ఆస్ట్రేలియా: అడవులను బూడిద చేస్తున్న అగ్నిజ్వాలలతో ఈ దేశం ఎలా పోరాడుతోందంటే...

  • 16 జనవరి 2020
ఆస్ట్రేలియా కార్చిచ్చులు Image copyright Getty Images

ఆస్ట్రేలియా మీద గత కొన్ని దశాబ్దాల్లోనే ఎప్పుడు లేనంతగా కార్చిచ్చులు విరుచుకుపడ్డాయి. పెద్ద పెద్ద మంటలు గడ్డి మైదానాలను, వనాలను, నేషనల్ పార్క్‌లను దహించివేస్తున్నాయి.

అత్యధిక ఉష్ణోగ్రతలు, నెలలపాటు కరవు పరిస్థితులు కొనసాగడం కార్చిచ్చులు భారీగా వ్యాపించడానికి తోడ్పడింది. జులై 1 తర్వాత కోటి హెక్టార్ల ( లక్ష చదరపు కి.మీ.ల) మేర ప్రాంతం దహనమైనట్లు అంచనా వేస్తున్నారు.

మరి, వీటిని అదుపు చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏం చేస్తోంది? ముందుగానే వాటిని నివారించే మార్గం ఉందా?

గత వారాంతం కార్చిచ్చులు కొంత శాంతించాయి. అగ్నిమాపక సిబ్బందికి తాత్కాలిక ఉపశమనం దొరికింది. అయితే, వర్షాలు గణనీయంగా పడే వరకూ పెద్ద కార్చిచ్చులు కొనసాగుతాయని అధికారులు అంటున్నారు. వచ్చే వారం ఉష్ణోగ్రతలు మరింత పెరగొచ్చని, కార్చిచ్చుల ముప్పు ఇంకా ఎక్కువవుతుందని చెబుతున్నారు.

ఇప్పటికీ వేల మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు పోరాడుతూనే ఉన్నారు.

కొన్ని పట్టణాలకు పట్టణాలే మంటల్లో చుట్టుకున్నాయి. చాలా మంది నిర్వాసితులయ్యారు. 28 మందికిపైగా ప్రాణాలు పోగోట్టుకున్నారు.

ఆస్ట్రేలియా రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ విభాగాలు కలిసి మంటల వ్యాప్తిని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నాయి. కొన్ని మంటలను రోజుల వ్యవధిలోనే అదుపు చేయగలినప్పటికీ, కొన్ని భారీ కార్చిచ్చులు మాత్రం నెలల తరబడి మండుతూనే ఉన్నాయి.

దేశవ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో మంటలు తీవ్రంగా ఉన్న సందర్భాల్లో కనీసం 3,700 మంది అగ్నిమాపక సిబ్బంది విధుల్లో ఉంటున్నారు. మంటలు ఎక్కువగా ఉన్న న్యూసౌత్ వేల్స్ (ఎన్ఎస్‌డబ్ల్యూ), విక్టోరియా రాష్ట్రాల్లో ఎక్కువ మంది సేవలందిస్తున్నారు. ఆ దేశ అగ్నిమాపక విభాగాలు ఈ విషయాన్ని తెలియజేశాయి.

మంటలు విజృంభించిన న్యూసౌత్‌వేల్స్‌లో 2,700 మంది అగ్నిమాపక సిబ్బంది పోరాడుతున్నారు.

తాను, తన సహచరులు కలిసి 42 లక్షల హెక్టార్ల ప్రాంతంలోని మంటలను అదుపు చేసేందుకు పోరాడామని.. సాధారణ పరిస్థితుల్లో తాము 3 లక్షల హెక్టార్లలో మంటలను నియంత్రించడమే ఎక్కువని న్యూసౌత్ వేల్స్ రూరల్ ఫైర్ సర్వీస్‌కు చెందిన బెన్ షెపర్డ్ చెప్పారు.

అగ్నిమాపక విభాగాలు మంటలను అదుపు చేసేందుకు విమానాలు, హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నాయి.

మంటలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు రోజూ న్యూసౌత్ వేల్స్‌లో 100, విక్టోరియాలో 60కిపైగా విమానాలు, హెలికాప్టర్లు వినియోగించినట్లు ఆయా రాష్ట్రాల అగ్నిమాపక విభాగాలు తెలిపాయి.

ఈ విమానాలు, హెలికాప్టర్లకు 'వాటర్ బాంబింగ్' సామర్థ్యం ఉంటుంది. నీటిని, అగ్నిమాపక పదార్థాలను మంటల మీద చల్లగలవు.

మొత్తంగా ఆస్ట్రేలియా వ్యాప్తంగా 500కుపైగా విమానాలు, హెలికాప్టర్లు అగ్నిమాపక చర్యల్లో పాలుపంచుకుంటున్నట్లు నేషనల్ ఏరియల్ ఫైర్‌ఫైటింగ్ సెంటర్ తెలిపింది.

విదేశాల నుంచి మరిన్నింటిని అద్దెకు తీసుకునేందుకు 14 మిలియన్ డాలర్లు(రూ.99 కోట్లు) చెల్లిస్తున్నామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు.

న్యూ సౌత్ వేల్స్‌లోని బెగా వ్యాలీ షైర్‌లో గురువారం ఓ హెలికాప్టర్ నీటిని నింపుకునేందుకు ప్రయత్నిస్తూ రిజర్వాయర్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలెట్ క్షేమంగా బయటపడ్డారు.

Image copyright Getty Images

క్షేత్ర స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది ట్రక్కులు, బుల్డోజర్లు, ప్రొక్లెయినర్ల వంటి భారీ వాహనాలను వినియోగిస్తున్నారు. మంటలు వ్యాప్తి చెందకుండా, చెట్ల మధ్య ఖాళీ స్థలాన్ని సృష్టిస్తున్నారు.

రోజూ 750 వాహనాలను తాము వినియోగిస్తున్నట్లు న్యూసౌత్ వేల్స్ రూరల్ ఫైర్ సర్వీస్ తెలిపింది.

వీటికి తోడు సైనిక విమానాలు, హెలికాప్టర్లు.. నావికాదళ ఓడలను కూడా మంటలను అదుపు చేసేందుకు వినియోగిస్తున్నారు.

Image copyright Getty Images

ప్రభుత్వంపై విమర్శలు

సంక్షోభాన్ని అంచనా వేయడంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ విఫలమయ్యారంటూ చాలా మంది విమర్శిస్తున్నారు.

ఆలస్యంగా స్పందించడం.. కార్చిచ్చులకు, వాతావరణ మార్పులకు మధ్య సంబంధం ఉందన్న విషయాన్ని అంగీకరించేందుకు నిరాకరించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.

స్కాట్ మోరిసన్ బొగ్గు పారిశ్రామిక రంగానికి మద్దతుదారుగా ఉన్నారు.

న్యూసౌత్ వేల్స్‌లో, విక్టోరియాలో కార్చిచ్చులు తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో మోరిసన్ కుటుంబంతో అమెరికాలోని హవాయికి కలిసి విహార యాత్రకు వెళ్లడంపైనా విమర్శలు వచ్చాయి. దీనికి ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

సంక్షోభం విషయంలో తాను వ్యవహరించిన తీరుపై మోరిసన్ కూడా పశ్చాతాపం వ్యక్తం చేశారు. ఈ విషయమై విచారణను కూడా ఎదుర్కొంటానని ఆయన చెప్పారు. ఈ విషాదం నుంచి దేశం కోలుకునేందుకు రూ.9,900 కోట్ల సాయం ప్రకటించారు.

దేశంలో సగటు ఉష్ణోగ్రతలు పెరిపోతుండటంతో వాతావరణ మార్పులపై, కార్బన్ ఉద్గారాలను తగ్గించే విషయమై ప్రధాని మరింత చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. గత వారం ఇవే డిమాండ్లతో జరిగిన ఓ నిరసన ప్రదర్శనలో వేల మంది పాల్గొన్నారు.

ఆస్ట్రేలియా వాతావరణ సంస్థ ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం 2019లోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత నమోదైంది.

హిందూ మహాసముద్రంలో డైపోల్ అనే పరిణామం కారణంగా ఒక్కసారిగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి, వాతావరణ మార్పులకు కారణమైందని ఆ సంస్థ తెలిపింది.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా కార్చిచ్చులు రేగే వాతావరణం, అవి రేగే కాలం కూడా పెరుగుతోందని ఆస్ట్రేలియా స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ నివేదిక పేర్కొంది.

ఆస్ట్రేలియా ఫెడరల్ సైన్స్ ఏజెన్సీ 2007లో వెల్లడించిన నివేదికలోనే 2020కల్లా తీవ్రమైన కార్చిచ్చులు ఏర్పడే అవకాశమున్నట్లు హెచ్చరించిందని న్యూజీలాండ్‌లోని లింకన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టిక్ కురాన్ అన్నారు.

ఆస్ట్రేలియాలో వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఒకేసారి ఈ పరిస్థితి రావడం.. భవిష్యతులో ఈ పరిస్థితి సర్వసాధారణమవ్వొచ్చని సంకేతాలు ఇస్తోందని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ప్రొఫెసర్ డేల్ డోమినీ-హోవ్స్ అన్నారు. ఇలాంటి విపత్తుల సమయంలో వ్యవహరించేందుకు కొత్త విధానాలను రూపొందించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పద్మ అవార్డ్స్ 2020 : జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు మరణానంతరం పద్మ విభూషణ్.. పీవీ సింధుకు పద్మభూషణ్

ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుంటే సీఏఏపై బీజేపీ రాజకీయం: కేసీఆర్

అమరావతిలో జర్నలిస్టులపై నిర్భయ కేసు: ఆ రోజు మందడం స్కూల్లో ఏం జరిగింది?

కరోనా వైరస్: వుహాన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు ఇప్పుడేం చేస్తున్నారు

CAA-NRC: జనన ధ్రువీకరణ పత్రాల కోసం మాలెగావ్‌లో 4 నెలల్లో 50వేల దరఖాస్తులు

కరోనా వైరస్: వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా ఆరు రోజుల్లోనే ఎలా నిర్మిస్తోంది

టర్కీలో భూకంపం.. కూలిన భవనాలు, 20 మంది మృతి.. వందలాది మందికి గాయాలు

వీడియో: షాహీన్‌బాగ్‌ నిరసనల్లో పాల్గొంటున్న మూడు తరాల ముస్లిం మహిళలు

కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'