కరోనావైరస్: తల్లి నుంచి బిడ్డకు సోకే అవకాశం ఉంటుందా ?

ఫొటో సోర్స్, Getty Images
వూహాన్లో అప్పుడే పుట్టిన చిన్నారిలో కరోనా వైరస్ లక్షణాలు
చైనాలో తొలిసారిగా అప్పుడే పుట్టిన చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. పుట్టిన 30 గంటలకే ఈ వైరస్ లక్షణాలను ఆ చిన్నారిలో వైద్యులు గుర్తించారు.
ప్రపంచంలో అంత చిన్న వయసువారిలో ఆ వ్యాధి లక్షణాలను గుర్తించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 2న కరోనా వైరస్ పుట్టుకకు కేంద్రంగా భావిస్తున్న వుహాన్‌లోని స్థానిక ఆస్పత్రిలో ఆ చిన్నారి జన్మించాడు. బిడ్డ జన్మించడానికి ముందు తల్లికి జరిపిన పరీక్షల్లో ఆమెకు కరోనా లక్షణాలున్నట్టు తేలింది.
కరోనా వైరస్ తల్లి నుంచి బిడ్డకు సోకుతుందా ?
అయితే ఇప్పటి వరకు తల్లి నుంచి బిడ్డకు ఈ వ్యాధి సోకుతుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. కానీ ఈ కేసు విషయంలో శిశువు గర్భంలో ఉన్న సమయంలోనే ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
ఇకపై కరోనా వైరస్ తల్లి నుంచి బిడ్డకు సోకే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని వూహన్ చిల్డ్రన్ హాస్పిటల్ నియోనాటల్ మెడిసిన్ విభాగం చీఫ్ ఫిజీషియన్ జెంగ్ లింగ్ కాంగ్ అన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అదే సమయంలో బిడ్డ పుట్టిన తర్వాత కరోనా వైరస్ సోకిన తల్లితోనే ఎక్కువ సమయం గడపటం వల్ల కూడా వైరస్ సోకే అవకాశాలు లేకపోలేదని కొలంబియా యూనివర్శిటీకి చెందిన మైల్మాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగం పేర్కొంది.
సుమారు 3 కేజీల 250 గ్రాముల బరువున్న ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని , వైద్యులు అనుక్షణం పర్యవేక్షిస్తున్నట్టు స్థానిక మీడియా షిన్హువా తెలిపింది.
ఫొటో సోర్స్, BSIP
పిల్లలకు ఈ తరహా వైరస్లు సోకడం మామూలేనా ?
ఇటీవల కరోనావైరస్ను గుర్తించిన తర్వాత చాలా కొద్ది మంది చిన్నారుల్లో మాత్రమే ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. గతంలో ప్రపంచాన్ని వణికించిన సార్స్, మెర్స్ వైరస్ల లక్షణాలు కూడా పిల్లల్లో అరుదుగానే కనిపించాయి. ఈ తరహా వైరస్లు సాధారణంగా మధ్య వయస్కులు అంటే 49 నుంచి 56 ఏళ్ల వయసు వారిలో కనపిస్తాయని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నివేదిక తెలిపింది. చిన్నారుల విషయానికొచ్చేసరికి అత్యంత అరుదుగానే కనిపిస్తాయని స్పష్టం చేసింది.
2016లో మెర్స్ వైరస్ బయట పడ్డ సమయంలో కూడా చిన్నారుల్లో ఆ వైరస్ లక్షణాలు అత్యంత అరుదుగానే కనిపించాయని ద వాల్డ్ జర్నల్ ఆఫ్ క్లినికల్ పీడియాట్రిక్స్ తెలిపింది. అందుకు కారణాలేంటన్నది తెలియలేదని కూడా ఆ నివేదికలో స్పష్టం చేసింది. సింగపూర్‌లో ఆరు నెలల చిన్నారిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడగా, ప్రస్తుతం వుహన్కు చెందిన 8 ఏళ్ల చిన్నారిలోనూ ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు .
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: వుహాన్ వాసులకు భోజనం ఎలా అందుతోంది
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- కరోనావైరస్ లక్షణాలను మొదట ఈ వైద్యుడు గుర్తించారు.. అసత్య ప్రచారం ఆపాలంటూ పోలీసులు బెదిరించారు
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)