ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 4 లోపే స్థానిక సంస్థల ఎన్నికలు! - ప్రెస్‌రివ్యూ

  • 29 డిసెంబర్ 2019

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగవంతమైందని.. మార్చి నాలుగోతేది లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని 'ప్రజాశక్తి' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. మార్చిలో విద్యార్థుల పరీక్షలకు ఇబ్బందులు లేకుండా చూడటానికి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలను ముగించాలని భావిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వివిధ శాఖలకు పంపిన సమాచారంలో పేర్కొంది.

హైకోర్టు ఆదేశాల మేరకు మూడంచెల ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయించింది. జనవరి మూడో తేదీలోగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఆ తరువాత మిగిలిన ఎన్నికల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికే ఖరారైన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్‌ పరీక్షలు మార్చి నాలుగో తేదీ నుంచి 23వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ తరువాత వివిధ ఉన్నత స్థాయి ప్రవేశ పరీక్షలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆ పరీక్షలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముగించాలని ఈసీ భావిస్తోంది.

రిజర్వేషన్ల జాబితాను ప్రభుత్వం అందించిన తరువాత ముందుగా మండల, జిల్లా పరిషత్‌ ప్రాదేశికాలకు ఎన్నికలు, ఆ తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కమిషన్‌ సిద్ధమౌతోంది.

గణాంకాల మేరకు ప్రతి వార్డుకు సగటున 255 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం ప్రతి వార్డుకు ఒక పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ప్రతి పంచాయతీలో సగటున పది వార్డులు ఉండడంతో వాటి కోసం పది పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది.

ఎన్నికల నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు, ఎన్నికల సిబ్బందిని సక్రమంగా ఉపయోగించుకునేందుకు.. 2013 ఎన్నికల్లో అమలు చేసినట్లుగానే ఈసారి కూడా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ఆలోచన చేస్తున్నారు. ప్రతి రెవిన్యూ డివిజన్‌లో ఉన్న పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు.

చేతులెత్తడం ద్వారానే చైర్మన్ల ఎన్నిక: ఇక పార్టీ గుర్తులతో జరిగే మండల, జిల్లా పరిషత్‌ ప్రాదేశికాల ఎన్నికల నిర్వహణపైనా అధికారులకు కమిషన్‌ సూచనలు చేసింది. ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు తమతమ మండలాధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్లను చేతులెత్తడం ద్వారా ఎన్నుకుంటారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హైదరాబాద్ శివారులో డిసెంబర్ ఏడున ఓటేసిన గిరిజన మహిళలు

''టీఆర్ఎస్ కనుసన్నల్లోనే మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్'' ఎలా ప్రకటించారు? - విపక్షాల ఆరోపణ

''ఓటర్ల జాబితాను రూపొందించలేదు. మున్సిపల్‌ రిజర్వేషన్లను ఖరారు చేయలేదు. అప్పుడే ఎన్నికల షెడ్యూల్‌ను ఎలా ప్రకటించారు?'' అని తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్‌ను మెజారిటీ రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రశ్నించినట్లు 'నవ తెలంగాణ' ఓ కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో.. టీఆర్‌ఎస్‌ పార్టీ కనుసన్నల్లో షెడ్యూల్‌ను విడుదల చేశారని పలు పార్టీల ప్రతినిధులు ఆరోపించారు. అయితే.. చేతకాకనే ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు సమర్థించుకున్నారు.

ఫిబ్రవరిలో మేడారంలో జాతర, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని షెడ్యూల్‌ను ఖరారు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా పలు ప్రతిపక్ష పార్టీలు శాంతించలేదు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి సమావేశానికి హాజరైన నాయకులు మర్రి శశిధర్‌రెడ్డి, జి.నిరంజన్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి బయటికి వచ్చేశారు. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా షెడ్యూల్‌ విడుదల చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు వడ్లమూడి కృష్ణస్వరూప్‌ విమర్శించారు. కేవలం టీఆర్‌ఎస్‌ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

'కృష్ణస్వరూప్‌ వర్సెస్‌ అధికారులు'గా మారిన సమావేశంలో మిగిలిన పక్షాల ప్రతినిధులు శాంతింపజేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు పోలీసులను పిలిపించి ఆయనను బయటికి పంపించేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళితుడినైన తనను అవమానించిన నాగిరెడ్డితో సహా తనను బయటికి పంపించిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు.

ఎంత చెప్పినా ఎన్నికల కమిషన్‌ వినిపించుకోవడం లేదని, టీఆర్‌ఎస్‌ ఆదేశాల మేరకే చేస్తున్నారని అర్థమవుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సమాయాత్తం కావడానికే మున్సిపల్‌ ఎన్నికలను ఆరు నెలలు ఆలస్యం చేసిందని అన్నారు.

ఒక మతం ఓట్ల కోసమే స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల పరిమితిని టీఆర్‌ఎస్‌ ఎత్తేసిందని, ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రజలకు నష్టం వాటిల్లుతుందని బీజేపీ నాయకులు మనోహర్‌రెడ్డి విమర్శించారు.

పారదర్శకంగా ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదని సీపీఐ నాయకులు బాలమల్లేష్‌ అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకే సౌలభ్యంగా ఉందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీనర్సింగరావు ఆరోపించారు. జనవరి 8న సార్వత్రిక సమ్మె, అనంతరం సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో షెడ్యూల్‌‌ను మరో వారం పాటు పొడిగించాలని కోరారు.

Image copyright Getty Images

''రేషన్‌కార్డు నా కొద్దు.. బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు''

తెల్ల రేషన్‌కార్డు (బీపీఎల్‌) నేడు బియ్యానికి తప్ప దేనికీ పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మిర్యాలగూడ పట్టణానికి చెందిన వీవీఎస్‌ కుమార్‌ అనే వ్యక్తి తన రేషన్‌కార్డును శనివారం ఆర్డీఓ కార్యాలయంలో అప్పగించినట్లు 'సాక్షి' ఓ కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తీసుకువచ్చిన తెల్ల రేషన్ కార్డు ద్వారా గతంలో బియ్యం, చింతపండు, పప్పు, కారం, పామాయిల్‌తో పాటు పలు రకాల నిత్యావసర సరకులను ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందించేది.

ఇటీవల బియ్యంతో పాటు పంచదార అడపాదడపా వస్తోంది. కానీ మిగిలిన ఏ నిత్యావసర వస్తువులు కూడా రాకుండా ప్రభుత్వం కోత విధించింది. దీంతో నిరుపేద లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఈ కార్డు బియ్యానికి తప్ప.. మరి దేనికీ ఉపయోగం లేదంటూ పట్టణంలోని మెయిన్‌ బజారుకు చెందిన వీవీఎస్‌ కుమార్‌ అనే వ్యక్తి.. ఆర్‌డీఓ కార్యాలయం వద్ద డీఏఓ రఘునాథ్, నాయబ్‌ తహసీల్దార్‌ జి. రామకృష్ణారెడ్డికి తన రేషన్ కార్డును అందజేశాడు. దీంతో అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

Image copyright Getty Images

అవినీతి కేసుల్లో రెవెన్యూదే అగ్రస్థానం .. ఏసీబీకి చిక్కిన వారిలో 54 మంది వీరే

తెలంగాణ రాష్ట్రంలో అవినీతిలో రెవెన్యూ శాఖనే ముందుంటుందనటానికి అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఉద్యోగుల్లో ఆ శాఖకు చెందిన వారే అధికంగా ఉండటం నిదర్శనమని 'ఈనాడు' ఓ కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. గత ఏడాది అగ్రస్థానంలో ఉన్న ఆ శాఖ ఈ ఏడాది సైతం అదే ఒరవడిని కొనసాగించింది. లంచాలు తీసుకుంటూ గత ఏడాది 37 మంది రెవెన్యూ ఉద్యోగులు ఏసీబీకి చిక్కితే.. ఈ సారి ఆ సంఖ్య ఏకంగా 54కు పెరిగింది.

రెండోస్థానంలో పురపాలక శాఖ నిలిచింది. గతేడాది ఆ శాఖ ఉద్యోగులు 15 మంది దొరికితే.. ఈసారి ఏకంగా 25 మంది చిక్కారు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏసీబీకి చిక్కిన హోంశాఖ ఉద్యోగుల సంఖ్య తగ్గడం గమనార్హం. గత ఏడాది 20 మంది పోలీసులు దొరికితే ఈసారి 18 మంది చిక్కారు.

వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. క్రితంసారి కేవలం నలుగురే చిక్కిన ఆ శాఖ ఉద్యోగులు ఈసారి ఏకంగా 13 మంది ఏసీబీ వలలో పడ్డారు.

గతేడాది అన్ని శాఖల్లో కలిపి 139 మంది అధికారులు చిక్కితే.. ఈసారి ఆ సంఖ్య 173కు పెరిగింది. అంటే.. గతేడాది కన్నా 25 శాతం అదనంగా అవినీతి చేపలు చిక్కినట్లు స్పష్టమవుతోంది.

ఈ ఏడాది ఏసీబీ అరెస్ట్ చేసిన వారిలో ఇంకా ఇంధన శాఖ ఉద్యోగులు 12 మంది, పంచాయతీరాజ్ ఉద్యోగులు 10 మంది, న్యాయశాఖ ఉద్యోగులు ఐదుగురు, విద్యాశాఖ ఉద్యోగులు నలుగురు, నీటిపారుదల శాఖ ఉద్యోగులు ముగ్గురు, రవాణా - ఆర్‌అండ్‌బీ ఉద్యోగులు ముగ్గురు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు ఇద్దరు, ఇతర శాఖల ఉద్యోగులు 24 మంది ఉన్నారు.

ఈ ఏడాది ఏసీబీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో బీమా వైద్య సేవలు (ఐఎంఎస్) విభాగానిదే అతిపెద్ద కేసు. ఐదేళ్లలో ఈ విభాగానికి మంజూరైన సుమారు రూ. 1,000 కోట్లలో రూ. 200 కోట్ల వరకు పక్కదారి పట్టినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు.

ఈ వ్యవహారంలో నాలుగు వేర్వేరు కేసులు నమోదవగా.. ఏకంగా 21 మంది కటకటాల పాలయ్యారు. వీరిలో పది మంది వరకు ఐఎంఎస్ ఉద్యోగులున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఏసీబీ జాబితాలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది.

డెబిట్ కార్డు Image copyright Getty Images

ఆ ఏటీఎం కార్డులను నెలాఖరులోగా మార్చుకోవాలి.. లేదంటే పనిచేయవ్‌!

'మీరు ఎస్‌బీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన మాగ్నెటిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులు (ఏటీఎం కార్డులు) వాడుతున్నారా..? అయితే జాగ్రత్త. మీ కార్డులు ఈ నెల 31 తర్వాత పనిచేయకపోవచ్చు' అని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. భారత్‌లో ఉన్న ప్రతి బ్యాంకు కూడా తమ మేగ్నటిక్‌ డెబిట్‌ కార్డులను ఈ నెలాఖరులోపు యూరోపే, మాస్టర్‌ కార్డ్‌, వీసా (ఈఎంవీ) చిప్‌ కార్డుగా మార్చాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈఎంవీ కాని డెబిట్ కార్డులన్నీ 31వ తేదీ తర్వాత నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన వినియోగదారుల్లో మాగ్నెటిక్‌ డెబిట్‌ కార్డుదారులు ఎక్కువగా ఉన్నారు. ఇవి కాక ఇతర బ్యాంకుల్లో మాగ్నెటిక్‌ కార్డుదారులు కూడా నెలాఖరులోపుగా తమ కార్డును మార్చుకోవాల్సి ఉంటుంది.

ఈఎంవీ అంటే..: డెబిట్‌ కార్డు చెల్లింపుల్లో యూరోపే, మాస్టర్‌కార్డ్‌, వీసా (ఈఎంవీ)లకు సంబంధించిన సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా పరిగణిస్తారు. ఈ చిప్‌ ఉన్న కార్డులకు మరింత భద్రత లభిస్తుంది. తొలినుంచీ వాడుతున్న మాగ్నెటిక్‌ స్ట్రిప్‌లతో పోలిస్తే ఇది చాలా సురక్షితం. ఈ నేపథ్యంలోనే భారత్‌లో కూడా ఈఎంవీ కార్డులను ఆర్‌బీఐ తప్పనిసరి చేసింది. వినియోగదారులు తమ కార్డులను అప్‌డేట్‌ చేసుకోవాలని ఇప్పటికే బ్యాంకులు మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో ఎన్నోసార్లు సూచిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: 'ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా'

'ఇంగ్లిష్ మీడియం బిల్లు'కు రెండోసారి ఏపీ అసెంబ్లీ ఆమోదం.. ఇప్పుడు మండలిలో ఏం జరుగుతుంది..

కరోనా వైరస్‌: చైనాలో మరో నగరానికి రాకపోకలు నిలిపివేత

‘రోహింజ్యాలపై మారణహోమం ఆపేందుకు చర్యలు తీసుకోండి’- మయన్మార్‌కు ఐసీజే ఆదేశం

ఆంధ్రప్రదేశ్: శాసన మండలిలో అసలేం జరిగింది? సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుంది

చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యం సేకరించి పిల్లలు పుట్టించొచ్చా

పీవీ సింధు విజయాల వెనుక పీబీఎల్‌ పాత్ర కూడా ఉందా

రజినీకాంత్ చెప్పిన దాంట్లో నిజమెంత... సీతారాముల నగ్నవిగ్రహాలకు పెరియార్ చెప్పుల దండలు వేసి ఊరేగించారా..

బెజోస్ ఫోన్ హ్యాకింగ్: అమెజాన్ బిలియనీర్ ఫోన్‌ని సౌదీ యువరాజు హ్యాక్ చేశారా?