పారాసైట్, జోకర్, 1917... ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న ఈ సినిమాల ప్రత్యేకత ఏమిటి?

  • భవానీ ఫణి
  • బీబీసీ కోసం
పారాసైట్ మూవీ

ఫొటో సోర్స్, Curzon

సాధారణంగా ఆస్కార్‌కి వెళ్లిన, గెలుచుకున్న సినిమాలన్నీ- అన్నిసార్లూ, అందరినీ ఆకట్టుకోలేవు. కానీ, ఈసారి మాత్రం, '1917', 'జోకర్', 'పారాసైట్'... ఈ మూడు సినిమాలూ ఆ వేదికకే వేడుకతెచ్చేవి. చూసి తీరాల్సినవి. కళ్లలోనూ, మనసులోనూ నింపుకోదగినవి.

పారాసైట్ చిత్రం ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ను దక్కించుకుంది. జోకర్‌ సినిమాలో నటనకు ఉత్తమ నటుడి అవార్డును వాకీన్ ఫీనిక్స్ దక్కించుకున్నారు. 1917 చిత్రం బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో అవార్డులు పొందింది.

మొత్తంగా పారాసైట్ సినిమాకు 4, 1917 చిత్రానికి మూడు, జోకర్ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి.

అసలు ఈ చిత్రాల్లో నటీనటుల ప్రతిభ, కథాకథనాలు, సాంకేతికాంశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఫొటో సోర్స్, AFP/Getty Images

వాస్తవాలకు వ్యంగ్య రూపం 'పారాసైట్'

జోకర్ సినిమాలానే ఈ సౌత్ కొరియన్ సినిమా కూడా ఆర్ధిక అసమానతల గురించి నెగిటివ్ టోన్‌లో మాట్లాడుతుంది. జోకర్ సినిమాకి - జోకర్ ఫిలాసఫీ ప్రాణమైతే, ఈ బ్లాక్ కామెడీ సినిమాకు కథే పంచ ప్రాణాలు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నటన వంటివి కూడా సినిమాకి ఉంటాయన్న స్పృహ కూడా రానివ్వకుండా తనలోకి లీనం చేసుకుంటాయి ఈ సినిమాకు చెందిన కథాకథనాలు. ఓక్జా, స్నో పైర్సర్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సినిమాలకు దర్శకత్వం వహించిన బాంగ్ జూ-హో పారాసైట్ దర్శకత్వం వహించారు.

అతి ముఖ్యమైనది కథే

భార్యాభర్త, ఇద్దరు పిల్లలు ఉన్న కిమ్‌ది బీద కుటుంబం. దీంతో కొడుకు, కూతురు మధ్యలోనే చదువు ఆపేస్తారు. కుటుంబ సభ్యులు నలుగురూ కలిసి అట్ట పెట్టెలు తయారుచేసి అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అంతలో కిమ్ కొడుకు 'కిమ్ కీ-వూ' కి, స్నేహితుడి ద్వారా అనుకోని అవకాశం లభిస్తుంది. బాగా ధనికులైన పార్క్ కుటుంబానికి చెందిన టీనేజ్ అమ్మాయికి ఇంగ్లిష్ ట్యూషన్ చెప్పే ఉద్యోగం దొరుకుతుంది.

పార్క్ కుటుంబంలో కూడా నలుగురు సభ్యులుంటారు. వీరి పిల్లలు ఇంకా చిన్నవాళ్లు. ఇద్దరూ స్కూల్‌లో చదువుతూ ఉంటారు. పార్క్ భార్య అమాయత్వాన్ని గమనించిన కిమ్ కీ-వూ, మెల్లగా తన చెల్లెలిని, పార్క్ కుమారుడైన అల్లరి పిల్లవాడు 'పార్క్ డా-సాంగ్' కు ఆర్ట్ టీచర్‌గా ఆ ఇంట్లోకి తీసుకొస్తాడు. తర్వాత నెమ్మదిగా ఆ ఇంటి డ్రైవర్‌గా వారి తండ్రి 'కిమ్ కి-టెక్' అవతారమెత్తుతాడు. అక్కడ వంట మనిషిగా ఉన్న స్త్రీని తప్పించి వారి తల్లి 'చంగ్ సూక్'ని కూడా ఆ ఇంట్లోకి చేరుస్తారు.

ఫొటో సోర్స్, CURZON

అంతలోనే కథ మరో మలుపు తిరుగుతుంది. అంతకుముందు అక్కడ వంట మనిషిగా పనిచేసిన స్త్రీ లీ-జంగ్, పార్క్ కుటుంబానికి చెందిన సీక్రెట్ బేస్మెంట్‌లో ఆమె భర్తను నాలుగేళ్లుగా దాచిపెట్టి ఉంచినట్టుగా కిమ్ కుటుంబానికి తెలుస్తుంది. కిమ్ కుటుంబమంతా కలిసి, పార్క్ కుటుంబాన్నిమోసం చేస్తున్న సంగతి లీ-జంగ్ కి కూడా తెలిసిపోతుంది. ఇక వారి మధ్య జరిగే సంఘర్షణ అనేక మలుపులు తిరిగి, హింసకు దారి తీస్తుంది. ఆ క్రమంలో కిమ్ కుటుంబం చెల్లాచెదురైపోతుంది. కూతురు చనిపోగా, కొడుకు అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడతాడు. తండ్రి రహస్యంగా దాక్కోవలసి వస్తుంది. పార్క్ కుటుంబం మాత్రం అక్కడినుంచి మరో చోటికి వెళ్ళిపోయి సుఖంగా జీవిస్తుంటుంది.

ధనం తాలూకూ బలాన్ని చాలా విచిత్రమైన కథనంతో చెప్పే కథ ఇది. 1917, జోకర్ సినిమాలు ఎటువంటి ప్రత్యేకమైన ఉద్దేశాలనూ వ్యక్తపరచవు గానీ, పారాసైట్ ది మాత్రం కచ్చితమైన ఉద్దేశాలను మనసులో పెట్టుకుని అల్లిన కథ.

కిమ్ కుటుంబం విపరీతంగా నష్టపోవడం, పార్క్ కుటుంబం ఎటువంటి హానికీ గురికాకుండా క్షేమంగా బయటపడటం వంటి అంశాల ద్వారానే, సినిమా అసలు ఉద్దేశం అర్థమవుతుంది.

ఫొటో సోర్స్, CURZON

పారాసైట్‌లో సమాజాన్ని అద్దంలా పట్టి చూపే వ్యంగ్యంతో కూడిన వాస్తవం ఉంటుంది. చెప్పకుండానే చెప్పి, సూదుల్లా పొడిచే ఆ ముక్కుసూటి నిజాలకు చెందిన తెలివి, నొప్పి కలిగించేదే అయినా ఆశ్చర్యపరుస్తుంది.

"ఆమెకి బాగా డబ్బులున్నా - మంచిది" అంటాడు కిమ్ కుటుంబపు భర్త, మిసెస్ పార్క్‌ని ఉద్దేశించి. "డబ్బులున్నాయి కాబట్టే ఆమె మంచిదయింది. నాకే కనక అంత డబ్బుంటే ఇంకా మంచిగా ఉండేదాన్ని" అంటుంది కిమ్ భార్య.

ఎంతో అమాయకంగా, మంచివాడిలా కనిపించే మిస్టర్ పార్క్, చాలా తేలిగ్గా, అతి మామూలు విషయాలన్నట్టుగా కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తుంటాడు. పనివాళ్ళు, బీద వాళ్ళు వారి పరిధుల్లో వారుండాలనీ, గీత దాటి ముందుకు రావడాన్ని సహించలేమనే అర్థం వచ్చేలా మాట్లాడతాడు. పైగా స్లమ్స్‌లో నివసించేవారి వద్ద నుండి వచ్చే వాసనను అతడు విపరీతంగా అసహ్యించుకుంటాడు. అవతల మనుషుల ప్రాణాలు పోతుంటే, వాసనలు భరించలేకపోవడం వంటి విషయాలే తనకి ముఖ్యమన్నట్టుగా ప్రవర్తిస్తాడు.

ఫొటో సోర్స్, CURZON

కొందరి కనిపించే అమాయకత్వం వెనుక, కనిపించని హిపోక్రసీ ఉంటుంది. ఇంకొందరి భయపెట్టే మోసం వెనుక, తప్పనిసరి అవసరం ఉంటుంది. మొదటి లక్షణం పార్క్ కుటుంబానిదైతే రెండో అవసరం కిమ్ కుటుంబానిది.

ఆర్ధిక అసమానతలు సమాజం మీద చూపే ప్రభావాన్ని ఒక సుదీర్ఘమైన, బిగువైన కథ ద్వారా ఇంత ఎఫెక్టివ్ గా చెప్పడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఈ సినిమా, జోకర్, 1917 లకు పోటీగా ఆస్కార్ ఉత్తమ చలన చిత్ర విభాగంలో నామినేట్ కాగలిగింది.

ఫొటో సోర్స్, ENTERTAINMENT ONE

అయిదు అద్భుతాల '1917'

మనసులోకి అమాంతం చొచ్చుకుని వచ్చి, చేతులు పట్టుకుని తన ప్రపంచంలోకి లాక్కెళ్లిపోయే సినిమా 1917. మొదటి ప్రపంచ యుద్ధపు కాలం నాటి కథాంశాన్ని కలిగి ఉన్న ఈ సినిమాను వార్ సినిమా అనేకంటే, సర్వైవల్ సినిమా అంటే బావుంటుంది.

ఇద్దరు వ్యక్తుల మనుగడ, మరో పదహారు వందల మంది మనుషుల ప్రాణాలను కాపాడటం కోసం, తెగించి వారిద్దరూ చేసిన యుద్ధం కాని యుద్ధమే ఈ 1917. దీనిలో దేశ భక్తి ఉంది. రక్తసంబంధం, మమకారం, అమాయకత్వం, క్రూరత్వం అన్నీ ఉన్నాయి.

ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది. అందుకే ఇది మరో కొత్త ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరించింది.

శత్రువుల పన్నాగం తెలియక జర్మన్ సైన్యం పన్నిన ఉచ్చులో చిక్కుకునేందుకు బయలుదేరతారు విల్ స్కాఫీల్డ్, టామ్ బ్లేక్ అనే ఎనిమిదో బెటాలియన్ సైనికులిద్దరు. రెండో బెటాలియన్‌కు చెందిన బ్రిటిష్ సైన్యాన్నిహెచ్చరించి, తాత్కాలికంగా ఎటాక్‌ను ఆపమని చెప్పడం ద్వారా పదహారువందల మంది సైనికుల ప్రాణాల్ని కాపాడగలిగే సందేశాన్ని పట్టుకుని వారు బయలుదేరతారు.

ఫొటో సోర్స్, ENTERTAINMENT ONE

ఆ పదహారు వందల మందిలో టామ్ సోదరుడు కూడా ఉండటంతో, అతను మరింత ఆదుర్దాతో ప్రయాణానికి సిద్ధమవుతాడు. దాదాపుగా సినిమా మొత్తం వీరిద్దరే కనిపిస్తారు. అప్పుడే సినిమాటోగ్రఫీకి చెందిన మొదటి మ్యాజిక్ మొదలవుతుంది.

వారితో పాటే నడుస్తూ కెమెరా కూడా సినిమాలోని ఒక పాత్రగా మారిపోతుంది. కనిపించని తోటి సైనికుడిలా చూడటం తప్ప మరేమీ చెయ్యలేని నిస్సహాయమైన స్నేహితుడిలా - అది తన పాత్రలో ఒదిగి జీవిస్తుంది. ఒక్కోసారి తట్టుకోలేనంత ఉద్వేగాన్నీ, మరికొన్ని సార్లు పట్టలేనంత ఉత్కంఠనీ అనుభవిస్తూ, ప్రేక్షకుడిలోకి ఎడ్రినలిన్‌ను పంప్ చేస్తుంది. ఎడతెరిపి లేని విషాదం తాలూకు దుఃఖాన్ని పట్టలేని ఆ కెమెరా కన్ను, మన కళ్ళలోకి కన్నీటిని బదిలీ చేసినట్టనిపిస్తుంది.

ఈ విధమైన టెక్నిక్, మధ్యనున్న తెరను మాయం చేసి - ప్రేక్షకుడిని సినిమాకు అతి దగ్గరగా చేరుస్తుంది. యుద్ధంలో చిక్కుకుని, అన్నింటినీ, అందరినీ కోల్పోయి, పేరేమిటో కూడా తెలియని పసిపాపతో పాటుగా ఆ శిధిలాల మధ్యన మిగిలిపోయిన ఒక యువతికి, విల్ తన దగ్గరున్న పాలతో నిండియున్న డబ్బాని చూపించినప్పుడు, ఆమె కళ్లలో కనిపించిన ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని పట్టుకున్న షాట్ విలువ వెలకట్టలేనిది.

రెండో మ్యాజిక్ - ఇదీ కెమెరా చేసేదే. విల్, టామ్‌ల ప్రయాణపు దారిలో అడుగడుగునా ఎదురయ్యే అంతులేని విధ్వంసాన్ని చూపిన ఆ కచ్చితమైన రంగుల తాలూకూ సౌందర్యం మాటల్లో చెప్పేది కాదు.

మూడో మ్యాజిక్ - సౌండ్ రికార్డింగ్, మిక్సింగ్‌లది. ఈ సినిమా పట్టుకోలేకపోయిన శబ్దమంటూ లేనేలేదు. ఇంకా చెప్పాలంటే, ఎప్పుడూ వినని, మామూలు చెవులు గ్రహించలేని కొత్త కొత్త శబ్ధాలనెన్నింటినో ఇది పరిచయం చేసిందని చెబితే అతిశయోక్తి కాదు. ప్రతి శబ్దమూ ఎంత డిటైల్డ్‌గా, కచ్చితంగా ఉందంటే, నడుస్తున్న బూట్లు, మండుతున్న మంటలు, ప్రవహిస్తున్న నీరు, వీస్తున్న గాలి, కదులుతున్న ఆకులు, నలుగుతున్న గడ్డి పరకలు, చివరికి జారుతున్న కన్నీరు, కొట్టుకుంటున్న గుండె చప్పుడూ కూడా వినిపించినంత పనైంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోని అందమైతే, కేవలం వినడం ద్వారా మాత్రమే అనుభవించగలం.

ఫొటో సోర్స్, Getty Images

నాలుగో మ్యాజిక్ - రంగుల కలయిక. పగటి పూట - ఆకాశం, నేల, అడవి, నదులూ వీటన్నింటినీ అలా ఉంచితే, చివరికి మురికి గుంటలూ, బంకర్లూ, శిథిల గృహాలూ, పాత ట్రక్కులూ కూడా విచిత్రమైన రంగులతో మెరిసిపోయాయి. ఇక రాత్రి సమయంలో అయితే, బాంబులుగా పడి, కనిపించినవాటినల్లా కాల్చేస్తూ ఎగసిపడిన ఆ మంటల రంగులు చూస్తే, కనిపిస్తున్న విధ్వంసానికి దిగులు పుడుతుంది గానీ, ఆ వెలుగులు చేసే మాయాజాలం వెనక, ఎరుపూ-నలుపూ రంగుల మేళవింపు వెనకా దాగి ఉన్న మేధను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.

ఐదో మ్యాజిక్ - విల్‌గా నటించిన 'జార్జ్ మ్యాక్ కే', లేతవయసు సైనికుడు టామ్‌గా నటించిన 'డీన్ చార్లెస్ చాప్మన్'ల నటన.

ఇక ఆరో మ్యాజిక్ కూడా చెప్పుకోవాల్సి వస్తే... అది దర్శకుడు సామ్ మెండెస్‌దే. పంచభూతాల్లాంటి ఈ ఐదు మ్యాజిక్‌లతో అతను సృష్టించిన మహాద్భుతం - ఈ 1917 సినిమా.

శత్రువులోని ప్రతీకారేచ్ఛ తన స్నేహితుడిని పొట్టన పెట్టుకుందని, మంచితనం పైన నమ్మకాన్ని కోల్పోలేదు.

వయసుకు కొత్త కలల్ని చూపగల మార్గంలో అందమైన ఓ యువతి అమాయకంగా నిలబడి ఉందని, అక్కడే ఆగిపోలేదు.

రక్తమోడుతూ కూడా శక్తి కొద్దీ పరిగెడుతూనే ఉన్నాడు విల్. సైన్యం నేర్పిన క్రమశిక్షణ తోడుగా, క్రూరమైన యుద్ధానికి కూడా మానవత్వపు రంగుని పూస్తూ, వందల మంది సైనికుల మరణాలను కనీసం కొంత కాలం పాటు వాయిదా వేయగల అవకాశాన్నిచ్చే సందేశాన్ని అవసరమైన చోటికి, అవసరమైన సమయానికి చేరవేశాడు. అత్యంత నిరాశాజనకమైన పరిస్థితులలో కూడా జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూసేందుకు ప్రోత్సహించే ఒక మంచి సినిమా -1917.

ఫొటో సోర్స్, Warner Bros

కలవరపరిచే 'జోకర్'

ఈ జోకర్ చెత్తకుప్పల్లోంచీ, అవమానాల్లోంచీ పుట్టుకొచ్చాడు. దుఃఖంలోంచీ, దైన్యంలోంచీ ఆవిర్భవించాడు. సమాజంలోని అంతులేని క్రూరత్వంలోంచి, జనాల తీవ్రమైన జాలిలేనితనంలోంచి పుట్టుకొచ్చాడు.

అందరినీ నవ్వించాలనుకున్న ఒక అమాయక ప్రాణి, తన లోపలున్న దుఃఖాన్ని మరింతగా అణిచిపెట్టి, అప్పుడేర్పడిన దుర్భరమైన విషాదంలోంచి ఇలా జోకర్‌గా ప్రాణం పోసుకున్నాడు.

అసలు జోకర్ ఎవరు?

ది డార్క్ నైట్ సినిమాతో అత్యంత ప్రజాదరణ పొందిన జోకర్ పాత్ర అసలు పుట్టింది 1940లలోనే. డీస్నీ కామిక్స్ వారి బ్యాట్‌మాన్ సిరీస్‌లో జోకర్ మొదటిసారిగా కనిపిస్తాడు. తర్వాత ఎన్నెన్నో కామిక్, టీవీ సిరీస్‌లలోనూ, సినిమాలలోనూ కనిపించిన ఈ జోకర్ పాత్ర, ఇప్పుడు తనదంటూ ఒక కథ చెబుతానని ఇలా 'జోకర్' సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అమెరికన్ దర్శకుడు టాడ్ ఫిలిప్ ఈ సినిమాని నిర్మించాలనుకోవడం నిజంగా పెద్ద సాహసం. ఎందుకంటే జోకర్ పాత్రకు ఉన్న పాపులారిటీ సామాన్యమైంది కాదు. తెలివైన ఉన్మాదిగా, స్టైల్ ఐకాన్‌గా జనంలో, ముఖ్యంగా యువతలో క్రేజ్‌ను సంపాదించుకున్న మొట్టమొదటి విలన్ - జోకర్. అందులోను, ది డార్క్ నైట్ సినిమాలో జోకర్‌గా నటించిన హీత్ లెడ్జర్ స్థానాన్ని మరెవరైనా భర్తీ చేయగలరని చెప్పి, చేయించి చూపించి, జోకర్ ఫ్యాన్స్‌ను మెప్పించడం కూడా ఇంచుమించు అసాధ్యంగా కనిపించే విషయం.

అంత బలమైన పాత్రకు చెందిన మూల కథను తనదైన శైలిలో అద్భుతంగా చెప్పి, మార్పు చేయలేని సంతకంగా మారిన ఆ పాత్రధారిని ఫీనిక్స్ రూపంలో మళ్లీ బతికించి, దర్శకుడు టాడ్ ఒక గొప్ప సృజనాత్మక విజయాన్ని సాధించగలిగాడు.

ఫొటో సోర్స్, Warner Bros

జోకర్ కథేంటి?

1981లో గోతమ్ అనే కల్పిత నగరంలో... హ్యాహీ అని తల్లి ముద్దుగా పిలుచుకునే బాలుడు ఆర్థర్... ఆమె చెప్పినట్టే ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో, స్టాండ్ అప్ కమెడియన్ కావాలని ప్రయత్నిస్తుంటాడు. 'హాహా' అనే సంస్థలో జోకర్‌గా పనిచేస్తుంటాడు.

కానీ, ఈ సమాజం అతడిని చిన్నచూపు చూస్తుంది. దారుణంగా అవమానిస్తూ, శారీరకంగానూ, మానసికంగానూ కూడా హింసిస్తుంటుంది. దానికితోడు అతనికి కారణం లేకుండానే, ఆపుకోలేనంత నవ్వు వస్తుంటుంది. ఆ స్థితి నుంచి బయటకు రావడానికి సైకియాట్రిక్ చికిత్స తీసుకుంటూ ఉంటాడు. అది పెద్దగా ప్రభావం చూపకపోవడం వల్ల, తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతుంటాడు.

మెల్లగా తన అసలు స్వరూపం అతనికి అర్థం కావడం మొదలవుతుంది. ఇన్నాళ్లూ లోపల దాగిన అతని నైజం ఒక్కసారిగా బయటకొస్తుంది. తను స్కిజోఫ్రినిక్ అన్న విషయం కూడా అతనికి ఆ సమయంలోనే తెలుస్తుంది. దానికితోడుగా గతానికి చెందిన మరికొన్ని భయకరమైన నిజాలు కూడా బయటపడటంతో అతని మనసు పూర్తిగా దారి మళ్లుతుంది.

అతనిలోని హింసాత్మక ప్రవృత్తి కోరలు చాచి గాండ్రిస్తుంది. 'తానంటూ ఒకడు నిజంగా ఉన్నాడా!' అని అతడే సందేహపడే స్థితి నుంచి, ఒక వర్గం ప్రజలు దేవుడిలా ఆరాధించే స్థాయికి చేరుకుంటాడు. తనని బాధ పెట్టినవారిపైన, చిన్నచూపు చూసినవారిపై పగ తీర్చుకుంటాడు.

'అసలు కథ'ను అర్థం చేసుకోవడం సులభమా?

ఈ సినిమా అంతర్లీనంగా రెండు కొసలుగా విడిపోయి సాగుతుంది. మొదటిది ఫిలాసఫీ, రెండోది సైకాలజీ.

జీవితాన్ని అర్థం చేసుకోలేక, మరణానికీ చేరువ కాలేక - జోకర్ తనదైన ఒక కొత్త ఫిలాసఫీని సృష్టించుకుంటాడు. ఇతని ఫిలాసఫీకి పేరు వెతకాలనుకుంటే దానిని నైతిక శూన్యవాదం (మోరల్ నిహిలిజం) అని పిలవవచ్చు.

'The worst part about having a mental illness is, people expect you to behave if u don't laugh' (మానసికమైన రోగం రావడం వలన కలిగే అతి పెద్ద నష్టం ఏమిటంటే, వాళ్ళు కోరుకున్నప్పుడు నువ్వు నవ్వకపోతే, సరిగా ప్రవర్తించే విధంగా వారు నీపై ఒత్తిడి తెస్తారు) అని అతను తన డైరీలో రాసుకుంటాడు. జనం నవ్వమన్నప్పుడు నవ్వలేకా, ఏడిపించినప్పుడు ఏడవలేకా, అతడు తనను తానే ఒక ఉన్మాదిగా భావించుకుంటాడు. చివరికి అలానే మారిపోతాడు.

జనమంతా కలిసి అతనిలోని మంచితనాన్ని చంపేశాక, ఇక అతను జనాన్ని చంపడం మొదలుపెడతాడు. ఇది అతని సైకలాజికల్ సమస్యకు చెందిన కోణం. చిన్న వయసులో హింసకు గురైన కారణంగా, వయసుతో పాటుగా మరిన్ని అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిన కారణంగా, అతడు మానసిక రోగిగా మారి కల్లోలాన్ని సృష్టిస్తాడు.

సినిమా మొదటి భాగం జోకర్ నిజమైన జీవితమైతే, రెండోది అతను వాస్తవమని భ్రమించే అతని ఊహ.

తనకు గన్ ఇచ్చి, కావాలని ఇబ్బందుల్లోకి నెట్టిన రాండల్ అనే సహోద్యోగిని జోకర్ చంపే దృశ్యం - సినిమాలోని అత్యంత కలవరపరిచే సన్నివేశం. అప్పుడే అతనిలోని ఉన్మాదం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. అతని ప్రవర్తనలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. రాండల్‌ను చంపిన తర్వాత, తనను తాను కనుగొన్న స్వేచ్ఛ కలిగించిన తాదాత్మ్యతలో అతడు మెట్ల మీద డాన్స్ చేసే సన్నివేశం, ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది.

జోకర్ ప్రాథమికంగా పోరాడాలనునుకున్నది మాత్రం - సమాజంలోని ఆర్ధిక అసమానతలకు కారణమైన వ్యక్తులతోనూ, సాటి మనిషిని మనిషిగా చూడలేని వికృత మనస్తత్వాలతోనూ మాత్రమేననీ అర్థం చేసుకోవచ్చు. కానీ చివర్లో డాక్టర్ని కూడా చంపడంతో, అతడు తన భావ ప్రకటనా స్వేచ్ఛకోసం ఏదైనా చేయగలిగే స్థితికి చేరుకుంటున్నాడని భావించవచ్చు.

ఫొటో సోర్స్, Warner Bros

సాంకేతికాంశాలు

సినిమాలో అతి ముఖ్యంగా చెప్పుకోదగ్గది, ఆర్థర్‌గా నటించిన వాకీన్ ఫీనిక్స్ నటన. ఇతడు ఈ జోకర్ పాత్ర కోసం ఇంచుమించు 24 కేజీల బరువు తగ్గాడట. బక్కచిక్కిపోయిన శరీరంతో అతను ప్రదర్శించిన హావభావాలు సామాన్యమైనవి కావు.

ఆగకుండా వచ్చే అతని నవ్వే ఈ సినిమాలోని జోకర్ ఫిలాసఫీకి ఆయువు పట్టు. కనుక ఆ నవ్వుకు పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యడంలో ఎటువంటి లోటూ చెయ్యలేదు వాకీన్. నరాలు తెగిపడినట్టుండే ఆ నవ్వు తాలూకూ ఉధృతిని మహా సముద్రంలా పొంగించాడతడు. పిచ్చితనం మనిషికెంత స్వేచ్ఛనిస్తుందన్న విషయాన్ని, అతడు తన స్టెప్స్ ద్వారా - వేల పదాలైనా వివరించలేనంత సమర్ధంగా వివరించాడు.

తర్వాత చెప్పుకోవాల్సింది నేపథ్య సంగీతం గురించి. ఈ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను హిల్డర్ గువోనాడోట్టిర్ అందించారు. ఈమె సృష్టించిన సంగీతం, జోకర్‌లోకి కరిగి కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది. అతని నవ్వులానే, బాధనీ, సంతోషాన్నీ అది ఒకేసారి కేప్చర్ చేస్తుంది. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే, అంతగా కలవరపరిచే సన్నివేశాలనూ, జోకర్ యొక్క హావభావాలనూ - లింక్ తెగకుండా, ఆసక్తి కలిగించే విధంగా అమర్చి పెట్టింది జెఫ్ గ్రాత్ ఎడిటింగ్. 1980ల కాలానికి తగినట్టుగా వెలుగులనూ, రంగులనూ సృష్టించి, అత్యంత నైపుణ్యవంతంగా కెమెరాను కదిలించాడు సినిమాటోగ్రాఫర్ లారెన్స్ షెర్. మొత్తంగా పూర్తి స్థాయి క్రెడిట్‌కు అర్హుడు మాత్రం, దర్శకుడు టాడ్ ఫిలిప్స్‌నే.

జోకర్ సినిమాని సరిగ్గా చూడగలగడం, కొంతవరకూ అర్థం చేసుకోగలగడం - శరీరాన్ని వదిలి చేసే ఆస్ట్రల్ ట్రావెలింగ్ లాంటిది. 'మననుండి మనం' విడివడినట్టనిపించేలా చేసే ఆ విచిత్రమైన అనుభూతిని చేజిక్కించుకోవడం - ఒక గొప్ప అనుభవం.

(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)