ఆస్ట్రేలియా కార్చిచ్చు: బూడిదలో ప్రాణం పోసుకుంటున్న మొక్కలు

  • 13 జనవరి 2020
ఆస్ట్రేలియా Image copyright Murray Lowe

ముందెన్నడూ లేనంత విధ్వంసకర దావానలంతో ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాల్లో పర్యావరణం పెద్దయెత్తున నాశనమవుతోంది. సెప్టెంబరులో కార్చిచ్చులు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 50 కోట్లకు పైగా జంతువులు చనిపోయాయి. లెక్కలేనన్ని చెట్లు, ఇతర ప్రాణకోటి బుగ్గిపాలయ్యాయి.

కోటీ 56 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణం అగ్నికి ఆహుతైంది. అయితే ఇటీవల తగులబడిపోయిన కొన్ని ప్రాంతాల్లో హరితం మళ్లీ ప్రాణం పోసుకొంటోంది. స్థానిక ఫొటోగ్రాఫర్ ముర్రే లోవ్ తీసిన ఫొటోలు ఈ దృశ్యాన్ని కళ్లకు కడుతున్నాయి.

న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సెంట్రల్ కోస్ట్‌లోని కుల్నురాలో తన ఇంటి సమీప ప్రాంతంపై కార్చిచ్చుల ప్రభావం గురించి తెలుసుకొనేందుకు వెళ్లినప్పుడు ఆయన ఈ ఫొటోలు తీశారు.

డిసెంబరులో సంభవించిన కార్చిచ్చు మిగిల్చిన బూడిదలో నడుచుకుంటూ వెళ్తుండగా- పచ్చటి గడ్డి, కాలిన చెట్ల కాండంలోంచి చిగురుస్తున్న గులాబీ రంగు ఆకులు ఆయనకు కనిపించాయి.

71 ఏళ్ల ముర్రే తను తీసిన ఫొటోలను ఈ నెల 6న సోషల్ మీడియాలో పెట్టారు. దావానల విషాదంలో మునిగిన వారిలో ఇవి ఒక చిన్న ఆశను చిగురింపజేశాయి. ఈ ఫొటోలను వేల మంది నెటిజన్లు షేర్ చేశారు.

ఎప్పుడూ తీరంలో సూర్యోదయాన్ని కెమెరాలో బంధించడానికి ఇష్టపడే ముర్రే, ఈసారి కార్చిచ్చుల బాధిత ప్రాంతాల పరిస్థితికి అద్దం పట్టే ప్రయత్నం చేశారు.

Image copyright Murray Lowe
చిత్రం శీర్షిక మూడు వారాల క్రితం కార్చిచ్చులు సంభవించిన కుల్నురా ప్రాంతంలో తిరిగి మొలకెత్తుతున్న పచ్చగడ్డి

కుల్నురా గుండా వెళ్తూ, ధారుగ్ నేషనల్ పార్క్ కొసన ఉండే చిన్న నివాస ప్రాంతం వద్ద ముర్రే ఆగారు. దావానలం నుంచి ఈ ప్రాంతం దాదాపు తప్పించుకొంది.

"ఇక్కడి అడవిలో భరించలేని నిశ్శబ్దం, స్తబ్ధత ఆవరించి ఉన్నాయి. కాలిపోయిన చెట్ల మధ్య నడుస్తూ వెళ్తుంటే నేల మీదున్న బూడిద గాల్లోకి లేస్తోంది. దావానలం ఎంతో తీవ్రమైనదైతేనే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది" అని ముర్రే వివరించారు. ఆయన వాహన తనిఖీ అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.

కార్చిచ్చుల తర్వాత అంతా వినాశనంలా కనిపించిందని, మొక్కలు కొంత కాలానికే తిరిగి వేగంగా పెరుగుతుండటం చూశాక ఆశ చిగురించిందని ఆయన వ్యాఖ్యానించారు. చెట్లు మళ్లీ ఇంతకు ముందులా పెరగాలని తాము కోరుకొన్నామని, మొక్కలు మొలకెత్తడం ఇది సాధ్యం కావొచ్చనే సంకేతాలను ఇస్తోందని చెప్పారు.

ధారుగ్ నేషనల్ పార్క్ 14,850 హెక్టార్లలో విస్తరించి ఉంది. కార్చిచ్చు ముప్పుతో దీనిని ప్రస్తుతం మూసి ఉంచారు. నైరుతి ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే గైమియా లిల్లీ, అనేక ఇతర వృక్షజాతులు ఈ పార్క్‌లో ఉన్నాయి.

Image copyright Murray Lowe

మొక్కలు ఇలా పెరగడం సాధారణమేనా?

లక్షల ఏళ్లలో చాలాసార్లు ఈ అడవుల్లో కార్చిచ్చులు సంభవించాయి. ఇక్కడి వృక్షజాతులు వీటి బారిన పడటం, తిరిగి అంకురించడం జరుగుతూ వస్తున్నాయి. జీవ పరిణామక్రమంలో సహజంగా ఉండే ఒత్తిడిని ఈ వృక్షజాతులు ఎదుర్కొన్నాయని, కాలిపోయిన తర్వాత తిరిగి మొలకెత్తే సామర్థ్యాన్ని సముపార్జించుకున్నాయని అగ్ని సంబంధ పర్యావరణ అంశాల్లో నిపుణురాలు కింబర్లీ సింప్సన్ వివరించారు.

ఆస్ట్రేలియా వృక్షజాతుల్లో చాలా చెట్ల కాండం లోపలి పొరల్లోంచి మొగ్గలు పుడతాయి. కార్చిచ్చుల సమయంలో తీవ్రమైన వేడిమి నుంచి దళసరి బెరడు వీటికి రక్షణ కల్పిస్తుంది. చాలా పొదలు, గడ్డి రకాలకు నేలపొర వేడిమి నుంచి రక్షణ ఇస్తుంది.

మరికొన్ని వృక్షజాతుల విత్తనాలు వేడిని బాగా తట్టుకుంటాయి.

కార్చిచ్చు తర్వాత, చిన్నపాటి మొక్కల వృద్ధికి తోడ్పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని, తగినంత కాంతి, బూడిదలోంచి వచ్చే పోషకాలు వీటికి ఉపయోగపడతాయని కింబర్లీ సింప్సన్ చెప్పారు. కార్చిచ్చు తర్వాత నేల త్వరగా పచ్చదనం సంతరించుకోవడం సాధారణమేనని తెలిపారు.

ముర్రే తీసిన ఫొటోల్లో మాత్రం కుల్నారా ప్రాంత అడవిలో ప్రస్తుతం ఇలాంటి ప్రక్రియ జరుగుతున్నట్లు కనిపించలేదని ఆమె చెప్పారు. ఇలాంటి విత్తనాలు మొలవాలంటే వాన పడాలని, కుల్నారాలో కార్చిచ్చుల తర్వాత ఇప్పటివరకు వాన పడలేదని వివరించారు.

Image copyright Murray Lowe
చిత్రం శీర్షిక ఆస్ట్రేలియాలోని చాలా చెట్లలో కార్చిచ్చు తర్వాత సత్వరం ఆకులు రావడం సాధారణమే. పరిణామ క్రమంలో ఈ చెట్లు ఈ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయి

ఇది ఆస్ట్రేలియా అంతటా జరుగుతుందా?

కార్చిచ్చుల తర్వాత మొక్కలు మళ్లీ ప్రాణం పోసుకోవడం, చెట్లు పెరగడం సంవత్సరాలపాటు సాగే ప్రక్రియ. కొన్ని జాతులు కార్చిచ్చు ఆగిపోయిన వెంటనే మొలకెత్తుతాయి. మరికొన్ని చాలా కాలం తర్వాత మొలకెత్తుతాయి.

ఈసారి కార్చిచ్చుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, ఇంతకాలం మంటలకు అలవాటుపడిన వృక్షజాతులు ఈసారి బతుకుతాయా, లేదా అనే ఆందోళన ఉందని కింబర్లీ చెప్పారు. ప్రస్తుత కార్చిచ్చుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం, దేశంలోని చాలా ప్రాంతాల్లో ముందెన్నడూ లేనంత కరవు పరిస్థితులు ఉండటం వల్ల ఈసారి స్థానికంగా చాలా మొక్కలు మనుగడ సాగించలేకపోవచ్చని అనుమానం వ్యక్తంచేశారు.

సాధారణంగా ఆస్ట్రేలియా వర్షారణ్యాల్లో కార్చిచ్చులు సంభవించవు. కానీ ఈసారి అక్కడా కార్చిచ్చుల ప్రభావం ఉంది. ఇది మొక్కల మనుగడపై ఎంత తీవ్రంగా ఉందో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్ వణికిస్తున్నా, మే నెలలోనే ఎన్నికలు జరుపుతామంటున్న పోలాండ్

కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు

ఇండియా లాక్‌డౌన్: ‘‘కరోనా సోకకపోయినా ఇంత శోకాన్ని మిగులుస్తుందని నేను అనుకోలేదు’’

కరోనావైరస్: ప్రాణాలు కాపాడుకోవడానికి డస్ట్ బిన్ కవర్లు వేసుకుంటున్న బ్రిటన్ వైద్య సిబ్బంది

కరోనాపై ప్రభుత్వం ఎలా ‘యుద్ధం’ చేయబోతోంది.. కంటైన్‌మెంట్ ఆపరేషన్‌ ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు ముగుస్తుంది

ప్రజల కదలికలను స్మార్ట్ ఫోన్ల ద్వారా కనిపెడుతున్న గూగుల్.. భారతదేశంలో లాక్‌డౌన్ ప్రకటించాక పరిస్థితిపై రిపోర్ట్

కరోనావైరస్: ఈ మహమ్మారికి ముంబయి కేంద్రంగా ఎలా మారింది

లాక్‌డౌన్ ఎఫెక్ట్: మహారాష్ట్ర నుంచి తమిళనాడు - 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరిన యువకులు

ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?