కొబ్బరి కల్లు తాగి ఫిలిప్పీన్స్‌లో ఎనిమిది మంది మృతి.. మరో 300 మంది ఆస్పత్రిపాలు

లాంబనాంగ్ మద్యం తయారీలో కొబ్బరి చెట్టు నుంచి సేకరించిన ద్రవాన్ని ప్రధానంగా వాడతారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

లాంబనాంగ్ మద్యం తయారీలో కొబ్బరి చెట్టు నుంచి సేకరించిన ద్రవాన్ని ప్రధానంగా వాడతారు.

ఆగ్నేయ ఆసియాలోని ఫిలిప్పీన్స్‌లో కొబ్బరి కల్లు తాగి ఎనిమిది మంది చనిపోయారు. మరో 300 మంది ఆస్పత్రి పాలయ్యారు.

బాధితులు వేర్వేరు పట్టణాల వారు. ఇక్కడ 'లాంబనాంగ్' అని పిలిచే ఈ మద్యాన్ని వీరంతా ఒకే దుకాణంలో కొన్నారని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

లాంబనాంగ్ తాగిన తర్వాత కడుపులో నొప్పి, మైకం వచ్చాయని బాధితులు చెప్పారు.

లాంబనాంగ్‌లో ఆల్కహాల్ దాదాపు 40 శాతం ఉంటుంది. అక్రమ లాంబనాంగ్ కూడా విరివిగా అమ్ముతుంటారు.

ఎక్కువ మంది బాధితులది లాగునా రాష్ట్రం రిజాల్ పట్టణమని, మిగతావారిది పొరుగు రాష్ట్రం క్వెజాన్‌ అని పోలీసులు చెప్పారు.

రిజాల్ పట్టణం దేశ రాజధాని మనీలాకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

మద్యం విషతుల్యం కావడంతో అనారోగ్యంపాలై మనీలా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

బాధితులు తాగిన లాంబనాంగ్ తయారుచేసిన డిస్టిలరీ యజమాని తనంతట తానుగా అధికారుల ముందు లొంగిపోయారని మీడియా సంస్థ ఏబీఎస్-సీబీఎన్ తెలిపింది.

ఈ డిస్టిలరీ చట్టబద్ధంగానే నడుస్తోందా, లేక అక్రమంగా నడుస్తోందా అనేదానిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి.

లాంబనాంగ్ అమ్మకాలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు లాగునా రాష్ట్ర గవర్నర్ రమిల్ హెర్నాండెజ్ ఫేస్‌బుక్‌లో చెప్పారు. క్రిస్మస్ సీజన్లో ఈ మద్యానికి గిరాకీ ఎక్కువ.

లాంబనాంగ్ మద్యం మరణాలపై దర్యాప్తు జరుగుతుందని ఆయన చెప్పారు.

లాంబనాంగ్ తాగి నిరుడు దేశంలో 21 మంది చనిపోయారని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, AMILA GAMAGE

ప్రమాదకర స్థాయుల్లో మిథనాల్ ఉన్న అక్రమ మద్యం ఆసియాలోని పేద ప్రాంతాల్లో చాలాసార్లు విపరిణామాలకు దారితీస్తోంది.

మిథనాల్ విషతుల్యం కావడం చూశారా అని కల్తీ మద్యం తాగేవారిని అడిగితే లేదని చెబుతారని, కానీ ఇలాంటి మద్యం తాగి ఎవరైనా చూపు కోల్పోవడం లేదా చనిపోవడం చూశారా అని అడిగితే మాత్రం ఔనని సమాధానమిస్తారని మిథనాల్ సంబంధింత దుర్ఘటనలపై అంతర్జాతీయ నిపుణుడైన డాక్టర్ నట్ ఎరిక్ హోవ్డా ఈ ఏడాది అక్టోబరులో బీబీసీతో చెప్పారు.

ఈ పర్యవసానాలు చాలా వరకు మిథనాల్ విషతుల్యం కావడం వల్లేనని నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయానికి చెందిన ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)