స్టెవియా: పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం

  • 13 జనవరి 2020
స్టెవియా సాగు Image copyright Stevia Hellas Cooperative

స్టెవియా మొక్కల ఆకుల నుంచి సేకరించిన పదార్థం చక్కెరకు సహజమైన, కేలరీ రహిత ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. స్టెవియా శతాబ్దాలుగా ప్రకృతిలో ఉంది. అయితే గత పదేళ్ల నుంచే ప్రధాన విపణిలోకి వస్తోంది.

ఏడేళ్ల క్రితం గ్రీకులో ఒక రైతు సమూహం పొగాకు సాగును ఆపేసి, పంచదారకు ప్రత్యామ్నాయంగా ఆదరణ పొందుతున్న 'స్టెవియా' వైపు మళ్లారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆరుగురు పొగాకు రైతులు స్టెవియా సాగు చేసి విజయం సాధించారంటూ క్రిస్టోస్ స్టామటిస్ అనే మెకానికల్ ఇంజినీర్ ఇచ్చిన ప్రోత్సాహం, సలహాలతో వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

స్టామటిస్‌ది గ్రీస్‌లోని ఫిథియోటిడా ప్రాంతం. రైతులకు పొగాకు అంత లాభసాటిగా ఉండేది కాదు.

ఆయన 150 మంది పొగాకు రైతులను స్టెవియా సాగుకు ఒప్పించారు. వారు తలా 500 యూరోలు(దాదాపు 40 వేల రూపాయలు) చొప్పున డబ్బు సమీకరించి, 2012లో 'స్టెవియా హెలాస్ కోఆపరేటివ్' ఏర్పాటు చేశారు.

ఐరోపాలో స్టెవియాను ఉత్పత్తి చేసిన తొలి బిజినెస్ ఇదే. ఇందులో ఇప్పుడు దాదాపు 300 మంది పనిచేస్తున్నారు.

'క్రౌడ్ సోర్సింగ్' ప్రాచుర్యం పొందక ముందే తమ గ్రామంలో ఈ విధానాన్ని అనుసరించామని స్టామటిస్ చెబుతారు. రైతులకు శక్తి ఉందని, అది వారికి ఉపయోగపడేలా చేశామని ఆయన అంటారు.

Image copyright Anton Ignatenco
చిత్రం శీర్షిక స్టెవియా ఆకుల నుంచి ద్రవాన్ని లేదా పొడిని తీస్తారు

గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరానికి ఉత్తర దిక్కులో కొన్ని గంటల ప్రయాణ దూరంలో ఈ సహకార సంస్థ ఉంది. ఇది 2018 చివరికి వ్యయం, రాబడి సమానంగా ఉండే, లాభం-నష్టం లేని దశ (బ్రేక్-‌ఈవెన్)కు చేరుకుంది. ఇప్పుడు లాభాలు పొందే దిశగా సాగుతోంది.

ఈ సంస్థ 'లా మియా స్టెవియా' అనే సొంత బ్రాండ్ పేరుతో ద్రవరూప స్టెవియా పదార్థాలను, స్టెవియా పొడులను అమ్ముతుంది. పశ్చిమ ఐరోపా దేశాలకు, కెనడా, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు ఎగుమతి చేస్తుంది.

వృద్ధికి అపారమైన అవకాశాలున్న పరిశ్రమ ఇది. వీటిని ఈ సంస్థ అందిపుచ్చుకుంటోంది.

స్టెవియా అంతర్జాతీయ అమ్మకాలు 2024లోగా దాదాపు రెండింతలవుతాయని, 81.8 కోట్ల డాలర్లకు చేరతాయని 'రీసర్చ్ అండ్ మార్కెట్స్' అనే కన్సల్టెన్సీ అధ్యయనం ఒకటి అంచనా వేసింది.

వృద్ధి రేటు గొప్పగా ఉన్నప్పటికీ స్టెవియా అమ్మకాలు అప్పటికి అస్పార్టేమ్, సుక్రాలోజ్ లాంటి కృత్రిమ స్వీటెనర్ల విక్రయాల కన్నా తక్కువే ఉంటాయి. 2024లోగా ఈ స్వీటెనర్ల వార్షిక అమ్మకాలు 270 కోట్ల డాలర్లకు చేరతాయని అంచనా.

అప్పట్లోగా చక్కెర వార్షిక విక్రయాలు 890 కోట్ల డాలర్లకు చేరతాయనే అంచనా ఉంది. చక్కెర అమ్మకాల వృద్ధి తక్కువగానే ఉంది.

Image copyright Stevia Hellas Cooperative
చిత్రం శీర్షిక మెకానికల్ ఇంజినీర్ క్రిస్టోస్ స్టామటిస్ ప్రోత్సాహంతో 'స్టెవియా హెలాస్ కోఆపరేటివ్' ఏర్పడింది

వినియోగదారులు ఆహారంలో చక్కెరను పరిమితం చేసే కొద్దీ స్టెవియా వినియోగం పెరుగుతూ పోతుందని అంతర్జాతీయ స్టెవియా మండలి అధ్యక్షుడు ఆండ్రూ ఓహ్మెస్ చెప్పారు.

స్టెవియాతో పోలిస్తే అస్పార్టేమ్, సుక్రాలోజ్ లాంటి స్వీటెనర్లు ఎక్కువ కాలంగా విపణిలో ఉన్నాయని, రానున్న ఐదు నుంచి పదేళ్లలో స్టెవియా వినియోగంలో పెరుగుదల 19-21 శాతం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

చక్కెరతో పోలిస్తే స్టెవియా ఖరీదైనదిగా కనిపిస్తుంది. సూపర్ మార్కెట్లలో స్టెవియా పొడి కేజీ దాదాపు 120 యూరోలు. చక్కెర 0.83 యూరోలు.

పంచదార కన్నా స్టెవియా 200 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటుందని, అందువల్ల కొంచెం వాడినా సరిపోతుందని, ఈ లెక్కన వాస్తవానికి ధర పరంగానూ పంచదార కన్నా స్టెవియానే మెరుగని స్టామటిస్ అభిప్రాయపడ్డారు.

స్టెవియా పర్యావరణానికి కూడా అనుకూలమైదని దీని మద్దతుదారులు చెబుతున్నారు. చెరకుతో పోలిస్తే స్టెవియా సాగులో నీటి వినియోగం 96 శాతం తక్కువని, బీట్ షుగర్‌తో పోలిస్తే 92 శాతం తక్కువని పేర్కొంటున్నారు. సగటున పది ఎకరాల భూభాగంలో ఈ పంటల సాగుతో వచ్చే తీపిపదార్థాన్ని స్టెవియా కేవలం రెండు ఎకరాల్లోనే అందిస్తుందని చెబుతున్నారు.

Image copyright Stevia Hellas Cooperative
చిత్రం శీర్షిక స్టెవియా ఉత్పత్తులు

స్టెవియా మూలాలు దక్షిణ అమెరికా ఖండంలోని పరాగ్వే, బ్రెజిల్‌లలో ఉన్నాయి. స్టెవియా పూర్తి పేరు స్టెవియా రెబౌడియానా. స్థానిక మూలవాసులకు ఈ మొక్క గుణాలు వందల ఏళ్లుగా తెలుసు. గ్వారణీ అనే ఒక స్థానిక భాషలో స్టెవియాను 'కా హి-హి' అంటారు. ఈ మాటకు అర్థం 'తీపి మూలక'.

స్టెవియా సాగును వాణిజ్య ప్రాతిపదికన తొలిసారిగా 1971లో జపనీయులు ప్రారంభించారు. అమెరికాలో, ఐరోపా దేశాల్లో వాణిజ్య సాగు నెమ్మదిగా మొదలైంది. ఇక్కడి నియంత్రణ సంస్థలకు స్టెవియా సురక్షితమైనదేననే నమ్మకం మొదట్లో లేకపోవడమే ఇందుకు కారణం. 1987లో 'అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ)' స్టెవియా మార్కెటింగ్‌ను నిషేధించడాన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

2008లో పరిస్థితులు మారాయి. స్టెవియా నుంచి సేకరించి, శుద్ధిచేసిన పదార్థాలకు ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. 2011లో యూరోపియన్ యూనియన్(ఈయూ), ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా అనుమతులు ఇచ్చాయి.

అయితే స్టెవియా వాడకంపై నేటికీ చర్చ సాగుతోంది.

అస్పార్టేమ్ లాంటి రసాయన పదార్థాలతో పోలిస్తే స్టెవియా పదార్థం శరీరంలో ఆమ్లాన్ని ఏర్పరచదని ధ్రువీకృత పోషక నిపుణురాలు కింబర్లీ స్నైడర్ చెబుతున్నారు. ఇది గుండెజబ్బుల ముప్పును పెంచదని, దంతక్షయానికి దారితీయదని, రక్తంలో చక్కెర స్థాయిపైనా ప్రభావం చూపదని ఆమె పేర్కొంటున్నారు.

Image copyright Stevia Hellas Cooperative
చిత్రం శీర్షిక గ్రీస్ వాతావరణ పరిస్థితులు స్టెవియా సాగుకు అనుకూలిస్తున్నాయి

కిరాణా దుకాణంలో దొరికే ద్రవరూప, ఘనరూప స్టెవియాను 'ఆడిటివ్‌ల'తో శుద్ధి చేస్తారని, దీనిని తీసుకుంటే ఉబ్బరం, అతిసారం, తలనొప్పి రావొచ్చని కింబర్లీ అభిప్రాయపడుతున్నారు.

స్టెవియా చక్కెర కంటే తియ్యగా ఉంటుంది కాబట్టి దీనిని వాడటం వల్ల తియ్యటి పదార్థాల పట్ల ఇష్టం పెరగొచ్చని, తీపిపదార్థాలు తీసుకోవడం మితిమీరితే మేలు కంటే కీడే ఎక్కువని ఆమె హెచ్చరిస్తున్నారు.

చక్కెర స్థానంలో స్టెవియా వాడితే కేలరీలు గణనీయంగా తగ్గుతాయని అంతర్జాతీయ స్టెవియా మండలి అధ్యక్షుడు ఆండ్రూ ఓహ్మెస్ చెబుతున్నారు.

ఆహార నిపుణురాలు రేచల్ ఫైన్ పంచదారకే పరిమితం కావాలని, అది కూడా మితంగా తీసుకోవాలని తన క్లయింట్లకు సూచిస్తున్నారు. మధుమేహ సమస్యతో బాధపడుతున్నవారికి ఆమె ఈ సూచన ఇవ్వడం లేదు. రక్తంలో చక్కెర నిల్వలపై ప్రభావం చూపని స్టెవియాను వారు ఒక ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు.

మధ్యదరా దేశాలకు సరఫరాకు ప్రణాళిక

మధ్యదరా సముద్ర ప్రాంత దేశాలైన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్ లాంటి దేశాలకు స్టెవియా సరఫరాకు అవసరమైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడమే స్టెవియా హెలాస్ కోఆపరేటివ్ తదుపరి ప్రణాళిక అని స్టామటిస్ తెలిపారు.

ఈ సంస్థ పెంచే స్టెవియా మొక్కలను శుద్ధి చేయడానికి ప్రస్తుతం ఫ్రాన్స్ పంపిస్తున్నారు. రానున్న రెండేళ్లలో ఐరోపాలోని బాల్కన్ ప్రాంతంలో శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక స్టెవియాతో తయారుచేసే పానీయం ఉత్పత్తిని కోకాకోలా నిలిపివేసింది

స్టెవియా సాగుకు అనువైన ప్రత్యేక వాతావరణ పరిస్థితులు తమ దేశంలో ఉన్నాయని స్టామటిస్ చెప్పారు.

ఉష్ణమండల వాతావరణం పెరిగే కొద్దీ ఇతర దేశాల్లోనూ స్టెవియా సాగుకు అనువైన పరిస్థితులు ఏర్పడవచ్చని గ్లోబల్ వార్మింగ్ నిపుణుడు మైకేల్ బడ్జిస్‌జెక్ చెప్పారు. ఆయన అమెరికాలోని 'జాన్సన్ అండ్ వేల్స్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్'లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

స్టెవియా వృద్ధికి అపారమైన అవకాశాలున్నా ఇది అంత తేలిగ్గా సాధ్యం కాకపోవచ్చు. స్టెవియాను వాడి తయారుచేసిన ఒక పానీయాన్ని కోకాకోలా 2014లో బ్రిటన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది.

అమ్మకాలు అంతగా లేకపోవడంతో మూడేళ్ల తర్వాత దీని ఉత్పత్తిని ఆపేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)