ఫోల్డింగ్ ఫోన్ల మీద శాపం 2020లో తొలగిపోతుందా?

  • 29 డిసెంబర్ 2019
మోటరోలా రేజర్

మోటరోలా తన కొత్త మోడల్ 'రేజర్' ఫోన్‌ విడుదలను కొంత కాలం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

మోటరోలా 2005లో విడుదల చేసిన ఫోల్డింగ్ ఫోన్ ప్రజాదరణ పొందటంతో.. దానిని మరింత అభివృద్ధి చేసి నిలువుగా మడత పెట్టే ఫీచర్‌తో 'రేజర్' మోడల్‌గా డిసెంబర్ 26వ తేదీన అమెరికాలో విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించింది.

ఈ 'రేజర్' ఆరంభ ధర 1,500 డాలర్లు (దాదాపు రూ. 1,07,000) ఉంటుందని కూడా చెప్పింది.

అయితే.. ఈ ఫోన్‌కు వచ్చిన ప్రజాదరణ వల్ల విడుదలలో జాప్యమవుతోందని.. సరఫరా కన్నా చాలా అధికంగా డిమాండ్ ఉండటంతో దీనిని అందించటం ఆలస్యమవుతోందని మోటరోలా యాజమాన్య సంస్థ లెనోవో చెప్తోంది.

కానీ.. మడత ఫోన్‌లు ఎదుర్కొంటున్న బాలారిష్టాలకు ఈ 'రేజర్' మరో ఉదాహరణ.

రేజర్ విడుదలలో జాప్యం పెద్ద విషయం కాదని మోటరోలా చెప్తున్నా.. ఎప్పుడు విడుదల చేస్తామనే కొత్త తేదీ ఇంకా వెల్లడించలేదు.

రేజర్ నమూనా ఫోన్‌ను బీబీసీ ప్రతినిధి క్రిస్ ఫాక్స్ ఉపయోగించి చూసినపుడు.. అందులోని హార్డ్‌వేర్‌లో కొన్ని సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఫోన్‌ను మడతపెట్టినపుడు దాని స్క్రీన్.. డివైజ్‌ నుంచి విడిపోతున్న తీరు అందులో ముఖ్యమైనది.

ఆ ఫోన్.. ఒక ప్రధానమైన మోడల్‌గా కన్నా.. ఒక ఫ్యాషన్ వస్తువుగానే అనిపించే అవకాశం ఎక్కువ ఉందని ఆయన అంచనా వేశారు.

ఈ ఫోన్‌కు 1,500 డాలర్ల ధర అనేది ఖరీదైన విషయంగా అనిపించినా.. ఫోల్డింగ్ ఫోన్ వర్గంలో తన ప్రధాన ప్రత్యర్థులైన రెండు ఫోన్ల కన్నా దీని ధర తక్కువగా ఉంది.

శాంసంగ్ ఫోల్డ్ ధర 1,980 డాలర్లు అయితే.. హువావే మేట్ ఎక్స్ ధర 2,600 డాలర్లు.

శాంసంగ్ కూడా తన 'ఫోల్డ్' మోడల్‌ను ఏప్రిల్‌లో విడుదల చేయాల్సి ఉండగా.. సమీక్షకులు తమ డివైజ్‌ల స్క్రీన్లు పగిలిపోయాయని నివేదించటంతో వాయిదా వేసింది.

దీంతో.. హువావే కూడా ముందుగా ప్రకటించిన తేదీకి తన 'మేట్ ఎక్స్' విడుదల చేయకుండా వాయిదా వేసింది. శాంసంగ్ మోడల్‌కు సమస్యలు ఎదురైన నేపథ్యంలో.. తన మోడల్‌ను విడుదల చేయటానికి ముందు మరిన్ని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పింది.

ఎట్టకేలకు.. సెప్టెంబర్‌లో శాంసంగ్ ఫోల్డ్, నవంబర్‌లో హువావే మేట్ ఎక్స్ మోడళ్లను విడుదల చేశారు. నిజానికి 2019 ఆరంభంలో మడత పెట్టే స్మార్ట్ ఫోన్లు వచ్చేస్తాయని.. మాంద్యం నెలకొన్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు ఉత్తేజం తెస్తాయని ఎంతో ఆసక్తిగా చర్చ జరిగితే.. ఏడాది చివరికి కానీ అవి మార్కెట్‌లోకి రాలేదు.

కానీ.. ఈ స్మార్ట్‌ఫోన్ దిగ్గజాల మోడళ్లను.. కాలిఫోర్నియాకు చెందిన పెద్దగా తెలియని కంపెనీ రాయోల్ కార్పొరేషన్ తన 'ఫ్లెక్స్‌పాయ్' మోడల్‌తో బెంబేలెత్తించింది. ఆ సంస్థ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను 2018 అక్టోబర్‌లో బీజింగ్‌లో ఆవిష్కరించింది.

అయితే.. ఫ్లెక్స్‌పాయ్ విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. దానికి బలమైన రివ్యూలూ లభించలేదు.

బీబీసీ క్లిక్ ప్రతినిధి డాన్ సిమన్స్.. 2019 జనవరిలో ఒక డెవలపర్ మోడల్ ఫోన్‌ను పరీక్షించి చూశారు. ఆ ఫోన్‌లోని ఫోల్డింగ్ స్క్రీన్ దానిని ఉంచిన దిశను బట్టి మారినప్పుడు.. ఆ మార్పులకు అనుగుణంగా పనిచేసే యాప్‌లు ఏవీ ఆ సమయానికి రూపొందలేదని ఆయన చెప్పారు.

చైనా దిగ్గజం షావోమి అధ్యక్షుడు బిన్ లిన్ కూడా 2019 జనవరిలో తన నమూనా ఫోల్డింగ్ ఫోన్‌ను ప్రదర్శించారు. కానీ వినియోగదారుల కోసం ఈ ఉత్పత్తి ఇంకా మార్కెట్‌లోకి రావాల్సి ఉంది.


‘‘జనంలో చాలా ఆసక్తి ఉంది...’’

జో క్లీన్‌మాన్, టెక్నాలజీ రిపోర్టర్

''ఇప్పటివరకూ రోడ్ల మీద ఎవరి చేతుల్లోనూ ఒక ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను నేను చూడలేదు. పారిశ్రామిక కార్యక్రమంలో నమూనా ఫోన్‌గానో, ఆఫీసుల్లో సమీక్షిస్తున్న హ్యాండ్‌సెట్‌గానో తప్ప.

ఇది 2020లో మారుతుందా?

క్రౌడ్-ఫండింగ్‌తో నడిచిన చాలా విఫలమైన ప్రాజెక్టులు చెప్తున్నట్లుగా.. మడత ఫోన్లకు అనుగుణంగా హార్డ్‌వేర్‌ను రూపొందించటం చాలా కష్టం. అయితే.. సీసీఎస్ ఇన్‌సైట్‌కు చెందిన విశ్లేషకుడు బెన్ వుడ్ ఆశాభావంతో ఉన్నారు.

ఫోల్డింగ్ డివైజ్‌లకు వాటివైన సమస్యలు ఉన్నప్పటికీ.. రేజర్ కోసం డిమాండ్, శాంసంగ్ ఫోల్డ్ ప్రారంభ అమ్మకాల లెక్కలు.. వినియోగదారులు చాలా ఆసక్తిగా ఉన్నారనేందుకు బలమైన సంకేతమని ఆయన అంటారు.

''ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే టెక్నాలజీ.. స్మార్ట్‌ఫోన్లపై మాత్రమే కాకుండా ఇంకా విస్తృత ప్రభావం చూపుతుందని నేను భావిస్తున్నా'' అని ఆయన నాతో చెప్పారు.

''వచ్చే దశాబ్ద కాలంలో.. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో సరికొత్త అధ్యాయానికి అది తెరతీస్తుంది. అన్ని రకాల ఉత్పత్తులకూ స్క్రీన్లు జతచేస్తారు. స్మార్ట్ స్పీకర్లు వంటి డివైజ్‌ల చుట్టూ స్క్రీన్లు అతికించి కనపడటానికి ఎంతో కాలం పట్టదు'' అని విశ్లేషించారు.

కొత్త సంవత్సరంలో సరికొత్త ఫోల్డింగ్ డివైజ్‌లను చూస్తామని.. జనవరిలో జరగబోయే భారీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో సీఈఎస్‌లో, ఫిబ్రవరిలో జరిగే మొబైల్ ఫోన్ ఎక్స్‌పో ఎండబ్ల్యూసీలో అవి దర్శనమిస్తాయని కూడా వుడ్ భావిస్తున్నారు.

ఇదిలావుంటే.. కొలంబియన్ డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ సోదరుడు నెలకొల్పిన ఎస్కోబార్ ఇంక్ అనే కంపెనీ.. కేవలం 345 డాలర్ల ధరతో ఫోల్డింగ్ డివైజ్‌ను తీసుకువస్తూ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నట్లు ఈ నెలలో ప్రకటించింది.

ఎస్కోబార్ ఫోల్డ్ 1 మోడల్.. డిజైన్, ఫీచర్ల విషయంలో అచ్చంగా రాయోల్ ఫ్లెక్స్‌పాయ్ తరహాలోనే కనిపిస్తోందని వివిధ టెక్నాలజీ సైట్లు పేర్కొన్నాయి.

ప్రస్తుతం ఇది ఆ సంస్థ సొంత వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

దీనివల్ల శాంసంగ్ కలవరపడుతుందని నాకైతే ఎందుకో అనిపించటం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు?

కరోనా వైరస్: చైనాలో 106కు చేరిన మరణాలు... ఇతర దేశాల్లో పెరుగుతున్న బాధితులు

ఆఫ్రికా: ప్రధాని భార్య హత్య మిస్టరీ... ఆరోపణల్లో కూరుకుపోయిన ప్రధాని థామస్, ఆయన రెండో భార్య

అఫ్గానిస్తాన్‌లో మా విమానం కూలడం నిజమే: అమెరికా సైన్యం

ఎయిర్ ఇండియా: రూ. 22,863 కోట్ల రుణ భారం సహా సంపూర్ణ విక్రయానికి ప్రభుత్వ నిర్ణయం

'దిశ' కేసులో తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద 40 అడుగుల ఎత్తున ఉన్న సీసీ కెమేరా ఫుటేజిలో కీలక దృశ్యాలు

ఏపీ శాసన మండలి రద్దుకు 133-0 ఓట్లతో అసెంబ్లీ తీర్మానం... అనుకూలంగా ఓటేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

కోబ్ బ్రయాంట్: బాస్కెట్ బాల్ సూపర్ స్టార్, ఆయన 13 ఏళ్ళ కుమార్తె హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం