వాతావరణ మార్పు: అంతరించిపోతున్న కీటకాలు.. అవి మాయమైపోతే మనుషులకేంటి నష్టం?

తేనెటీగ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తేనెటీగ

కీటకాలు 'జుయ్.. జుయ్' అంటూ చుట్టూ గోల పెడుతూ తిరుగుతుంటే మీకు చిరాకు అనిపించొచ్చు. కానీ, వాటిని నలిపేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా కీటకాల జనాభా వేగంగా తగ్గిపోతోంది.

ఆహారోత్పత్తిలో, మన ప్రపంచ సమతుల్యతను కాపాడటంలో కీటకాలది చాలా ముఖ్యమైన పాత్ర.

ప్రపంచంలో ఉన్న కీటకాలన్నీ మాయమైపోతే, మనుషులందరూ చనిపోతారని అంటున్నారు లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం సీనియర్ క్యురేటర్ ఎరికా మెక్ ఆలిస్టర్.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పేడ పురుగు

‘మనుషులూ పోతారు’

జీవ అవశేషాలను విచ్ఛిన్నం చేయడంలో కీటకాలది ముఖ్యపాత్ర. అంటే ఏదైనా త్వరగా కుళ్లిపోయి, తిరిగి మట్టిలో కలిసేందుకు అవి ఉపయోగపడతాయి.

‘‘మలాన్ని మట్టిలో కలిపే పేడ పరుగులు లేకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. మనమంతా చట్టూ మలంతో, కళేబరాల మధ్య బతకాలి’’ అని మెక్ ఆలిస్టర్ బీబీసీతో చెప్పారు.

పక్షులకు, చిన్న జంతువులకు.. కీటకాలు ఆహారం కూడా అవుతాయి.

‘‘సకశేరుక జీవాల్లో 60 శాతం కీటకాల మీదే ఆధారపడి జీవిస్తాయి. కీటకాలతో పాటు చాలా పక్షులు, గబ్బిలాలు, కప్పలు, మంచి నీటి చేపల జాతులు కూడా మాయమైపోతున్నాయి. పోషకాల పునర్వినియోగం.. నేల లోపల, జలాశయాల్లో ఉండే లక్షల కీటకాల చర్యలపైనే ఆధారపడి ఉంటుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన డాక్టర్ ఫ్రాన్సిస్కో సాంచెజ్-బేయో బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

‘మోనార్క్’ సీతాకోక చిలుక

ఉచిత సేవ

పర్యావరణ వ్యవస్థలో పునర్వినియోగం కోసం పనిచేయడం, కొన్ని జీవ జాతులకు ఆహారంగా ఉండటంతోపాటు కీటకాలు చేసే మరో కీలకమైన పని ఉంది. అదే పరాగ సంపర్కం. ఆహారోత్పత్తిలో ఇది చాలా ముఖ్యం.

కీటకాల ఉచిత సేవల వల్ల మనుషులకు ఏటా రూ.24 లక్షల కోట్ల విలువైన ప్రయోజనం కలుగుతుందని ఓ అధ్యయనం అంచనా వేసింది.

‘‘పూలు పూచే చాలా రకాల మొక్కలకు పరాగసంపర్కం కోసం కీటకాలు అవసరం. పంట మొక్కల్లో ఇలాంటివి 75 శాతం ఉన్నాయి’’ అని సాంచేజ్-బేయో అన్నారు.

అయినా, ఈ కీటకాలు చేస్తున్న మేలును మనం విస్మరిస్తుంటాం.

‘‘చాకోలెట్లను తయారుచేసేందుకు ఉపయోగపడే కోకో చెట్లలో పరాగ సంపర్కం కోసం 17 వరకూ కీటకాలు ఉపయోగపడతాయి. వాటిలో 15 రకాల కీటకాలు కుట్టేవి. అవంటే మనకు ఇష్టం ఉండదు. ఇంకొకటి చాలా చిన్నగా ఉండే చీమ. మరొకటి చిమ్మట పురుగు. వాటి గురించి మనకు ఎక్కువగా తెలియదు’’ అని మెక్ ఆలిస్టర్ చెప్పారు.

చాలా దేశాల్లో పరాగసంపర్కానికి ఉపయోగపడే కందిరీగల్లాంటి కీటక జాతులు అంతరించిపోతున్నాయి. మోనార్క్ లాంటి సీతాకోక చిలుకల జాతులు కూడా మాయమైపోతున్నాయి.

చుట్టూ కీటకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆలస్యమయ్యేదాకా మనం సమస్యను గుర్తించడం లేదా?

ఫొటో సోర్స్, Getty Images

కీటకాల ప్రపంచం చాలా పెద్దది. మనలో చాలా మంది దాన్ని అర్థం చేసుకోలేం.

ప్రపంచంలో ఉన్న కీటకాలన్నింటి బరువు కలిపితే, మొత్తం మనుషుల బరువుకు 17 రెట్లు ఉండొచ్చని అమెరికాలోని స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ అంచనా వేసింది.

భూమి మీద ఎప్పుడైనా 10 క్వింటిలియన్ కీటకాలు ఉంటున్నాయని లెక్కగట్టింది. అంటే, 10,000,000,000,000,000,000 కీటకాలు.

కీటకాల జాతులు 20 లక్షల నుంచి 3 కోట్ల వరకూ ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జంతువులకు సంబంధించిన పరిశోధనల్లా.. కీటకాలపై లోతైన అధ్యయనాలు జరగలేదు.

మనకు ఇప్పటివరకూ 9 లక్షల కీటక జాతులే తెలుసని స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ చెబుతోంది.

భారీ జనాభా, గొప్ప జీవ వైవిధ్యం ఉన్నా కీటకాలు అంతరించిపోవడం ఆగట్లేదు.

చాలా కీటక జాతులు శాస్త్రవేత్తలు ఇంకా గుర్తించకముందే అంతరించిపోతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

భయపెడుతున్న అంచనాలు

జర్మనీ, బ్రిటన్, ప్యూర్టో రికో దేశాల్లో కీటకాల నుంచి వచ్చే బయోమాస్ ఏటా 2.5 శాతం చొప్పున తగ్గుతోందని బయోలాజికల్ కన్సర్వేషన్ అనే జర్నల్ గత ఏడాది ఓ నివేదిక ఇచ్చింది.

‘‘మనం గుర్తించిన 41 శాతం కీటక జాతుల్లో జనాభా తగ్గిపోతోంది. చాలా కొద్ది సంఖ్యలో కొన్ని కీటక జాతుల్లో మాత్రం కీటకాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మిగతా కీటకాలు అంతరిస్తుండటం వల్ల ఏర్పడుతున్న ఖాళీని అవి భర్తీ చేస్తున్నాయి’’ అని సాంచెజ్-బేయో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

జర్మనీలోని 60 రక్షిత ప్రాంతాల్లో గత 30 ఏళ్లలో ఎగిరే కీటకాల సంఖ్య 75 శాతం తగ్గిందని ఓ నివేదికలో వెల్లడైంది.

ప్యూర్టో రికోలో నాలుగు దశాబ్దాల్లో కీటకాల సంఖ్య 98 శాతం పడిపోయిందని ఓ అమెరికన్ పరిశోధకుడు లెక్కగట్టారు.

ఇదే పరిస్థితి కొనసాగితే చాలా కీటక జాతులు తుడిచిపెట్టుకుపోతాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఇవే చంపుతున్నాయి

వ్యవసాయం బాగా పెరగడం వల్ల కీటకాలకు ఆవాసాలు లేకుండా పోతున్నాయి.

‘‘కీటకాలు పెరిగేందుకు చెట్లు కావాలి. కుళ్లిపోతున్న ఆకులపై వాటి లార్వా బతుకుతుంది. ఒకే పంట వేస్తే వాటికి కావాల్సిన చెట్లు లేకుండా పోతాయి. లార్వాకు ఆవాసాలు ఉండవు’’ అని మెక్ ఆలిస్టర్ అన్నారు.

పురుగుమందుల వినియోగం పెరగడం, కలుపు జాతులు, గ్లోబల్ వార్మింగ్ కూడా కీటకాలపై ప్రభావం చూపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

బొద్దింకలు

బొద్దింకలకు ఢోకా లేదు

ఈ పరిణామాన్ని బొద్దింకల్లాంటి చీడ పురుగులు మాత్రం తట్టుకోగలగడం మనకు దుర్వార్త. చాలా రకాల పురుగు మందులకు అవి నిరోధకత్వాన్ని పెంచుకున్నాయి.

‘‘ప్రత్యుత్పత్తి వేగంగా చేసుకునే చీడ పురుగులకు వేడి వాతావరణం మరింత కలిసివస్తుంది. ఎందుకంటే, ప్రత్యుత్పత్తి నెమ్మదిగా ఉండే వాటి సహజమైన శత్రువులు అంతరించిపోతాయి. కొన్ని రకాల చీడ పురుగులు విపరీతంగా పెరిగి, మనల్ని పీడించే అవకాశాలు లేకపోలేదు. తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకల్లాంటి గొప్ప కీటకాలను మాత్రం మనం కోల్పోతాం’’ అని ససెక్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవ్ గోల్సన్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఎలా కాపాడొచ్చు

పరిస్థితిని సరిదిద్దే అవకాశాలు ఇంకా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

‘‘మైదానాల చుట్టూ చెట్లను, తుప్పలను, పూల వనాలను పెంచాలి. ప్రమాదకర పురుగు మందుల వాడకాన్ని అరికట్టాలి. కార్బన్ ఉద్గారాలను తగ్గించే విధానాలను అమలు చేయాలి’’ అని సాంచెజ్-బేయో చెప్పారు.

పురుగు మందులు వాడకుండా పండించే (ఆర్గానిక్) ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలన్న నిర్ణయానికి రావడం ద్వారా ప్రజలు కూడా వ్యక్తిగత స్థాయిలో కీటకాలు అంతరించడాన్ని ఆపేందుకు కృషి చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ఆర్గానిక్ ఆహారం మాత్రమే కావాలంటే, రైతులు కూడా పురుగుమందుల వినియోగం ఆపేస్తారు. ఫలితంగా పర్యావరణంలో విషపదార్థాలు తగ్గుతాయి’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)