చైనా కరెన్సీ నోట్లపై చిరస్థాయిగా నిలిచిపోయిన 'ట్రాక్టర్ హీరోయిన్' ఇక లేరు

  • 15 జనవరి 2020
ట్రాక్టర్ హీరోయిన్

చైనా మొట్టమొదటి మహిళా ట్రాక్టర్ డ్రైవర్ లియాంగ్ జున్ (90) చనిపోయారు.

దేశంలోని మహిళలకు స్ఫూర్తినిచ్చేందుకు చైనా ఆమె చిత్రాన్ని 1962లో కరెన్సీ నోట్లపై ముద్రించడం మొదలుపెట్టింది. లియాంగ్ ట్రాక్టర్ నడుపుతున్న చిత్రాన్ని 1 యువాన్ నోట్లపై అచ్చు వేయించింది. దీంతో ఆమె నేషనల్ ఐకాన్‌గా మారారు.

''నా అంత బాగా ట్రాక్టర్ నడిపేవారు ఎవరూ లేరు. ఈ జీవితంలో నేను బాధపడే విషయాలేవీ లేవు'' అని ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో లియాంగ్ జున్ అన్నారు.

చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్సులో 1930లో ఓ పేద కుటుంబంలో లియాంగ్ జున్ పుట్టారు. వ్యవసాయ పనులు చేస్తూనే తమ గ్రామంలోని ఓ పాఠశాలలలో ఆమె చదువుకునేవారు.

1948లో స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ట్రాక్టర్ డ్రైవింగ్ శిక్షణ తరగతులు మొదలయ్యాయి. లియాంగ్ అందులో చేరారు.

మొత్తం 70 మంది ఆ తరగతుల్లో చేరగా, వారిలో లియాంగ్ మాత్రమే మహిళ అని చైనీస్ మీడియా తెలిపింది.

లియాంగ్ జున్ శిక్షణ పూర్తి చేసుకుని, చైనా తొలి మహిళా ట్రాక్టర్ డ్రైవర్‌గా మారారు.

ఆ మరుసటి ఏడాది కమ్యూనిస్ట్ నాయకుడు మావో జెడాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటును ప్రకటించారు.

లియాంగ్ జున్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)లో చేరారు. వ్యవసాయ యంత్రాల గురించి మరింత అవగాహన పెంచేకునేందుకు ఆమెను పార్టీ బీజింగ్‌లోని పాఠశాలకు పంపించింది.

ఆ తర్వాత లియాంగ్ జున్ హీలాంగ్‌జియాంగ్‌కు తిరిగి వచ్చి, పైచదువులు పూర్తి చేశారు. ఆ తర్వాత వ్యవసాయ యంత్రాల పరిశోధన కేంద్రంలో పనిచేశారు.

Image copyright WEIBO
చిత్రం శీర్షిక 18 ఏళ్ల వయసులో లియాంగ్ జున్ ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నారు

1962లో చైనా కరెన్సీ నోట్లపై లియాంగ్ ట్రాక్టర్ నడుపుతున్న చిత్రాన్ని ముద్రించడం ప్రారంభించింది.

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలను కార్మిక శక్తిలో భాగం చేయడాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ప్రాధాన్యతగా పెట్టుకుంది.

మహిళలను వివిధ వృత్తుల్లో చూపించడం మొదలుపెట్టింది. ఇందుకోసం 'మహిళా ట్రాక్టర్ డ్రైవర్‌' చిత్రం స్థాయిలో మరేదీ ఉపయోగపడలేదని 'ది ఆక్స్‌ఫర్డ్ హాండ్‌బుక్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ కమ్యూనిజం' పుస్తకం అభిప్రాయపడింది.

Image copyright EPA

లియాంగ్ జున్‌ కథను చైనా బాగా ప్రచారం చేసింది. పాఠ్యపుస్తకాల్లో ఆమె గురించి పాఠాలను చేర్చారు. ఆమె స్ఫూర్తితో చైనాలో పదుల సంఖ్యలో మహిళలు ట్రాక్టర్ డ్రైవర్లుగా మారారు.

దశాబ్దాల పాటు వ్యవసాయ యంత్రాల రంగంలో పనిచేసిన లియాంగ్ జున్.. 1990లో హార్బిన్ మున్సిపల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ మెషీన్స్ చీఫ్ ఇంజినీర్‌గా ఉండగా పదవీవిరమణ చేశారు.

కొన్నేళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఆమె తరచుగా స్పృహ కోల్పోతూ, తిరిగి కోలుకుంటూ.. చివరికి మంచానికే పరిమతమయ్యారని చైనీస్ మీడియా తెలిపింది.

సోమవారం ఆమె ప్రశాంతంగా కన్ను మూశారని లియాంగ్ జున్ కొడుకు వాంగ్ యాంబింగ్ చెప్పారు.

Image copyright WEIBO
చిత్రం శీర్షిక వృద్ధాప్యంలో ట్రాక్టర్‌పై లియాంగ్ జున్

''ఆమె గట్టిగా పోరాడారు. చైనా తొలి మహిళా ట్రాక్టర్ డ్రైవర్ అని ఆమె గురించి జనాలు మాట్లాడుకున్నప్పుడల్లా సంతోషపడేవారు'' అని ఆయన చెప్పారు.

చైనా సోషల్ మీడియా వెబ్‌సైట్ వీబోలో లియాంగ్ జున్‌కు చాలా మంది నివాళులు అర్పిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ఆమె మరణించిన వార్త ట్రెండింగ్ అంశాల్లో అగ్ర స్థానంలో నిలిచింది.

మగవాళ్లు చేసే ఏ పనైనా, ఆడవాళ్లూ చేయగలరని ఆమె నిరూపించారని ఓ వ్యక్తి వ్యాఖ్యానిస్తే, 'ఆకాశంలో సగం ఆక్రమించిన మహిళకు వీడ్కోలు' అంటూ మావో జెడాంగ్ సూక్తిని మరొకరు గుర్తుచేశారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

CAA-NRC: జనన ధ్రువీకరణ పత్రాల కోసం మాలెగావ్‌లో 4 నెలల్లో 50వేల దరఖాస్తులు

కరోనా వైరస్: వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా ఆరు రోజుల్లోనే ఎలా నిర్మిస్తోంది

టర్కీలో భూకంపం.. కూలిన భవనాలు, 20 మంది మృతి.. వందలాది మందికి గాయాలు

వీడియో: షాహీన్‌బాగ్‌ నిరసనల్లో పాల్గొంటున్న మూడు తరాల ముస్లిం మహిళలు

కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'

ప్రతి శుక్రవారం ఏదో ఒక కారణం చెబుతారేం.. ఈసారి రాకపోతే చర్యలు తప్పవు - సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం

కరోనా వైరస్: చేపల మార్కెట్లో మొదలైంది.. చైనా మొత్తం పాకింది

అంగోలాను ఆఫ్రికా అత్యంత సంపన్న మహిళ ఇజాబెల్ ఎలా ‘దోచేశారు’

డిస్కో రాజా సినిమా రివ్యూ : రవితేజ సైన్స్ ఫిక్షన్ ప్రయోగం ఫలించిందా..