సొలీన్: గాలి నుంచి ఆహారం తయారు చేస్తున్న ఫిన్‌లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?

  • రోజర్ హరబిన్
  • బీబీసీ ప్రతినిధి
గాలి నుంచి ప్రొటీన్

ఫొటో సోర్స్, MIKAEL KUITUNEN/ SOLAR FOODS

ఫిన్‌లాండ్ శాస్త్రవేత్తలు 'పలచటి గాలి' నుంచి ఒక ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దశాబ్దం లోపు ఇది సోయా ధరలతో పోటీపడుతుందని చెబుతున్నారు.

విద్యుత్ ద్వారా నీటి నుంచి వేరు చేసిన హైడ్రోజన్‌ తిని బతికే బాక్టీరియా మట్టి నుంచి దీనిని ఉత్పత్తి చేశారు.

సౌరశక్తి, గాలి మరల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసినపుడు, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు జీరో ఉండేలా ఆహారాన్ని కూడా ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

వారి కలలు నిజమైతే, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎన్నో సమస్యలను ఎదుర్కోడానికి ఇది ప్రపంచానికి సాయం అందిస్తుంది.

నేను గత ఏడాది హెల్సింకీ శివార్లలో ఉన్న సోలార్ ఫుడ్ పైలెట్ ప్లాంటుకు వెళ్లినపుడు, పరిశోధకులు ఆ ప్రొటీన్ తయారీకి నిధులు సమీకరిస్తున్నారు.

ప్రస్తుతం వాళ్లు దాదాపు 5.5 మిలియన్ యూరోల(రూ.4 కోట్ల 35 లక్షలు)పెట్టుబడులు ఆకర్షించారు. విద్యుత్ ధరను బట్టి దశాబ్దం చివరికల్లా, అంటే 2025 కల్లా తమ ఉత్పత్తి ధరను సోయా బీన్ ధరకు సమానంగా ఉంటుందని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, AFP

రుచిలో లోపం

నేను 'సోలీన్' అనే చాలా విలువైన ప్రొటీన్ గింజలను కొన్ని రుచిచూశాను. దానికి ఎలాంటి రుచి లేదు. శాస్త్రవేత్తలు ప్లాన్ చేస్తున్నది అదే.

వాళ్లు దానిని అన్ని రకాల ఆహారానికి తటస్థ సంకలితంలా ఉండాలని అనుకుంటున్నారు.

ఇది పైస్, ఐస్ క్రీమ్, బిస్కట్లు, పాస్తా, నూడుల్స్, సాస్‌, బ్రెడ్‌లా బలం అందిస్తుందా అని నేను వారిని అడిగాను. దానిని కల్చర్డ్ మాంసం, చేపలను పెంచడానికి కూడా మాధ్యమంలా ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇది చిత్తడి భూముల్లో సాగుచేసిన సోయాను పశువులు తినకుండా వాటికి పోషకాలు అందించి కాపాడగలదు.

వారి ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగినా, ప్రపంచ అవసరాలను తీరేలా వారు ఈ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయాలంటే, చాలా ఏళ్లు పట్టేలా కనిపిస్తోంది.

కానీ భవిష్యత్తులో సంశ్లేష ఆహారం(synthesised food) తయారీ కోసం చూస్తున్న ఎన్నో సంస్థల్లో ఇది కూడా ఒకటి.

బ్రిటన్‌లోని క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీలో చదివిన పాసి వైనిక్కా ఈ సంస్థకు సీఈఓగా ఉన్నారు.

అంతరిక్ష యుగం ఆలోచన

ఈ టెక్నాలజీ వెనుక నిజానికి, 1960లో అంతరిక్ష రంగంలో అభివృద్ధి చేసిన సాంకేతికత ఉందని ఆయన నాకు చెప్పారు.

తను ప్రదర్శించే మొక్కను కొన్ని నెలల క్రితం నుంచీ పెంచుతున్నానని, అది 2022 నాటికి సిద్ధం అవుతుందని ఆయన చెప్పారు.

పూర్తి పెట్టుబడులపై 2023లో నిర్ణయం వస్తుందని, అంతా తాము అనుకున్నట్టే జరిగితే 2025లో ప్రొటీన్ ఉత్పత్తికి మొదటి పరిశ్రమను ఏర్పాటు చేస్తామని అన్నారు.

"మేం ఇప్పటివరకూ చాలా బాగా చేశాం. మేం మొదటి ఫ్యాక్టరీ పెట్టగానే, దానికి రియాక్టర్లను జోడించి(ప్రొటీన్‌ను పులియబెట్టడానికి) గాలి, సౌరశక్తి లాంటి ఇతర స్వచ్ఛమైన సాంకేతికల్లాగే దానిలో కూడా అద్భుతమైన సవరణలు తీసుకొస్తాం. 2025 ప్రారంభంలో మేం సోయాతో పోటీపడే అవకాశం ఉందని అనుకుంటున్నాం" అన్నారు.

సొలీన్ తయారీకి నీటిని విడగొట్టి హైడ్రోజన్ తయారు చేయడానికి ఎలక్ట్రోలిసిస్ ఉయోగిస్తున్నారు. గాలిలోని హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఖనిజాలను బాక్టీరియా తినేలా చేస్తారు. అది తర్వాత ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది.

"ఇందులో అత్యంత ముఖ్యమైనది విద్యుత్ ధరే. మరిన్ని పునరుత్పాదక శక్తులు వచ్చేకొద్దీ, ఈ ధర పడిపోతుందని మా సంస్థ భావిస్తోంది" అన్నారు.

ఈ అసాధారణ సాంకేతికత పురోగతిని పర్యావరణ ప్రచారకులు, 'అపాకలిప్స్ కౌ' అనే టీవీ డాక్యుమెంటరీ తీసిన జార్జ్ మాంబియాట్ ప్రశంసించారు.

ఫొటో సోర్స్, Getty Images

భవిష్యత్తుపై ఆశలు

మాంబియాట్ సాధారణంగా ప్రపంచం భవిష్యత్తు గురించి నిరాశావాదంతో ఉన్నారు. కానీ సోలార్ ఫుడ్స్ తనలో ఆశలు కల్పించినట్లు చెప్పారు.

"ఆహార ఉత్పత్తి మనం నివసిస్తున్న ప్రపంచాన్ని రెండుగా చీల్చేస్తోంది. చేపలుపట్టడం, వ్యవసాయం ఎప్పటినుంచో ఉన్నాయి. ఎన్నో వన్యప్రాణులు అంతరించిపోవడానికి, జీవవైవిధ్యం నాశనం కావడానికి అది ఒక పెద్ద కారణం. వాతావరణ మార్పులకు వ్యవసాయం ఒక ప్రధాన కారణం" అన్నారు.

కానీ ఆ ఆశలు ఆవిరైపోతున్నట్లు కనిపిస్తున్న సమయంలో 'వ్యవసాయ రహిత ఆహారం' ప్రజలను, భూమిని కాపాడడానికి అద్భుతమైన అవకాశాలు సృష్టిస్తోంది.

తాత్కాలికంగా మొక్కల ఆధారిత ఆహారం వైపు ప్రజలను మళ్లించడం ద్వారా ఎన్నో జాతులను, ప్రాంతాలను కాపాడ్డానికి సమయం ఆదా చేయడానికి మేం సాయం చేయగలం.

"కానీ 'వ్యవసాయ రహిత ఆహారం' కనిపించని చోట ఇది ఆశలు రేకెత్తిస్తోంది. మేం త్వరలోనే భూమిని నాశనం చేయకుండా ప్రపంచంలో ఉన్నవారి కడుపు నింపుతాం" అని ఆయన చెప్పారు.

"సాంకేతికత అంతరాయం వల్ల ఏర్పడే చాలా సమస్యలను అంచనా వేసే రీథింక్ ఎక్స్ అనే సంస్థ పరిశోధకులు "కచ్చితత్వంతో పులియబెట్టడం వల్ల ఏర్పడే ప్రొటీన్లు 2035 నాటికి జంతువుల నుంచి అందే మాంసకృత్తుల కంటే 10 రెట్లు చౌకగా లభిస్తాయి" అన్నారు.

ఫలితంగా పశువుల పెంపకం పరిశ్రమ దాదాపు కుప్పకూలే దశకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మాంసం ఉత్పత్తిదారులు తమ పశువులకు కొత్త ప్రొటీన్లు అందించే సామర్థ్యాన్ని ఇది అడ్డుకోలేదని విమర్శకులు ఫిర్యాదు చేస్తున్నారు.

ఆహార పంటలకు సంబంధించి ఏర్పడే పర్యావరణ మార్పులను అరికట్టేందుకు కొత్తరకం పరిష్కారాలు గుర్తించడానికి, ఒక శాస్త్రీయ పరిశోధనకు నేతృత్వం వహించడానికి ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యా సంస్థలతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేశారు.

"భూమిని ఉపయోగించే విషయానికి వస్తే సూక్ష్మజీవుల నుంచి పొందే ప్రొటీన్, సోయా కంటే మరింత సమర్థంగా ఉంటుంది" అని గత ఏడాది ఒక పత్రిక చెప్పింది.

అయినా ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఇప్పటికీ చాలా మంది మాంసంలా కనిపించే వాటి కంటే, అసలైన మాంసాన్నే తినాలని కోరుకుంటున్నారు.

"కొత్తరకం ఆహారం గురించి పెట్టుబడిదారుల్లో ఆసక్తి పెరుగుతోంది" అని క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ లియాన్ టెర్రీ బీబీసీకి చెప్పారు.

"సింథటిక్ ఆహారం చుట్టూ వేగంగా పెట్టుబడులు పెడుతున్నారు. కానీ వాటిని తినాలని నిజంగా ఆకలి వేస్తుందా?" అని ఆయన అడిగారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)