సొమాలియాలో కారు బాంబు పేలుడు.. 76 మంది మృతి

సొమాలియాలో కారు బాంబు పేలుడు

ఫొటో సోర్స్, Reuters

సొమాలియా రాజధాని మొగదిషులో శనివారం ఉదయం ఓ కారు బాంబు పేలింది. ఘటనలో 76 మంది మృతి చెందారు.

మొగదిషులో బాగా రద్దీగా ఉండే కూడలిలోని ఓ తనిఖీ కేంద్రం వద్ద ఈ పేలుడు జరిగింది.

ఈ బాంబు పేలుడు వల్ల 76 మంది మరణించారు. 90మందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ఫొటో సోర్స్, Reuters

పేలుడుకు ఇంకా ఏ సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే, ఇదివరకు అల్ షబాబ్ మిలిటెంట్లు ఈ తరహాలో చాలా దాడులు చేశారు.

"ఇక్కడంతా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు కనిపిస్తున్నాయి. పేలుడు ధాటికి కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనట్లుగా కాలిపోయాయి" అని ప్రత్యక్ష సాక్షి సకారియె అబ్దుకాదిర్ తెలిపారు. ఈయన పేలుడు జరిగిన సమయంలో ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్నారు.

మృతుల్లో కనీసం 16 మంది బనదీర్ యూనివర్శిటీ విద్యార్థులని, వీరంతా ప్రయాణిస్తున్న బస్సు ఈ పేలుడులో ధ్వంసమైందని ఏఎఫ్పీ వార్తసంస్థ తెలిపింది.

ఇదో చీకటి రోజు అని యూనివర్సిటీ ఛైర్మన్ మొహమద్ మొహమూద్ హసన్ వ్యాఖ్యానించారు. చదువుకునేందుకు తమ పిల్లల్ని తల్లిదండ్రులు పంపిస్తే, వారి మృతదేహాలు తిరిగి వారి ఇళ్లకు వెళ్తున్నాయని ఆయన బాధతో అన్నారు.

ఓ రోడ్డు నిర్మాణ పనిలో ఉన్న టర్కిష్ ఇంజినీర్ల బృందానికి సమీపంలో ఈ పేలుడు చోటుచేసుకుందని ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు రాయిటర్స్ వెల్లడించింది.

ఈ దాడిలో ఇద్దరు టర్కిష్ ఇంజినీర్లు మరణించారని సొమాలియా విదేశాంగ మంత్రి అహ్మద్ అవాద్ ట్వీట్ చేశారు. చనిపోయిన వారిలో విద్యార్థులు, కష్టపడి పనిచేసే పురుషులు, మహిళలు ఉన్నారని ఆయన అందులే రాశారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)