పెరూ: అడవిలో తప్పిపోయి, 34 రోజులపాటు బెర్రీలు తింటూ ప్రాణాలు నిలబెట్టుకున్న తల్లీ పిల్లలు

  • 28 జనవరి 2020
చిలీలోని చిట్టడవిలో బెర్రీలు.. 2018 మార్చి 5 నాటి ఫొటో Image copyright Getty Images
చిత్రం శీర్షిక (ప్రతీకాత్మక చిత్రం)

అడవిలో తప్పిపోయిన ఓ తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు 34 రోజుల పాటు కేవలం బెర్రీ పండ్లు తింటూ ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఈ ఘటన పెరూలో జరిగింది.

అడవిలో కృశించిపోయిన స్థితిలో ఉన్న ఆ తల్లీ పిల్లలను పెరూలోని స్థానిక ఆదివాసీలు గుర్తించారు. ఈ నలుగురూ 34 రోజుల నుంచి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు.

పెరూ - కొలంబియా సరిహద్దులో ఉన్న ఓ మారుమూల గ్రామంలో బంధువులను కలిసేందుకు ఆ మహిళతో పాటు ఆమె ముగ్గురు కూతుళ్లు వెళ్లారు. కానీ, తిరిగి వచ్చేప్పుడు దారి గుర్తించలేక వాళ్ల తప్పిపోయారు.

ఇన్ని రోజులూ అడవిలో దొరికే విత్తనాలు, మొక్కల ఆకులూ, బెర్రీలు తింటూ బతికినట్లు వాళ్లు చెప్పారు.

వాళ్లను ఆస్పత్రికి తరలించి పోషకాహారలేమితో పాటు డీహైడ్రేషన్ సమస్యకు చికిత్స అందిస్తున్నారు.

ఆ మహిళ సరిహద్దు దాటి భర్తతో కలిసి స్వదేశమైన కొలంబియాకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరిగినట్లు కొలంబియాకు చెందిన కారకోల్ అనే చానెల్ తెలిపింది. అనుకున్న సమయానికి, ముందుగా నిర్ణయించుకున్న ప్రదేశానికి ఆమె, పిల్లలు చేరకపోవడంతో వాళ్లు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె భర్త చెప్పారు. ప్యుర్టొ లెగుజామొ గ్రామం వద్ద నుంచి వారు తప్పిపోయి ఉంటారని తెలిపాడు.

బంధువుల ఇంటినుంచి కొంత దూరం వచ్చాక తనకు కళ్లు తిరిగినట్లు అనిపించిందని, ఆ తరువాత పుటమాయో నది సమీపంలో దారి తప్పిపోయినట్లు ఆ మహిళ తెలిపారు.

ఎంతకీ దారి కనుక్కోలేకపోయిన ఆ తల్లీ పిల్లలు అలా అడవిలో ముందుకు నడుస్తూ దొరికింది తింటూ 34 రోజులు గడిపారు. చివరికి యుబిటో అనే ఓ గ్రామం సమీపంలో కొందరు ఆదివాసీలు వీరిని గుర్తించారు. తరువాత వీళ్లు పెరూ నేవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఆపైన పెరూ నేవీ అధికారులు, కొలంబియా నేవీ అధికారులకు సమాచారం చేరవేశారు. వాళ్ల సాయంతో ఓ పడవలో కొలంబియాలోని ఓ ఆస్పత్రికి వారిని తరలించారు.

పడవ నుంచి దిగిన తరువాత ఆ పిల్లలు తమకోసం ఎదురుచూస్తున్న తండ్రిని కలిసే దృశ్యాలను కారకోల్ టీవీ ప్రసారం చేసింది.

'ప్రతి అరగంటకు నీళ్లు తాగేవాళ్లం. నీళ్లు దొరక్కపోతే కళ్లు తిరిగేవి. చాలాసార్లు ఆగుతూ నడవాల్సి వచ్చింది. ఒక దశలో పిల్లలు ఏమాత్రం ముందుకు అడుగు వేయలేకపోయారు' అని ఆ మహిళ చెప్పడం వీడియోలో కనిపించింది.

వాళ్ల ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయి. మలేరియా లాంటి వ్యాధులు ఏవైనా వారికి సోకాయేమోనని పరీక్షించనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు