జోర్డాన్, ఈజిప్టులకు మా కుక్కలను ఇక పంపించం: అమెరికా ప్రకటన

  • 25 డిసెంబర్ 2019
అమెరికా స్నిఫర్ డాగ్స్ Image copyright PRESS ASSOCIATION
చిత్రం శీర్షిక అనేక దేశాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో స్నిఫర్ డాగ్స్‌ను ఉపయోగిస్తున్నారు

పేలుడు పదార్థాలను పసిగట్టే శునకాలను జోర్డాన్, ఈజిప్టులకు పంపించటాన్ని నిలిపివేసినట్లు అమెరికా చెప్పింది. ఆ రెండు దేశాల్లో నిర్లక్ష్యం కారణంగా అనేక శునకాలు మరణించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

''క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నపుడు ఏ శునకమైనా మరణించటం అత్యంత విచారకరమైన సంఘటన'' అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో జోర్డాన్, ఈజిప్టులతో పాటు మరో ఎనిమిది దేశాలకు పంపించిన 100కు పైగా శునకాల సంరక్షణ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అమెరికా విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ కార్యాలయం గత సెప్టెంబరులో ఒక నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది.

అమెరికాలో శిక్షణ పొందిన కుక్కలను ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా ఆయా దేశాలకు అందిస్తున్నారు.

వీటిని పంపించటం మీద తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు అమెరికా సోమవారం నాడు ప్రకటించింది. మరిన్ని శునకాల మరణాలను నివారించటానికి ఈ చర్య చేపట్టినట్లు విదేశాంగ శాఖ అధికారి తెలిపారు.

ఈ అంశం మీద జోర్డాన్, ఈజిప్టులు ఇంకా స్పందించలేదు.

''విదేశాల్లో ఉగ్రవాద వ్యతిరేక కృషిలో, అమెరికన్ల ప్రాణాలను కాపాడటంలో ఈ కుక్కలు కీలక పాత్ర పోషిస్తాయి'' అని అమెరికా అధికారి చెప్పారు.

ఇప్పటికే జోర్డాన్, ఈజిప్టులకు పంపించిన శునకాలు ప్రస్తుతానికి అక్కడే ఉంటాయని పేర్కొన్నారు.

Image copyright CANINE VALIDATION CENTER
చిత్రం శీర్షిక జోర్డాన్‌కు పంపిన శునకాల్లో రెండు కుక్కలు పోషకాహారం లేక తీవ్రంగా జబ్బుపడ్డాయి

జోర్డాన్‌లో ఒక శునకం 2017లో వడదెబ్బ వల్ల చనిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ నివేదిక చెప్తోంది.

మరో రెండు శునకాలను ''ఆరోగ్యం విషమించిన పరిస్థితిలో అమెరికాకు తిప్పి పంపించారు'' అని కూడా పేర్కొంది.

''చివరికి ఆ రెండు శునకాల్లో ఒకదాని కారుణ్యమరణానికి అధికారులు అంగీకరించాల్సి వచ్చింది.. మరొక శునకం బరువు తీవ్రంగా తగ్గిపోవటంతో దానికి పోషకాహారం అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సి వచ్చింది'' అని ఆ నివేదిక వివరించింది.

ఆ మూడు శునకాలూ బెల్జియన్ మాలనోయీ జాతికి చెందిన కుక్కలే.

ఈ నెలలో ఇచ్చిన మరో నివేదికలో.. జోర్డాన్‌కు పంపించిన మరో రెండు కుక్కలు అసహజ కారణాల వల్ల చనిపోయాయని వెల్లడించింది. ఒక కుక్క వడ దెబ్బతో, మరో కుక్క పోలీసులు చిలకరించిన క్రిమిసంహారకం వల్ల చనిపోయిందని తాజా నివేదికలో వివరించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ కథనం.

అమెరికా శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్‌ (వాసన పసిగట్టే శునకాలు) ను అత్యధికంగా జోర్డాన్‌కు పంపిస్తుంటారు. ఇప్పటికి దాదాపు 100 శునకాలను ఆ దేశానికి అందించారు.

ఈజిప్టుకు పంపించిన 10 శునకాల్లో మూడు శునకాలు 2018-19 సంవత్సరంలో ఊపిరితిత్తుల క్యాన్సర్, వడ దెబ్బ, పిత్తాశయం దెబ్బతినటం వల్ల చనిపోయాయని అమెరికా నివేదిక తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...

నంబి నారాయణన్: ఒక నకిలీ ‘గూఢచార కుంభకోణం’ ఈ సైంటిస్టు జీవితాన్ని ఎలా నాశనం చేసిందంటే..

నెలకు రూ.7 వేల వేతనం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న రైతు కూలీలు

అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు

కరోనా వైరస్: చైనాలో 106కు చేరిన మరణాలు... ఇతర దేశాల్లో పెరుగుతున్న బాధితులు

ఆఫ్రికా: ప్రధాని భార్య హత్య మిస్టరీ... ఆరోపణల్లో కూరుకుపోయిన ప్రధాని థామస్, ఆయన రెండో భార్య

అఫ్గానిస్తాన్‌లో మా విమానం కూలడం నిజమే: అమెరికా సైన్యం

ఎయిర్ ఇండియా: రూ. 22,863 కోట్ల రుణ భారం సహా సంపూర్ణ విక్రయానికి ప్రభుత్వ నిర్ణయం