‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. ట్రంప్, జిన్‌పింగ్‌ పాలనపై ప్రముఖ వితరణశీలి జార్జ్ సోరస్ విమర్శలు

  • 26 జనవరి 2020
జార్జ్ సోరస్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈ నెల 23న దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మాట్లాడుతున్న జార్జ్ సోరస్

అమెరికా, చైనాల్లో నిరంకుశ పాలకులు పాలన సాగిస్తున్నారని ప్రముఖ వితరణశీలి, వ్యాపారవేత్త అయిన హంగేరియన-అమెరికన్ జార్జ్ సోరస్ విమర్శించారు. అమెరికాలో డోనల్డ్ ట్రంప్, చైనాలో జీ జిన్‌పింగ్ అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేదని వ్యాఖ్యానించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో భారత ప్రభుత్వం కటువైన చర్యలు చేపడుతోందని, దేశంలో లక్షల మంది ముస్లింలకు పౌరసత్వాన్ని దూరం చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.

మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని నిర్వీర్యం చేయడం, వివాదాస్పద భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)‌ను తీసుకురావడాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ ఆరోపణలు చేశారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోసగాడని, ఆయన అమెరికా రాజ్యాంగం హద్దులు మీరారని సోరస్ వ్యాఖ్యానించారు. చైనీయుల జీవితంపై పూర్తి నియంత్రణ సాధించేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని తప్పుబట్టారు.

తాజాగా తూర్పు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో ఆయన ప్రసంగించారు. జనాకర్షక రాజకీయ విధానాలు(పాపులిజం), వాతావరణ మార్పుల ముప్పు పెరుగుతోందని హెచ్చరించారు.

సోరస్ ఒక యూదు. నాజీ దురాగతాల సమయంలో ఫోర్జరీ చేసిన గుర్తింపు పత్రాలు చూపించి ఆయన ప్రాణాలు దక్కించుకొన్నారు.

ఉదారవాద సమాజాలకు అమెరికా, చైనా ప్రభుత్వాలు అత్యంత తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని ఆయన తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తంచేశారు.

సమాజంలో విభేదించేవారి పట్ల పెరుగుతున్న అసహనాన్ని ఎదుర్కొని, ఉదారవాద విలువలను వ్యాప్తి చేసేందుకు విశ్వవిద్యాలయాలతో కూడిన ఒక నెట్‌వర్క్‌కు వంద కోట్ల డాలర్ల విరాళం అందిస్తానని సోరస్ ప్రకటించారు.

అమెరికాలో డెమొక్రటిక్ పార్టీకి భారీగా నిధులు సమకూర్చే దాతల్లో ఆయన ఒకరు.

అమెరికా, ఐరోపా సహా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ ప్రాజెక్టులకు, ఉదారవాద వ్యాప్తికి కోట్ల డాలర్ల సొంత డబ్బును సోరస్ ఖర్చు పెడుతున్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ట్రంప్, జిన్‌పింగ్

"మళ్లీ గెలిచేందుకు ట్రంప్ ఏమైనా చేస్తారు"

ట్రంప్, జిన్‌పింగ్ అపరిమిత అధికారాలను ఉపయోగించేందుకు యత్నిస్తున్నారని సోరస్ విమర్శించారు.

"వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశం ప్రయోజనాలను వదులుకొనేందుకు ట్రంప్ సిద్ధం. అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు ఆయన ఏమైనా చేస్తారు. అటు జిన్‌పింగ్ ట్రంప్ బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి ఎదురుచూస్తుంటారు. సొంత ప్రజలపై పూర్తి నియంత్రణ కోసం ఆయన కృత్రిమమేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగిస్తున్నారు" అని సోరస్ వ్యాఖ్యానించారు.

సోరస్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష కార్యాలయం స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక సోరస్ ఒక యూదు. నాజీ దురాగతాల సమయంలో ఫోర్జరీ చేసిన గుర్తింపు పత్రాలు చూపించి ఆయన ప్రాణాలు దక్కించుకొన్నారు.

చైనా ఆర్థిక వ్యవస్థను అధ్యక్షుడు జిన్‌పింగ్ ఊపిరి తీసుకోనివ్వడం లేదని, ట్రంప్ కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని సోరస్ విమర్శించారు.

తీవ్రస్థాయికి చేరిన అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఇటీవలే తగ్గుముఖం పట్టింది.

వాణిజ్య ఘర్షణలను తగ్గించుకొనేందుకు రెండు దేశాలూ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని నిర్వీర్యం చేయడం, పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడాన్ని దృష్టిలో ఉంచుకొని మోదీ ప్రభుత్వంపై సోరస్ విమర్శలు చేశారు.

ఉదారవాద కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నందుకు మితవాద గ్రూపులు సోరస్‌ను తరచూ విమర్శిస్తుంటాయి. ఈ విమర్శల్లో ఎక్కువగా యూదు వ్యతిరేక ధోరణి ఉంటుందనే విమర్శ ఉంది.

విశ్వవిద్యాలయాల నెట్‌వర్క్ ప్రాజెక్ట్ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని, తన జీవిత కాలంలోనే ఇది అమలయ్యేలా చూస్తానని సోరస్ తెలిపారు.

హంగేరీలో 1971లో సోరస్ స్థాపించిన ప్రైవేటు విశ్వవిద్యాలయం 'సెంట్రల్ యూరోపియన్ యూనివర్శిటీ'ని మూసేయించడానికి హంగేరీ అధ్యక్షుడు విక్టర్ ఓర్బన్ పదే పదే ప్రయత్నిస్తున్నారు. విశ్వవిద్యాలయాల నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌కు సోరస్ విరాళం ప్రకటించడాన్ని ఓర్బన్ చర్యలకు ప్రతిస్పందనగా చూస్తున్నారు.

హంగేరీని వలసదారులతో నింపేసేందుకు, దేశాన్ని నాశనం చేసేందుకు సోరస్ రహస్యంగా కుట్ర పన్నుతున్నారని ఓర్బన్ నేతృత్వంలోని జాతీయవాద జనాకర్షక ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణను సోరస్ ఖండిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

దిల్లీ హింస: తుపాకీ పట్టుకుని పోలీసులపై కాల్పులు జరుపుతున్న ఈ వ్యక్తి ఎవరు?

డోనల్డ్ ట్రంప్: ముగిసిన రెండు రోజుల భారత పర్యటన

ఇరాన్ ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రికి కరోనావైరస్.. స్పెయిన్‌లో వందల మందిని లోపలే ఉంచి హోటల్‌ను మూసేసిన ప్రభుత్వం

BBC Indian Sportswoman of the Year 2019: విజేత ఎవరో మార్చి 8న ప్రకటిస్తాం

దిల్లీ హింస: ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో హింసకు కారకులెవరు.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు

దిల్లీ: హింసాత్మక ఘర్షణల్లో 13కి చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు

మోదీ ప్రభుత్వ విజయాలపై అహ్మదాబాద్‌లో ట్రంప్ చెప్పినవన్నీ నిజాలేనా? - బీబీసీ రియాల్టీ చెక్