సిరియా శాంతిదూత హెవ్రిన్ ఖలాఫ్‌ శరీరంలో ఇరవైకి పైగా తూటాలు... ఆమెను చంపిందెవరు?

  • 13 జనవరి 2020
హెవ్రిన్‌కు నివాళిగా ఇటలీలో ప్రదర్శనలు Image copyright Getty Images
చిత్రం శీర్షిక హెవ్రిన్ ఖలాఫ్ చిత్రం

సిరియాలో కుర్దిష్ రాజకీయ నాయకురాలు హెవ్రిన్ ఖలాఫ్‌ను సిరియన్ నేషనల్ ఆర్మీ‌లోని టర్కీ మద్దతు ఉన్న ఒక వర్గం హత్య చేసిందనడానికి బలమైన ఆధారాలు 'బీబీసీ న్యూస్ అరబిక్' దర్యాప్తులో లభించాయి.

అయితే, ఆ వర్గమైన అహ్రార్ అల్ షర్కియా మత్రం తాము ఆమె హత్యకు బాధ్యులం కాదని చెబుతోంది. కానీ, సాక్షాలు మాత్రం వేరేగా ఉన్నాయి.

34 ఏళ్ళ హెవ్రిన్ ఖలాఫ్ సిరియాలోని స్థానిక జాతుల మధ్య సమానత్వం కోసం పాటుపడేవారు. ఉత్తర సిరియాలో కుర్దుల అధీనంలోని రోజావా ప్రాంతంలోకి టర్కీ దండయాత్రలనూ ఆమె గట్టిగా వ్యతిరేకించేవారు.

Image copyright Future Syria Party
చిత్రం శీర్షిక హెవ్రిన్ ఖలాఫ్ (రంగుల పువ్వులున్న టాప్ వేసుకున్న మహిళ)

అమెరికా బలగాల ఉపసంహరణతో...

రోజావా ప్రాంత పునర్నిర్మాణంలో సవాళ్లు ఎదుర్కొంటున్న కుర్దులు, సిరియా అరబ్‌లు, క్రిస్టియన్లు కలిసి పనిచేయాలని కోరుకున్న 'ఫ్యూచర్ సిరియా పార్టీ' స్థాపనకు సహకరించినవారిలో హెవ్రిన్ ఒకరు.

''ఒక కామ్రేడ్‌ను, ఒక సోదరిని, మా కామ్రేడ్‌లందరికీ నాయకురాలిని కోల్పోయాం'' అని ఆమె స్నేహితురాలు, ఒకప్పటి రూం మేట్ నుబాహార్ ముస్తాఫా అన్నారు.

ఉత్తర సిరియాలోని అల్ హసాకా పట్టణం నుంచి 2019 అక్టోబరు 12 ఉదయం 5.30 గంటలకు హెవ్రిన్ ఎం-4 రహదారిపై రఖ్ఖా నగరానికి బయలుదేరారు. అల్ హసాకా నుంచి రఖ్ఖాకు మూడు గంటల ప్రయాణం. రఖ్ఖాలో ఫ్యూచర్ సిరియా పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు ఆమె ఆ ప్రయాణం ప్రారంభించారు.

అప్పటికి ఆ ప్రాంతం నుంచి అమెరికా తన సైనిక బలగాలను ఉపసంహరించుకుని మూడే మూడు రోజులైంది. అమెరికా బలగాలు వెనక్కు వెళ్లడంతో సిరియాలోకి చొరబడి సైనిక కార్యకలాపాలు సాగించడానికి టర్కీకి వీలు కలిగింది.

టర్కీ నుంచి మిలటరీ కాన్వాయ్ ఒకటి సిరియాలోకి ప్రవేశించి ఎం-4 మోటార్‌వే వైపు వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెప్పారు.

చిత్రం శీర్షిక హెవ్రిన్ ప్రయాణించిన కారుపై తూటాలు చేసిన రంథ్రాలు

టెలిగ్రామ్‌ వీడియోల సహాయంతో

టర్కీ మద్దతు ఉన్న సిరియన్ నేషనల్ ఆర్మీ(ఎస్‌ఎన్‌ఏ)కి చెందినది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నేతృత్వంలోని సిరియా ప్రభుత్వ బలగాలకు దీనికి సంబంధం లేదు.

టర్కీ 2019లో 41 ముఠాలను ఒక చోట చేర్చి 70 వేల మందితో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసింది. వీరికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఆయుధాలు సమకూర్చడం అంతా టర్కీయే చేస్తోంది. అమెరికా బలగాలు సిరియా నుంచి వైదొలగినప్పటి నుంచి ఈ ఎస్‌ఎన్‌ఏ ఈశాన్య సిరియాలో కుర్దిష్ దళాలతో పోరాడుతోంది.

ఈ ఎస్ఎన్ఏలోని ఒక ఫ్యాక్షన్ అహ్రార్ అల్ షర్కియా.. మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో కొన్ని వీడియోలున పోస్ట్ చేసింది. అందులో ఆ గ్రూప్.. ఎం-4 మోటార్‌వేపైకి వచ్చామని ప్రకటించుకుంది.

ఆ వీడియోలో ఉదయిస్తున్న సూర్యుడు కనిపిస్తాడు. అది వారు ఉదయం 6.30 నుంచి 7 గంటల మధ్య అక్కడికి చేరుకున్నట్లు సూచిస్తుంది.

వారు పోస్ట్ చేసిన వీడియోలలో ఒకదానిలో కాంక్రీట్ దిమ్మె, టెలిఫోన్ స్తంభం, దుమ్ముకొట్టుకుపోయిన రోడ్డు కనిపిస్తోంది. ఆ ప్రాంత శాటిలైట్ చిత్రాలతో ఈ వీడియోలోని దృశ్యాలను పోల్చినప్పుడు వారున్న ప్రాంతం తిర్వాజియా చెక్‌పాయింట్‌గా 'బీబీసీ' గుర్తించింది.

ఈ ప్రాంతంలోని ఉపగ్రహ చిత్రాలతో స్థానాలను పోల్చడం ద్వారా, బిబిసి వీడియోను తిర్వాజియా చెక్‌పాయింట్‌కు జియోలొకేట్ చేసింది.

అక్టోబర్ 12న ఉదయం హెవ్రిన్ ఖలాఫ్ కారు కూడా ఈ చెక్‌పోస్ట్ దిశగానే ప్రయాణించింది.

Image copyright Video posted on Telegram
చిత్రం శీర్షిక కారును చుట్టుముట్టిన సాయుధులు

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హత్యలు

కాగా, ఎం-4 మోటార్‌వేకి వచ్చామని చెబుతున్న ఆ వీడియోలో అనంతరం టర్కీతో దశాబ్దాలుగా పోరాడుతున్న కుర్దు సాయుధ గ్రూప్ పీకేకేకి చెందినవారికి చెబుతూ ముగ్గురిని అరెస్ట్ చేయడం అందులో కనిపిస్తుంది.

మరో వీడియోలో అహ్రార్ అల్ షర్కియాకు చెందిన ఓ వ్యక్తి తన సహచరుడితో చెబుతున్న మాటలు వినిపిస్తాయి. అక్కడ(తిర్వాజియా చెక్‌పాయింట్) వద్ద కింద పడి ఉన్న మనిషిని తాను కాల్చి చంపడాన్ని వీడియో తీయమని ఆ వ్యక్తి చెబుతున్నాడు.

అయితే, తమ గ్రూప్‌కి చెందినవారెవరూ అక్కడ లేరని తొలుత బుకాయించిన అహ్రార్ అల్ షర్కియా అనంతరం ''ఆ రోజు ఎం-4 మోటార్‌వేను దిగ్బంధించినవారు తమ గ్రూప్‌వారే అయినా అనుమతులు లేకుండా అలా చేశారని, నాయకత్వ ఆదేశాలను ధిక్కరించినవారిపై విచారణ జరుగుతోంది'' అంటూ బీబీసీకి ఒక ప్రకటన విడుదల చేసింది.

తమ గ్రూప్‌కు చెందిన ఆ బృందం ఓ కారుపై కాల్పులు జరిపినట్లు కూడా అల్ షర్కియా తరువాత అంగీకరించింది. అయితే, వారు ఆపినప్పుడు ఆ కారు ఆగకుండా ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపారని చెప్పారు. తామెప్పుడూ హెవ్రిన్ ఖలాఫ్‌ను లక్ష్యంగా చేసుకోలేదని, ఆమెను ఎలా హతమయ్యారో తమకు తెలియదని చెప్పారు.

అల్ షర్కియా సాయుధులు పోస్ట్ చేసిన వీడియోలు, 'బీబీసీ న్యూస్ అరబిక్'తో మాట్లాడిన ప్రత్యక్ష సాక్షి చెప్పిన ప్రకారం హెవ్రిన్‌ను హతమార్చింది వారేనని తెలుస్తోంది.

బీబీసీ జియోలొకేషన్ విశ్లేషణ ప్రకారం తిర్వాజియా చెక్‌పోస్ట్‌ వద్ద హెవ్రిన్ కారు రహదారికి కొద్దిగా దూరంగా ఉంది. అల్ షర్కియా సాయుధులు పోస్ట్ చేసిన వీడియోలు విశ్లేషిస్తే వారు ఆమె కారును చుట్టుముట్టడం కనిపిస్తుంది.

కారులో ఒక మృతదేహం ఉంది. అది ఆమె డ్రైవర్ ఫర్హాద్ రమదాన్ మృతదేహంగా భావిస్తున్నారు. వీడియోలో అదే సమయంలో కారు లోపలి నుంచి భయకంపితమైన మహిళ స్వరం వినిపించింది.

చిత్రం శీర్షిక హెవ్రిన్ తల్లి సౌవాద్ మొహమ్మద్

''అది హెవ్రిన్ గొంతే. 5 వేల గొంతుల్లో కూడా నేను హెవ్రిన్ గొంతును గుర్తుపడతాను'' అని హెవ్రిన్ తల్లి సౌవాద్ మొహమ్మద్ బీబీసీతో చెప్పారు.

''ఆమె గొంతు విన్నప్పుడు ఈ ప్రపంచంలోని క్రూరత్వాన్ని చూశాను. ఈ ప్రపంచంలో మానవత్వమనేదే లేదు'' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారామె.

హెవ్రిన్ ప్రయాణిస్తున్న కారును ఆపినప్పుడు ఆమె సజీవంగానే ఉన్నారు.. అంతేకాదు, ఆ సాయుధులకు ఆమె ఎవరో చెప్పినట్లుగా వీడియోల ఆధారంగా తెలుస్తోంది.

ఆమె కారు లోపల మరణించలేదని సూచించడానికీ ఆధారాలు కనిపిస్తున్నాయి.

అహ్రార్ అల్ షర్కియా తిరుగుబాటుదారులు అక్కడికి వచ్చినప్పుడు తాను అటువైపుగా వెళ్తున్నానని ఓ రైతు 'బీబీసీ'కి తెలిపారు.

సుమారు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో అల్ షర్కియా సాయుధులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత ఆ రైతు ఘటనా ప్రదేశంలోకి వెళ్లి చూశానని చెప్పారు.

''అదో భీతావహ దృశ్యం. నేనక్కడికి వెళ్లగానే నాకు మొట్టమొదట కనిపించింది కారుకు 5 మీటర్ల దూరంలో ఉన్న ఒక అమ్మాయి మృతదేహం. ఆమె ముఖం చితికిపోయింది. కాలు తీవ్రంగా దెబ్బతింది. బహుశా విరిగిపోయినా విరిగిపోవచ్చు'' అన్నారాయన.

తిర్వాజియా చెక్‌పాయింట్ వద్ద 9 మృతదేహాలను చూసినట్లు ఆయన చెప్పారు. అయితే, మృతదేహాలను కారులో ఉంచడానికి స్థానికుల సహాయాన్ని కోరానని, కానీ, వారెవరూ ముందుకు రాలేదని... అలా చేస్తే తమనూ చంపేస్తారన్నది వారి భయమని ఆ రైతు చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హెవ్రిన్ శవయాత్ర

20 తూటా గాయాలు

హెవ్రిక్ హత్యకు గురైన రోజునే మధ్యాహ్నం 12 గంటలకు ఆమె మృతదేహంతో పాటు మరో మూడు మృతదేహాలను మాలికియా సైనిక ఆసుపత్రికి చేర్చారు. అక్కడి వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమెపై 20 కంటే ఎక్కువసార్లు కాల్చినట్లు తేలింది. ఆమె రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. ఆమెపై తీవ్రమైన భౌతికదాడి జరిగింది.

అహ్రార్ అల్ షర్కియా సాయుధులు ఆమెను కారు నుంచి బయటకు లాగి తీవ్రంగా కొట్టి కిందపడేసి కాల్చి చంపేసినట్లు 'బీబీసీ అరబిక్' భావిస్తోంది.

అయితే, అల్ షర్కియా మాత్రం ''హెవ్రిన్ ఖలాఫ్‌ను హత్యతో మాకు సంబంధం లేదని ఇప్పటికే చాలాసార్లు స్పష్టంగా చెప్పాం'' అని బీబీసీకి తెలిపారు.

కాగా హెవ్రిన్ ఖలాఫ్ హత్యపై నిష్పాక్షిక దర్యాప్తు ప్రారంభించాలని ఐరాస మానవ హక్కుల కమిషనర్ టర్కీని కోరినప్పటికీ ఇంకా అలాంటి విచారణేమీ ప్రారంభం కాలేదు.

అక్టోబరులో అమెరికా బలగాలు ఆ ప్రాంతం నుంచి వైదొలగిన తరువాత హతులైన వందల మందిలో హెవ్రిన్ ఒకరు.

''ఈ హత్యలన్నిటిపైనా స్వతంత్రంగా దర్యాప్తు జరిగి కారకులను విచారించాలి. ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

అమ్నెస్టీ ఇంటర్నేషనల్ బీబీసీకి "హెవ్రీన్ ఖలాఫ్ మరియు ఇతరులను హత్య చేసినట్లు స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి మరియు నేరస్థులను న్యాయం చేయాలి ... టర్కీ మద్దతున్న దళాలకు అడ్డుకట్ట వేయకపోయినా, వారి ఉల్లంఘనలకు శిక్షల నుంచి మినహాయించడాన్ని ఆపకపోయినా వారి దురాగతాలను మరింత ప్రోత్సహించినట్లే''ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 'బీబీసీ'తో వ్యాఖ్యానించింది.

ఈ మొత్తం వ్యవహారంపై టర్కీ ప్రభుత్వాన్ని సంప్రదించగా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

డోనల్డ్ ట్రంప్: ముగిసిన రెండు రోజుల భారత పర్యటన

ఇరాన్ ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రికి కరోనావైరస్.. స్పెయిన్‌లో వందల మందిని లోపలే ఉంచి హోటల్‌ను మూసేసిన ప్రభుత్వం

దిల్లీ హింస: ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో హింసకు కారకులెవరు.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు

BBC Indian Sportswoman of the Year 2019: విజేత ఎవరో మార్చి 8న ప్రకటిస్తాం

దిల్లీ: హింసాత్మక ఘర్షణల్లో 10కి చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు

మోదీ ప్రభుత్వ విజయాలపై అహ్మదాబాద్‌లో ట్రంప్ చెప్పినవన్నీ నిజాలేనా? - బీబీసీ రియాల్టీ చెక్

వీడియో: ఇళ్ల మధ్యకు వచ్చిన ఎలుగుబంటి