కరోనా వైరస్: వుహాన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు ఇప్పుడేం చేస్తున్నారు

  • 25 జనవరి 2020
ప్రతి ఒక్కరూ మాస్కలు ధరించాల్సిందే Image copyright Getty Images

వుహాన్ సహా, హుబే ప్రావిన్సులోని వివిధ ప్రాంతాల్లో వ్యాపించిన కరోనా వైరస్ వల్ల 40 మందికి పైగా మృతిచెందారని, మరో 1287 మందికి ఈ వైరస్ వ్యాపించిందని అధికారులు ధ్రువీకరించారు.

మరోవైపు, చైనాలో లూనార్ న్యూ ఇయర్ సంబరాలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ, ఈ వైరస్ వల్ల చాలా కార్యక్రమాలను రద్దు చేశారు. వైరస్ గుప్పిట్లో చిక్కుకున్న వుహాన్ నగరంలో ఒక కొత్త ఆస్పత్రి కూడా నిర్మిస్తున్నారు.

ఈ వైరస్ యూరప్ వరకూ వ్యాపించిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ ముగ్గురికి సోకిందని ధ్రువీకరించారు.

హుబే ప్రావిన్స్‌లో పర్యటించడాన్ని నిషేధించారు. దీంతో 10 నగరాల్లో దాదాపు 2 కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. భారత్‌లో ఇప్పటివరకూ ఇది వ్యాపించినట్లు ఎలాంటి వార్తలూ రాలేదు.

వుహాన్‌లో చాలా మంది భారతీయులు ఉంటున్నారు. అక్కడ నుంచి బయటికెళ్లడాన్ని నిషేధించడంతో వీరంతా ఇబ్బందులు పడుతున్నారు.

బీబీసీ ప్రతినిధి గగన్ సబర్వాల్ కొంతమంది భారత విద్యార్థులతో ఫోన్, వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. వారు నగరంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వుహాన్‌లో వైరస్ బాధితుల కోసం హుటాహుటిన ఓ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు

భయాందోళనల్లో భారత విద్యార్థులు

వుహాన్‌లో భయం భయంగా ఉన్న విద్యార్థుల్లో చాంగ్‌థామ్ పెపె బిఫోజీత్ ఒకరు. ఇతడు గత రెండేళ్లుగా ఇక్కడే చదువుకుంటున్నాడు. వుహాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో మేనేజ్‌మెంట్ మాస్టర్స్ చేస్తున్నాడు.

గత వారం రోజులుగా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, కానీ గత రెండు మూడు రోజుల నుంచి చాలా మార్పులు జరుగుతున్నాయని అతడు చెప్పాడు. తనకు ఆందోళనగా, భయంగా ఉందన్నాడు.

ఇప్పటివరకూ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని బిఫోజీత్ చెప్పాడు. తమ యూనివర్సిటీ, స్థానిక అధికారులు చాలా మంచివారని, ఆరోగ్యం, చికిత్స గురించి తమకు అన్నిరకాల సలహాలూ ఇస్తున్నారని తెలిపాడు.

బిఫోజీత్ చదివే విశ్వవిద్యాలయంలో ప్రతి రోజూ విద్యార్థులందరి శారీరక ఉష్ణోగ్రతలు చెక్ చేస్తున్నారు. ఉచిత మాస్కులు పంపిణీ చేస్తున్నారు. అవసరమైతే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు విశ్వవిద్యాలయానికి సొంత అంబులెన్స్ కూడా ఉంది.

Image copyright Getty Images

గంటగంటకూ చేతులు కడుగుతున్నారు

విద్యార్థులకు గంటగంటకూ తమ చేతులు కడుక్కోవాలని అధికారులు సూచించారు. బయటి ఆహార పదార్థాలు తినకుండా ఉండాలని, గది నుంచి బయటకు వెళ్లాలనుకుంటే మాస్క్ ధరించాలని చెప్పారు.

వుహాన్‌లో మార్కెట్లు, రోడ్లు బోసిపోయాయి. అది చైనా కొత్త సంవత్సరం వల్లా లేక వైరస్ వల్లా అనేది చాలామందికి అర్థం కావడం లేదు. నగరంలో సబ్ వే, మెట్రో సేవలు నిలిపివేశారు. రైళ్లు, విమానాలు కూడా రద్దు చేశారు.

విద్యార్థులు అందరూ తమ గదుల్లోనే ఉంటున్నారు. పక్కన స్నేహితుల గదుల వరకూ మాత్రమే వెళ్లగలుగుతున్నారు.

అంతా బాగానే ఉందని, కానీ, అందరూ కాస్త భయపడిపోయి ఉన్నారని విద్యార్థులు చెప్పారు. అధికారులు తమకు అవసరమైన అన్ని సౌకర్యాలూ అందిస్తున్నారని చెప్పారు.

చిత్రం శీర్షిక సౌరభ్ శర్మ

ఎక్కువ మెడికల్ విద్యార్థులే

అలాగే సౌరభ్ శర్మ అనే మరో విద్యార్థి జనవరి 17న భారత్ నుంచి వుహాన్ వచ్చాడు. వచ్చే ముందే అతడికి కరోనా వైరస్ గురించి తెలిసింది. కానీ, అప్పటికి ఆ వైరస్ వ్యాపించి కొన్ని రోజులే అయ్యింది.

సౌరభ్ వుహాన్‌లో మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు. అతడు చైనాలో రెండున్నరేళ్ల నుంచి ఉంటున్నాడు.

వుహాన్‌లో భారతీయులు చాలా మంది ఉన్నారని అతడు చెప్పాడు. తను వుహాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నానని అన్నాడు.

అందరూ మాస్కులు వేసుకుని తిరుగుతుండడం తాను చూశానని, తమ విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులను గది లోపలే ఉండాలని, వీలైతే మాస్కులు ధరించాలని చెప్పారని అతడు బీబీసీకి చెప్పాడు.

మొదట్లో జనం ఈ వైరస్‌కు పెద్దగా భయపడినట్లు తనకు అనిపించలేదని సౌరభ్ చెప్పాడు.

బయటకు వెళ్లేటపుడు, ఎక్కడకు వెళ్తున్నారో, ఎప్పుడు తిరిగి వస్తారో హాస్టల్ రిసెప్షన్‌లో చెప్పి వెళ్లాలని తమ విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రతి విద్యార్థికీ చెప్పారని అతడు తెలిపాడు.

వైరస్ గురించి తెలిసిన తర్వాత తమ విశ్వవిద్యాలయం క్యాంటీన్‌లో మాంసాహార పదార్థాలు నిలిపివేశారని చెప్పాడు.

వుహాన్‌లోని తన స్నేహితులను వారి గదుల్లోనే ఉండమన్నారని, తప్పనిసరి అయితే తప్ప హాస్టల్ లేదా డార్మిటరీ వదిలి వెళ్లద్దని వారికి చెప్పారని సౌరభ్ తెలిపాడు.

చైనాలో కొత్త ఏడాది ఉండడంతో, విద్యార్థులు అనుకోకుండా ప్రతి ఏడాదీ లాగే ఈసారి కూడా తమ గదుల్లో ఆహార పదార్థాలు నిల్వచేసుకున్నారు. ఎందుకంటే, ఆ రోజుల్లో ఆహారం దొరకడం కష్టమైపోతుంది. ఇప్పుడు అతడి స్నేహితులు వాటిపైనే ఆధారపడ్డారు.

చిత్రం శీర్షిక దేబేశ్ మిశ్రా

భారత ఏంబసీతో సంప్రదింపులు

దేబేష్ మిశ్రా గత నాలుగేళ్లుగా వుహాన్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. ప్రస్తుతం నగరం నిర్మానుష్యంగా ఉందని అతడు చెప్పాడు. గత రెండు మూడు రోజులుగా వర్షం కూడా పడుతోందని, అందరూ మాస్కులు, గ్లోవ్స్ వేసుకుని ఉన్నారని అంటున్నాడు.

అక్కడ కొన్ని షాపులే తెరిచి ఉన్నాయి. గత ఏడాదిలా ఇక్కడ చైనా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడం లేదు.

నగరం అంతటా విషాదం అలుముకుందని, చాలా మంది నగరం వదిలి బయటకు వెళ్లిపోయారని దేబేష్ చెప్పాడు.

తనలాగే, చాలామంది భారతీయులు భయపడిపోయి ఉన్నారని, బయటకు వెళ్లకుండా ఉన్నారని అతడు చెబుతున్నాడు. తను కూడా గంటగంటకూ చేతులు, ముఖం కడుక్కుంటున్నానని, శానిటైజర్స్ ఉపయోగిస్తున్నానని తెలిపాడు.

దేబేష్ విశ్వవిద్యాలయంలో ఉన్న వారికి కూడా బహిరంగ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని, మాస్క్ ధరించాలని చెప్పారు.

భారత్‌లోని తమ కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని, వుహాన్ వదిలి భారత్ వెళ్లడానికి తనకు ఎప్పుడు అనుమతి లభిస్తుందో తెలీదని దేబేష్ చెప్పాడు.

వుహాన్‌లోని భారత విద్యార్థులు ఎలా ఉన్నారు, వారిని ఎలా బయటకు తీసుకురావాలి అనేదానిపై భారత రాయబార కార్యాలయం అధికారులు చర్చలు జరుపుతున్నారు. నగరంలో ఎక్కువ ప్రాంతం లాక్‌డౌన్‌లో ఉంది.

గత మూడు రోజులుగా అందరూ గదుల లోపలే ఉంటున్నారు. వాట్సాప్, ఇతర ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా న్యూస్ తెలుసుకుంటున్నారు. బయట పరిస్థితి ఎలా ఉందో తెలియకపోవడంతో, వారు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నారు.

చిత్రం శీర్షిక దీదేశ్వర్

చైనా అధికారులకు ప్రశంసలు

చెన్నై నుంచి వచ్చిన మోనికా సేతురామన్ కూడా వుహాన్‌లో చదువుతున్నారు. ఆమె వుహాన్‌లో 500 మంది విద్యార్థుల ఇళ్లు ఉన్నాయని, ఇప్పుడు 173 మంది విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయి ఉన్నారని చెప్పారు. వారందరూ తమ గదుల్లో, డార్మిటరీల లోపలే ఉండిపోయారని చెప్పారు.

వైరస్ వల్ల నగరమంతా భయం ఆవరించిందని, చైనా కొత్త సంవత్సరం ప్రారంభ సమయంలో ఇలా జరగడం విషాదకరమని అన్నారు.

ప్రాణాంతక వైరస్‌ను అడ్డుకునేందుకు, ఇలా లాక్‌డౌన్ చేయడం మంచిదేనని ఆమె చెప్పారు. తమ విశ్వవిద్యాలయంలో చైనా అధికారులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను మెచ్చుకున్నారు. తనకు మాస్క్, గ్లోవ్స్, శానిటైజర్స్ ఇచ్చారని మోనికా చెప్పారు.

తన దగ్గర ప్రస్తుతం రెండు వారాలకు సరిపడా వంట సరుకులు ఉన్నాయని, పరిస్థితి త్వరలో మెరుగు పడుతుందని అనుకుంటున్నట్లు మోనికా చెప్పారు.

గదుల్లో ఉన్న 173 మంది విద్యార్థులు తమ కుటుంబాలతో, భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉన్నారని ఆమె చెప్పారు. ఇప్పటివరకూ తమకు ఎలాంటి సమస్యా లేదని, అందరూ వుహాన్, తమ క్షేమం కోసం ప్రార్థించాలని కోరారు.

వుహాన్‌లోనే ఉంటున్న దీదేశ్వర్ మాయూమ్ మణిపూర్ వాసి. అతడు కూడా వుహాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నాడు.

"కొత్త ఏడాదిలో పండగ వాతావరణంలో ఇలా జరగడం విషాదకరం. ఇలా ఎప్పటివరకూ ఉంటుందో తెలీడం లేదు. కానీ గదిలో, డార్మిటరీలో ఉండడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదనే అనుకుంటున్నా" అంటున్నాడు దీదేశ్వర్.

మరో పక్క చైనాలోనే ఉంటూ చదువుకుంటున్న కొందరు తెలుగు విద్యార్థులు కూడా బీబీసీతో మాట్లాడారు.

చిత్రం శీర్షిక భవనం దాక్షాయణి

''కరోనా వైరస్ గురించి మొదట తెలియగానే చాలా భయపడ్డాం. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం.. ఇప్పుడు ఈ వైరస్ ఏంటని అనుకున్నాం. కానీ, దీన్నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏం చేయాలి అని మా ప్రొఫెసర్లు చెప్పారు. వాటిని పాటిస్తూ జాగ్రత్తగా ఉంటున్నాం.'' అని చెప్పారు చైనాలో మెడిసిన్ చదువుతున్న భవనం దాక్షాయణి.

చిత్రం శీర్షిక లంకా తేజస్వి

‘‘మా ప్రొఫెసర్లు వైరస్ గురించి చాలా స్ట్రిక్ట్‌గా కొన్ని సూచనలు చేశారు. రద్దీ ప్రాంతాలకు వెళ్లకూడదని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించాలని సూచించారు’’ అన్నారు మరో వైద్య విద్యార్థి లంకా తేజస్వి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)