శాండా బల్లి: మనుషుల 'మగతనం' కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఎడారి జీవి

  • ఉమర్ దరాజ్ నంగియానా
  • బీబీసీ ప్రతినిధి, లాహోర్
శాండా బల్లి

పాకిస్తాన్‌లో ఎడారి ప్రాంతాల్లో ఇసుకలో తచ్చాడే ఈ బల్లిని శాండా(ఇంగ్లీషులో సారా హార్డ్ వికీ) అంటారు. ఇది ఉడుములాగే ఉంటుంది.

వేటగాళ్లు, పక్షుల నుంచి తనను ఎలాగోలా తప్పించుకునే ఈ బల్లి, మనిషి నుంచి మాత్రం ప్రాణాలు కాపాడుకోలేకపోతోంది. మిగతా అన్ని ప్రాణుల్లాగే దీన్లో కూడా కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వుపై మనిషి కన్ను పడింది.

దాంతో, శాండా బల్లి లాహోర్ వీధుల్లో, చౌరస్తాల్లో, రహదారుల పక్కన లేదా తోపుడు బండ్లపై, షాపుల్లో అంగడి సరుకైపోయింది.

అక్కడ కనిపించే శాండా బల్లులు అటూ ఇటూ కదల్లేవు. ఎందుకంటే, అప్పటికే దాని నడుము విరిగిపోయి ఉంటుంది. ఆ తర్వాత అది గంటలు లెక్కబెట్టుకుంటూ ఉంటుంది.

ఫుట్‌పాత్‌లపై జనం గుమిగూడినా, లేదంటే పెద్ద పెద్ద షాపుల్లో 'స్వచ్ఛమైన శాండా ఆయిల్' అని బోర్డులు పెట్టే వాళ్లు దొరకడమే ఆలస్యం, కత్తితో దీని మెత్తటి కడుపు కోసి లోపల ఉన్న కొవ్వును బయటకు తీస్తారు.

ఇదంతా కొనేవారి కళ్లముందే జరుగుతుంది. అప్పుడే అది అసలైన నూనె అని వాళ్లకు నమ్మకం కలుగుతుంది.

శాండా నూనె ప్రత్యేకత ఏంటి?

లాహోర్‌లో చాలా ప్రాంతాల్లో శాండా బల్లి నూనె అమ్మే షాపులు కనిపిస్తాయి. వాటిలో కొన్ని దశాబ్దాల నుంచీ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో శాండా బల్లి నూనె వ్యాపారం బహిరంగంగా జరుగుతుంటుంది.

కానీ ఆ షాపుల్లో కొనడానికి వచ్చేవారు దాని గురించి అడగడానికి జంకుతారు. పరిచయస్తులకు తమ ‘విషయం’ తెలుస్తుందని అని భయపడతారు. ఠోకర్ నియాజ్ బేగ్‌ అనే ప్రాంతంలో ఒక వంతెన కింద కొన్ని శాండా బల్లులతో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడి దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు.

పతుకీ నుంచి వచ్చిన ఆ యువకుడు తన పేరు యాసీన్ అని చెప్పాడు. తన స్నేహితుడి కోసం శాండ్ నూనె తీసుకెళ్లడానికి వచ్చానని చెప్పాడు. "నేను ఇంతకు ముందు కూడా ఈ నూనె నా ఫ్రెండ్ కోసం పంపించాను. అతడికి బాగుంది. ఇప్పుడు తను మళ్లీ స్వచ్ఛమైన శాండా ఆయిల్ కావాలని చెప్పాడు. అందుకే నేనిక్కడ నా కళ్లముందే తీయిస్తున్నా" అన్నాడు.

శాండా బల్లి నూనెలో కామోద్దీపన లక్షణాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. అంటే అది మగతనం పెంచుతుందని, అంగస్తంభన సమస్యలు లేకుండా చేస్తుందని అనుకుంటున్నారు. "మగతనం లోపం ఉంటే ఈ నూనెతో పురుషాంగాన్ని మసాజ్ చేస్తారు" అని అతడు చెప్పాడు.

'మగతనం' లోపానికి చికిత్స

మహమ్మద్ యాసీన్ వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. తను చదువుకోలేదు.

అలాంటప్పుడు, అతడికి ఈ శాండా నూనె గురించి ఎలా తెలిసింది. అతడు ఇంత చాటుగా రాకుండా, ఈ నూనె అమ్మే షాపులకు వెళ్లుండచ్చు కదా.

దానికి సమాధానం చెబుతుండగా, స్థానికులు అతడి చుట్టూ గుమిగూడారు. అక్కడే శాండా నూనె అమ్మే మరో వ్యక్తి ఫారెస్ట్ డిపార్టుమెంటుకు భయపడి తన పేరు రాయొద్దని కోరుతూ బీబీసీతో మాట్లాడాడు.

అతడి దగ్గర నడుము విరగ్గొట్టిన డజనుకు పైగా శాండా బల్లులు ఉన్నాయి. ఆ నూనెతో ఒళ్లు నొప్పులు, పక్షవాతం, కండరాల నొప్పులు కూడా తగ్గడంతోపాటు మగతనం లోపం ఉంటే చికిత్సకు ఈ నూనె మంచిదని చెప్పాడు. అంగస్తంభన సమస్యలు ఉన్నప్పుడు దానిని పురుషాంగానికి మాలిష్ చేస్తారని, తన తాత నుంచి తనకు ఈ వివరాలు తెలిసాయని అతడు చెప్పాడు. ఆ వ్యాపారం వంశపారంపర్యంగా చేస్తున్నానని అన్నాడు.

వాళ్ల దగ్గర శాండా కొవ్వు నూనె సీసాలు మాత్రమే కాదు, ఒక బుట్టలో పాము కూడా ఉంది. మరో రెండు పాములను కింద ఒక డబ్బాలో దాచిపెట్టాడు. ఒక జాడీలో జలగలు ఉన్నాయి. కొన్ని జాడీల్లో రకరకాల కొవ్వులు ఉండడం కనిపించింది.

ఆ కొవ్వులు సింహం, ఎలుగుబంటి, పాము, కప్ప లాంటి వేరే జంతువులవని, వాటిని శాండా నూనెలో కలిపి ప్రత్యేకమైన నూనె తయారు చేస్తామని అతడు చెప్పాడు. అలా శాండా బల్లి నూనె ప్రభావం పెరుగుతుందన్నాడు. ఆ నూనె చాలా వేడిపుట్టిస్తుందని తెలిపాడు.

ఏ జంతువు కొవ్వు కావాలన్నా, తన దగ్గర అది సులభంగా దొరుకుతుందని అతడు చెప్పాడు. దేనికి డిమాండ్ ఉంటే ఆ రకం నూనె తయారు చేసి ఇస్తానని అన్నాడు.

ఎక్కువగా యువకులే వస్తున్నారు

శాండా బల్లి నూనెను కొనడానికి అతడి దగ్గరకు అన్నివయసుల వారూ వస్తుంటారు. కానీ వారిలో ఎక్కువగా యువకులే ఉంటారు. "కుర్రాళ్లు, ఇంటర్నెట్‌లో చూసి నూనె తీసుకోడానికి భాటీకి వస్తున్నారు. అంత పెద్దవాళ్లేం కాదు, కానీ నూనె కావాలని అడుగుతారు" అన్నాడు.

శాండా బల్లుల నూనె అమ్మేవారు మగతనం బలహీనత లేదా అంగస్తంభన సమస్యల గురించి తమ దగ్గరకు వచ్చేవారిని భయపెట్టేలా కథలు వినిపిస్తారని అతడు చెప్పాడు.

కానీ, ఇలాంటి సమస్యలకు సంబంధించి ఆధునిక వైద్య పరంగా ఎన్నో చికిత్సలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చే వారిలో ఎక్కువగా చదువుకోని వారే ఉన్నారు.

ఫొటో క్యాప్షన్,

డాక్టర్ ముజమ్మిల్ తాహిర్

శాండా బల్లి నూనె నిజంగా పనికొస్తుందా?

ప్రొఫెసర్ డాక్టర్ ముజిమ్మిల్ తాహిర్ లాహోర్‌లోని ఆయుర్ కేర్ ఆస్పత్రిలో యూరాలజిస్ట్, ఆయన లాహోర్ షేఖ్ జియాద్ ఆస్పత్రి యూరాలజీ విభాగం అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. బీబీసీతో మాట్లాడిన ఆయన శాండా నూనె వల్ల ప్రయోజనం అని చెబుతున్నవన్నీ కల్పితం అన్నారు.

"మనం శాండా నూనె తీసే కొవ్వును పరీక్షలు చేస్తే అది మిగతా జంతువుల్లో కొవ్వులాగే ఉంటుంది. అందులో ఎలాంటి ప్రత్యేకతా లేదని తెలుస్తుంది అన్నారు. దాని నూనెలో కూడా ఎలాంటి లైంగిక బలహీనతలనూ నయం చేసేంత ప్రత్యేకతలు లేవు" అన్నారు.

"మేం అది వాడిన చాలామందిని చూశాం. వారు కాలిన తర్వాత మా దగ్గరకు వస్తారు. వారు ఆ ఆయిల్ ఎక్కడెక్కడ రాసుకుంటారో అక్కడంతా కాలిపోతుంది. తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది" అన్నారు.

"అంగస్తంభనకు ఎక్కువగా ఎలాంటి కారణం ఉండదు. పురుషత్వ లోపం అని శాండా బల్లి నూనె ఉపయోగిస్తున్నామని చెబుతున్నారు. 90 శాతం కేసుల్లో అది శారీరక సమస్య కాదు" అని డాక్టర్ ముజమ్మిల్ చెప్పారు.

అంగస్తంభన సమస్య ఉన్న వారికి సైకోథెరపీ ఇస్తే 60 నుంచి 70 శాతం మందికి నయం అవుతుంది. మిగతావారికి మందుల అవసరం ఉంటుంది. అవి వాడితే వారికి కూడా నయం అవుతుంది అన్నారు.

మెడికల్ సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందంటే అన్నిరకాల వ్యాధులకూ ఇప్పుడు చికిత్స సాధ్యమే. శాండా బల్లులను అకారణంగా చంపుతున్నారు. ఇదంతా డబ్బుల కోసమే జరుగుతోంది అని డాక్టర్ ముజమ్మిల్ ఆరోపించారు.

శాండా బల్లులే ఎందుకు?

పాకిస్తాన్, భారత్‌లోని చాలా ప్రాంతాల్లోనే కాకుండా శాండా బల్లులు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. అక్కడ కూడా వీటిని అలా అనుకుని చంపేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి వీటి నూనెను అరేబియా, ఇతర దేశాలకు కూడా పంపిస్తున్నారు అని ముజమ్మిల్ చెప్పారు.

చాలా ప్రాంతాల్లో దాని జననావయవాలు కూడా తింటున్నారు. దాని మాంసం కూడా అమ్ముతున్నారు. వీటన్నిటికీ వెనుక శాండా వల్ల లైంగిక బలహీనతలు నయం అవుతాయనే ఆలోచనే కారణం.

ఈ వ్యాపారంలో ఉన్న ఎక్కువ మంది చదువుకోని వారే. వారు చదువుకోని వాళ్లను మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నారు.

శతాబ్దాల నుంచి శాండా బల్లుల గురించి ఇలాంటి అభిప్రాయం ఉంది. ఇది చిన్న ప్రాణి, ఎలాంటి రక్షణ లేకుండా ఉంటుంది. ఎడారిలో చాలా వేడిగా ఉన్న వాతావరణంలో కూడా బతకగలదు. అందుకే దీని కొవ్వు తింటే చాలా శక్తి వస్తుందని నమ్ముతారు.

శతాబ్దాల నుంచి చెబుతున్న విషయాన్ని వీళ్లు ముందుకు తీసుకెళ్తున్నారు. దీనిపై చాలా పరిశోధనలు జరిగాయి. శాండా కొవ్వులో అలాంటి ఏ శక్తీ లేదని వాటిలో తేలింది.

శాండా నూనె వ్యాపారంతో ఆదాయం ఎంత?

"దీని నూనె ఒక బాటిల్ 150 నుంచి 500 మధ్య అమ్ముతాం. స్పెషల్ నూనె ఇంకా ఎక్కువకు అమ్ముడవుతుంది. కొనేవారికి ఎలాంటి కొవ్వు కావాలి అనేదానిపైన ధర ఆధారపడి ఉంటుంది" అని శాండా నూనె అమ్మే ఒక వ్యక్తి చెప్పాడు.

"స్పెషల్ నూనెను మూడు వేల వరకూ అమ్ముతాం. కొనేవారు అడిగేదాన్ని బట్టి వాళ్లకు తయారు చేసిస్తాం. ఒక శాండాను చంపితే, దాని కొవ్వుతో ఎంత నూనె వస్తుంది అనేది దాని శరీరం సైజును బట్టి ఉంటుంది"

కొన్ని శాండా బల్లుల్లో పది గ్రాములకు పైగా కొవ్వు వస్తే, కొన్నింటిలో 20 గ్రాములు కూడా ఉంటుంది.

ఇదంతా మాతో చెబుతున్న అతడు, హఠాత్తుగా అక్కడ ఉన్న శాండా బల్లుల్ని తీసి డబ్బాలో వేయడం మొదలెట్టాడు. ఎందుకని అడిగితే 'ఫారెస్ట్ డిపార్టుమెంట్ వాళ్లు వస్తున్నారని' చెప్పాడు.

"మేం శాండాలను ఉంచుకోకూడదు. అది చూస్తే, వాళ్లు జరిమానా వేస్తారు లేదంటే మా బండి తీసుకుని వెళ్లిపోతారు" అన్నాడు.

కానీ లాహోర్‌లో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, అక్కడ డజన్ల కొద్దీ శాండా బల్లులను రోజూ బహిరంగంగా చంపుతుంటారు. అక్కడే వాటి నూనె తయారుచేస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)