కరోనా వైరస్-వుహాన్ : ఒక నగరాన్ని మూసేయడం సాధ్యమా? చైనా చర్యతో వైరస్ వ్యాప్తి ఆగిపోతుందా?

  • 26 జనవరి 2020
కరోనా వైరస్ Image copyright AFP

చైనీస్ కొత్త సంవత్సరం వేళ వుహాన్‌ రైల్వే స్టేషన్‌లో సాధారణంగా చాలా హడావుడి కనిపించాలి. కానీ, ఇప్పుడలా లేదు. ప్లాట్‌ఫామ్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

కారణం కరోనా వైరస్. ఈ వైరస్ వుహాన్ నగరంలోనే పుట్టుకొచ్చింది.

దేశంలో ఇప్పటి వరకూ 830 మందికి దీని బారిన పడ్డట్లు నిర్థరణ అయ్యింది. వీరిలో 41 మంది చనిపోయారు.

దీంతో వుహాన్ నగరానికి ప్రభుత్వం రాకపోకలు నిలిపేసింది.

విమానాలు, రైళ్లు, పడవలు.. ఇలా అన్ని రవాణా సేవలు ఆగిపోయాయి.

రహదారులను అధికారికంగా మూసేయలేదు గానీ, చాలా చోట్ల రాకపోకలను ఆపేసినట్లు వార్తలు అందుతున్నాయి.

నగరంలో ఉంటున్నవారిని ఎక్కడికీ వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

కానీ, ఒక నగరాన్నిఇలా మూసేయడం సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ సాధ్యపడినా, దాని వల్ల ప్రయోజనం ఉంటుందా?

Image copyright Getty Images

ఐరాస సమాచారం ప్రకారం వుహాన్ ప్రపంచంలోనే 42వ అతిపెద్ద నగరం.

అలాంటి నగరాన్ని పూర్తిగా మూసేయడం అంత సులభమైన విషయం కాదు.

వుహాన్‌లోకి వచ్చే ప్రధాన రహదారులు 20కిపైనే ఉన్నాయి. చిన్నవైతే పదుల్లో ఉంటాయి. ప్రజా రవాణా వ్యవస్థలను నిలిపేసినా, రాకపోకలను అడ్డుకోవడం దాదాపు అసాధ్యం.

నగరం చుట్టూ కంచెలా చైనీస్ సైన్యం నిల్చుంటే గానీ, వుహాన్‌ను మూసేయడం సాధ్యం కాదని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ప్రొఫెసర్, ఆరోగ్య భద్రత నిపుణుడు ఆడమ్ కామ్రాడ్ట్ స్కాట్ వ్యాఖ్యానించారు.

ఒక వేళ అలా ఓ కంచెలా నిల్చోవాలన్నా అది సాధ్యమయ్యే పనేనా? చాలా ఆధునిక నగరాల్లాగే, వుహాన్ సరిహద్దులు చెరిపేసుకుంటూ పక్కనున్న చిన్న పట్టణాలు, గ్రామాలతో కలిసిపోయింది.

''నగరాలు ఒక ఆకారమంటూ లేకుండా మారతాయి. ప్రతి రహదారినీ మూసేయడం కుదరదు. కొంత వరకూ అది సాధ్యం కావచ్చు. కానీ, లోపాలు లేని చర్యేమీ కాదు'' అని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ప్రొఫెసర్, అంటువ్యాధుల నిపుణుడు మిఖాయిల్ ప్రొకోపెంకో అన్నారు.

కోటీ పది లక్షల జనాభా ఉన్న నగరాన్ని మూసేయాలంటే కొత్త సైన్స్ కావాలేమోనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చైనా ప్రతినిధి గాడెన్ గాలియా అసోసియేట్ ప్రెస్ వార్తాసంస్థతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ దశలో నగరం మూసివేత వల్ల ప్రయోజనం ఉంటుందా, లేదా అని చెప్పడం కష్టమని అన్నారు.

వుహాన్‌ తలుపులను పూర్తిగా మూసేయడం ఒకవేళ సాధ్యపడినా, ఆ వైరస్ ఎప్పుడో నగరం గడప దాటి బయటపడి ఉండొచ్చు.

Image copyright Reuters

కరోనా వైరస్ వ్యాప్తి గురించి డబ్ల్యూహెచ్ఓకు 2019, డిసెంబర్ 31న నివేదిక అందింది.

జనవరి 20 నాటికి గానీ చైనాలోని అధికారులు దీని గురించి ధ్రువీకరించలేదు. అప్పుడే ఈ వ్యాధి గురించి చెప్పిన వారు, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని కూడా వెల్లడించారు.

అప్పటికే లక్షల సంఖ్యలో జనం నగరానికి రాకపోకలు సాగించి ఉంటారు.

చైనావ్యాప్తంగానే కాదు, ఆసియాలో.. ఆఖరికి అమెరికాలోనూ కరోనా వైరస్ సోకిన కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆ కేసులన్నింటిలో బాధితులు వుహాన్‌కు ఇటీవల కాలంలో వెళ్లొచ్చినవారే.

ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాపిస్తున్నా, చైనాలో పరిస్థితే అత్యంత కలవరానికి గురిచేస్తుందని ప్రొఫెసర్ కామ్రాడ్ట్ స్కాట్ అన్నారు.

''మిగతా దేశాల్లో కరోనా కేసులు ఒకట్రెండు చొప్పునే వెలుగుచూశాయి. థాయ్‌లాండ్‌లో నాలుగు కేసులు బయటపడ్డాయి. వీటి సంఖ్య చాలా తక్కువ. స్థానికంగా సరైన సమయంలో గుర్తించి, అది వ్యాపించకుండా అడ్డుకోగలిగినట్లు అర్థమవుతోంది. చైనాలోనే ఇది పెద్ద సమస్యగా ఉంది'' అని ఆయన చెప్పారు.

Image copyright Getty Images

వుహాన్ రాజధానిగా ఉన్న హుబీ ప్రావిన్సులో గురువారం నాటికి 571 కేసులు నమోదయ్యాయి. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సులో 26, బీజింగ్‌లో 10 కేసులు వెలుగుచూశాయి. హాంకాంగ్‌లోనూ 38 అనుమానిత కేసులు నమోదయ్యాయి.

''వైరస్ ఇప్పటికే స్థానికంగా వ్యాప్తి అవుతోంది. బయటకూ పొక్కి ఉండే అవకాశాలున్నాయి. అలాంటప్పుడు వుహాన్‌లో తీసుకున్నవి ఆలస్యమైన చర్యలే'' అని ప్రొఫెసర్ కామ్రాడ్ట్ స్కాట్ అన్నారు.

కరోనా వైరస్‌పై అంతర్జాతీయ స్పందన బాగుందని ప్రొఫెసర్ ప్రొకోపెంకో అభిప్రాయపడ్డారు.

వుహాన్ నుంచి సిడ్నీకి చివరగా వచ్చిన విమాన ప్రయాణికులందరినీ బయోసెక్యూరిటీ అధికారులు పరీక్షించారు.

ఈ వైరస్ తమకు సోకిందన్న విషయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చని ప్రొకోపెంకో అన్నారు.

''వైరస్ సోకిన తర్వాత కూడా ఆ లక్షణాలు కొందరిలో బయటపడకపోవచ్చు. ఒక వేళ బయటపడ్డా, అది జలుబులాగో, జ్వరంలాగో కనిపించవచ్చు. బయటకు వాళ్లు సాధారణంగానే కనిపిస్తారు. మిగతా వాళ్లను కలుస్తారు. అప్పుడు ఆ వైరస్ ఇంకా వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా ఫ్లూ బయటపడటానికి రెండు, మూడు రోజుల సమయం పడుతుంటుంది. కరోనా వైరస్ విషయంలో ఐదారు రోజులు, వారం, ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు'' అని అన్నారు.

Image copyright Getty Images

అంటే, గత వారం వైరస్ సోకిన వ్యక్తి ఎవరైనా తనకు తెలియకుండానే దాన్ని ఎక్కడెక్కోడో వ్యాప్తి చేసి ఉండొచ్చు.

అయితే, ఇదంతా వైరస్‌ను అదుపు చేసేందుకు చైనా చేపడుతున్న చర్యలు తప్పని చెప్పడం కాదు.

డబ్ల్యూహెచ్ఓ చైనా చర్యలను ప్రశంసించింది కూడా.

'సామాజికంగా దూరంపెట్టడం'గా నిపుణులు పిలిచే ఇలాంటి చర్య తీసుకున్నప్పుడు కొన్ని పర్యవసానాలు ఉండటం సహజమే.

2009లో ఏప్రిల్‌లో స్వైన్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు మెక్సికో సిటీలోని బార్లు, సినిమా హాళ్లు, థియేటర్లు, ఫుట్‌బాల్ మైదానాలు, చర్చిలను కూడా మూసేశారు. రెస్టారెంట్లు కూడా పార్సిల్ సేవలను మాత్రమే అందించాయి.

''మెక్సికో సిటీలో చేపట్టిన చర్యలు వ్యాప్తిని నెమ్మదింపజేశాయనొచ్చు. పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చేందుకు అధికారులకు అవి సాయపడ్డాయి. కానీ, వ్యాప్తి వెంటనే ఆగిపోయిందా అంటే, లేదనే చెప్పాలి'' అని ప్రొఫెసర్ కామ్రాడ్ట్ స్కాట్ అన్నారు.

మరి, వుహాన్ మూసివేత వల్ల ఫలితం ఉంటుందా?

''చైనా కరోనా వైరస్‌ సోకినట్లు ధ్రువీకరించిన కేసుల సమాచారాన్నే బయటకు చెబుతోంది. ఆ అంకెలను బట్టి చూస్తే నేనైతే ఇలాంటి చర్యను చేయమని అనను. ఒక వేళ వేల సంఖ్యలో అనుమానిత కేసులు ఎక్కువ ఉంటే మాత్రం, ఈ చర్య ఉపయోగపడొచ్చు'' అని కామ్రాడ్ట్ స్కాట్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: ఐసీయూలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

లాక్‌డౌన్ ఎఫెక్ట్: మహారాష్ట్ర నుంచి తమిళనాడు - 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరిన యువకులు

ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?

కరోనావైరస్: బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లాక్‌డౌన్ గురించి ఏం చెప్పింది?

లైట్లు ఆర్పేయాలన్న మోదీ మాట వినలేదని.. నలుగురు ముస్లిం సోదరుల మీద దాడి

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను భారత్ ఎగుమతి చేయకపోతే, తగిన ప్రతిస్పందన ఉంటుందన్న ట్రంప్

కరోనావైరస్ - తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్; 'లాక్‌డౌన్ కొనసాగించాలని ప్రధానికి చెప్పాను'

కరోనావైరస్: కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేశారు?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ అడ్డాగా కర్నూలు... 303 కేసుల్లో 74 ఈ జిల్లాలోనే