మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’

  • డానీ షా
  • హోమ్ అఫైర్స్ ప్రతినిధి
మద్యపానం గృహహింస

ఫొటో సోర్స్, Getty Images

మద్యం లేదా మాదక ద్రవ్యాల మీద ఆధారపడే పురుషులు.. మహిళల మీద గృహ హింసకు పాల్పడే అవకాశం ఇతరులకన్నా ఆరు, ఏడు రెట్లు అధికంగా ఉంటుందని ఒక విస్తృత అధ్యయనంలో వెల్లడైంది.

స్వీడన్‌లో 16 సంవత్సరాల పాటు నమోదు చేసిన లక్షలాది వైద్య రికార్డులు, పోలీస్ సమాచారాన్ని విశ్లేషిస్తూ నిర్వహించిన ఈ పరిశోధన వివరాలను ప్లాస్-మెడిసిన్ అనే ఆన్‌లైన్ జర్నల్‌లో ప్రచురించారు.

మానసిక అనారోగ్యాలు, ప్రవర్తనా లోపాలు ఉన్న పురుషులు కూడా తమ భాగస్వాములపై హింసకు పాల్పడే అవకాశం అధికంగా ఉంటుందని ఈ పరిశోధన గుర్తించింది.

యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ సీనా ఫజల్ ఈ అధ్యయనానికి సారథ్యం వహించారు. అమెరికా, స్వీడన్, లండన్ కింగ్స్ కాలేజ్‌లకు చెందిన నిపుణులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు.

మాదక ద్రవ్యాలు, మద్యపాన వ్యసనాలకు చికిత్స సేవలను మెరుగుపరచటంతో పాటు.. ఈ నేరాలకు పాల్పడే వారిని మరింత మెరుగుగా పర్యవేక్షించటం ద్వారా గృహ హింసను తగ్గించవచ్చునని తమ పరిశోధన ఫలితాలు చెప్తున్నాయని ప్రొఫెసర్ ఫజల్ బీబీసీకి తెలిపారు.

ఈ అధ్యయనంలో.. 1998 జనవరి నుంచి 2013 డిసెంబర్ వరకు.. మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం సమస్యలు ఉన్నట్లు వైద్యపరంగా గుర్తించిన 1,40,000 మంది పురుషుల వివరాలను సేకరించారు.

ఫొటో సోర్స్, Getty Images

వీరిలో ఆ తర్వాతి కాలంలో.. తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్, మాజీ జీవితభాగస్వాములను బెదిరించటం, దాడి చేయటం, లైంగిక దాడులకు పాల్పడటం వంటి కేసుల్లో ఎంత మంది అరెస్ట్ అయ్యారనేది పరిశోధించారు.

మద్యపాన వ్యసనపరుల్లో 1.7 శాతం మంది ఇలాంటి నేరాల కింద అరెస్టయ్యారని గుర్తించారు. అదే వయసులో ఉన్న మొత్తం పురుషుల్లో ఇటువంటి అరెస్టుల సగటుతో పోలిస్తే ఇది ఆరు రెట్లు అధికం.

ఇక మాదకద్రవ్యాల వినియోగం సమస్య ఉన్న పురుషుల్లో అయితే 2.1 శాతం మంది గృహ హింస నేరాల కింద అరెస్టయ్యారని తేలింది. సాధారణ సగటుకన్నా ఇది ఏడు రెట్లు అధికం.

మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగానికి - గృహ హింసకు మధ్య సంబంధం ఉందనేది నిస్సందేహమని ఈ పరిశోధన తేల్చింది. అయితే.. ఈ ఫలితాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్‌లో బాధితుల కమిషనర్ డేమ్ వెరా బాయిర్డ్ అంటారు.

''మద్యం మత్తులో గృహ హింసకు పాల్పడే వాళ్లలో చాలా మంది మద్యం తాగకుండా ఉన్నప్పుడు కూడా హింసాత్మకంగా, బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తారు'' అని ఆమె పేర్కొన్నారు.

''అలాగే గృహ హింసకు పాల్పడే వారిలో, నియంత్రించే పెత్తనం చలాయించే వారిలో చాలా మందికి మద్యపానం కానీ, మాదక ద్రవ్యాల అలవాటు కానీ లేదు. కాబట్టి.. గృహ హింసకు పాల్పడేవారి మీద కేంద్రీకరించాల్సిన వనరులను మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగాన్ని పరిష్కరించటానికి మళ్లించటం పొరపాటు అవుతుంది'' అని ఆమె విశ్లేషించారు.

మానసిక అనారోగ్యాలతో సంబంధం

మద్యపానం, మాదకద్రవ్యాలను వినియోగించే పురుషులు గృహ హింసకు పాల్పడే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి.. కుటుంబ నేపథ్యం, జన్యువారసత్వం వంటి ఇతర అంశాలేవైనా కారణం కావచ్చునేమో తెలుసుకోవటానికి.. వారి ''సహోదరులతో పోల్చి'' కూడా పోల్చిచూశారు పరిశోధకులు.

మద్యం, మాదక ద్రవ్యాలను వినియోగించే వారిలో గృహ హింస నైజం అధికంగానే ఉందని.. అయితే.. ఇటువంటి అలవాట్లు లేని వారి సహోదరులతో పోల్చినపుడు ఈ నైజం కొంత తక్కువగా ఉందని ఈ పరిశీలనలో గుర్తించారు.

''మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం వల్ల.. ఒక వ్యక్తిలో సంశయాలను తగ్గిస్తాయి. అది.. సన్నిహిత సంబంధాల్లో సంఘర్షణలను పరిష్కరించుకోవటానికి హింసను ఉపయోగించటానికి దారితీయగలదు'' అని ఈ పరిశోధన చెప్తోంది.

కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలకు, గృహ హింసకు సంబంధం ఉందని కూడా ఈ పరిశోధన గుర్తించింది. అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), వ్యక్తిత్వ లోపాలు, వైద్యపరమైన కుంగుబాటు వంటి సమస్యలు ఉన్న వారు.. గృహ హింస కేసుల్లో అరెస్టయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

''మానసిక వైకల్యాలు ఉన్నవారు.. తమ రుగ్మతలకు సంబంధించిన లక్షణాలను ఎదుర్కొనే వ్యూహాల్లో భాగంగా మద్యం, మాదకద్రవ్యాలను ఉపయోగించే అవకాశం అధికంగా ఉంటుంది'' అని ఈ అధ్యయనం చెప్తోంది.

''కాబట్టి మానసిక వైకల్యాలకు గృహ హింసకు అంతర్లీనంగా సంబంధాన్ని ఏర్పరిచేది మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం కావచ్చు'' అని విశ్లేషించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)