చమురు కోసం జరిగే అంతర్జాతీయ ఘర్షణలకు సౌర విద్యుత్ ముగింపు పలుకుతుందా?

  • 17 జనవరి 2020
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరప్రాంత సముద్రంలో నాలుగు ఆయిల్ ట్యాంకర్ల మీద దాడులకు కారణం ఇరాన్ అని అమెరికా ఆరోపించింది. ఆ ఆరోపణలను ఇరాన్ తిరస్కరిస్తోంది. Image copyright Getty Images
చిత్రం శీర్షిక చమురు కోసం వందల ఏళ్లుగా దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వస్తున్నాయో దక్షిణ స్పెయిన్‌లోని గెమాసోలార్ అనే ‌పవర్ స్టేషన్‌ను చూస్తే అర్థమవుతుంది.

బీడుబారిన ఇక్కడి భూముల్లో రోజులో 24 గంటలూ సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. రాత్రింబవళ్లు సూర్య రశ్మి ఉండదు కదా! మరి 24 గంటలూ ఎలా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు? అన్న అనుమానం మీకు వచ్చి ఉంటుంది. నిజమే, సూర్యుడు రాత్రింబవళ్లు కనిపించడు. కానీ, వీళ్లు సూర్యుడు లేని సమయంలోనూ వీళ్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

హైడ్రాలిక్‌లతో 2500కు పైగా భారీ అద్దాలను ఏర్పాటు చేశారు. ఆకాశంలో సూర్యుడు కదలికలతకు అనుగుణంగా ఈ అద్దాలు కూడా తిరుగుతాయి. ఒక్కో అద్దం పరిమాణం దాదాపు ఓ టెన్నిస్ కోర్టులో సగం ఉంటుంది.

ఆ అద్దాలకు మధ్యలో ఒక ఎత్తయిన టవర్ ఉంటుంది. ఆ అద్దాల మీద పడే సూర్యకిరణాలన్నీ పరావర్తనం చెంది టవర్ శిఖరం మీద పడతాయి. 140 మీటర్ల ఎత్తులో ఉండే ఆ శిఖరం దగ్గర ఉష్ణోగ్రత దాదాపు 600 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అక్కడ ద్రవరూప లవణాన్ని వేడిచేస్తారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గెమాసోలార్ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం

ఉష్ణశక్తిని నిల్వచేసేందుకు ద్రవరూప లవణాన్ని వినియోగిస్తారు. అలా వేడెక్కిన లవణాన్ని ఒక ట్యాంకులో నిల్వ చేస్తారు. అందులోంచి కొద్ది కొద్దిగా ద్రావణాన్ని 24 గంటలూ వదులుతూ నీటిని వేడెక్కిస్తారు. ఆ నీటి నుంచి వెలువడే ఆవిరితో టర్బైన్లు తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

అలా పగలు సౌరశక్తిని వాడుకుని రాత్రి సమయంలోనూ విద్యుత్‌ను నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తున్నారు.

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాంకేతికత ఎంత వేగంగా వృద్ధి చెందుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

సమీప భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనా సంఖ్య పుంచుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం బ్యాటరీ టెక్నాలజీ ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉంది. తేలికగా ఉండి, ఎక్కువ సమయం విద్యత్‌ను నిల్వ చేసే బ్యాటరీల అభివృద్ధికి పలు కార్పొరేట్ సంస్థలు, శాస్త్రవేత్తలు తీవ్రంగా పోటీపడుతున్నారు.

ఇప్పటికే కొన్ని సంస్థలు ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ విమానాల తయారీని మొదలుపెట్టాయి. చూస్తుంటే ఓడలు కూడా సంప్రదాయ చమురుతో కాకుండా బ్యాటరీలతో పనిచేసే రోజులు మరెంతో దూరంలో లేవని అనిపిస్తోంది.

మరి, భూతాపం నుంచి మన గ్రహాన్ని ఈ పునరుత్పాతక ఇంధన విప్లవం కాపాడుతుందా? అని తరచూ వినిపించే ప్రశ్న. దానికి సమాధానం చెప్పేంత అర్హత నాకు లేదు.

కానీ, ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. అదేమిటంటే, ఈ పునరుత్పాదక ఇంధన టెక్నాలజీ ప్రపంచ రాజకీయాల మీద మాత్రం తప్పకుండా ప్రభావం చూపుతుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 1991లో కువైట్‌లోని చమురు క్షేత్రానికి ఇరాక్ సైన్యం నిప్పు పెట్టింది

చమురు కోసం యుద్ధాలు

గత శతాబ్ద కాలానికి పైగా అంతర్జాతీయ వాణిజ్యంలో పెట్రోలియం, గ్యాస్ వనరులున్న దేశాలే కీలకంగా ఉన్నాయి. చమురు కోసమే యుద్ధాలు కూడా జరిగాయి.

అది మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే ఈ వివాదాలు ప్రారంభమయ్యాయి. బ్రిటిష్ నావికాదళం తొలి అధిపతి విన్‌స్టన్ చర్చిల్ కాలంలోనే ఇరాన్ నుంచి చమురు దిగుమతికి మార్గాలు వేశారు.

బ్రిటన్‌కు చమురుపై హక్కుల కోసం అప్పట్లోనే ఇరాన్‌లోని ఆంగ్లో- పర్షియన్ ఆయిల్ కంపెనీలో మెజార్టీ వాటాను కొనుగోలు చేశారు. ఇరాన్‌లో పెట్రోలియంను వెలికితీసిన మొదటి సంస్థ అదే.

అప్పటి నుంచి మొదలుకుని 20వ శతాబ్దంలో చమురు నిల్వలు ఉన్న దేశాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

బాకూ చమురు క్షేత్రాలను కైవసం చేసుకునేందుకు అడాల్ఫ్ హిట్లర్ చేసిన ప్రయత్నాల నుంచి కువైట్‌ను సద్దాం హుస్సేన్ ఆక్రమించడం నుంచి 2019 సెప్టెంబర్‌లో సౌదీలోని చమురు కేంద్రాలపై జరిగిన డ్రోన్, క్షిపణి దాడుల వరకు... దేశాల మధ్య అనేక ఘర్షణలకు మూలకారణం చమురే.

ఇప్పుడు ప్రధానంగా ఎదురవుతున్న ప్రశ్నలేమిటో చూద్దాం. పునరుత్పాదక ఇంధన విప్లవం ఈ ప్రాంతీయ రాజకీయ సమీకరణలను ఎంతవరకు మార్చగలదు? ప్రపంచంలో శిలాజ ఇంధన ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా ఉన్న పశ్చిమాసియా, ఆఫ్రికా లాంటి దేశాలపై ఈ ప్రత్యామ్నాయ ఇంధనంతో ఏమేరకు ప్రభావం ఉంటుంది? ఇన్నాళ్లూ చమురు ఉత్పత్తులే ప్రధాన ఆదాయవనరుగా ఉన్న ఆ దేశాలలో అంతర్గతంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది?

Image copyright Getty Images

ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలపైనే ఆధారపడి ఉన్నాయి. ఎక్కువ మంది ప్రభుత్వ రంగంలోనే పనిచేస్తున్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెరిగితే ఈ దేశాల ఇంధన ఎగుమతులపై ప్రభావం పడుతుంది.

అయితే, ప్రపంచంలో చమురుకు డిమాండ్ ఇంకా పెరిగి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందా? లేక పునరుత్పాదక ఇంధనం వల్ల చమురు వాడకం తగ్గుతుందా? అన్న ప్రశ్నలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా 2025 కల్లా తెలిసిపోతుందని నెదర్లాండ్స్‌కు చెందిన చమురు ఉత్పత్తుల సంస్థ షెల్ పేర్కొంది.

అందుకే, కొన్ని చమురు ఉత్పత్తి సంస్థలు పూర్తిగా చమురు మీదే ఆధారపడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ రక్షణ మార్గాలను వెతుక్కుంటున్నాయి. కొన్ని దేశాలు మాత్రం ఇప్పట్లో చమురుకు డిమాండ్ పడిపోదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

"చమురు ఎగుమతుల ద్వారానే ఆ దేశాలకు అధిక శాతం ఆదాయం వస్తోంది. ఒకవేళ ఆ ఆదాయం తగ్గినా, పూర్తిగా ఆగిపోయినా ఆ దేశాలు ఏమాత్రం కోలుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. నిరుద్యోగం పెరుగుతుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయలేరు. జీతాలు ఇవ్వడం కష్టమవుతుంది. ప్రజలు ఎంత వేగంగా పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లుతారో అంత వేగంగా ఈ దేశాల ఆదాయం తగ్గిపోతుంది" అని బ్రిటన్ విదేశీ వ్యవహారాల నిపుణుడు ప్రొఫెసర్ పాల్ స్టీవెన్స్ అంటున్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక 2019 సెప్టెంబర్‌లో సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కర్మాగారంపై దాడి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది

"ప్రజలకు సరైన ఆహారం, ఇంధనం, నీటి అవసరాలు తీర్చకపోతే, భద్రత కల్పించకపోయినప్పుడు ఆ దేశాల్లో సుస్థిరతను కాపాడటం కష్టమవుతుంది. ఇప్పుడు చాలా పశ్చిమాసియా దేశాల్లో అలాంటి పరిస్థితులను చూస్తున్నాం. ప్రజల అంచనాలకు తగిన విధంగా ప్రభుత్వాలు పనిచేకపోతే నగరాల్లో అల్లర్లు మొదలవుతాయి. అది దేశంలో అస్థిరతకు దారితీస్తుంది’’ అని పర్యావరణ వ్యవహారాల నిపుణుడు, యూకే ప్రభుత్వ మాజీ సలహాదారుడు టామ్ బుర్కె వివరించారు.

ప్రస్తుతం చమురు వాణిజ్యంతో వచ్చే ఆదాయంతో మనుగడ సాగిస్తున్న దేశాలు ఒక్కసారిగా కుదేలైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అలాంటి పరిణామాలతో ఆయా దేశాలే కాదు, వాటి ప్రభావం యావత్ ప్రపంచం మీద ఉంటుంది.

అలా ఆర్థికంగా సంక్షోభాల్లో చిక్కుకున్న దేశాలు తీవ్రవాదానికి కేంద్రాలుగా మారుతుంటాయి. సిరియానే అందుకు తాజా ఉదాహరణ. ఈ దేశం నుంచి అనేక మంది శరణార్థులుగా ప్రాణాలు నిలుపుకునేందుకు దేశాల సరిహద్దులు దాటివెళ్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రష్యా ఆర్థిక వ్యవస్థకు చమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే కీలకం

ఇలాంటి పరిస్థితులు గల్ఫ్ దేశాలకు మాత్రమే పరిమితం కాకపోవచ్చు. ప్రపంచంలో అత్యధికంగా చమురు, గ్యాస్ ఎగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా ఒకటి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు ద్వారా వచ్చే ఆదాయమే కీలకం.

అందుకే, 'పునరుత్పాదక ఇంధన సాంకేతికత' అభివృద్ధి రష్యా ఆర్థిక వ్యవస్థకు 'ప్రధాన సవాలు, ముప్పు'గా పరిణమిస్తుంందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు.

చమురు ధరల పతనంతోనే సోవియట్ యూనియన్ కూలిపోయిందన్న విషయాన్ని చాలామంది రష్యా పౌరులు గుర్తుచేసుకుంటారు. కానీ, ఈ దేశ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై పెద్దగా దృష్టి సారించడంలేదు. పునరుత్పాదక శక్తి ఉత్పత్తితో భవిష్యత్తులో సంప్రదాయ ఇంధనానికి డిమాండ్ తగ్గిపోతే దాని ప్రభావం రష్యా మీద కూడా పడుతుంది.

పునరుత్పాదక ఇంధన సాంకేతికత మరికొన్ని రకాల ఉద్రిక్తతలకు కూడా కారణమవుతోంది.

పునరుత్పాదక విద్యుత్‌కు ముఖ్యమైనవి బ్యాటరీలు. కాబట్టి, బ్యాటరీలో వాడే అత్యంత కీలకమైన, అరుదుగా లభించే కోబాల్ట్, లిథియం లాంటి ఖనిజాల కోసం కొట్లాటలు పెరగవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రపంచంలో నాణ్యమైన కోబాల్ట్ ఖనిజం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ)లో దొరుకుతుంది. ఈ దేశంలో అనేక ఏళ్లుగా అస్థిరత నెలకొంది.

Image copyright Getty Images

ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని... తీవ్రవాదం, వలసల కంటే భూతాపాన్ని నియంత్రించడమే ముఖ్యమా? అని కొందరు ప్రశ్నిస్తుంటారు. వాళ్ల ప్రశ్న కూడా కొంత మేర సబబే.

కానీ, పునరుత్పాదక ఇంధనం గురించి అనేక సానుకూల అంశాలు ఉన్నాయి.

పునరుత్పాదక ఇంధనం వైపు ప్రజలు మళ్లితే, ఇన్నాళ్లూ చమురు కోసం ఇతర దేశాల మీద ఆధారపడిన అనేక దేశాలు సొంతంగా తమ అవసరాలకు తగినంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోగలుగుతాయి.

ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా దేశాలకు పర్యావరణ హిత ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉంది. సూర్యరశ్మి, గాలి, సముద్రంలో అలలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

దాంతో, ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉన్నప్పుడు దేశాల మధ్య చమురు గొడవలు తగ్గుతాయి. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయాల్సిన అవసరం లేనప్పుడు, అక్కడ పోటాపోటీగా సైన్యాలను మోహరించాల్సిన అవసరం ఏముంటుంది?

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE దిల్లీ హింస: తాహిర్ హుస్సేన్‌‌పై హత్యాయత్నం కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

యువకుడి ఆచూకీ కోసం వెదుకుతుంటే సింహాల బోనులో అస్థిపంజరం దొరికింది

కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా.. శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’

యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్

దిల్లీ హింస: జస్టిస్ మురళీధర్ ఎవరు.. ఆయన బదిలీపై చర్చ ఎందుకు

దిల్లీ హింస ప్రభావం హైదరాబాద్‌పై ఎలా ఉంది

దిల్లీ హింసను 2002 నాటి గుజరాత్ అల్లర్లతో ఎందుకు పోలుస్తున్నారంటే...

దిల్లీలో హింస: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్లకు మించి ఏమైనా చేయగలరా?

కరోనావైరస్: ఇటలీలో 400కు పెరిగిన కేసులు