వినోదం కోసం ఇంట్లో చిరుతల్ని పెంచుకుంటున్నారు

  • 19 జనవరి 2020
చిరుతల్ని ఇలా ఇంట్లో పెంచుకోవడాన్ని వాళ్లు హోదాకు చిహ్నంగా భావిస్తున్నారు Image copyright Instagram/humaidalbuqaish
చిత్రం శీర్షిక చిరుతల్ని ఇలా ఇంట్లో పెంచుకోవడాన్ని వాళ్లు హోదాకు చిహ్నంగా భావిస్తున్నారు

సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ అరబ్ దేశాల్లో సంపన్నులు గడిపే విలాసవంతమైన జీవనశైలి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా అత్యాధునిక స్పోర్ట్స్ కార్లతో పాటు ఆ కార్లలో ముందు సీట్లలో దర్జాగా కూర్చొని ప్రయాణించే చిరుత పులులను కూడా చాలామంది చూసే ఉంటారు.

ఇళ్లలో కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకున్నట్లు చిరుత పులుల్ని పెంచుకోవడాన్ని అక్కడ సంపన్నులు తమ హోదాకు చిహ్నంగా భావిస్తారు.

అయితే వాళ్ల ఈ అలవాటు కారణంగా ఆఫ్రికా నుంచి చిరుతల్ని అక్రమంగా తరలించే ముఠాలు పెరిగిపోతున్నాయి. ప్రతి నెలా కనీసం నాలుగు చిరుతల్ని ఇలా ఆఫ్రికా నుంచి గల్ఫ్ దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఇథియోపియా వన్యప్రాణి విభాగ అధికారులు చెబుతున్నారు.

దాదాపు 8 లక్షల రూపాయలకు స్మగ్లర్లు ఈ చిరుత పులుల్ని సంపన్నులకు అమ్ముతున్నారు.

అధికారిక గణాంకాల ప్రకారం అడవుల్లో ఇప్పటికి 7,100 చిరుతలు మాత్రమే మిగిలున్నాయి. అందులో 90శాతం ఆఫ్రికాలోనే ఉన్నాయి.

Image copyright AFP

అంతరించిపోతున్న జీవుల జాబితాలో చిరుతలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికా నుంచి, ముఖ్యంగా ఇథియోపియా నుంచి ఇలా చిరుతుల్ని తరలించడం ఆందోళన కలిగిస్తోంది.

అక్కడి ప్రజల పేదరికాన్ని ఆసరాగా తీసుకొని, వారికి డబ్బు ఎరవేసి అక్రమంగా చిరుత కూనల్ని పట్టి బంధించేలా స్మగ్లర్లు ప్రోత్సహిస్తున్నారు. తరువాత ఈ కూనల్ని గల్ఫ్ దేశాలకు తరలిస్తున్నారు.

ఒక్క పులి కూనను పట్టుకున్నందుకు అక్కడి వారికి స్మగ్లర్లు చెల్లించేది కేవలం రూ.22వేల నుంచి రూ.30 వేలు. వాటిని అక్కడి నుంచి స్వయం ప్రకటిత స్వతంత్ర సొమాలిలాండ్‌కు తరలిస్తారు. ఆపైన యెమెన్ మీదుగా వాటిని యూఏఈ, సౌదీ దేశాలకు పంపిస్తారు.

చిత్రం శీర్షిక ఇథియోపియా, సొమాలియా నుంచి యెమెన్ మీదుగా చిరుతలను గల్ఫ్ దేశాలకు తరలిస్తున్నారు

బ్లాక్ మార్కెట్‌లో వాటిని సగటున రూ.8 లక్షల రూపాయలకు సంపన్నులకు అమ్మేస్తారని, అక్కడివారు చిరుతలను స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారని ఇథియోపియా వన్యప్రాణుల విభాగ అధికారి పావ్లోస్ తెలిపారు.

ఇలా అక్రమంగా చిరుతల్ని తరలిస్తున్న కొందర్ని రెండ్రోజుల క్రితం ఇథియోపియా పోలీసులు అరెస్టు చేశారు. కొందరు వ్యక్తులు భుజాల మీద వేసుకున్న బ్యాగుల్లో కదలికలు కనిపించాయని, అనుమానం వచ్చి వాటిని తెరిచి చూస్తే అందులో పులి కూనలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న కొన్ని పులులను కింది వీడియోలో చూడొచ్చు. అల్ మదీనా న్యూస్ ఈ వీడియోను అప్‌లోడ్ చేసింది.

ఇలా అక్రమంగా గల్ఫ్ దేశాలకు తరలించే క్రమంలో మార్గమధ్యలోనే చాలా చిరుత కూనలు చచ్చిపోతాయని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఈ అక్రమ వ్యాపారం కారణంగా సొమాలియా, ఇథియోపియా లాంటి దేశాల్లో పులుల జనాభా భారీగా తగ్గిపోతోందని వారు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు