కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?

  • 7 ఏప్రిల్ 2020
కరోనావైరస్ జాగ్రత్తలు

కరోనావైరస్ వేగంగా విస్తరిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల మందికి పైగా ఈ వైరస్ సోకింది. మృతుల సంఖ్య 75వేలు దాటింది.

భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య ఐదు వేలకు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం ఇప్పటివరకు 124 మంది చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 868 కేసులు నమోదయ్యాయి. 48 మంది చనిపోయారు.

అమెరికాలో అత్యధికంగా 3,68,449మందికి కరోనావైరస్ సోకింది. ఏప్రిల్ 7వ తేదీ నాటికి 11వేల మంది వైరస్ బారిన పడి చనిపోయారు.

ఇటలీలో ఇప్పటికే 16,523 మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ మొత్తంగా 1,32,547 మందికి సోకింది. స్పెయిన్‌లో 1,40,510 మంది వైరస్ బాధితులు నమోదయ్యారు. 13,798 మంది మృతి చెందారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

5194

మొత్తం కేసులు

402

కోలుకున్నవారు

149

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 20 IST

నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?

అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం క్రమం తప్పకుండా చేతులను సబ్బు, నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవడం.

వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు పడే తుంపర ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది. గాలిలోకి ఎగజిమ్మే ఆ చిన్న చిన్న నీటి రేణువులతో కప్పబడిన వైరస్, మరొకరికి శ్వాస ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆ తుంపర పడిన ప్రదేశాన్ని చేతులతో తాకి, ఆ తరువాత అదే చేయితో కళ్లు, ముక్కు లేదా నోటిని ముట్టుకుంటే వైరస్ సంక్రమిస్తుంది.

కాబట్టి, దగ్గినా, తుమ్మినా టిష్యూ పేపర్ అడ్డుగా పెట్టుకోవడం, కడుక్కోని చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండడం, ఇన్ఫెక్షన్ సోకిన వారికి దూరంగా ఉండడం ద్వారా కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.

ముఖానికి వేసుకునే మాస్కుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కరోనావైరస్ లక్షణాలు

కరోనావైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. జ్వరంతో మొదలై, పొడి దగ్గు రావడం, ఆ తరువాత శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది రావడం ఈ వైరస్ లక్షణాలు.

ఈ వైరస్ సోకితే దగ్గు ఆగకుండా వస్తుంది. ఒక్కోసారి గంటకు పైగా దగ్గు వస్తూనే ఉంటుంది. 24 గంటల్లో అలా సుదీర్ఘమైన దగ్గు రెండు మూడు సార్లు వస్తుంది. మీకు మామూలుగానే దగ్గు సమస్య ఉంటే, వైరస్ వల్ల కలిగే దగ్గు మరింత తీవ్రంగా ఉంటుంది.

శరీర ఉష్ణోగ్రత (జ్వరం) 100 డిగ్రీల ఫారిన్ హీట్ దాటుతుంది. దీంతో శరీరమంతా వెచ్చగా కానీ, చల్లగా కానీ ఉంటుంది. కొందరి శరీరం వణికిపోతుంటుంది.

గొంతు మంటపుడుతుంది. తలనొప్పి వస్తుంది. నీళ్ల విరేచనాలు కూడా జరగొచ్చు. ఈ వైరస్ సోకినవారు వాసన, రుచి గ్రహించే శక్తి కోల్పోవచ్చు.

సాధారణంగా ఈ లక్షణాలు కనిపించడానికి 5 రోజుల సమయం పట్టొచ్చు. అయితే, కొందరిలో ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం... కరోనావైరస్ సోకిన వ్యక్తిలో లక్షణాలు కనిపించడానికి (ఇంక్యుబేషన్ వ్యవధి) 14 రోజుల వరకూ సమయం పట్టవచ్చు.

ప్రజలు ఆసుపత్రికి వెళ్లాల్సింది ఎప్పుడు?

కరోనావైరస్ సోకిన వారిలో చాలామంది విశ్రాంతి తీసుకుని, పారాసెటమాల్ వంటి మాత్రలు తీసుకుని కోలుకుంటున్నారు.

అయితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంటే మాత్రం ఆసుపత్రిలో వైద్యం అవసరమవుతుంది.

ఊపిరితిత్తులు ఎంతగా దెబ్బతిన్నాయో డాక్టర్లు పరీక్షించి తదనుగుణంగా ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్టుతో వైద్యం అందిస్తారు.

అయితే, తీవ్రంగా జబ్బుపడి, మీ రోజువారీ కార్యక్రమాలను కూడా చేసుకోలేకపోతున్నప్పుడు ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలను కానీ, ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్లను కానీ సంప్రదించాలి.

శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతుంటే, కొన్ని పదాలకు మించి మాట్లాడలేకపోతుంటే మాత్రం తక్షణం 104, 108 వంటి ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేయాలి.

ఇంటెన్సివ్ కేర్‌లో ఏం జరుగుతుంది?

తీవ్రంగా జబ్బుపడ్డ వారికి వైద్యం అందించే ప్రత్యేక వార్డులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూ) అంటారు.

కరోనావైరస్ సోకిన పేషెంట్లకు ఐసీయూల్లో ఫేస్ మాస్కు లేదా ముక్కు ద్వారా లోపలికి వేసిన గొట్టం ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తారు.

ఇంకా ఎక్కువగా జబ్బుపడ్డ రోగులకైతే వెంటిలేటర్ల ద్వారా ప్రాణవాయువును అందిస్తారు. నోరు, ముక్కు ద్వారా కానీ, గొంతును కోసి కానీ ఒక గొట్టాన్ని లోపలికి పంపించి, ఊపిరితిత్తులకు నేరుగా ఆక్సిజన్ అందేలా చేస్తారు.

కరోనావైరస్ ఎంత ప్రమాదకరం?

కరోనావైరస్ వ్యాధి బారినపడ్డవారికి సంబంధించిన గణాంకాలను చూస్తే, చనిపోయినవారి శాతం చాలా తక్కువ. ఈ గణాంకాలన్నీ పూర్తిగా విశ్వసనీయమైనవి కాకపోయినా, కరోనావైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా మరణాల రేటు ఒకటి లేదా రెండు శాతం మాత్రమే ఉంటుంది.

ప్రస్తుతం అనేక దేశాల్లో వేలాది మందికి చికిత్స జరుగుతోంది. కాబట్టి ఈ మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చు. అయితే, స్వల్ప లక్షణాలున్నవారు నమోదుకానందువల్ల మరణాల సంఖ్య తక్కువగా నమోదు కావొచ్చు.

ఇన్ఫెక్షన్‌కు గురైన 56000 మందిపై డబ్ల్యూహెచ్ఓ చేసిన ఓ అధ్యయనం ప్రకారం, వైరస్ కారణంగా 6శాతం మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో ఊపిరితిత్తుల్లో సమస్యలు, అవయవాలు పనిచేయకపోవడం ద్వారా మరణం సంభవించే అవకాశం ఎక్కువ.

14శాతం రోగుల్లో తీవ్ర లక్షణాలు కనిపించాయి. వీరిలో శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురయ్యాయి.

80శాతం మందిలో ప్రాథమిక లక్షణాలు కనిపించాయి. అంటే, జ్వరం, దగ్గు వంటివి. ఇవి న్యుమోనియాకు కూడా దారితీయవచ్చు.

వృద్ధులు, అప్పటికే ఆస్తమా వంటి శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు, డయాబెటిస్, గుండె జబ్బులున్నవారిపై కరోనావైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రమాదముంది. మహిళలకన్నా పురుషులే ఈ వైరస్ వల్ల ఎక్కువగా చనిపోయే ప్రమాదం ఉంది.

రోగనిరోధక శక్తిని పెంపొందింపచేసి, వైరస్‌తో శరీరం పోరాడేలా చేయడం ద్వారా రోగి శ్వాస తీసుకునేందుకు సహకరించేలా చేయడమే కరోనావైరస్‌కు చికిత్స.

కరోనావైరస్‌కు వ్యాక్సిన్ తయారీ పని ఇంకా కొనసాగుతోంది.

కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా?

కరోనావైరస్ మిగిలిన ప్రమాదకరమైన వైరస్‌ల మాదిరిగా గాలిలో ప్రయాణించలేదు. కానీ, వైరస్‌ బారినపడ్డ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ పెట్టుకుంటే మాత్రం వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

యూకే నేషనల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం... నేరుగా కాంటాక్ట్ పెట్టుకోవడం అంటే.... వైరస్ బారిన పడ్డ వ్యక్తితో రెండు మీటర్ల కన్నా తక్కువ దూరంలో 15 నిముషాల కన్నా ఎక్కువ సేపు గడపడం అన్న మాట.

ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపరల ద్వారా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తుంపర్లలో కరోనావైరస్ కణాలు ఉంటాయి.

ఈ వైరస్ ఏదైనా వస్తువుకు అంటిపెట్టుకుని సజీవంగా చాలా కాలంపాటు ఉంటుంది. చల్లని ప్రదేశాల్లో తొమ్మిది రోజుల వరకూ ఇది బతికుండే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.

కాబట్టి, ఆ వైరస్ ఉన్న వస్తువులపై చేతులు వేసిన వాళ్లకూ అది సోకే ప్రమాదం ఉంది. అందుకే, మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్ల హ్యాండ్ రెయిల్స్, మెట్రో రైళ్లలో నిలబడేటప్పుడు పట్టుకునే హ్యాండిళ్లు, బస్సుల్లో సీట్ల వెనుక ఉండే హ్యాండిళ్లు వంటి వాటిపై చేతులు వేయకుండా ఉంటే మంచిది.

ఆ వస్తువులను పట్టుకుని, తర్వాత ఆ చేతితో ముఖాన్ని, నోటిని, ముక్కు, కళ్లను తాకితే వైరస్ నేరుగా శరీరంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.

దగ్గు, తుమ్ము వస్తున్నప్పుడు టిష్యూ పేపర్లను లేదా మోచేతిని అడ్డు పెట్టుకోవాలి. చేతులను కడుక్కోకుండా ముఖాన్ని ముట్టుకోకూడదు. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి దూరంగా ఉండటం చాలా ముఖ్యమైన అంశం. ఇలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫేస్ మాస్కులు ఉపయోగించినా పూర్తి రక్షణ ఉండదు.

ఒకవేళ మీరు ఎవరైనా కరోనావైరస్ సోకిన వ్యక్తితో కాంటాక్ట్ అయితే కొన్ని రోజుల పాటు ఇతరులెవరినీ కలవకుండా దూరంగా ఉండటం శ్రేయస్కరం.

పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ సూచనల ప్రకారం, వైరస్ సోకిందని అనుమానం ఉన్న వ్యక్తులు డాక్టర్, హాస్పటల్‌, ఫార్మసీ వంటి ప్రదేశాలకు వెంటనే నేరుగా వెళ్లకూడదు. డాక్టర్లు లేదా తమ ప్రాంతాల్లోని ఆరోగ్య కార్యకర్తలను ఫోన్‌లో లేదా ఆన్‌లైన్‌లో సంప్రదించి, మాట్లాడి తగిన వైద్య సలహాలు తీసుకోవాలి.

విదేశాల నుంచి వచ్చినవారు కనీసం 14 రోజుల పాటు ఎవరినీ కలుసుకోకుండా ఇంట్లోనే ప్రత్యేకంగా ఉండాలి.

కరోనావైరస్: జాగ్రత్తలు

కరోనావైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది.

ముఖ్యంగా ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవాలి.

దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి కనీసం ఒక మీటరు నుంచి మూడు మీటర్ల దూరంలో ఉండాలి.

ఆ రెండు లక్షణాలతో బాధపడుతున్నవారు తుమ్మినా లేదా దగ్గినా టిష్యూ లేదా బట్ట అడ్డు పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.

ప్రయాణాల్లో, షాపింగ్ సమయాల్లో, ఆఫీసుల్లో అవసరమైన ప్రతి వస్తువును చేతితో తాకుతునే ఉంటాం. ఆ సమయంలో వైరస్ సోకే అవకాశం ఉంది. అవే చేతులతో కళ్లను నలిపినా, ముక్కును, నోటిని తాకినా ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. కనుక అదే పనిగా చేతులతో కళ్లను, నోటిని, ముక్కును తాకవద్దు.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు

ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి పెంపుడు జంతువులు లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలి.

పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకూడదు.

జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో శుభ్రంగా కడుక్కోవడం ఎలా?

కరోనావైరస్: మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది?

వైరస్‌లు.. మన శరీరంలోని కణాలలోకి వెళ్లి, వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి.

కొత్త కరోనావైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్‌ను శ్వాసలోకి పీల్చినపుడు (ఇది సోకిన వారు ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినపుడు), లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఇది మన శరీరంలోకి చొరబడుతుంది.

మొదట మన గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది. వాటిని 'కరోనావైరస్ కర్మాగారాలు'గా మార్చేస్తుంది. అంటే.. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది.

ఇది ప్రాథమిక దశ. ఈ దశలో మనం జబ్బుపడం. అసలు కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.

వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం- ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే.. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంది.

కరోనావైరస్ వల్ల వచ్చే దగ్గు ఆరంభంలో పొడిగా ఉంటుంది. అంటే తెమడ వంటిదేమీ రాదు. వైరస్ సోకినపుడు కణాల్లో కలిగే అలజడి బహుశా దీనికి కారణం కావచ్చు.

కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి.

ఈ లక్షణాలకు.. శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ.. ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం, పారాసెటమాల్ మందులతో చికిత్స అందిస్తారు. ప్రత్యేకమైన ఆస్పత్రి చికిత్స అవసరం ఉండదు.

ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయానికి చాలా మంది కోలుకుంటారు. ఎందుకంటే.. వారిలోని రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడి దానిని తరిమేస్తుంది.

అయితే, కొంతమందిలో కోవిడ్-19 వ్యాధి మరింతగా ముదురుతుంది. ఈ దశలో ముక్కు కారటం వంటి జలుబు వంటి లక్షణాలు కూడా రావచ్చని పలు అధ్యయనాల్లో తెలుస్తోంది.

Image copyright Reuters

కరోనావైరస్‌ నిర్థరణకు చేసే పరీక్షలేంటి?

మిచెల్లీ రాబర్ట్స్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్ హెల్త్ ఎడిటర్

కరోనావైరస్ మహమ్మారిని కనిపెట్టేందుకు, నిర్థరించేందుకు రెండు రకాల పరీక్షల అందుబాటులో ఉన్నాయి.

1.యాంటీజెన్ లేదా నాకు కరోనావైరస్ సోకిందా?: ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకిందా, సోకితే అతడు వేరేవారికి దాన్ని వ్యాపింపచేసే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయి అనే విషయాలను ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. తీవ్రంగా జబ్బుపడిన రోగులకు హాస్పటళ్లలో ప్రస్తుతం ఈ పరీక్షనే నిర్వహిస్తున్నారు.

2.యాంటీబాడీ లేదా నాకీ మధ్య కరోనావైరస్ వచ్చిందా?: ఇది ప్రజలకు ప్రస్తుతం (ఇంగ్లండ్‌లో) అందుబాటులో లేదు. కానీ లక్షల మందికి ఈ పరీక్ష నిర్వహించాలని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ ఆదేశించింది. దీనివల్ల ఎంతమంది ప్రజలు అసలు ఎలాంటి లక్షణాలు లేకుండా లేదా ప్రాథమిక లక్షణాలతో కరోనావైరస్ బారిన పడ్డారు అనే విషయం తెలుసుకోవచ్చు.

కరోనావైరస్‌ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ఈ రెండు పరీక్షలూ చాలా ముఖ్యమైనవి.

వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోంది?

ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కరోనావైరస్ కేసులు నమోదవుతున్నాయి. అయితే, చాలా కేసులు ఇప్పటికీ ఆరోగ్య సంస్థల దృష్టిలోకి రావట్లేదని అధికారులు భావిస్తున్నారు.

వీటిలో చాలా కేసులు అమెరికా, చైనా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్, దక్షిణ కొరియాల్లోనే నమోదయ్యాయి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: భారత్‌లో 166 కోవిడ్ మృతులు, వైరస్ బాధితులు 5,734

కరోనావైరస్‌ మీద విజయం సాధించామన్న చైనా మాటలను నమ్మవచ్చా?

ప్రెస్ రివ్యూ: ‘తెలంగాణలో 125 కరోనావైరస్ హాట్‌ స్పాట్లు.. ఒక్క హైదరాబాద్‌లోనే 60’ -

కరోనావైరస్ లాక్‌డౌన్ భారతదేశంలో ఆహార కొరతకు దారి తీస్తుందా?

కరోనావైరస్ లేనివాళ్లే దేశంలో ఎక్కువగా చనిపోతారా.. ఎందుకు

కరోనావైరస్: లాక్‌డౌన్‌లో ఉపాధి లేక, ఆహారం అందక ట్రాన్స్‌జెండర్ల ఇబ్బందులు

క‌రోనావైర‌స్: మేడిన్ ఆంధ్రప్రదేశ్ టెస్టింగ్ కిట్లు.. పీపీఈలు, వెంటిలేటర్లు, మాస్కుల్ని కూడా ఉత్పత్తి చేస్తున్న ఏపీ

కరోనావైరస్: కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడగలదా

కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా.. అందుకు ఆధారాలు ఉన్నాయా