతిస్పందనగా 1980వ దశకంలో 'స్వేచ్ఛా పాఠశాల' (ఫ్రీ స్కూల్) ఉద్యమం మొదలైంది. ఇవి.. స్వేచ్ఛ, వ్యక్తిత్వం సూత్రాలు ప్రాతిపదికగా పనిచేసే ప్రత్యామ్నాయ పాఠశాలలు.

నిర్బంధ విద్యకు ప్రత్యామ్నాయంగా.. ఇంట్లో విద్యాబోధనతో పాటు ఈ స్వేచ్ఛా పాఠశాలను కూడా ప్రజలు అంగీకరించారు. అయితే ఇవి చిన్నారులకు గుర్తింపుగల ఉత్తీర్ణత అర్హతలు ఏవీ ఇవ్వవు.

గత రెండున్నర దశాబ్దాల్లో ఈ స్వేచ్ఛా పాఠశాలలు, ప్రత్యామ్నాయ పాఠశాలలకు వెళుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 1992లో ఇలాంటి విద్యార్థుల సంఖ్య 7,424గా ఉంటే.. 2017లో అది 20,346కు పెరిగింది.

మధ్యలో బడి మానేయటం వల్ల దీర్ఘకాలిక పర్యవసానాలు ఉంటాయి. చిన్నారులు సమాజం నుంచి పూర్తిగా తప్పుకుని.. తమ గదుల్లో తమను బంధించుకునే ముప్పు అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితిని 'హికికోమోరి' అని పిలుస్తారు.

ఇంకా ఆందోళనకరమైన విషయం.. ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య. ఇలాంటి విద్యార్థుల సంఖ్య 30 సంవత్సరాల కాలంలో 2018లో అత్యధికంగా నమోదైంది. గత ఏడాది 332 మంది చిన్నారి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండటంతో జపాన్ ప్రభుత్వం 2016 లోనే స్కూళ్లకు ప్రత్యేక సిఫారసులు చేస్తూ 'ఆత్మహత్యల నివారణ' చట్టం చేసింది.

ఫొటో సోర్స్, STEPHANE BUREAU DU COLOMBIER

ఫొటో క్యాప్షన్,

స్వేచ్ఛా పాఠశాలలు తమ సొంత నియమనిబంధనలు అమలు చేస్తాయి

మరైతే జపాన్‌లో ఇంత ఎక్కువ సంఖ్యలో చిన్నారులు ఎందుకు బడి మానేస్తున్నారు?

కుటుంబ పరిస్థితులు, స్నేహితులతో వ్యక్తిగత సమస్యలు, స్కూల్లో ఆకతాయిల వేధింపులు - ప్రధాన కారణాల్లో కొన్ని అని విద్యాశాఖ సర్వే చెప్తోంది.

బడి మానేసిన చిన్నారులు.. తాము ఇతర విద్యార్థులతో.. కొన్నిసార్లు ఉపాధ్యాయులతో కలసి సాగలేకపోతున్నామని సాధారణంగా చెప్తున్నారు.

టోమో మోరిహషి విషయంలో కూడా ఇదే జరిగింది.

''చాలా మందితో నాకు సౌకర్యవంతంగా ఉండదు. బడి జీవితం బాధాకరంగా ఉండేది'' అని చెప్తోంది ఈ 12 ఏళ్ల బాలిక.

టోమోకి 'వరణాత్మక మౌనం' (సెలక్టివ్ మ్యూటిజం) అనే సమస్య ఉంది. అది బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినపుడు ఆమె మీద ప్రభావం చూపుతుంది.

''నా ఇంటి బయట కానీ, నా కుటుంబానికి దూరంగా కానీ ఉన్నపుడు నేను మాట్లాడగలిగేదానిని కాదు'' అని ఆమె వివరించింది.

జపాన్ పాఠశాలల్లో కఠిన నియమనిబంధనలను పాటించటం కూడా ఆమెకు కష్టంగా ఉండేది.

''మేం ధరించే దుస్తులు రంగుల్లో ఉండకూడదు. జుట్టుకు రంగు వేసుకోకూడదు. జుట్టు రిబ్బన్లకు ఒకటే రంగు నిర్ధారించారు. వాటిని ముంజేతి మీద ధరించకూడదు'' అంటూ కొన్ని నిబంధనలను ప్రస్తావించింది టోమో.

ఫొటో సోర్స్, Getty Images

జపాన్‌లో చాలా పాఠశాలలు.. తమ విద్యార్థుల వస్త్రధారణ, వారు కనిపించే తీరును అన్ని రకాలుగా నియంత్రిస్తాయి. చిన్నారుల జుట్టు గోధుమ రంగులో ఉంటే దానికి నల్ల రంగు వేసుకోక తప్పదు. వాతావరణం ఎంత చల్లగా ఉన్నా కూడా వీరు టైట్లు, కోట్లు ధరించటానికి వీలు లేదు. కొన్నిచోట్ల విద్యార్థుల అండర్‌వేర్ రంగును కూడా పాఠశాలలే నిర్ణయిస్తాయి.

1970లు 1980లలో హింస, వేధింపులకు ప్రతిస్పందనగా పాఠశాలల్లో కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టారు. 1990లలో వాటిని సడలించినప్పటికీ ఇటీవలి కాలంలో మరింత కఠినంగా మారాయి.

ఈ నియంత్రణ, నిబంధనలను ''చీకటి స్కూల్ నిబంధనలు'' అని వర్ణిస్తుంటారు. కార్మికులను దోచుకునే కంపెనీలను వివరించటానికి ఉపయోగించే పదమిది.

ఇప్పుడు యుటా లాగానే టోమో కూడా టోక్యోలోని 'తమగవ ఫ్రీ స్కూల్'కి వెళుతోంది. అక్కడ విద్యార్థులు యూనిఫాం ధరించాల్సిన అవసరం లేదు. వాళ్లు ఏఏ పనులు చేయాలనుకుంటున్నారనేది వాళ్లే నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. అయితే.. ఆ పనుల విషయంలో స్కూలు, తల్లిదండ్రులు, విద్యార్థుల మధ్య ముందే అంగీకారం ఉంటుంది. విద్యార్థులు తమ వ్యక్తిగత నైపుణ్యాలు, ఆసక్తులను అనుసరించటాన్ని ప్రోత్సహిస్తారు.

జపనీస్, మ్యాథ్స్ తరగుతల కోసం కంప్యూటర్లు ఉన్న గదులు ఉన్నాయి. పుస్తకాలు, మాంగాస్ (జపనీస్ కామిక్ బుక్స్)తో ఓ గ్రంథాలయం ఉంటుంది.

ఫొటో సోర్స్, STEPHANE BUREAU DU COLOMBIER

ఫొటో క్యాప్షన్,

స్వేచ్ఛా పాఠశాలలో విద్యార్థులు తాము చేయాలనుకున్న పనులు ఎంచుకుని చేసుకోవచ్చు

అక్కడ వాతావరణం.. ఓ పెద్ద కుటుంబంలో లాగా చాలా సాధారణంగా ఉంటుంది. విద్యార్థులు కలిసి ముచ్చటించుకుంటుంటారు. కలిసి ఆడుకుంటుంటారు.

''జనంలో సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయటం ఈ స్కూల్ లక్ష్యం'' అని పాఠశాల ప్రధానాధిపతి టకాషి యొషికావా చెప్పారు.

కసరత్తులు చేయటం ద్వారా కానీ, ఆడుకోవటం ద్వారా కానీ, చదువుకోవటం ద్వారా కానీ.. పెద్ద సమూహంలో ఉన్నపుడు పిల్లలు భయాందోళనలకు గురవకుండా ఉండటం ముఖ్యం.

ఈ స్కూలును ఇటీవలే ఇంకా విశాలమైన ప్రదేశానికి మార్చారు. ప్రస్తుతం రోజుకు సుమారు 10 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

ఫొటో సోర్స్, STEPHANE BUREAU DU COLOMBIER

యోషికావా 2010లో తన మొట్టమొదటి స్వేచ్ఛా పాఠశాలను టోక్యోలోని ఫూచూ ప్రాంతంలో ఓ మూడంతస్తుల అపార్ట్‌మెంట్‌లో ప్రారంభించారు.

''పదిహేనేళ్లు దాటిన విద్యార్థులు వస్తారని నేను భావించాను. కానీ.. వాస్తవానికి వచ్చిన వాళ్ల వయసు ఏడు, ఎనిమిదేళ్లు మాత్రమే ఉంది. చాలా మంది సెలెక్టివ్ మ్యూటిజంతో మౌనంగా ఉండేవారు. స్కూల్లో వాళ్లు ఏమీ చేసేవాళ్లు కాదు'' అని ఆయన వివరించారు.

చాలా మంది విద్యార్థులు స్కూలుకు వెళ్లటానికి తిరస్కరించటానికి మూల కారణం సంభాషణ సమస్యలని యోషికావా నమ్ముతారు.

విద్యారంగంలోకి ఆయన స్వీయ ప్రయాణం కూడా అసాధారణమైనదే. ఆయన ఒక జపాన్ కంపెనీలో నెలవారీ వేతనం తీసుకునే ఉద్యోగాన్ని నాలుగు పదుల వయసు వచ్చాక మానేశారు. దానికి కారణం.. కెరీర్ నిచ్చెన ఎక్కటంలో తనకు ఆసక్తి లేదని ఆయన నిర్ణయించుకోవటమే. ఆయన తండ్రి ఒక వైద్యుడు. ఆయన కూడా సమాజానికి సేవ చేయాలనే అభిలాషతో.. సామాజిక కార్యకర్తగా, పిల్లలను పెంచటానికి స్వీకరించే తండ్రిగా (ఫోస్టర్ ఫాదర్‌గా) మారారు.

ఫొటో సోర్స్, STEPHANE BUREAU DU COLOMBIER

ఫొటో క్యాప్షన్,

టకాషీ యోషికావా 2010లో స్వేచ్ఛా పాఠశాలను ప్రారంభించారు

ఆ అనుభవం ద్వారా.. పిల్లలు ఎదుర్కొనే సమస్యల గురించి ఆయన తెలసుకున్నారు. చాలా మంది పిల్లలు పేదరికం వల్ల, గృహ హింస వల్ల ఎంతగా బాధపడుతున్నారు.. అది స్కూలులో వారి పనితీరు మీద ఎంతగా ప్రభావం చూపుతోంది అనేది అర్థంచేసుకున్నారు.

విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల్లో పెద్ద పెద్ద తరగతులు ఒకటి అని నగోయా యూనివర్సిటీలో విద్యారంగ నిపుణుడు ప్రొఫెసర్ రియో ఉచిడా చెప్తారు.

''దాదాపు 40 మంది విద్యార్థులు ఉండే తరగతి గదుల్లో చాలా జరగొచ్చు.. వాళ్లంతా ఏడాది పాటు కలిసి ఉండాలి'' అని ఆయన అంటారు.

జపాన్‌లో జీవితంలో నిలబడటానికి సాహచర్యతత్వం అతి కీలకమని ఆయన పేర్కొన్నారు. ''ఎందుకంటే జన సాంద్రత ఎంత అధికంగా ఉంటుందంటే.. ఇతరులతో కలిసి ముందుకు సాగలేకపోతే, సమన్వయం చేసుకోలేకపోతే మనుగడ సాగించలేం'' అని చెప్పారు.

ఇది స్కూళ్లకి మాత్రమే కాదు.. జనం అధికంగా గుమికూడే ప్రజా రవాణా వంటి ఇతర బహిరంగ ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

కానీ.. వీటన్నిటికీ అనుగుణంగా నడచుకోవాల్సి రావటం చాలా మంది విద్యార్థులకు ఒక సమస్య. ఎక్కువ మంది గుంపుగా ఉండే తరగతి గదులు వారికి సౌకర్యవంతంగా అనిపించవు. వారు చిన్న ప్రదేశంలోనే తమ సహ విద్యార్థులతో కలిసి అన్ని పనులూ చేయాల్సి ఉంటుంది.

''అటువంటి పరిస్థతుల్లో అసౌకర్యంగా అనిపించటం మామూలు విషయమే'' అంటారు ప్రొఫెసర్ ఉచిడా.

ఇంకా ఏమిటంటే.. జపాన్‌లో చిన్నారులు సంవత్సరాల తరబడి అదే తరగతిలో ఉంటారు. కాబట్టి సమస్యలు తలెత్తినపుడు స్కూలుకు వెళ్లటం బాధాకరంగా మారగలదు.

''ఆ అర్థంలో.. స్వేచ్ఛా పాఠశాలలు వంటివి అందించే మద్దతు చాలా అర్థవంతమైనది. ఆ పాఠశాలల్లో బృందాల గురించి తక్కువ పట్టించుకుంటారు. ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచనలు, భావనలకు విలువనివ్వటం జరుగుతుంది'' అని ప్రొఫెసర్ ఉచిడా పేర్కొన్నారు.

స్వేచ్ఛా పాఠశాలలు ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ.. విద్యా వ్యవస్థలో అంతర్గతంగా ఉన్న సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. విద్యార్థుల్లో భిన్నత్వాన్ని అభివృద్ధి చేయకపోవటం వారి మానవ హక్కులను ఉల్లంఘించటమేనని ప్రొఫెసర్ ఉచిడా అంటారు. చాలా మంది అంగీకరిస్తారు.

ఫొటో సోర్స్, STEPHANE BUREAU DU COLOMBIER

ఫొటో క్యాప్షన్,

తమగవ స్వేచ్ఛా పాఠశాలలో ఆడుకుంటున్న చిన్నారులు

''చీకటి పాఠశాల నిబంధనల'' మీద, జపాన్‌లో పాఠశాల వాతావరణం మీద దేశవ్యాప్తంగా విమర్శలు పెరుగుతున్నాయి. ఆ నిబంధనలు మానవ హక్కుల ఉల్లంఘన అని, విద్యార్థుల్లో భిన్నత్వానికి అవరోధమని టోక్యో షింబున్ వార్తాపత్రిక ఇటీవల ఒక వ్యాసంలో అభివర్ణించింది.

'చీకటి పాఠశాల నిబంధనలను నిర్మూలిద్దాం' (బ్లాక్ కొసొకు ఒ నకుసొ) ప్రాజెక్ట్ ఉద్యమ బృందం గత ఆగస్టులో విద్యామంత్రిత్వ శాఖకు ఒక ఆన్‌లైన్ పిటిషన్ సమర్పించింది.

అసంబద్ధమైన పాఠశాల నిబంధనల మీద దర్యాప్తు చేయాలని కోరుతున్న ఆ పిటిషన్ మీద 60,000 మంది సంతకాలు చేశారు.

ఒసాకా పాలక సంస్థ.. ఈ ప్రాంతంలోని స్కూళ్లన్నీ తమ నిబంధనలను సమీక్షించాలని ఆదేశించటంతో దాదాపు 40 శాతం పాఠశాలలు నిబంధనల్లో మార్పులు చేశాయి.

పాఠశాలకు గైర్హాజరవటం ఒక రుగ్మత కాదని.. ఒక పోకడ అని విద్యా శాఖ ఇప్పుపడు అంగీకరిస్తున్నట్లు కనిపిస్తోందని ప్రొఫెసర్ ఉచిడా అంటారు. ఇది.. ఫుటోకో చిన్నారులు ఒక సమస్య కాదని.. ఆహ్లాదకర వాతావరణాన్ని అందించటంలో విఫలమవుతున్న విద్యా వ్యవస్థకు వారి ప్రతిస్పందిస్తున్నారనేది పరోక్షంగా ఒప్పుకోవటమేనని ఆయన అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)