నార్త్‌ పోల్‌లోని శాంటా ఇల్లు ఇది... ఇక్కడికి ఎలా వెళ్లాలో తెలుసా?

నార్త్ పోల్‌ పట్టణంలోని శాంటా క్లాజ్ ఇల్లు ఒక ప్రత్యేక పర్యటక ప్రదేశం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

నార్త్ పోల్‌ పట్టణంలోని శాంటా క్లాజ్ ఇల్లు ఒక ప్రత్యేక పర్యటక ప్రదేశం

'నార్త్ పోల్‌'లోని శాంటా క్లాజ్ ఇంటికి ఎలా వెళ్లాలో మీకు తెలుసా?

ఈ ప్రశ్న వినగానే... అసలు 'ఉత్తర ధ్రువం' దగ్గరకు దారి అడగటమేంటని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.

కానీ, ఈ ప్రశ్నలో నార్త్ పోల్ అంటే నిజమైన ఉత్తర ధ్రువం కాదు. అది అమెరికాలోని ఒక పట్టణం పేరు.

ఏడాది పొడవునా క్రిస్మస్ సందడి కనిపించే ఈ పట్టణవాసులకు చిత్రవిచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి.

21 ఏళ్ల కోడీ మెయెర్ అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో ఉన్న ఈ పట్టణంలోనే పుట్టి పెరిగారు. ఇప్పుడు శాంటా క్లాజ్ హౌస్‌లో పనిచేస్తున్నారు.

తనకు తరచూ ఎదురయ్యే ప్రశ్నలకు ఆన్‌లైన్‌లో ఆయన సమాధానాలు చెబుతున్నారు.

''సాధారణంగా చాలామంది ఓ... మీరు ఉత్తర ధ్రువం దగ్గర ఉంటారా! తమాషా చేస్తున్నారా? అని అంటారు. ఇంకొందరు అది నిజమైన పట్టణమేనా? అని ప్రశ్నిస్తుంటారు. నిజంగా అది ఊరే అని వారికి గూగుల్‌లో చూపిస్తుంటాను" అని కోడీ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రపంచంలోనే అతిపెద్ద ఫైబర్ గ్లాస్‌ శాంటా క్లాజ్ విగ్రహం నార్త్‌ పోల్‌లో ఉంది

అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో నార్త్ పోల్ అనే చిన్న పట్టణం ఉంది. దీని జనాభా 2,117. నార్త్ పోల్ అనగానే ఉత్తర ధ్రువం అని చాలామంది అనుకుంటారు. కానీ, ఇది ధ్రువం కాదు. వాస్తవ ఉత్తర ధ్రువానికి 2,700 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది.

ఆర్కిటిక్ సర్కిల్ నుంచి దక్షిణం వైపున రెండు గంటలు ప్రయాణిస్తే ఈ పట్టణం వస్తుంది. ప్రముఖ పర్యటక ప్రదేశం. 'శాంటా క్లాజ్, నార్త్ పోల్' చిరునామాతో ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి అనేక ఉత్తరాలు వస్తుంటాయి.

ఆ ఉత్తరాలలో అడిగే ప్రశ్నలకు ఇక్కడికి సమీపంలో ఉన్న ఈల్సన్ వైమానిక దళ స్థావరం దగ్గర నుంచి కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు సమాధానాలు రాస్తుంటారు.

"ఈ నార్త్ పోల్‌ పట్టణంలో గడపడం చాలా అరుదైన అనుభూతి. ప్రపంచ నలుమూలల నుంచి చిన్నారులు రాసే ఉత్తరాలకు మేము ప్రత్యుత్తరాలు రాస్తుంటాం. నేను గతంలో శాంటాకు ఉత్తరం రాశాను. ఆ తర్వాత అటువైపు నుంచి ప్రత్యుత్తరం వచ్చినప్పుడు నా ఆనందాన్ని ఇప్పుడు మాటల్లో వర్ణించలేను" అని నార్త్‌పోల్‌‌లో రెండేళ్లుగా పనిచేస్తున్న ఆ వైమానిక దళ సభ్యురాలు మిట్జి విల్కాక్స్ వివరించారు.

ఫొటో క్యాప్షన్,

ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడి శాంటా క్లాజ్‌కు వచ్చే ఉత్తరాలకు మిట్జి ప్రత్యుత్తరాలు రాస్తుంటారు.

ఏటా ఈ సమయంలో ఇక్కడ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండదు. కాబట్టి, బయట తిరిగేందుకు పెద్దగా వీలుండదు.

"సాధారణంగా ఈ కాలంలో ఉదయం 11 లేదా 12 గంటలకు సూర్యుడు పైకి వస్తాడు. మళ్లీ 3 గంటలకే కనిపించకుండా పోతాడు. కాబట్టి మనకు మూడు నాలుగు గంటల సమయమే ఉంటుంది" అని కోడీ చెప్పారు.

చలి విషయానికొస్తే, డిసెంబర్‌లో ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 25 డిగ్రీల సెంటీగ్రేడ్‌ దాకా పడిపోతుందని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఉత్తర ధ్రువం నుంచి విరజిమ్మే అందమైన వెలుగులను చూసి ఆస్వాదించేందుకు పర్యటకులు నార్త్‌ పోల్‌కు వస్తుంటారు

"రాత్రి పూట కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. స్నో బోర్డింగ్‌కు వెళ్తాం. స్నోమొబైలింగ్, ఐస్-ఫిషింగ్ కూడా చేయొచ్చు" అని కోడీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)