బ్రెజిల్: నెలకు రూ.7 వేల వేతనం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న రైతు కూలీలు

  • 28 జనవరి 2020
ప్రిసెల్లా - ఏడాది 5 నెలలే పని, రూ.83వేలతో సంవత్సరమంతా బతకాలి Image copyright OXFAM BRASIL
చిత్రం శీర్షిక ప్రిసెల్లా - ‘ఏడాదికి 5 నెలలే పని, రూ.83వేలతో సంవత్సరమంతా బతకాలి’

పొలాల్లో రైతు కూలీలుగా పనిచేయడం అంత సులువు కాదు. కాస్త ఆదాయం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. నిత్యం పురుగు మందుల మధ్య, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పని చేయాలి. ఇలా ఎక్కువ కాలంపాటు పనిచేస్తే తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలూ ఎదురయ్యే అవకాశం ఉంది.

ఈ పరిస్థితి భారత్‌లోనే కాదు, బ్రెజిల్‌లో కూడా చాలా ఎక్కువగా ఉంది. అక్కడ కూడా పొలాల్లో, పండ్ల తోటల్లో పనిచేసే బాల కార్మికుల సంఖ్య ఎక్కువే. అలాంటి వాళ్లలో లూకాస్ డ సిల్వా అనే 25ఏళ్ల కుర్రాడు కూడా ఒకరు.

పదేళ్ల పాటు అతడు పుచ్చకాయ తోటల్లో పురుగు మందు పిచికారీ చేసే పని చేసి గతేడాది పూర్తిగా ఆ పని మానేశాడు. అక్కడ పనిచేసేప్పుడు ఏ రోజూ కూడా శరీరాన్ని పూర్తిగా కప్పుకోవడానికి అవసరమయ్యే దుస్తులు ఇవ్వలేదని, నిత్యం పురుగు మందుల వాసన పీలుస్తూ పనిచేయడం వల్ల తలనొప్పి అనేది మామూలు సమస్యలా మారిపోయిందని అతడు చెప్పారు.

పురుగు మందులు కొట్టాక, అన్నం తినడానికి ముందు చేతులు కడుక్కునే అవకాశం కూడా ఉండేది కాదని, సబ్బు, నీళ్లు అందుబాటులో ఉండవని, ఒక బానిసలా పనిచేస్తున్న భావన కలిగేదని అన్నారు.

ఇలాంటి కథలు బ్రెజిల్‌లో సర్వసాధారణం. అక్కడ భారీగా పండే మామిడి, పుచ్చకాయ, ద్రాక్ష, ఆరెంజ్ లాంటి పండ్ల తోటల్లో లూకాస్ లాంటి లక్షలాది కూలీలు పనిచేస్తారు. ఆ పండ్లన్నీ ఎక్కువగా యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు ఎగుమతవుతుంటాయి.

Image copyright oxfam brasil
చిత్రం శీర్షిక చైనా, భారత్‌ల తరువాత ప్రపంచంలో అత్యధికంగా పండ్లను ఉత్పత్తి చేసే దేశం బ్రెజిల్

చైనా, భారత్‌ల తరువాత ప్రపంచంలో అత్యధికంగా పండ్లను ఉత్పత్తి చేసే దేశం బ్రెజిల్. నారింజ ఉత్పత్తిలో ఆ దేశమే నంబర్ వన్.

అక్కడి ట్రేడ్ యూనియన్ల లెక్కల ప్రకారం దాదాపు 48 లక్షల మంది రైతు కూలీలుగా పనిచేస్తున్నారు. పండ్ల సాగు ద్వారా ఏటా ఆ దేశానికి దాదాపు 71వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. కానీ, అందులో అతి కొద్ది మొత్తం మాత్రమే ఈ రైతు కూలీలకు అందుతోందని బ్రెజిల్ ఆక్స్‌ఫామ్ నివేదికలు చెబుతున్నాయి.

దేశంలో అతి తక్కువ ఆదాయం ఉన్న 20 శాతం పేదల్లో పండ్ల తోటల్లో పనిచేసే కూలీలే ఉన్నారు.

సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో బ్రెజిల్‌లో మామిడి పండ్ల కోత మొదలవుతుంది. ఆ పనిలో రైతు కూలీలదే కీలక పాత్ర. అందులోనూ మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి మహిళల్లో కార్మెన్ ప్రిసెల్లా ఒకరు.

Image copyright Oxfam
చిత్రం శీర్షిక పొలాల్లో నిత్యం పురుగు మందుల మధ్య పనిచేయడం వల్ల తనకు చర్మ సమస్య వచ్చిందని ఈ రైతు చెబుతున్నారు

ప్రిసెల్లా వయసు 25. ఆమె టీనేజీలో ఉన్నప్పట్నుంచీ తోటల్లో పండ్లను కోసే పని చేస్తున్నారు. బ్రెజిల్‌లో కనీస వేతనాల చట్టం అమల్లో ఉంది. కానీ, ఆమెకు ఉపాధి మాత్రం ఏడాదిలో పండ్లను కోసే ఆ ఐదు నెలలు మాత్రమే దొరకుతుంది.

కాబట్టి, ఏడాదికి గరిష్ఠంగా ఆమె సంపాదన రూ. 83 వేల రూపాయలు దాటదు. ఈ సంపాదనతో ఏడాది మొత్తం బతకాలని, ఖాళీగా ఉండటం కంటే ఈ పనిచేయడమే మేలని ఆమె అంటారు.

బ్రెజిల్‌లో వ్యవసాయ రంగమంతా కార్పొరేట్ కంపెనీల చేతుల్లోనే ఉంటుంది. దానివల్ల చిన్నస్థాయి కార్మికులు బాగా నష్టపోతున్నారు.

కార్పొరేట్ కంపెనీల రాకతో వ్యవసాయంలో సాంకేతికత వినియోగం పెరిగిపోయి కూలీల కనీస ఉపాధిపై కూడా ప్రభావం పడుతోంది.

Image copyright Oxfam
చిత్రం శీర్షిక చాలా దుర్భర పరిస్థితుల్లో బ్రెజిల్ రైతు కూలీలు పనిచేయాల్సి వస్తోంది

ఏదో ఒక పని దొరికితే చాలని కూలీలు అనుకోవడం వల్ల చాలా దుర్భరమైన వాతావరణంలో పనిచేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. దానివల్ల ఉపాధి కల్పించేవాళ్లు కూడా అక్కడ పరిస్థితులను మెరుగుపరిచే దిశగా ప్రయత్నాలు చేయట్లేదు.

అందుకే అక్కడ కనీస వేతనాన్ని పెంచాలని, రైతు కూలీలు పనిచేసే ప్రదేశాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలని, పురుగు మందులపై కూడా నిఘాపెట్టాలని అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఏడాది మొత్తం పని కల్పించడంతో పాటు కనీస వేతనాన్ని పెంచాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ సమస్యల గురించి మాట్లాడటానికి బ్రెజిల్ వ్యవసాయశాఖ అధికారులను బీబీసీ సంప్రదించింది. కానీ, వారు స్పందించేందుకు నిరాకరించారు.

వ్యవసాయ రంగ కంపెనీల్లో ఒకటైన కాలిమన్ అనే కార్పొరేట్ సంస్థ ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఆక్స్‌ఫామ్ సంస్థ రిపోర్టులు వాస్తవానికి దూరంగా ఉంటాయని విమర్శించింది.

ఇలా పని ప్రదేశంలో సమస్యల గురించి మాట్లాడినందుకు వ్యవసాయ రంగ కంపెనీలో పనిచేసే జోస్ ఎవాండ్రో డ సిల్వా అనే వ్యక్తి ఏడాది క్రితం ఉద్యోగం కోల్పోయారు. సంస్థకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తే వేరే ఎక్కడా అతడికి పని దొరకదని ఆ కంపెనీ మేనేజెర్ బెదిరించాడు.

ఇప్పటికీ డ సిల్వా ఉద్యోగం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్‌, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...

కరోనావైరస్: దక్షిణ కొరియాలో ఒకే రోజులో రెట్టింపైన రోగుల సంఖ్య

ట్రంప్‌కు 70 లక్షల మంది స్వాగతం పలకడం సాధ్యమేనా...

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

విశాఖ ఏజెన్సీ: తమ ఊరికి సొంతంగా రోడ్డు నిర్మించుకున్న ఈ గిరిజనులు ఏమంటున్నారో వింటారా...

ఛత్తీస్‌గఢ్ గిరిజనులపై బంగ్లాదేశ్ శరణార్థులు నిజంగానే ఆధిపత్యం చలాయిస్తున్నారా?

200 ఏళ్ల నాటి ఈస్టిండియా కంపెనీ పెయింటింగ్స్‌.. భారత్‌కు నచ్చలేదు, బ్రిటన్‌ ఇబ్బంది పడింది ఎందుకు

‘నగ్నంగా గుంపులుగా నిలబెట్టి, ‘ఫింగర్ టెస్ట్’లు చేశారు’: ఫిట్‌నెస్ పరీక్షల నిర్వహణ తీరుపై మహిళా ఉద్యోగుల అభ్యంతరం