క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు

  • లారా బికర్
  • బీబీసీ ప్రతినిధి, సోల్ నుంచి
బాంబు పేలుళ్లతో ధ్వంసమైన ఉత్తర కొరియాలోని హంగ్నమ్ బీచ్‌ (1950లో)

ఫొటో సోర్స్, US NAVAL HISTORICAL CENTER

ఫొటో క్యాప్షన్,

బాంబు పేలుళ్లతో ధ్వంసమైన ఉత్తర కొరియాలోని హంగ్నమ్ బీచ్‌ (1950లో)

సరిగ్గా 70 ఏళ్ల క్రితం... 1950లో క్రిస్మస్ రోజు. అది కొరియా యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయం. ఉత్తర కొరియాలోని పోర్టు నుంచి 14,000 మంది శరణార్థులతో అమెరికాకు చెందిన ఒక నౌక బయలుదేరింది.

సైనిక వాహనాలను, మందుగుండు సామగ్రిని తీసుకెళ్లే నౌక అది. అయినా, చైనా బలగాలు దాడులను తీవ్రతరం చేయడంతో ప్రాణభయంతో వాళ్లందరూ ఆ నౌకలోకి ఎక్కేశారు.

ప్రాణభయంతో వణికిపోతున్న ఆ శరణార్థులకు అమెరికా మెరైన్ అధికారులు కూడా అడ్డుచెప్పలేకపోయారు.

సైనిక సామగ్రితో పాటు 60 మంది సిబ్బందిని మాత్రమే తీసుకెళ్లేందుకు డిజైన్ చేసిన ఆ ఓడలోకి చూస్తుండగానే 14,000 మంది ఎక్కారు. కనీసం నిలబడేందుకు కూడా అందులో సరిగా చోటు లేదు. అయినా, ఇరుక్కుని నిలబడ్డారు.

మూడు రోజులు ప్రయాణించి వారందరినీ సురక్షితంగా దక్షిణ కొరియాకు చేర్చింది ఆ నౌక. అలా ప్రాణాలు కాపాడుకున్న వారిలో దక్షిణ కొరియా ప్రస్తుత అధ్యక్షుడు మూన్‌ జే-ఇన్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు.

ఆ నౌక పేరు ఎస్‌ఎస్ మెరెడిత్ విక్టరీ.

1945లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో మందుగుండు సామగ్రి రవాణా కోసం అమెరికా దీనిని తయారు చేసింది.

ఫొటో సోర్స్, LEE GYONG-PIL

ఫొటో క్యాప్షన్,

లీ గియాంగ్- పిల్ కుటుంబం

1950 డిసెంబర్‌లో దాదాపు లక్ష మంది అమెరికా సైనికులు ఉత్తర కొరియాలోని హంగ్నమ్ పోర్టులో చిక్కుకున్నారు. మూడు వైపుల నుంచీ చైనా బలగాలు వారిని సమీపిస్తున్నాయి.

అంతకుముందు తమకు నాలుగింతల మంది ఉన్న సైన్యాన్ని కూడా అమెరికా ఎదుర్కొంది. ఇప్పుడు మాత్రం చైనా బలగాల నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది. అందుకు వారికి ఉన్న ఏకైక మార్గం సముద్రం ఒక్కటే. సమయం ఎక్కువగా లేదు.

అయితే, ఆ పోర్టుకు అమెరికా బలగాలు మాత్రమే కాదు, మరో లక్ష మంది దాకా ఉత్తర కొరియా శరణార్థులు కూడా ప్రాణభయంతో ఆ బీచ్‌కు తరలివచ్చారు. వారిలో కొందరు నిండు గర్భిణులు ఉన్నారు. అనేక మంది పసి పిల్లలను భుజాన వేసుకుని గడ్డకట్టిన మంచులో కిలోమీటర్ల దూరం పరుగెత్తుకుంటూ వచ్చారు. చలికి వణుకుతున్నారు. నీరసించిపోయారు. భయంభయంగా ఆందోళనతో... ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే చాలు అన్నట్టుగా ఉన్నారు.

ఫొటో సోర్స్, NATIONAL ARCHIVES US

ఫొటో క్యాప్షన్,

1950 డిసెంబర్‌లో హంగ్నమ్ పోర్టులో నౌకలోకి వెళ్లేందుకు గుమికూడిన శరణార్థులు

ఇంతలో సైనికులను, యుద్ధ సామగ్రిని, ఇతర సరకులను దక్షిణ కొరియాలోని బూసాన్, జియోజ్ ఐలాండ్ పోర్టులకు తరలించేందుకు దాదాపు 100 అమెరికా నౌకలు హంగ్నమ్ పోర్టుకు వచ్చాయి. అందులో ఎస్‌ఎస్‌ మెరెడిత్ విక్టరీ అనే నౌక ఒకటి.

అయితే, అప్పటి వరకూ శరణార్థులను తీసుకెళ్లాలని అమెరికా అధికారులు అనుకోలేదు. కానీ, ప్రాణభయంతో ఉన్న వారిని చూసి, వాళ్లను ఎలాగైనా రక్షించాలని నిర్ణయించారు.

"యుద్ధంలో గెలవడం సైనికుల ముందున్న లక్ష్యం అయితే, అప్పుడు శరణార్థులను కాపాడటం వారి కర్తవ్యం కాదు. పౌరులను కాపాడటం మంచిదే కానీ, అంతకంటే ముఖ్యమైనది సైనికులను రక్షించడం.

అయినా, ప్రాణభయంతో వచ్చిన ఆ శరణార్థులను కూడా తమతోపాటు తీసుకెళ్లాలని అమెరికా మెరైన్ అధికారులు నిర్ణయించారు. ఆ శరణార్థులను రక్షించేందుకు మిగతా అధికారులను ఒప్పించడంలో మా తాతయ్య కల్నల్ ఎడ్వర్డ్ ఫోర్నీ సమన్వయకర్తగా వ్యవహరించారు" అని ప్రస్తుతం దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో ఉంటున్న నెడ్ వివరించారు.

ఫొటో సోర్స్, AL FRANZON

ఫొటో క్యాప్షన్,

కార్గో నౌకలోకి ఎక్కిన 14 వేల మంది శరణార్థులు

అమెరికా సైనికుల నౌకలోకి ఎక్కితేనే బతుకుతాం, లేదంటే ప్రాణాలతో ఉండలేమని వేలాది మంది శరణార్థులు భయపడుతున్నారు. వారిలో 17 ఏళ్ల హాన్-బో-బే తన తల్లితో ఉన్నారు.

"అది అత్యంత భయంకరమైన సమయం. ఏ క్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఆ నౌక ఎక్కడం తప్పించి మాకు మరో ఆలోచన లేదు. అది ఎక్కడికి వెళ్తుందో కూడా మాకు తెలియదు. అయినా, ప్రాణాలు కాపాడుకోవచ్చన్నదే మా ధీమా. ఎలాగోలా ఆ ఓడ ఎక్కాం. దాంతో ఊపిరి పీల్చుకున్నాం. కానీ, ఓడ కదిలాక సొంత గడ్డను వీడుతున్నందుకు కన్నీళ్లు ఆగలేదు. తీరం నుంచి దూరం వెళ్లే కొద్దీ వెనక్కి చూస్తూ ఉండిపోయాం'' అని హాన్-బో గుర్తు చేసుకున్నారు.

ఓడల్లోకి ముందుగా సైనిక వాహనాలు, యుద్ధ సామగ్రి బాక్సులు, ఇతర నిత్యావసర సరకులను ఎక్కించారు. వాటి మధ్యలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ శరణార్థులు చేరిపోయారు. తాగేందుకు నీళ్లు లేవు, తినేందుకు ఆహారం లేదు.

నిజానికి సైనిక సామగ్రితో పాటు 60 మంది సిబ్బందిని మాత్రమే తీసుకెళ్లేలా ఎస్‌ఎస్ మెరెడిత్ విక్టరీని డిజైన్ చేశారు. కానీ, ఇప్పుడు అందులో 14,000 మంది శరణార్థులు ఉన్నారు. సైనిక సామగ్రి, వాహనాలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, US MARINE CORPS ARCHIVES

ఫొటో క్యాప్షన్,

నౌకలోకి వెళ్లేందుకు క్యూ కట్టిన శరణార్థులు

"మా అమ్మ ఇంటి నుంచి చిన్న బ్లాంకెట్ పట్టుకురాగలిగింది. మా అమ్మ, నేను, మా చెల్లి ముగ్గురం దానితో ముడివేసుకున్నాం. ఓడలో వేల మంది ఉన్నారు. ఎటూ కదల్లేకపోతున్నాం. సముద్రంలో అలలు వచ్చినప్పుడల్లా నీటి తుంపరలు మీద పడటంతో పూర్తిగా తడిసిపోయాం. సముద్రంలో పడిపోతామేమోనని భయపడ్డాం" అని హాన్-బో వివరించారు.

అదృష్టం కొద్దీ ఆ ప్రయాణంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. దాదాపు లక్ష మంది సైనిక బలగాలతో పాటు, మరో లక్ష మంది దాకా శరణార్థులు సురక్షితంగా దక్షిణ కొరియా చేరుకున్నారు.

అమెరికా చరిత్రలో అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అంతమంది ప్రజలను సముద్ర మార్గంలో సైనిక బలగాలు రక్షించడం అదే అతిపెద్ద ఆపరేషన్. దాంతో, ఆ నౌకకు 'ది షిప్ ఆఫ్ మిరాకిల్స్' అనే పేరు కూడా వచ్చింది.

ఎస్‌ఎస్ మెరెడిత్ విక్టరీ ఓడ జియోజీ ఐలాండ్ పోర్టుకు చేరుకునే సరికి అందులో ఐదుగురు శిశువులు జన్మించారు. ఆ ఐదుగురిలో లీ గియాంగ్- పిల్ ఒకరు. ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్లు.

ఆ నౌకలో సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో ఆయన బొడ్డుతాడును 'మంత్రసాని' పంటితోనే కొరికి కత్తిరించారు.

అమెరికా సైనికులకు ఎవరికీ కొరియా పేర్లు తెలియదు. దాంతో, ఆ శిశువులను కిమ్చి అని పిలిచేవారు. లీ గియాంగ్- పిల్‌కి వాళ్లు పెట్టిన పేరు కిమ్చి5.

ఫొటో క్యాప్షన్,

లీ గియాంగ్- పిల్

ఎస్‌ఎస్ మెరెడిత్ విక్టరీ ఓడ 70 ఏళ్లుగా జియోజీ ఐలాండ్ తీరంలోనే ఉంది. కిమ్చి5 కూడా ఆ దీవిలోనే నివసిస్తున్నారు. పశువైద్యుడిగా పనిచేస్తున్న ఆయన తన బిజినెస్ కార్డు మీద ఇప్పటికీ పేరు కిమ్చి5 అని రాసుకున్నారు.

కిమ్చి1 సోహ్న్ యాంగ్- యుంగ్‌గా దక్షిణ కొరియాలో చాలామందికి తెలుసు. కిమ్చి2, 3, 4 లు ఎక్కడున్నారు? ఏమయ్యారన్న వివరాలు మాత్రం ఎవరికీ తెలియడంలేదు

ఆ ఓడల్లో దక్షిణ కొరియా చేరుకున్న వారి వారసులు ప్రస్తుతం దక్షిణ కొరియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది దాకా ఉంటారని అంచనా.

ఫొటో సోర్స్, LEE GYONG-PIL

ఫొటో క్యాప్షన్,

లీ గియాంగ్- పిల్ కార్గో షిప్‌లోనే జన్మించారు. అప్పుడు ఆయనకు సైనికులు కిమ్చి5 అని పేరు పెట్టారు

అమెరికా బలగాలు బయలుదేరి వెళ్తూ వెళ్తూ.. హంగ్నమ్ పోర్టులో బాంబులను వేశాయి. అనంతరం ఆ పట్టణంలోకి చైనా ఆర్మీ ప్రవేశించింది.

"బాంబులు పేలిన తర్వాత ఆ బీచ్‌లో అగ్నిజ్వాలలు భారీగా ఎగిసిపడటాన్ని నేను ఓడలోంచి చూశాను. మేము ఎలాగోలా అమెరికా ఓడలు ఎక్కి వచ్చాం. కానీ, ఇంకా చాలామంది ఎక్కలేక అక్కడే ఉండిపోయారు. వాళ్లంతా బాంబు పేలుళ్లలో చనిపోయి ఉంటారు. యుద్ధాలు అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రపంచంలో యుద్ధాలు రాకూడదు'' అని హాన్-బో-బే అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)