పుతిన్ భవిష్యత్ ప్రణాళికల ప్రకారమే రష్యా ప్రభుత్వం రాజీనామా

  • 16 జనవరి 2020
పుతిన్ Image copyright Reuters

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాను సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగేందుకు వీలుగా రాజ్యాంగంలో సమూల మార్పులను ప్రతిపాదించిన కొద్దిసేపట్లోనే ఆ దేశప్రభుత్వం రాజీనామా చేసింది.

ప్రజల ఆమోదం లభిస్తే ఈ ప్రతిపాదనల ద్వారా అధికారం అధ్యక్ష పదవి నుంచి పార్లమెంటుకు సంక్రమిస్తుంది.

ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న పుతిన్ పదవీకాలం 2024 వరకు ఉంది. అయితే, ఆయన కొత్త పదవి కోరుకోవడం కానీ లేదంటే తెర వెనుక రాజకీయ శక్తిగా శాసిస్తారని అంచనాలు వినిపిస్తున్నాయి.

చట్టసభల సభ్యులనుద్దేశించి చేసిన వార్షిక ప్రసంగంలో పుతిన్ తన ఆలోచనలు బయటపెట్టారు. ఆ తరువాత అనూహ్యంగా ప్రధాని ద్విమిత్రి మెద్వదేవ్ తన ప్రభుత్వమంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త మార్పులకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.

అయితే, ప్రధాని ఈ ప్రకటన చేసేటప్పటికి మంత్రులకు కూడా రాజీనామా విషయం తెలియదని రష్యా ప్రభుత్వ వర్గాల నుంచి బీబీసీకి సమాచారం అందింది. 'ఇది ఆశ్చర్యంగా అనిపించింది' అని ఆ వర్గాలు తెలిపాయి.

Image copyright EPA
చిత్రం శీర్షిక పుతిన్, మెద్వదేవ్

పుతిన్ ప్రతిపాదనలు ఏమిటి?

పార్లమెంటునుద్దేశించి పుతిన్ చేసిన ప్రసంగంలో కొన్ని ప్రతిపాదనలు చేస్తూ దానిపై దేశవ్యాప్త ఓటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.

పుతిన్ ప్రతిపాదించిన రాజ్యాంగ సంస్కరణల్లో భాగంగా దిగువ సభ 'స్టేట్ డ్యూమా'కు ప్రధాని, మంత్రివర్గ నియామకానికి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించే ప్రతిపాదన ఉంది.

ప్రస్తుత విధానంలో అధ్యక్షుడే ప్రధానిని నియమిస్తారు. ఆ నిర్ణయాన్ని డ్యూమా ఆమోదిస్తుంది.

పుతిన్ తన తాజా ప్రతిపాదనల్లో సలహా మండలిగా వ్యవహరించే స్టేట్ కౌన్సిల్ పాత్ర పరిధి పెంచాలని సూచించారు.

ప్రస్తుతం ఈ కౌన్సిల్‌కు అధ్యక్షుడు పుతిన్ సారథ్యం వహిస్తున్నారు.

వీటితో పాటు అంతర్జాతీయ చట్టాల ఆధిపత్యాన్ని తగ్గించాలన్నదీ పుతిన్ చేసిన ప్రతిపాదనలలో ఒకటి. అధ్యక్ష పదవిలో రెండుసార్లకు మించి ఉండరాదన్న నిబంధనను సవరించాలని.. విదేశీ పౌరసత్వం ఉన్న, విదేశాల్లో నివాస అనుమతులున్నవారు అధ్యక్ష అభ్యర్థులు కాకుండా నివారించే చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని పుతిన్ ప్రతిపాదించారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక మెద్వదేవ్, పుతిన్

పుతిన్ ప్రతిపాదనలకు స్పందన ఎలా ఉంది?

ప్రధాని మెద్వదేవ్ తన ప్రభుత్వ రాజీనామా ప్రకటన చేసినప్పుడు ఆయన పక్కనే పుతిన్ కూర్చున్నారు.

''ఈ ప్రతిపాదనలను మార్పులను స్వీకరించినప్పుడు కేవలం రాజ్యాంగంలోని అధికరణల్లోనే కాదు అధికార సమతూకంలోను.. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల అధికారంలోనూ గణనీయమైన మార్పులను తీసుకొస్తుంది'' అని మెద్వదేవ్ చెప్పారు.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుత విధానంలో కొనసాగుతున్న ప్రభుత్వ రాజీనామా చేసిందని ఆయన చెప్పారు.

మెద్వదేవ్ సేవలకు పుతిన్ ధన్యవాదాలు చెబుతూనే చేయాల్సింది ఇంకెంతో ఉందన్నారు. తన నేతృత్వంలోని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డిప్యూటీ హెడ్‌గా ఉండాలంటూ పుతిన్ ఆయన్ను కోరారు.

మెద్వదేవ్ చాలాకాలంగా ప్రధాని పదవిలో ఉన్నారు. ఆయన 2008 నుంచి 2012 మధ్య అధ్యక్షుడిగానూ పనిచేశారు. పుతిన్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు.

మెద్వదేవ్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ప్రధానిగా ఉన్న పుతిన్ తెర వెనుక శక్తిగా ఉండేవారు.

రష్యాలో విపక్ష నేత అలెక్సీ నావల్నీ మాట్లాడుతూ.. రాజ్యాంగ మార్పులపై చేపట్టే ఎలాంటి రిఫరెండమ్ అయినా మోసపూరితంగా సాగుతుందని.. జీవితాంతం రష్యాలో ఏకఛత్రాధిపత్యం సాగించడమే పుతిన్ లక్ష్యమని విమర్శించారు.

బోరిస్ ఎల్సిన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1993లో చిట్టచివరి సారి రష్యాలో రిఫరెండమ్ నిర్వహించారు.

1999లో ఎల్సిన్ రాజీనామా తరువాత పుతిన్ తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత ఏడాది పూర్తిస్థాయి అధ్యక్షుడైన ఆయన అప్పటి నుంచి మార్చిమార్చి అధ్యక్ష, ప్రధాని పదవుల్లో కొనసాగుతున్నారు.

పుతిన్ ఇంకేం చెప్పారు?

పార్లమెంటును ఉద్దేశించి పుతిన్ చేసిన ప్రసంగంలో రష్యా జనాభా పెంచేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలను వివరించారు. తూర్పు ఐరోపాలోని పలు దేశాల మాదిరిగానే జననాల రేటు తగ్గుదల వల్ల రష్యా ఇబ్బంది పడుతోంది. గత ఏడాది పెద్ద కుటుంబాలకు పన్ను మినహాయింపులు ఇచ్చారు పుతిన్.

బుధవారం ఆయన ఇకపై పిల్లలను కనే మహిళలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రష్యాలో జననాల రేటు 1.5 కంటే తక్కువగా ఉండడంతో నాలుగేళ్లలో దాన్ని 1.7కి పెంచాలన్న లక్ష్యంతో పుతిన్ ఈ నిర్ణయం ప్రకటించారు.

అల్పాదాయ కుటుంబాల్లోని 3 నుంచి ఏడేళ్లలోపు చిన్నారులకు కూడా పలు ఆర్థిక ప్రయోజనాలు అందించడంతోపాటు స్కూలులో తొలి నాలుగేళ్లు విద్యార్థులకు ఉచిత భోజన వసతీ కల్పిస్తామని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఎయిర్ ఇండియా ఫర్ సేల్: రూ. 22,863 కోట్ల రుణభారం సహా సంపూర్ణ విక్రయానికి ప్రభుత్వ నిర్ణయం

ఏపీ శాసన మండలి రద్దుకు 133-0 ఓట్లతో అసెంబ్లీ తీర్మానం... అనుకూలంగా ఓటేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

కేకు తినే పోటీలో ప్రాణం కోల్పోయిన మహిళ

కోబ్ బ్రయాంట్: బాస్కెట్ బాల్ సూపర్ స్టార్, ఆయన 13 ఏళ్ళ కుమార్తె హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం

ఆశిమా ఛిబ్బర్ :మగాడి తోడు లేకుండానే తల్లి అయిన మహిళ కథ

అఫ్గానిస్తాన్‌లో కూలిన విమానం.. అంతుబట్టని వివరాలు.. రంగంలోకి దిగిన అమెరికా

కరోనావైరస్: చైనాలో 80 మంది మృతి... విదేశాలకు విస్తరిస్తున్న భయం

గీతా చౌహాన్: ‘పడితే లేపడానికి ఎవరూ రారు... మనకు మనమే లేవాలి’