ప్యూర్టోరికో: భవిష్యత్తు కోసం పోరాడుతున్న ఓ ‘అమెరికన్’ ద్వీపం కథ

  • 29 డిసెంబర్ 2019
హరికేన్ మారియా విధ్వంసం Image copyright Getty Images
చిత్రం శీర్షిక హరికేన్ మారియా విధ్వంసం

"ఏదో బాంబు పడ్డట్లు అనిపించింది"- కరీబియన్ ద్వీపం ప్యూర్టోరికోలో హరికేన్ మారియా సృష్టించిన బీభత్సం గురించి కార్లోస్ రివెరా-వెలెజ్ మాట ఇది. నాడు హరికేన్ వల్ల ఇక్కడ ఇంచుమించు 2,975 మంది చనిపోయారు.

2017 సెప్టెంబరు 20న ప్యూర్టోరికోపై హరికేన్ మారియా విరుచుకుపడటం, తదనంతర పరిణామాలను ప్యూర్టోరికో వైద్య సాంకేతిక పరిజ్ఞాన పరిశ్రమ సంఘం చైర్మన్ అయిన కార్లోస్ గుర్తుతెచ్చుకుంటూ, ఈ వ్యాఖ్య చేశారు.

ఈ ద్వీపం అమెరికా భూభాగంలో ఉంది. 110 మైళ్ల పొడవు, 35 మైళ్ల వెడల్పుతో ఉండే ఈ భూభాగాన్ని అధికారికంగా 'కామన్‌వెల్త్ ఆఫ్ ప్యూర్టోరికో' అని అంటారు.

మూడు రోజులపాటు తమ కంపెనీ సైట్‌కు వెళ్లలేకపోయానని, కమ్యూనికేషన్ టవర్లు కూలిపోయాయని, పైకప్పులు తొలగిపోయాయని, రోడ్లపైకి పెద్దయెత్తున వ్యర్థాలు చేరుకున్నాయని కార్లోస్ వివరించారు. ఒకవైపు మానవ విషాదం, మరోవైపు అప్పటికే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు తగిలిన దెబ్బ ప్యూర్టోరికోను కుంగదీశాయి.

Image copyright Getty Images

పింఛను రుణాలు సహా మొత్తం అప్పులు 12 వేల కోట్ల డాలర్లకు చేరుకోవడంతో, హరికేన్ బీభత్సానికి కొన్ని నెలల ముందు 2017 మేలో ప్యూర్టోరికోను దివాలా తీసినట్లు ప్రకటించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్యూర్టోరికో ఏడాదికి 350 కోట్ల డాలర్లు రుణదాతలకు చెల్లింపులు చేయలేని స్థితికి చేరుకుంది.

హరికేన్ మారియా విధ్వంసానికి ముందు దశాబ్ద కాలంలో ఒకే ఒక్క ఏడాది 2012లో మాత్రమే ప్యూర్టోరికో ఆర్థిక వృద్ధిని సాధించింది. అప్పుడు అర శాతం వృద్ధి నమోదైంది.

హరికేన్ మారియా వల్ల 10 వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. విధ్వంసం తర్వాత ప్యూర్టోరికో మౌలిక సదుపాయాలు, భవనాల పునర్నిర్మాణాన్ని చేపట్టాల్సి వచ్చింది. దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో నాలుగు శాతం వృద్ధి రేటు నమోదైంది.

ఈ వృద్ధిరేటుతో ప్యూర్టోరికోకు కలిగేది తాత్కాలిక ఉపశమనమేనని భావిస్తున్నారు. ఈ ప్రాంత జనాభా తగ్గిపోతోంది. ప్యూర్టోరికో ప్రజలకు అమెరికా పాస్‌పోర్టులు ఉంటాయి. దీంతో వాళ్లు ప్రధాన భూభాగంలో ఉద్యోగాలు చేసేందుకు వీలుంటుంది. ఫలితంగా ఇక్కడ జనాభా తగ్గిపోతోంది.

ప్రస్తుతం ప్యూర్టోరికో జనాభా సుమారు 30 లక్షలు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హరికేన్ మారియా వల్ల విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమవడంతో ప్యూర్టోరికోలో చాలా మంది జనరేటర్లపై ఆధారపడాల్సి వచ్చింది.

రానున్న రెండేళ్లలో ప్యూర్టోరికో ఆర్థిక వ్యవస్థ మళ్లీ పతనమవుతుందని 'ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్'లో లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల ముఖ్య ఆర్థికవేత్త అయిన రాబర్ట్ వుడ్ అంచనా వేస్తున్నారు.

ప్రధానంగా హరికేన్ విధ్వంస అనంతర పునర్నిర్మాణ పనులతో సాధ్యమైన వృద్ధి ఇప్పుడు ఆగిపోతోందని, ఆర్థిక వ్యవస్థ తిరిగి దీర్ఘకాలిక తిరోగమనంలోకి జారుకొంటోందని ఆయన చెప్పారు. వలసలు పెరుగుతున్న, పోటీతత్వం తగ్గిపోతున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థ ఇలా అవుతోందన్నారు.

ప్యూర్టోరికోలో ఒకప్పుడు పన్ను మినహాయింపులు.. తయారీ రంగం ముఖ్యంగా ఔషధ రంగం వృద్ధికి తోడ్పడ్డాయి. అమెరికా సంస్థలకు ఇవి అనుచిత ప్రయోజనం కలిగించేవని భావిస్తారు. వీటిని దశల వారీగా తగ్గిస్తూ వచ్చి 2006లో పూర్తిగా ఎత్తివేసినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో చిక్కుకుపోయింది.

అప్పట్లో బహుశా ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ప్యూర్టోరికోలో పన్ను రేట్లు ఉండేవని, దీనివల్ల చాలా పెద్ద కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయని, ఆర్థిక వ్యవస్థకు అపార ప్రయోజనం కలిగించాయని ప్యూర్టోరికో సంస్థ 'సీహెచ్‌డీఆర్ ఫార్మాస్యూటికల్ కన్సల్టింగ్ సర్వీసెస్' చీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్లోస్ డెల్ రియో చెప్పారు.

వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉన్న ప్యూర్టోరికోలో 1976లో ప్రవేశపెట్టిన ఈ పన్ను మినహాయింపులతో దాదాపు 20 ఏళ్లపాటు తయారీ రంగం పరుగులు పెట్టింది.

2006లో పన్ను మినహాయింపులను ఎత్తేశాక ఆర్థిక వ్యవస్థ తిరోగమనం బాట పట్టింది. అధికారిక గణాంకాల ప్రకారం 1996లో తయారీ రంగంలో అత్యధికంగా 73,200 ఉద్యోగాలు ఉండేవి. 2017 నాటికి ఇవి సగానికి పైగా పడిపోయాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2017లో ప్యూర్టోరికో రాజధాని సాన్ జువాన్‌లో హరికేన్ మారియా ధాటికి ఎన్నో చెట్లు నేలకొరిగాయి

హరికేన్ మారియాను అప్పట్లో కేటగిరీ-4 హరికేన్‌గా ప్రకటించారు. ఇది తీరాన్ని తాకడానికి రెండు వారాల ముందు అంతకంటే తక్కువ శక్తిమంతమైన హరికేన్ ఇర్మా.. ప్యూర్టోరికోపై ప్రభావం చూపింది.

హరికేన్‌కు, హరికేన్‌కు మధ్య తమకు కోలుకొనే సమయం కూడా దొరకలేదని ప్యూర్టోరికో ప్రణాళికా సంఘంలో ఆర్థిక, సామాజిక ప్రణాళికా కార్యక్రమ విభాగం సంచాలకుడైన అలెజాండ్రో డియాజ్ మారెరో చెప్పారు. హరికేన్ బీభత్సంతో నీరు, విద్యుత్ కూడా లేవని, మొబైల్ ఫోన్ సేవలు, ఇతర సమాచార వ్యవస్థలేవీ పనిచేయలేదని ఆయన గుర్తుచేసుకున్నారు.

80 ఏళ్లలో ఎన్నడూ లేని విధ్వంసాన్ని నాడు తాము చూశామని అలెజాండ్రో చెప్పారు.

మారియా విధ్వంసంతో, ప్యూర్టోరికో సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనాలని, ప్యూర్టోరికో స్థాయిలో, జాతీయస్థాయిలో అంటే అమెరికా ప్రభుత్వం స్థాయిలో ప్రయత్నాలు జరగాలనే సూచనలు వచ్చాయి.

ప్యూర్టోరికో ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించే బోర్డును ఏర్పాటు చేసేందుకు 2016లో అమెరికా పార్లమెంటు కాంగ్రెస్ 'ప్యూర్టోరికో పర్యవేక్షణ, నిర్వహణ, ఆర్థిక స్థిరత్వ చట్టం' చేసింది. ప్యూర్టోరికో 2020లో దివాలా నుంచి బయటపడేందుకు రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను ఈ ఏడాది ప్రకటించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్యూర్టోరికో జనాభా మరింత తగ్గితే ఆర్థిక సమస్యలకు అదొక పరిష్కారం కాగలదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా నౌకాశ్రయాల మధ్య తిరిగే నౌకలు అమెరికాలోనే నిర్మించాలని 1920 నాటి జోన్స్ చట్టం చెబుతోంది. ఇది వాణిజ్యానికి అడ్డంకిగా ఉందనే భావన ఉంది. ఈ చట్టాన్ని అమెరికా సవరిస్తే ప్యూర్టోరికోకు ఎంతో తోడ్పాటు అందించినట్లవుతుందని యూనివర్శిటీ ఆఫ్ ప్యూర్టోరికో అసోసియేట్ ప్రొఫెసర్ జోస్ కారబలో-క్యోటో అభిప్రాయపడ్డారు.

ప్యూర్టోరికోలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నవీకరించే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. విద్యుత్ వ్యయాలు అమెరికా రాష్ట్రాల సగటుతో పోలిస్తే ఇక్కడ రెండింతల కంటే పైనే ఉంటాయి. ఔషధ పరిశ్రమలను, తయారీ రంగ పరిశ్రమలను ఆకట్టుకోవాలంటే ఇదో అడ్డంకిగా నిలుస్తుంది.

ప్యూర్టోరికో కార్మికులు విద్యావంతులుని, రెండు భాషలు మాట్లాడతారని, వారికి చాలా టెక్నాలజీల్లో అనుభవం ఉందని, అమెరికా, అంతర్జాతీయ నిబంధనలపై విస్తృతమైన అవగాహన ఉందని బ్రిటన్‌కు చెందిన ఔషధ సంస్థ అస్త్రాజెనెకా చెప్పింది. ఈ సంస్థకు అక్కడ ఒక కర్మాగారం ఉంది.

ప్యూర్టోరికో జనాభా మరింత తగ్గితే ఆర్థిక వ్యవస్థ సమస్యలకు అదొక పరిష్కారం కాగలదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ప్యూర్టోరికో ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఇప్పుడున్న జనాభా కూడా చాలా ఎక్కువేనని 'మునిసిపల్ మార్కెట్ అనలిటిక్స్' సంస్థలో భాగస్వామి అయిన మ్యాట్ ఫాబియన్ అభిప్రాయపడ్డారు.

అమెరికా కల్పించే పన్ను ప్రయోజనాలపై ఆధారపడకుండా, సౌర విద్యుత్ వైపు మళ్లడం, మంచి నీటి కోసం నిర్లవణీకరణ (డీశాలినేషన్) కేంద్రాలు నిర్మించడం లాంటి సొంత ప్రయత్నాలను ప్యూర్టోరికో చేయాల్సి ఉందని ఆయన వివరించారు.

ఇప్పటికే విధానాల్లో మార్పు వస్తున్నట్లు కనిపిస్తోందని ఆర్థిక, ప్రణాళికా సలహా సంస్థ 'ఎస్టుడియోస్ టెక్నికోస్' చైర్మన్ జోస్ విల్లామిల్ చెప్పారు. ఉదాహరణకు టెక్ స్టార్టప్‌లకు ప్రభుత్వం మద్దతు అందిస్తోందని తెలిపారు. విధాన మార్పుతో ఫలితం వెంటనే ఉండదని, ఐదు నుంచి ఏడేళ్లలో వస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)