సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందా?

  • 13 జనవరి 2020
సంగీతం వింటూ వ్యాయామం చేస్తున్న అథ్లెట్ Image copyright iStock

కొత్త సంవత్సరంలో.. బరువు తగ్గటంతో పాటు.. ''ఇంకా ఎక్కువగా వ్యాయామం'' చేయాలనేది చాలా ఎక్కువ మంది తీసుకునే నిర్ణయం.

అసలేమీ చేయకుండా ఉండటానికి బదులు.. ఎలాంటి వ్యాయామైనా మంచిదే. అయినాకూడా.. 'బ్రిస్క్' - అంటే కొంత వేగంగా చేసే వ్యాయామం గుండెకు, మెదడుకు మంచిదని నిపుణులు చెప్తారు.

ఈ సంవత్సరంలో మరింత చురుకుగా ఉండాలని నిర్ణయం తీసుకున్న కోట్లాది మందిలో మీరు కూడా ఒకరైతే.. అలా బ్రిస్క్ వ్యాయామం చేయటానికి కొంచెం ఉత్సాహాన్నిచ్చే సంగీతం ఉపయోగపడుతుందా?

బీబీసీ 'ట్రస్ట్ మి ఐ యామ్ ఎ డాక్టర్' కార్యక్రమం కోసం.. అది ఎంత వరకూ పనిచేస్తుందనేది మేం ప్రయోగాత్మకంగా పరిశీలించాం.

నెమ్మదిగా నడవటం కన్నా.. వేగంగా నడవటం వల్ల మెదడుకి రక్తప్రసరణ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా బీడీఎన్ఎఫ్ (బ్రెయిన్ డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్) అనే హార్మోన్‌ విడుదలవుతుంది. కొత్త మెదడు కణాల ఉత్పత్తికి బీడీఎన్ఎఫ్ సాయపడుతుంది. ఇది మన వయసు పెరిగేకొద్దీ మనకు చాలా సహాయపడుతుంది.

చాలా విశ్రాంతిగా అడుగులు వేసేవారికన్నా.. వేగంగా నడిచేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది.

Image copyright Getty Images

బ్రిటన్‌లో 50,000 మందికి పైగా వాకర్ల (నడిచే వారి) మీద నిర్వహించిన ఒక భారీ అధ్యయనంలో.. వేగంగా నడుస్తున్నామని చెప్పిన వారు.. నెమ్మదిగా నడుస్తున్నామని చెప్పే వారి కన్నా సగటున 24 శాతం ఎక్కువ కాలం జీవించినట్లు వెల్లడైంది. ఈ అధ్యయనం వివరాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించారు.

కానీ.. ఇటువంటి అధ్యయనాల నుంచి కార్యకారణ ప్రభావాలను నిర్ధారించటం కష్టం. ఎందుకంటే.. వేగంగా నడిచేవారు అప్పటికే మిగతా వారికన్నా ఆరోగ్యంగా ఉండి ఉండొచ్చు.

రెండేళ్ల కిందట.. యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌లో ఫిజికల్ యాక్టివిటీ అండ్ హెల్త్ ప్రొఫెసర్ రాబ్ కోప్‌లాండ్ నిర్వహించిన ఇదే తరహా ప్రయోగంలో నేను పాల్గొన్నాను. పెద్దగా శారీరక వ్యాయామం చేయని ఫ్యాక్టరీ కార్మికులు కొంతమందిని మేం ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నాం.

వారిలో కొందరికి 10,000 అడుగులు నడిచే పని అప్పగించాం. ఇంకొందరికి రోజుకు మూడు సార్లు 10 నిమిషాల చొప్పున వేగంగా నడిచే పని అప్పగించాం.

ఆ పరిశీలన ముగిసిన తర్వాత.. ఒకేసారి 10,000 అడుగల లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయటం కన్నా.. రోజుకు పలుమార్లు కొద్ది సేపే అయినా వేగంగా నడవటం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించాం.

చిత్రం శీర్షిక 'ట్రస్ట్ మి ఐ యామ్ ఎ డాక్టర్' బృందం

సంగీత వైద్యం?

ఈ సంవత్సరం.. మరింత ఎక్కువ మందితో అదే ప్రయోగం చేయాలని భావించాం. అయితే.. సంగీతం చేర్చటం వల్ల నడిచే వేగం పెరుగుతుందా అనేది కూడా చూడాలనుకున్నాం.

నిజానికి.. 'బ్రిస్క్ వాకింగ్' చేయండి అని జనానికి చెప్తుంటాం కానీ.. అసలు అదంటే ఏమిటనేది మనలో చాలా తక్కువ మందికే తెలుసు. ''వేగంగా నడుస్తూ మాట్లాడగలగాలి.. కానీ పాడలేనంత వేగంగా ఉండకూడదు'' అని ఒకరు చెప్పారు. అయితే.. నేను ఎంత వేగంగా నడిచినా కానీ నేను పాడగలను. కాబట్టి ఆ సలహా నాకు వ్యక్తిగతంగా ఉపయోగపడదు.

మరింత స్పష్టమైన నిర్వచనం చెప్తే.. 'బ్రిస్క్ వాకింగ్' అంటే నిమిషానికి సుమారు 100 అడుగులు నడవటం. కనీసం అంత వేగవంతమైన బీట్ ఉన్న సంగీతం వినటం దీనికి సాయపడగలదు. అబ్బా పాట డాన్సింగ్ క్వీన్, షకీరా సాంగ్ హిప్స్ డోంట్ లై వంటి సంగీతం ఈ కోవలోకి వస్తుంది.

నేను అల్స్టర్ యూనివర్సిటీలో ఎక్సర్సైజ్ అండ్ హెల్త్ ప్రొఫెసర్ మేరీ మర్ఫీతో కలిశాను. మేం 25 నుంచి 65 ఏళ్ల మధ్య వయసుగల 24 మంది వలంటీర్లను చేర్చుకున్నాం. వారిని రెండు బృందాలుగా విభజించాం.

ఒక బృందానికి పీడోమీటర్లు ఇచ్చాం. రోజుకు 10,000 అడుగులు వేయాలని చెప్పాం. మరొక బృందానికి మేం ఎంపిక చేసిన సంగీతం వింటూ రోజుకు 30 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయాలని చెప్పాం.

Image copyright Getty Images

ప్రయోగం ఆరంభంలో ప్రతి ఒక్కరి బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్, బాడీ ఫాట్ వివరాలను మేం పరీక్షించాం. ఐదు వారాల పాటు మేం చెప్పినట్లు నడిచిన తర్వాత తిరిగి వచ్చారు. అప్పుడు మళ్లీ పరీక్షలు నిర్వహించాం.

బ్రిస్క్ వాక్ చేసిన వాళ్లకి సంగీతం బాగానే నచ్చింది. కానీ.. దానివల్ల ఏమైనా మేలు జరిగిందా?

''శుభవార్త ఏమిటంటే రెండు బృందాల్లోనూ సానుకూల మార్పులు వచ్చాయి. అయితే.. రోజుకు 10,000 అడుగులు నడిచిన వారిలో కన్నా.. సంగీతం వింటూ వేగంగా నడిచిన వారిలో కొంచెం ఎక్కువగా మెరుగుదల కనిపించింది'' అని ప్రొఫెసర్ మర్ఫీ చెప్పారు.

రోజుకు 10,000 అడుగులు నడిచిన వారి శరీరాల్లో కొవ్వు సగటున 1.8 శాతం తగ్గితే.. వేగంగా నడిచిన వారిలో ఆ తగ్గుదల రేటు 2.4 శాతంగా ఉంది. బ్రిస్క్ వాక్ చేసిన వారిలో బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువగా తగ్గింది.

అంటే.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. మంచి బీట్ ఉన్న మ్యూజిక్ పెట్టుకుని కాళ్లను నేల మీద ఆన్చి వేగంగా అడుగులు వేయండి అనేది ఈ ప్రయోగం ఇస్తున్న సందేశం.

'ట్రస్ట్ మి ఐ యామ్ ఎ డాక్టర్' కార్యక్రమం బీబీసీ2లో బుధవారం ప్రసారమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: పరీక్ష చేయించుకోవడం ఎందుకంత ముఖ్యం? ఎవరు చేయించుకోవాలి?

కరోనా వైరస్: 24 గంటల్లో 525 కొత్త కేసులు.. భారత్‌లో 3,072కి పెరిగిన పాజిటివ్ కేసులు

కరోనా క్వారంటైన్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సాంకేతికతను ఎలా వాడుతున్నాయి?

హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణులు, ఇతర రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

కరోనావైరస్ సంక్షోభం: సమానత్వ, న్యాయ మూలాలపై సరికొత్త సమాజాన్ని నిర్మించేందుకు ఇది సదవకాశమా

వివిధ దేశాల్లో కరోనా లాక్‌డౌన్ నిబంధనలు: ‘ఆడవాళ్లు బయటకు వచ్చే రోజు మగవాళ్లు రాకూడదు.. భార్యలు భర్తల్ని విసిగించొద్దు’

కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'

కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చు - పరిశోధకులు