థాయ్‌లాండ్ గుహలో రెస్క్యూ ఆపరేషన్‌లో సోకిన ఇన్‌ఫెక్షన్‌తో నేవీ సీల్ సభ్యుడి మృతి

  • 29 డిసెంబర్ 2019
థాయ్‌లాండ్ గుహలో రెస్క్యూ ఆపరేషన్ Image copyright Getty Images

ఏడాది కిందట థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలురు, వారి ఫుట్‌బాల్ కోచ్‌ను రక్షించిన బృందంలోని ఒక సభ్యుడు.. ఆ ఆపరేషన్ సందర్భంగా సోకిన ఇన్‌ఫెక్షన్‌తో ఏడాది కాలంగా పోరాడి మరణించినట్లు అధికారులు తెలిపారు.

థాయ్ నేవీ సీల్ పెట్టీ ఆఫీసర్ బీరుట్ పక్బరాకి.. థామ్ లువాంగ్ గుహలో 17 రోజుల పాటు చిక్కుకుపోయిన బాలుర బృందాన్ని రక్షించే సమయంలో బ్లడ్ ఇన్‌ఫెక్షన్ సోకింది.

ఆయనకు అప్పటి నుంచీ వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించి శుక్రవారం చనిపోయినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఆ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో థాయ్ నేవీ సీల్ డైవర్ సమన్ గునాన్.. ఆక్సిజన్ ట్యాంకులను గుహలో చిక్కకున్న వారికి అందించి తిరిగి వస్తుండగా మధ్యలోనే తన ఆక్సిజన్ అయిపోవటంతో చనిపోయారు. అనంతరం గుహ ముఖద్వారం దగ్గర ఆయన విగ్రహం ప్రతిష్టించారు.

నాడు ఇన్‌ఫెక్షన్ సోకిన బీరుట్ ఇప్పుడు చనిపోయారు. ఆయన భౌతికకాయాన్ని స్వస్థలమైన సాటున్ ప్రావిన్స్‌లో ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం సమాధి చేసినట్లు అధికారులు చెప్పారు.

Image copyright AFP/ROYAL THAI NAVY

నాడు ఏం జరిగింది? పిల్లల్ని ఎలా రక్షించారు?

ఈ 'థామ్ లువాంగ్' గుహ థాయిలాండ్‌లోనే అత్యంత పొడవైన గుహ. ఇది మొత్తం 10,316 మీటర్ల పొడవున ఉంది. అంటే సుమారు 10 కిలోమీటర్ల మేర ఈ గుహ ఉంటుంది.

థాయ్‌లాండ్‌కు చెందిన వైల్డ్ బోర్స్ యువ ఫుట్‌బాల్ జట్టు సభ్యులు, వారి కోచ్ 2018 జూన్ 23వ తేదీన.. విహార యాత్ర కోసం ఈ గుహలోకి వెళ్లారు. నాడు జట్టు సభ్యుల వయసు 11 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య ఉండగా.. కోచ్ వయసు 25 సంవత్సరాలు.

ఫుట్‌బాల్ టీం గుహలోకి వెళ్లిన తరువాత కుంభవృష్టి మొదలైంది. కొండలపై నుంచి వర్షం నీరు వరదలా ముంచెత్తి గుహ ముఖద్వారంలోంచి లోపలికి వచ్చేసింది. ఒక్కసారిగా నీరు నిండిపోవడంతో వీరంతా కాస్త ఎత్తయిన ప్రాంతానికి చేరి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నంలో గుహలో ఇంకా లోపలికి వెళ్లి పాతాళంలో చిక్కుకుపోయారు.

గుహ బయటి నుంచి వీరు చిక్కుకుపోయిన ప్రాంతం దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీరిని రక్షించటం కోసం ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. తొమ్మిది రోజుల తర్వాత.. వీరు గుహలో క్షేమంగా ఉన్నట్లు తెలిసింది.

ఇద్దరు బ్రిటిష్ గజ ఈతగాళ్లు నిర్విరామంగా కొనసాగించిన గాలింపులో భాగంగా గుహలో కొంత విశాలంగా ఉన్న ప్రాంతంలోని ఒక దిబ్బ మీద వీరు చిక్కుకుపోయి ఉండటాన్ని గుర్తించారు.

అయితే.. గుహలో నీటి మట్టం పెరుగుతుండటం.. అక్కడికి చేరుకోవటానికి బురద ఆటంకంగా ఉండటంతో వారిని సురక్షితంగా వెలికి తీయటం సవాలుగా మారింది.

మొత్తం 90 మందికి పైగా డైవర్లు కలిసి.. వారం రోజుల పాటు చాలా ప్రమాదకరమైన, సంక్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించారు. వీరిలో థాయ్‌లాండ్ డైవర్లు 40 మంది, ఇతర దేశాలకు చెందిన డైవర్లు 50 మంది ఉన్నారు.

బాలురను బయటకు తీసుకువచ్చే ముందు రోజుల తరబడి ఆహారం లేక నీరసించిపోయిన పిల్లలకు ముందు ఆహారం, నీరు, మందులు, లైట్లు వంటివి సరఫరా చేశారు. కొన్ని రోజుల తర్వాత.. చీకటిలో నీళ్లు నిండిన దారుల్లోంచి గుహ ప్రవేశ మార్గం వైపు ఎలా రావాలో డైవర్లు పిల్లలకు చూపించారు. నడుస్తూ గుహ దాటేలా వారిని సన్నద్ధం చేశారు.

Image copyright EPA/CHIANG RAI PROVINCIAL PUBLIC RELATIONS OFFICE

గుహలో కఠినమైన దారుల్లోంచి పిల్లలు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లి వారిని మళ్లీ ప్రవేశ మార్గం వరకూ తీసుకురావడం ఎంతో అనుభవం ఉన్న ఈతగాళ్లకు కూడా కష్టమైంది.

సహాయ కార్యక్రమాలలో భాగంగా గుహలో నడవడంతోపాటు, పాకడం, గైడింగ్ రోప్స్ ద్వారా ఈదారు. రెస్పిరేటర్ల బదులు డైవర్లు అందరూ ఫుల్ ఫేస్ మాస్కులు వేసుకున్నారు.

ఒక్కో బాలుడిని ఇద్దరు డైవర్లు కలిసి తీసుకొచ్చారు. పిల్లాడికి అందిస్తున్న ఆక్సిజన్ ట్యాంకును కూడా డైవర్లే మోశారు. ఆ ఉదంతం ప్రపంచ మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది.

థాయ్‌లాండ్‌లోని ఉత్తర చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ గుహను.. ఈ ఏడాది నవంబర్‌లో మళ్లీ పర్యటకుల సందర్శన కోసం తెరిచారు. ప్రారంభ కార్యక్రమానికి మత గురువులు, ప్రభుత్వ అధికారులు, పార్క్ రేంజర్లు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)