దానిష్ కనేరియా: షోయబ్ అఖ్తర్‌ ఏమన్నాడు.. యూసఫ్ ఎందుకు ఖండించాడు...

దానిష్ కనేరియా

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ క్రికెట్‌లో మైనారిటీ ఆటగాడు దానిష్ కనేరియాతో జట్టు వ్యవహరించిన తీరు గురించి మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ప్రకటన తర్వాత చాలా స్పందనలు వచ్చాయి.

మొదట జావేద్ మియాందాద్ "పాకిస్తాన్ మైనారిటీ హిందూ సమాజంపై వివక్ష చూపిస్తుంటే దానిష్ కనేరియా దేశం కోసం ఎలా ఆడేవాడని" అన్నాడు.

ఇప్పుడు స్వయంగా పాక్ మైనారిటీ సమాజం నుంచి వచ్చిన మాజీ బ్యాట్స్‌మెన్ మహమ్మద్ యూసుఫ్ కూడా షోయబ్ మాటలను ఖండించాడు.

శుక్రవారం ఒక ట్వీట్ చేసిన అతడు మైనారిటీ ఆటగాళ్లపై పాకిస్తాన్ క్రికెట్ టీమ్ వివక్ష చూపించింది అనడాన్ని ఖండించాడు.

"పాకిస్తాన్ జట్టులో మైనారిటీ ఆటగాళ్ల పట్ల వివక్ష గురించి చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. నేను కూడా జట్టులో సభ్యుడిగా ఉన్నాను. నాకు ఎప్పుడూ జట్టు, మేనేజ్‌మెంట్, ఫ్యాన్స్ నుంచి చాలా ప్రేమ, మద్దతు లభించింది. పాకిస్తాన్ జిందాబాద్" అని ట్వీట్‌లో అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images

మతం మార్చుకున్న యూసుఫ్

13 ఏళ్లు పాకిస్తాన్ జట్టులో ఆడారు మహమ్మద్ యూసుఫ్.

పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతానికి చెందిన క్రైస్తవ కుటుంబంలో పుట్టిన యూసుఫ్ తర్వాత ఇస్లాంను స్వీకరించాడు. 2004లో మతం మారకముందు యూసుఫ్ పాకిస్తాన్‌ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.

పాకిస్తాన్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఒకే ఒక మైనారిటీ ఆటగాడు యూసుఫ్. పాకిస్తాన్ కోసం యూసుఫ్ మొత్తం 9 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు.

1998లో అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ప్రారంభించిన మహమ్మద్ యూసుఫ్‌ మతం మార్చుకోడానికి ముందు యూసుఫ్ యొహానాగా ఉన్నాడు.

మతమార్పిడి తర్వాత ముస్లిం అయ్యాక అతడు తన పేరును మహమ్మద్ యూసుఫ్‌గా మార్చుకున్నాడు.

13 ఏళ్ల తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్(1988 ఫిబ్రవరి నుంచి 2010 ఆగస్టు వరకు)లో యూసుఫ్ మొత్తం 90 టెస్టులు ఆడాడు. 7530 పరుగులతో పాకిస్తాన్‌ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక టెస్ట్ రన్స్ చేసిన నాలుగో ఆటగాడుగా నిలిచాడు. టెస్టు మ్యాచుల్లో పాకిస్తాన్ కోసం అత్యధిక పరుగులు యూనిస్ ఖాన్(10099), జావేద్ మియాందాద్(8832), ఇంజమామ్ ఉల్-హక్(8830) చేశారు.

అంతే కాదు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన పాక్ బ్యాట్స్‌మెన్లలో యూసుఫ్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 288 మ్యాచుల్లో 9720 పరుగులు చేశాడు. వన్డేల్లో అతడి కంటే ఎక్కువగా ఇంజమామ్ ఉల్-హక్ మాత్రమే (11739) రన్స్ చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images

షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యలతో కలకలం

మైనారిటీలతో పాకిస్తాన్ జట్టు ప్రవర్తన గురించి యూసుఫ్ శుక్రవారం ఈ ప్రకటన చేయడానికి ఒక రోజు ముందు షోయబ్ అఖ్తర్ ఒక వ్యాఖ్య చేశాడు.

అందులో అతడు(షోయబ్) "తన తోటి ఆటగాళ్లు కొందరు జట్టులో మరో ఆటగాడైన దానిష్ కనేరియాతో అతడు హిందువు కాబట్టి పక్షపాతంతో ప్రవర్తించేవారని" చెప్పాడు.

కొంతమంది పాకిస్తానీ క్రికెటర్లు దానిష్ కనేరియాతో కలిసి తినేవాళ్లు కూడా కాదని షోయబ్ అన్నాడు.

న్యూస్ ఏజెన్సీ పీటీఐ, పీటీవీ స్పోర్ట్స్‌లో 'గేమ్ ఆన్ హై' కార్యక్రమంలో షోయబ్ అఖ్తర్ ఈ మాటలు అన్నట్టు చెప్పింది.

మాజీ పాకిస్తానీ లెక్-స్పిన్నర్ దానిష్ కనేరియాను ఈ విషయంపై బీబీసీ సంప్రదించినపుడు అతడు దానిని నేరుగా ధ్రువీకరించలేదు. షోయబ్ అఖ్తర్ వాదనను కూడా అతడు తోసిపుచ్చలేదు.

తర్వాత అతను ఒక ట్వీట్ ద్వారా తన స్పందనను తెలిపాడు.

"నేను లెజండరీ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఇంటర్వ్యూ టీవీలో చూశాను. నేను వ్యక్తిగతంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఆయన ప్రపంచానికి నిజం చెప్పారు. దానితోపాటూ ఒక క్రికెటర్‌గా నాకు అండగా నిలిచిన అందరికీ నేను రుణపడి ఉంటాను. మీడియా సహా క్రికెట్ ఫ్యాన్స్, పాకిస్తాన్ పౌరులు నాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా" అన్నాడు.

"సమాజంలో కొన్ని అంశాలు నన్ను వ్యతిరేకించాయి. అయితే నన్ను ప్రేమించేవారి ముందు ఆ వ్యతిరేకతలు నిలవలేకపోయాయి. నేను నా జీవితంలో ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉన్నాను. అలాంటి వ్యతిరేకతలను పట్టించుకోలేదు" అన్నాడు.

ఫిక్సింగ్ ఆరోపణల్లో కనేరియాపై నిషేధం

ఫిక్సింగ్ ఆరోపణలపై 2012లో కనేరియాపై నిషేధం విధించారు.

39 ఏళ్ల కనేరియా తను ఆ సమస్య నుంచి బయటపడ్డానికి చాలా మంది దగ్గరకు వెళ్లానని, కానీ తన ప్రయత్నాలన్నీ ఫలించలేదని చెప్పాడు.

కనేరియా తన ట్విటర్ హ్యాండిల్లో షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యకు స్పందిస్తూ, దీనికి సంబంధించి ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌ను అభ్యర్థించాడు.

"నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నేను పాకిస్తాన్, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సాయం కోసం వేడుకున్నాను. కానీ ఇప్పటివరకూ నాకు ఎలాంటి సాయం అందలేదు. అయితే పాకిస్తాన్‌లో చాలామంది క్రికెటర్ల సమస్యలను పరిష్కరించారు. నేను ఒక క్రికెటర్‌గా పాకిస్తాన్ కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. దానికి గర్విస్తున్నాను. ఈ సమయంలో పాకిస్తాన్ ప్రజలు నాకు సాయం చేస్తారని నాకు అనిపిస్తోంది" అన్నాడు.

"నాకు ఈ గందరగోళం నుంచి బయటపడ్డానికి గౌరవ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్, ఇతర దేశాల క్రికెట్ అభిమానులతోపాటు, పాకిస్తాన్‌ అగ్ర క్రికెటర్లు అందరి మద్దతు కావాలి" అన్నాడు.

"దయచేసి ముందుకు వచ్చి నాకు సాయం చేయండి. దీనికి రాజకీయ రంగు పులమవద్దని నేను వ్యక్తిగతంగా అందరినీ వేడుకుంటున్నాను" అన్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)