మహిళల జీవితాలను మార్చేసిన కుట్టు మిషన్ కథ

  • 17 జనవరి 2020
పేటెంట్ హక్కులు పొందిన మొదటి కుట్టు యంత్రం వాణిజ్య ప్రకటన (1899లో) Image copyright Getty Images
చిత్రం శీర్షిక పేటెంట్ హక్కులు పొందిన మొదటి కుట్టు మెషీన్ ప్రకటన (1899లో)

ప్రపంచంలో సామాజిక పురోగతి 1850లోనే ప్రారంభమైంది.

మహిళలకు ఓటు హక్కు కల్పించాలంటూ 1848లో అమెరికా ఉద్యమకారిణి ఎలిజబెత్ కేడీ స్టాంటన్ ఒక సదస్సు నిర్వహించారు. ఆమె మరీ అతిగా ఆశిస్తున్నారని, మహిళలకు ఓటు హక్కు రావడం అంత సులువు కాదంటూ ఆమె మద్దతుదారులే అనుమానం వ్యక్తం చేశారు. కానీ, ఆ కల నెరవేరింది.

అదే సమయంలో, అమెరికాలోని బోస్టన్‌లో నటుడిగా విఫలమైన ఒక వ్యక్తి ఆవిష్కర్తగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఒక వర్క్‌షాపులో కొద్దిపాటి స్థలాన్ని ఆయన అద్దెకు తీసుకుని చెక్కల మీద అక్షరాలు చెక్కే టైప్‌ మెషీన్‌ను తయారు చేశారు. కానీ, దానికి ఆదరణ లభించలేదు. ఆ పరికరం బాగా పనిచేస్తుండేది. కానీ దానిని కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు.

నిరుత్సాహంలో కూరుకుపోయిన ఆ 'విఫల నటుడి'ని వర్క్‌షాపు యజమాని పిలిచి కుట్టు యంత్రం తయారీ గురించి ఆలోచించాలని సూచించారు.కుట్టు మిషన్ తయారీ కోసం అప్పటికే అనేక దశాబ్దాలుగా చాలామంది ప్రయత్నించారు. కానీ, ఎవరూ విజయవంతం కాలేదు.

చేతితో ఒక్క షర్టు కుట్టాలంటే అప్పట్లో 14 గంటలు కష్టపడాల్సి వచ్చేది. ఆ పనిని వేగంవంతం చేసే యంత్రాన్ని తయారు చేయగలిగితే సులువుగా ధనవంతుడిని అయిపోవచ్చని ఆ 'విఫల నటుడు' అనుకున్నారు.

పైగా అప్పట్లో మహిళలు బయట ఎంత కష్టపడినా సరైన వేతనాలు వచ్చేవి కాదు. దాంతో, చాలామంది గ‌ృహిణులు, యువతులు కుట్టు పని చేసేందుకు ఆసక్తి చూపుతారని ఆయన భావించారు. పట్టుదలతో ఒక మెషీన్‌ను తయారు చేశారు. అది విజయవంతంగా పనిచేసింది.

అలా ఆవిష్కర్తగా మారిన ఆ విఫల నటుడు ఐజాక్ మెర్రిట్ సింగర్.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఐజాక్ మెర్రిట్ సింగర్

ఆ యంత్రం తొలి నమూనా రూపొందించేందుకు ఆయన తీవ్రంగా కష్టపడ్డారు. చివరికి ఒక షర్టును కేవలం గంటలోనే కుట్టే యంత్రాన్ని విజయవంతంగా తయారు చేయగలిగారు.

ఆ ఆవిష్కరణకు పేటెంట్ హక్కులను తీసుకుని అమ్మకాలు ప్రారంభించారు. దానికి మంచి ఆదరణ లభించింది.

అయితే, అప్పటికే ఇతరుల పేరిట పేటెంట్ హక్కులు ఉన్న నేత్రాకార సూదితో పాటు మరికొన్ని ఆవిష్కరణలు ఆ యంత్రానికి కీలకమయ్యాయి.

దాంతో, మిగతా ఆవిష్కర్తలకు, సింగర్‌కు మధ్య 1850లలో 'కుట్టు మిషన్ యుద్ధం' నడిచింది. అప్పుడు కుట్టు యంత్రం అమ్మడం కంటే, పేటెంట్ హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ పరస్పరం ఒకరి మీద ఒకరు దావాలు వేసుకోవడానికే ఆ ఆవిష్కర్తలు ఎక్కువగా పోటీపడ్డారు.

చివరికి ఒక న్యాయవాది చొరవ తీసుకుని వారి మధ్య సయోధ్య కుదిర్చారు. దాంతో న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. కుట్టు మెషీన్ అమ్మకాలు ఊపందుకున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సింగర్ తయారు చేసిన మొదటి కుట్టు యంత్రానికి పేటెంట్ హక్కులు 1851లో వచ్చాయి

మరోవైపు, కొన్నాళ్లకే ఇతరులు భిన్నమైన కొత్తరకం పరికరాలతో కుట్టు యంత్రాలను తయారు చేయడం ప్రారంభించారు. సింగర్ మాత్రం చాలా ఏళ్ల పాటు తన పాతరకం విడిభాగాలు, నట్లు, బోల్టులతోనే తయారు చేసేవారు.

అయితే, సిగర్, ఆయన వ్యాపార భాగస్వామి ఎడ్వార్డ్ క్లార్క్‌లు మార్కెటింగ్‌‌ వ్యూహాలలో దిట్ట. అప్పట్లో కుట్టు యంత్రం ధర చాలా ఎక్కువగా ఉండేది. ఒక సామాన్య కుటుంబం దానిని కొనాలంటే కొన్ని నెలల ఆదాయాన్ని వెచ్చించాల్సి వచ్చేది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సింగర్ కుట్టు యంత్రం గురించి 1900లో ప్రచురించిన ప్రకటన ఇది

ధర ఎక్కువగా ఉండటం వల్ల సామాన్యులు వాటిని కొనలేకపోతున్నారని గమనించిన ఎడ్వార్డ్ క్లార్క్ ఒక ఉపాయం చేశారు. నెలనెలా వాయిదాల రూపంలో డబ్బులు తీసుకుని కుట్టు మిషన్లను ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. నెలనెలా చెల్లించే వాయిదాల మొత్తం ఆ మెషీన్ అమ్మకం ధరకు సమానం అయ్యాక అది వారి సొంతం అవుతుంది.

అది చాలామంది వినియోగదారులను ఆకర్షించింది. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సింగర్ అనేక మంది ఏజెంట్లను నియమించుకున్నారు. ఎవరైనా మెషీన్ కొంటే ఆ ఏజెంట్లు వెళ్లి బిగించేవారు, అది చెడిపోయినప్పుడు వచ్చి బాగు చేసేవారు.

Image copyright Punch Cartoon Library / TopFoto
చిత్రం శీర్షిక కుట్టు యంత్రాలతో కలిగే ప్రయోజనాలను ఎగతాళి చేస్తూ అప్పట్లో కొన్ని కార్టూన్లు కనిపించాయి

సింగర్ పొట్టిగా ఉండేవారు. అందగాడు, ఇతరులను బాగా ఆకర్షించగల చాతుర్యం, మంచి ఔదార్యం కలిగిన వ్యక్తి. కనికరము లేని వ్యక్తి కూడా.

మహిళల పట్ల సింగర్‌కు పెద్దగా గౌరవం ఉండేది కాదు, మహిళలకు ఆయన మద్దతు ఇచ్చేవారు కాదు.

ఆయనను స్త్రీలోలుడు అని కూడా అనేవారు. 21 మంది పిల్లలకు ఆయన తండ్రి అయ్యారు. కొన్నేళ్ల పాటు ఆయన ఒకరికి తెలియకుండా మరొకరితో సమాంతరంగా మూడు కుటుంబాలను నడిపారు. సాంకేతికంగా వేరే పురుషులతో వివాహ బంధంలో ఉన్న మహిళలతోనే ఆయన సహజీవనం చేశారు. ఆయన తనను కొట్టారంటూ ఒక మహిళ ఫిర్యాదు కూడా చేశారు.

దాంతో, ఆయనకు మహిళలంటే చాలా చులకన భావన ఉండేదన్న వాదన వ్యాప్తి చెందింది.

కానీ, మహిళలకు గౌరవం ఇచ్చే విషయాన్ని పక్కన పెడితే, ఆయన వ్యాపారం మాత్రం మహిళల మీద ఆధారపడినదే.

ఆయన న్యూయార్క్‌లో ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకుని, కుట్టు మిషన్ల గురించి వివరించేందుకు యువతులను నియమించుకున్నారు. వారు ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించేవారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సింగర్ తయారు చేసిన కుట్టు యంత్రాన్ని వాడుతున్న మహిళ (1907లో)

'మహిళలు మంచి నిర్ణయాలు తీసుకోగలరు' అన్నట్లుగా సింగర్ ప్రకటనలు వేయించారు. "కుటుంబంలోని మహిళకే నేరుగా కుట్టు మెసీన్లు అమ్ముతాం. బాగా పనిచేస్తే ఒక్కో మహిళ ఈ యంత్రంతో ఏడాదికి 1000 డాలర్లు సంపాదించవచ్చు" అంటూ ప్రకటనలు ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలన్న భావన ఆ ప్రకటనల్లో కనిపించింది.

"కుట్టు మెషీన్లు మన తల్లులకు, బిడ్డలకు ఎంతో ఉపశమనం కలిగించాయి. మహిళా దర్జీలు తక్కువ శ్రమతో మెరుగైన ప్రతిఫలం పొందేందుకు అవి ఎంతో దోహదపడ్డాయి" అంటూ 1860 జనవరి 7న న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనం ప్రచురించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

దిల్లీ హింస: కాంగ్రెస్ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిసిన సోనియా గాంధీ

దిల్లీ హింస: జస్టిస్ మురళీధర్ బదిలీపై ఎవరు ఏమంటున్నారు?

దిల్లీ హింసను 2002 నాటి గుజరాత్ అల్లర్లతో ఎందుకు పోలుస్తున్నారంటే...

దిల్లీలో హింస: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్లకు మించి ఏమైనా చేయగలరా?

కరోనావైరస్: ఇటలీలో 400కు పెరిగిన కేసులు

అభినందన్ క్రాష్ ల్యాండింగ్ ఎలా జరిగింది? అప్పుడు అక్కడ ఉన్నవాళ్లు ఏమన్నారు...

దిల్లీ హింస: ఆర్ఎస్ఎస్, అమిత్ షాల పేర్లు చెప్పవద్దన్న అజిత్ డోభాల్

ముకేశ్ అంబానీ సంపాదన గంటకు ఏడు కోట్లు : ప్రెస్ రివ్యూ

కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?