'ఏ ఉపయోగం' లేనంత వృద్ధాప్యంలోకి వెళ్లాక ఏమవుతుంది? ఆచీ తెగలో వృద్ధ మహిళలను ఎందుకు నరికి చంపేస్తారు?

  • 24 జనవరి 2020
వృద్ధాప్యం దశలు Image copyright Getty Images

"వృద్ధ మహిళలను ఒక నది దగ్గరికి తీసుకెళ్లి చాలా సులువుగా చంపేశాను. అందరూ చనిపోయారు. ఊపిరి పూర్తిగా ఆగిపోకముందే ఖననం చేసేశాను. అందుకే మహిళలు నన్ను చూస్తే భయపడతారు.''

అంత దారుణం చేస్తారా? అని చాలామందికి అనిపించవచ్చు. కానీ, ఇది నిజం. తూర్పు పరాగ్వేలోని మూలవాసులైన ఆచీ తెగకు చెందిన ఒక వ్యక్తి మానవ పరిణామ శాస్త్రవేత్తలు కిమ్ హిల్, మగ్డలేనా హర్టాడోలకు చెప్పిన విషయాలివి.

"నానమ్మలు, అమ్మమ్మలు కొంత వయసు వచ్చేదాకా ఇంటిపనులు చేస్తూ, పిల్లలను ఆడిస్తూ సాయపడతారు. కానీ, వారితో ఏ ఉపయోగం లేనప్పుడు వారిపట్ల ఎలాంటి కరుణ చూపించాల్సిన అవసరం లేదు" అని ఆయన చెప్పుకొచ్చారు.

వారిని అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపేస్తారు. ఆచీ తెగ ఆచారాల ప్రకారం, వృద్ధ పురుషులకు భిన్నమైన 'శిక్ష' ఉంటుంది. ఇక ఏ పని చేయలేరన్న స్థితికి వచ్చిన వారు తమంతట తామే కనిపించకుండా వెళ్లిపోవాలి, ఇంకెప్పుడూ తిరిగి రాకూడదు.

ఈ ఆచారాలను చూస్తుంటే మనల్ని పెంచి పోషించిన పెద్దలకు మనం ఇస్తున్నది ఏంటి? అన్న ప్రశ్న ఒక మనిషిగా చాలామందికి వస్తుంది. అందుకు భిన్నమైన సమాధానాలు ఉన్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆచీ తెగ ప్రజలకు స్థిర నివాసం ఉండదు. ఆహారం కోసం నిత్యం అడవుల్లో సంచరిస్తూ ఉంటారు

పపువా న్యూ గినీలో

ఆచీ తెగలోనే కాదు, పపువా న్యూ గినీలోని క్వలాంగ్ తెగలోనూ అలాంటి ఆచారాలు ఉన్నాయని మరో మానవ శాస్త్రవేత్త జారెడ్ డైమండ్ చెప్పారు.

క్వలాంగ్ తెగలో ఒక మహిళ భర్త చనిపోయినప్పుడు, ఆ మహిళ చనిపోవాల్సిందే. ఆమెను చంపాల్సిన బాధ్యత కూడా ఆమె కొడుకుదే. తండ్రి చనిపోగానే తల్లిని కొడుకులే గొంతు నులిమి చంపేస్తారు.

మరణానంతరం ప్రయోజనాల కోసం ప్రజలు తమను తామే చంపుకోవడాన్ని ఆర్కిటిక్‌లోని చుక్చి తెగ ఆచారం ప్రోత్సహిస్తుంది.

అయితే, చాలా తెగల్లో పూర్తి భిన్నమైన ఆచారాలు ఉన్నాయి. చాలా తెగల్లో పాలన వృద్ధుల చేతుల్లోనే ఉంటుంది. వృద్ధులు చెప్పినట్లు యువత నడుచుకుంటారు.

మరికొన్ని తెగల్లో అయితే వృద్ధులకు, దంతాలు లేని తల్లిదండ్రులకు వారి పిల్లలు ఆహారాన్ని నమిలి తినిపిస్తారు.

Image copyright Getty Images

మనలో చాలామంది ఒక వయసు వచ్చే దాకా చేతనైంత కాలం పనులు చేసుకుని బతుకుతాం. ఆ తర్వాత అంతకాలం మనం అందించిన సేవలకు ప్రతిఫలంగా ప్రభుత్వాల నుంచో, లేదా మనం పని చేసిన సంస్థ నుంచో పెన్షన్ వస్తుందని ఆశిస్తాం.

పెన్షన్ ఇవ్వడం అనే విధానం ఇప్పటిది కాదు. ప్రాచీన రోమన్ నాగరికత కాలంలోనూ 'పెన్షన్' విధానం అమలులో ఉండేది. అప్పట్లో సైనికులకు పెన్షన్ ఇచ్చేవారు. 'పేమెంట్' అనే లాటిన్ పదం నుంచి పెన్షన్ వచ్చింది.

సైనికేతరులకు పెన్షన్ ఇవ్వడం మాత్రం 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. జర్మనీ ఛాన్సలర్ ఒటో వాన్ బిస్మార్క్ కృషి ఫలితంగా తొలిసారిగా 1890లో జర్మనీలో యూనివర్సల్ స్టేట్ పెన్షన్ పథకం ప్రారంభమైంది.

వృద్ధాప్యం వల్లనో, అనారోగ్యం కారణంగానో పనిచేయలేని స్థితిలో ఉన్నవారికి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అలాంటి వారు ప్రభుత్వం నుంచి సంరక్షణను కోరవచ్చని 1881లో జర్మనీ పార్లమెంటులో బిస్మార్క్ చెప్పారు.

కానీ, ఇప్పటికీ ప్రపంచంలో అనేక మంది వృద్ధులకు సరైన ఆదరణ, ఆసరా లభించడంలేదు.

ప్రపంచంలోని వృద్ధుల్లో దాదాపు మూడో వంతు మందికి పెన్షన్ భరోసా లేదు. పెన్షన్ పొందుతున్న వారిలోనూ చాలామందికి ఆ డబ్బు తమ కనీస అవసరాలకు కూడా సరిపోవడంలేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బిస్మార్క్ విగ్రహం

చాలా దేశాల్లో తాము వృద్ధాప్యంలోకి వెళ్లేసరికి తమ పిల్లలు సంపాదిస్తూ తమను బాగా చూసుకుంటారని చాలామంది ఆశిస్తున్నారు. కానీ, ఆ ఆకాంక్షలను నెరవేర్చడం సవాలుగా మారుతోంది.

పెన్షన్ల విషయంలో మున్ముందు సవాళ్లు మరింత పెరుగుతాయని ఆర్థిక నిపుణులు చాలా ఏళ్లుగా చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో వస్తున్న మార్పుల వల్ల ఆయు: ప్రమాణం పెరుగుతోంది. సగటున 65 ఏళ్ల వయసున్న మహిళలు దాదాపు 15 ఏళ్లు ఎక్కువ కాలం జీవించగలరని ధనిక దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) దాదాపు 50 ఏళ్ల క్రితమే చెప్పింది. వైద్య సౌకర్యాలు మెరుగయ్యాయి కాబట్టి ప్రస్తుతం 20 ఏళ్లు ఎక్కువ కాలం జీవించవచ్చని ఆ సంస్థ అంటోంది.

ఇదే సమయంలో ఉమ్మడి కుటుంబాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. కుటుంబంలోని సభ్యుల సంఖ్య తగ్గుతోంది. ఒకప్పుడు కుటుంబంలో పిల్లల సంఖ్య సగటు 2.7గా ఉండేది, ఇప్పుడది 1.7కి తగ్గిపోయింది. కాబట్టి, భవిష్యత్తులో శ్రామిక శక్తి తగ్గిపోతుంది.

దీనివల్ల మంచి, చెడు రెండూ ఉన్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పెన్షన్లు ప్రస్తుత శ్రామికుల మీ ఆధారపడి ఉంటాయి

శ్రామిక శక్తి తగ్గిపోవడం వల్ల పెన్షన్ల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎలా అంటే, రిటైర్మెంట్ తీసుకుని పెన్షన్ తీసుకునే వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. పన్నులు చెల్లిస్తూ... వృద్ధులకు ఆసరా అందించే శ్రామికుల సంఖ్య తక్కువగా ఉంటుంది.

1960లలో సగటున ఒక వృద్ధ వ్యక్తికి 12 మంది శ్రామికులు ఉండేవారు. ప్రస్తుతం ఆ శ్రామికుల సంఖ్య ఎనిమిదిగా ఉంది. 2050 నాటికి ఆ సంఖ్య నాలుగుకు పడిపోతుందని అంచనా.

ప్రస్తుతం ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు పెన్షన్ వ్యవస్థను ఖరీదైన అంశంగా చూస్తున్నాయి. ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో అందాల్సిన ప్రయోజానాలను సంస్థలు తగ్గిస్తున్నాయి. 40 ఏళ్ల క్రితం, అమెరికాలోని అత్యధిక మంది ఉద్యోగులకు 'డిఫైన్డ్- బెనిఫిట్' పథకాలు వర్తిస్తుండేవి. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వారికి ఖచ్చితంగా కొన్ని ప్రయోజనాలు అందుతుండేవి. ఇప్పుడు పది మందిలో ఒకరికి మాత్రమే అలాంటి పథకాల ప్రయోజనాలు అందుతున్నాయి.

చిత్రం శీర్షిక సీపీఎస్ అమలుతో రిటైర్మెంట్ తర్వాత తమ పరిస్థితి ఇలా ఉంటుందంటూ 2018 ఏపీ ఉద్యోగులు నిరసన తెలిపారు.

భారత్‌లో సీపీఎస్

ప్రస్తుతం 'డిఫైన్డ్- కంట్రిబ్యూషన్' పథకాలను అమలు చేస్తున్నారు. ఇందులో సంస్థలు ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో కొంత మొత్తాన్ని తీసుకుని పెన్షన్ నిధిలో జమచేస్తాయి.

2003లో భారత ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం-సీపీఎస్‌ తీసుకొచ్చింది. దీన్నే నేషనల్ పెన్షన్ స్కీమ్-ఎన్‌పీఎస్‌ అని కూడా పిలుస్తారు.

త్రిపుర, పశ్చిమ బెంగాల్ మినహా ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు ఈ స్కీమ్‌లో చేరాయి.

కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకారం 2004, జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరే వారందరూ సీపీఎస్‌ కిందికి వస్తారు.

అప్పటి వరకు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వమే ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చేది.

కానీ, కొత్త స్కీమ్ ప్రకారం పెన్షన్ కోసం ప్రతీనెల ఉద్యోగి జీతం నుంచి 10శాతం కట్ చేస్తారు. ప్రభుత్వం మరో 10శాతం నిధులు ఇస్తుంది.

ఈ పెన్షన్‌ నిధిని నేషనల్‌ పెన్షన్‌ స్కీం-ఎన్‌పీఎస్‌ ట్రస్టు, నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌-ఎన్‌ఎస్‌డీఎల్‌ ద్వారా షేర్‌ మార్కెట్‌లో మదుపు చేస్తారు.

పదవీ విరమణ సమయంలో సర్వీసు మొత్తంలో ఉద్యోగి, ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణీత శాతంలో యాన్యుటీ ప్లాన్‌లలో ఉంచి నెలవారీ పెన్షన్ చెల్లిస్తారు.

దీర్ఘకాలం పాటు పెన్షన్లు ఇవ్వడాన్ని ఖరీదైన వ్యవహారంగా భావించడం వల్లే సంస్థలు పాత పెన్షన్ విధానాలను దూరంపెడుతున్నాయని అర్థం చేసుకోవచ్చు.

Image copyright Getty Images

అయితే, అమెరికాలో ఒక సైనికుడి కేసు... పెన్షన్‌ విధానంపై లోతుగా ఆలోచింపజేస్తుంది.

1861 నుంచి 1865 మధ్యలో అమెరికాలో అంతర్యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పోరాడిన సైనికుల్లో జాన్ జానెవే ఒకరు. అప్పటి అమెరికా పెన్షన్ విధానం ప్రకారం, ఆ సైనికుడు చనిపోయినప్పుడు ఆయన భార్య బతికి ఉంటే, ఆమెకు జీవిత కాలం వితంతు పెన్షన్ అందుతుంది. అయితే, 81 ఏళ్ల వయసులో జాన్ జానెవే చనిపోకముందు ఓ 18 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నారు. కాబట్టి, ఆమెకు జీవితాంతం అంటే 2003 వరకూ అమెరికా ప్రభుత్వం వితంతు పెన్షన్ ఇస్తూ వచ్చింది. అంటే, అంతర్యుద్ధం ముగిసిన తర్వాత దాదాపు 140 ఏళ్లపాటు ఆ సైనికుడి కుటుంబానికి పెన్షన్ అందింది.

ఎవరైనా వయసులో ఉన్నప్పుడు పొదుపు చేసుకోకపోతే వృద్ధాప్యంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ తర్వాత అందే పెన్షన్లు వారి అవసరాలకు ఏమాత్రం సరిపోవని అంటున్నారు. అందుకే, వృద్ధాప్యం కోసం ప్రతి వ్యక్తీ తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.

కానీ, ఇప్పుడిప్పుడే కెరీర్‌లో అడుగుపెట్టిన యువత కొన్ని దశాబ్దాల తర్వాత ఉండే అవసరాల మీద దృష్టిపెట్టడం అంత సులువు కాదు.

Image copyright Getty Images

50 ఏళ్లకు పైబడినవారితో పోల్చితే, 50 ఏళ్ల లోపు వారు సగం మంది కూడా వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యల గురించి ఆలోచించడంలేదని ఒక సర్వేలో వెల్లడైంది.

నిజమే... తమను తాము వృద్ధులుగా ఊహించుకోవడం చాలామందికి మనసొప్పదు. కానీ, మీరు సొంతింటి కల గురించి, పిల్లల పెంపకం గురించి ఆలోచిస్తున్నప్పుడు, మీ వృద్ధాప్యం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం తప్పకుండా ఉంది.

భవిష్యత్తు కోసం క్రమం తప్పకుండా సంపాదనలో కొంత మొత్తాన్ని పెన్షన్ నిధిలో జమచేసుకోవడంతో పాటు, జీతం పెరిగినప్పుడల్లా ఆ పొదుపును పెంచుకుంటూ పోతే బాగుంటుందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.

కొందరు మాత్రం రిటైర్మెంట్ అంటూ ఒక వయసును నిర్ధేశించుకోకుండా, మన పూర్వీకుల మాదిరిగా ఎవరి మీదా ఆధారపడకుండా చేతనైనంత కాలం పని చేయాలని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పెన్షన్ విధానంలో మార్పులను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు 2019 డిసెంబర్‌లో ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పారిస్ ఒపేరా డాన్సర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు

కొన్ని ఆదిమ తెగల్లో తమ బిడ్డలు ఆప్యాయంగా ఆహారం నమిలి పెట్టడాన్ని వృద్ధులు కోరుకోవచ్చు. లేదంటే వృద్ధుల పోషణను భారంగా భావించి వారిని చంపేస్తారేమోనని అనిపిస్తోంది. ముఖ్యంగా ఆచీ తెగ విషయానికి వస్తే, అది సంచార తెగ. వారికి ఒక్క చోట స్థిర నివాసం ఉండదు. ఆహారం కోసం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. కాబట్టి, వారికి వృద్ధుల సంరక్షణ చూడటం ఖరీదైన విషయం కావచ్చు.

కానీ, ప్రస్తుత ప్రపంచం చాలా మెరుగుపడింది. ఆహారం కోసం సంచరించాల్సిన అవసరాలు తగ్గిపోయాయి. కాస్త ముందుచూపుతో ఆలోచిస్తే పెరుగుతున్న పెన్షన్ల భారాన్ని భరించడం సాధ్యమే.

Image copyright Getty Images

అయితే, ఇక్కడ గమనించాల్సిన మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు పెద్దలు జ్ఞానాన్ని తమలో పదిలపరచుకుని, దానిని తమ తర్వాతి తరాలకు బదిలీ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. జ్ఞానం అనేది అత్యంత వేగంగా మారుతోంది. మరి, స్కూళ్లు, వికీపీడియా ఉండగా బామ్మలు ఎవరికి కావాలి?

వృద్ధుల పట్ల గౌరవ స్థాయి తెలియకుండానే ఖర్చులు, ప్రయోజనాల మధ్య సమతుల్యతను పోల్చి చూసిన రోజులలో మనం చాలా కాలమే ప్రయాణించాం. ఇప్పటికైనా, గౌరవప్రదమైన వృద్ధాప్యం ఒక హక్కు అని మనం విశ్వసిస్తే, బహుశా మనం స్పష్టంగా... సాధ్యమైనంత తొందరగా చెప్పాల్సి ఉంటుంటేదేమో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచమంతటా కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు... సెన్సెక్స్ 1300 పాయింట్లు పతనం

కరోనావైరస్ వ్యాప్తిని ఉత్తర కొరియా సమర్థంగా ఎదుర్కోగలదా?

దిల్లీ హింస: 'ప్రేమికుల దినోత్సవం రోజు పెళ్ళి చేసుకున్నాడు... 11 రోజులకే అల్లర్లలో చనిపోయాడు"

ప్రెస్ రివ్యూ: స్టూడెంట్స్‌ లోన్‌ యాప్‌ల నయా దందా... గడువులోగా అప్పు తీర్చకుంటే బ్లాక్‌మెయిల్‌

CAA, దిల్లీ హింసలపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి

దిల్లీ హింస: తాహిర్ హుస్సేన్‌‌పై హత్యాయత్నం కేసు... పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆప్

యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్

దిల్లీ హింస ప్రభావం హైదరాబాద్‌పై ఎలా ఉంది

దిల్లీ హింస: జస్టిస్ మురళీధర్ ఎవరు.. ఆయన బదిలీపై చర్చ ఎందుకు