వు హుయాన్: రోజుకు గుప్పెడు అన్నం, పిడికెడు మిరపకాయలు... అయిదేళ్లపాటు అదే ఆహారం తిన్న చైనా విద్యార్థిని మృతి

  • 15 జనవరి 2020
వు హుయాన్ Image copyright FENG VIDEO
చిత్రం శీర్షిక వు హుయాన్ తన తమ్ముడికి సాయం చేయటానికి తాను తిండి మానేసేది

ఏళ్ల తరబడి రోజుకు కేవలం 20 రూపాయలు ఖర్చు పెట్టి అన్నం, మిరపకాయలే ఆహారంగా జీవించిన ఒక చైనా విద్యార్థిని.. తీవ్ర పోషకాహార లోపంతో చనిపోయిందని చైనా మీడియా వెల్లడించింది.

వు హుయాన్ అనే ఆ విద్యార్థిని.. అనారోగ్యంతో ఉన్న తన తమ్ముడికి సాయం చేయటం కోసం.. తను సరిగా తినకపోవటంతో కేవలం 20 కిలోల బరువు మాత్రమే ఉండేది. ఆమె ఫొటోలు గత ఏడాది వెలుగులోకి రావటంతో చైనా ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

శ్వాస సమస్యలు తలెత్తటంతో ఆమెను 2019 అక్టోబరులో ఆస్పత్రిలో చేర్చారు.

ఆమె కోలుకోవటం కోసం పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. కానీ ఫలితం లేకపోయింది. వు హుయాన్ సోమవారం నాడు చనిపోయినట్లు ఆమె సోదరుడు విలేకరులకు చెప్పాడు.

వు హుయాన్.. తన తండ్రి, నానమ్మలు చికిత్స కోసం డబ్బులు లేక చనిపోవటంతో తాను మీడియాను సాయం కోసం అర్థించానని 'చాంగ్‌క్వింగ్ మోర్నింగ్ పోస్ట్'‌తో చెప్పారు.

''పేదరికం వల్ల చావు కోసం ఎదురుచూసే ఆ దుస్థితి నేను అనుభవించకూడదని అనుకున్నాను'' అని పేర్కొన్నారు.

చనిపోయేటప్పటికి ఆమె వయసు కేవలం 24 సంవత్సరాలని ఆమె తమ్ముడు 'బీజింగ్ యూత్ డెయిలీ'కి తెలిపారు.

యూనివర్సిటీలో మూడో సంవత్సరం చదవుతున్న వు హుయాన్.. ఐదేళ్ల పాటు అతి తక్కువ ఆహారంతోనే జీవించటం వల్ల గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు గత ఏడాది వివరించారు.

హుయాన్ కథ ఏమిటి?

వు హుయాన్, ఆమె తమ్ముడు మనుగడ సాగించటానికి చాలా ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆమెకు నాలుగేళ్ల వయసులో వారి తల్లి చనిపోయింది. ఆమె స్కూల్‌లో చదువుతుండగానే వారి తండ్రి కూడా చనిపోయాడు.

అప్పుడు వారిద్దరినీ వారి నానమ్మ చూసుకునేది. ఆ తర్వాత వారి బంధువులైన ఒక దంపతులు కొంత కాలం నెలకు 300 యువాన్లు (సుమారు 3,000 రూపాయలు) మాత్రం వీరికి ఇవ్వగలిగేవారు.

అయితే.. ఆమె తమ్ముడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉండటంతో అతడికి వైద్యం కోసమే ఆ డబ్బులో చాలా వరకూ ఖర్చయ్యేది.

దీంతో వు హుయాన్‌కు సగటున రోజుకు రూ. 20 మాత్రమే తన ఆహారం కోసం ఖర్చు పెట్టుకోవటానికి వీలయ్యేది. ఆమె ఐదేళ్ల పాటు అన్నం, మిరపకాయలు తింటూ జీవించింది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చినపుడు ఆమె నాలుగు అడుగుల ఐదు అంగుళాల ఎత్తు, 20 కిలోల బరువు మాత్రమే ఉంది.

తీవ్ర పోషకాహార లోపం వల్ల ఆమె కనుబొమ్మలు, సగం జుట్టు ఊడిపోయాయని డాక్టర్లు చెప్పారు.

Image copyright Weibo

కారణం ఏమిటి?

ఈ అక్కాతమ్ముళ్లు చైనాలోని అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటైన గ్విజోలో నివసించేవారు. వీరి ఉదంతం.. చైనాలో పేదరికం గురించి ప్రపంచానికి తెలియజేసింది.

చైనా ఆర్థికవ్యవస్థ గత కొన్ని దశాబ్దాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నా కూడా.. పేదరికం అంతరించిపోలేదు. 2017లో దేశంలో 3.046 కోట్ల మంది గ్రామీణ ప్రజలు జాతీయ దారిద్ర్యరేఖ అయిన రోజుకు రూ. 135 కన్నా తక్కువ ఆదాయంతో నివసిస్తున్నారని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెప్తోంది.

అసమానతలు కూడా పెరిగాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 2018 నివేదిక ప్రకారం.. చైనా ఇప్పుడు ''ప్రపంచంలో అత్యంత అసమానతలు ఉన్న దేశాల్లో ఒకటి''.

వు హుయాన్ ఉదంతం.. అధికార వ్యవస్థల మీద ఆగ్రహం పెల్లుబికేలా చేసింది. ఈ అక్కాతమ్ముళ్లకు ఎందుకు సాయం చేయలేకపోయారని సోషల్ మీడియాలో అనేక మంది ప్రశ్నించారు.

ఆ యువతి తన తమ్ముడికి సాయం చేయటానికి, తను చదువు కొనసాగించటానికి చేసిన కృషి పట్ల చాలా మంది అబ్బురపడ్డారు.

క్రౌడ్‌ఫండింగ్ వేదికల ద్వారా విరాళాలతో పాటు.. ఆమె ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు 40,000 యువాన్లు (సుమారు రూ. 4.11 లక్షలు) విరాళం ఇచ్చారు. ఆమె గ్రామ ప్రజలు ఆమెకు సాయం చేయటానికి 30,000 (సుమారు రూ. 3 లక్షలు) యువాన్లు సమీకరించారు.

యు హుయాన్ మరణానికి ముందు.. ఆమె ప్రభుత్వం నుంచి కనీస రాయితీ (నెలకు 300 నుంచి 700 యువాన్ల మధ్య ఉంటుందని అంచనా) పొందుతోందని, ఆస్పత్రిలో ఉండగా 20,000 యువాన్ల (సుమారు రూ. 2 లక్షలు) అత్యవసర సహాయ నిధి అందించామని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

చైనా.. 2020 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తామని ప్రతిన బూనింది. ఈ నెల ఆరంభంలో.. జియాంగ్సు రాష్ట్రంలోని 8 కోట్ల మంది జనాభాలో కేవలం 17 మంది మాత్రమే పేదరికంలో జీవిస్తున్నారని ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఈ గణాంకాలను కొందరు ఆన్‌లైన్‌లో ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

విశాఖపట్నంలో రాజధాని: సెక్రటేరియట్, సీఎం నివాసం ఉండేది ఎక్కడంటే..

ఏనుగు ఈ స్టార్‌ హోటల్‌కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో

సాయిబాబా ‘జన్మస్థలం’పై వెనక్కు తగ్గిన సీఎం.. షిరిడీ సంస్థాన్‌ ట్రస్టుతో చర్చలు

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు: విశాఖపట్నంలో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు

దీప కర్మాకర్ అడుగుజాడల్లో త్రిపుర నుంచి దూసుకువస్తున్న మరో జిమ్నాస్ట్..

ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ అమలు చేస్తారా.. ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు

వసతి గృహంలో బాలికలపై అత్యాచారం కేసు: 19 మందిని దోషులుగా తేల్చిన కోర్టు

జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు