రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఓ ప్రశ్న అడిగింది... ఈ జర్నలిస్టు ఉద్యోగం పోయింది

అలీసా యరోవ్‌స్కయ

ఈమె పేరు అలీసా యరోవ్‌స్కయ. రష్యా ప్రభుత్వ టీవీ చానల్ యామల్-రీజియన్‌లో ఈమె జర్నలిస్టుగా పనిచేసేవారు. దేశాధ్యక్షుడు వార్షిక విలేకరుల సమావేశంలో వ్లాదిమిర్ పుతిన్‌ను ఈమె ఒక ప్రశ్న అడిగారు. కొన్ని రోజులకే ఈమెను ఉద్యోగం లోనుంచి తీసేశారు. ఎందుకనేది అస్పష్టం.

పశ్చిమ సైబీరియాలో వాయువ్యంగా ఉన్న ఆర్కిటిక్ యామల్ ప్రాంత అధికారులు.. ఈమె అడిగిన ప్రశ్న పట్ల అసంతృప్తి చెందారని కొన్ని వార్తలు చెప్తున్నాయి.

అయితే.. తాను స్వయంగా రాజీనామా సమర్పించానని అలీసా చెప్తున్నారు.

కానీ.. ఈ ఉదంతం రష్యా పాత్రికేయులు అధికారులను బాధ్యులను చేస్తూ ప్రశ్నించటంలో ఉన్న కష్టాలను మరోసారి తెరపైకి తెచ్చింది.

ఈ జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఏమిటి?

అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 19వ తేదీన వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం మొదలై దాదాపు మూడు గంటలు దాటిన తర్వాత యామల్ ప్రాంతానికి చెందిన పాత్రికేయులకు మైక్రోఫోన్ అందింది.

అలీసా యరోవ్‌స్కయ మైక్రోఫోన్ తీసుకున్నారు. అయితే.. పుతిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ ఎంపిక చేసిన యామల్-రీజియన్ టీవీకి చెందిన మరో జర్నలిస్టుకు ఆ మైక్రోఫోన్‌ను ఇవ్వాలనుకుంటే.. దానిని అలీసా తీసుకున్నట్లు చెప్తున్నారు.

భూతాపం వల్ల ఆర్కిటిక్ సముద్ర మార్గం కరుగుతున్న ఫలితంగా తమ ప్రాంతానికి కలిగే ప్రయోజనాల గురించి ఆమె ప్రస్తావించటం మొదలుపెట్టారు. స్థానికంగా రైలు మార్గం సహా మౌలిక సదుపాయాల నిర్మాణం జరుగుతుండగా.. ఓబ్ నది మీద ఒక వంతెన నిర్మాణం ఆగిపోయిందని పేర్కొన్నారు. రెండు స్థానిక నగరాలు సేల్ఖార్ద్, లాబిత్నాంగిలను అనుసంధానించటానికి ఆ వంతెన నిర్మాణం తలపెట్టారు.

''ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తిచేయటానికి మా గవర్నర్ దిమిత్రి అర్ట్క్యుఖోవ్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కానీ.. దీని గురించి కేంద్ర స్థాయిలో అతి తక్కువగా చర్చించినట్లు మాకు వినిపిస్తోంది. నా ప్రశ్న ఏమిటంటే.. కేంద్రంలో అత్యంత ముఖ్యమైన మనుషులు ఈ విషయం మీద దృష్టి సారించగలరా?'' అని ఆమె ప్రశ్నించారు.

దీనికి పుతిన్ స్పందిస్తూ.. ఒక నిర్దిష్ట ప్రాజెక్టును ప్రత్యేకంగా ఎంపిక చేయటం కేంద్ర ప్రభుత్వానికి తగదని చెప్పారు. అయితే.. ఆ ప్రాంతీయ రవాణా మౌలిక సదుపాయాలకు ఓబ్ వంతెన ''కీలకమైన లింకు'' అని అభివర్ణించారు. ఎందుకంటే.. ఆర్కిటిక్ ఓడరేవులను తెరవటం చాలా ప్రధానమైన కృషి అంటూ.. వాటిని అభివృద్ధితో, సరుకుల రవాణాతో అనుసంధానించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

దీని గురించి ప్రభుత్వానికి అవగాహన ఉందని.. దీని మీద దృష్టి పెడుతుందని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP

అలీసా ఉద్యోగం ఎందుకు పోయింది?

ఈ విషయంలో అలీసా జోక్యం చేసుకవటం పట్ల యామల్-నెనెట్స్ జిల్లాకు చెందిన సీనియర్ అధికారులు అసంతృప్తిగా ఉన్నారని.. తన సహచర జర్నలిస్టు నుంచి ఆమె మైక్రోఫోన్ తీసేసుకోవటం పట్ల టీవీ చానల్ ఆగ్రహించిందని Ura.ru వెబ్‌సైట్ ఓ కథనంలో పేర్కొంది.

ఆమె పనిచేసిన టీవీ చానల్‌ యజమాని స్థానిక ప్రభుత్వమనే విషయాన్ని ఉటంకిస్తూ.. తనను పొగడడాన్ని గవర్నర్ అభినందించలేదని ప్రభుత్వ వర్గాల సమాచారంగా ఆ వెబ్‌సైట్ చెప్పింది. అంతేకాదు.. పుతిన్ మీడియా సమావేశంలో రైల్వే అనుసంధానాల గురించి ప్రశ్న అడగాలని ముందుగానే అంగీకారానికి వచ్చినట్లు కూడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయని వివరించింది.

పుతిన్ ఎప్పుడు విలేకరుల సమావేశం నిర్వహించినా జర్నలిస్టులు తమ ప్రశ్నలు వినిపించటానికి పోటీపడాల్సి వస్తుంది. ఈ సమావేశంలో బీబీసీ ప్రతినిధి స్టీవ్ రోసెన్‌బర్గ్.. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జన్సన్ గురించి పుతిన్‌ను ఒక ప్రశ్న అడగటం ద్వారా పరిస్థితి ఎలా ఉంటుందో చూపించారు.

ఇదిలావుంటే.. తనను ఉద్యోగం నుంచి తొలగించలేదని.. తాను రాజీనామా సమర్పించానని అలీసా పలు రష్యా మీడియా సంస్థలకు చెప్పారు. అయితే.. దీనికి, తాను అడిగిన ప్రశ్నకు సంబంధం ఉందా లేదా అన్న విషయం మాత్రం చెప్పలేదు.

అయితే.. పుతిన్ మీడియా సమావేశం సందర్భంగా తీసిన ఆయన ఫొటోతో కూడిన ఒక ఫేస్‌బుక్‌ పోస్టు కింద.. పుతిన్ రూపం మీద అలీసా చేసిన వ్యాఖ్యకు ఆమె ఉద్యోగం కోల్పోవటానికి సంబంధం ఉండి ఉండొచ్చునని మరో వార్తా కథనం అంచనా వేసింది.

''నాకు బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ కనిపించటం లేదు. ఆయన వయసు తెలుస్తోంది'' అని అలీసా వ్యాఖ్యానించినట్లు ఆ కథనం చెప్తోంది. ఆ పోస్టును తర్వాత తొలగించటంతో ఈ కామెంట్‌ను తనిఖీ చేయటం సాధ్యం కాలేదు.

మరోవైపు.. అలీసా ఉద్యోగం వీడటానికి కారణం.. ఆమె రాజీనామా చేయటమా, తొలగించటమా అనేది తెలియదని పుతిన్ అధికార ప్రతినిధి మంగళవారం వ్యాఖ్యానించినట్లు Izvestia వెబ్‌సైట్ ఒక కథనంలో తెలిపింది. అయితే.. జర్నలిస్టును ఉద్యోగం నుంచి తొలగించటం అనేది ఒక చానల్ సంపాదకులకు సంబంధించిన అంశం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)