పాకిస్తాన్‌‌లో చక్కెర కొరత... ఇబ్బందులు పడుతున్న ప్రజలు

  • 15 ఫిబ్రవరి 2020
పాకిస్తాన్ చక్కెర కొరత Image copyright Getty Images
చిత్రం శీర్షిక కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్‌లో గోధుమ పిండి కొరత ఏర్పడటంతో రొట్టెలు దొరక్క జనాలు ఇబ్బందులు పడ్డారు.

పాకిస్తాన్‌లో నిత్యం ఏదో ఒక కొత్త ఆహార సంక్షోభం పుట్టుకువస్తోంది.

కొన్ని రోజుల క్రితం గోధుమ పిండి కొరత ఏర్పడటంతో రొట్టెలు దొరక్క జనాలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆ సంక్షోభం తీరిపోయిందని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చెబుతోంది. అంతకుముందు పాల విషయంలోనూ అలానే జరిగింది.

ఇప్పుడు తాజాగా చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఈ సమస్యను తీర్చేందుకు రేషన్ షాపుల్లో రాయితీలను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

మరోవైపు చక్కెరను అక్రమంగా నిల్వ ఉంచేవారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.

లాహోర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఎనిమిది వేలకుపైగా చక్కెర బస్తాలను జిల్లా అధికారులు జప్తు చేశారు. వీటన్నింటిలో కలిపి మొత్తంగా 4 లక్షల కిలోలకు పైనే చక్కెర ఉంది.

ఇవన్నీ అక్రమంగా నిల్వ ఉంచిన చక్కెర బస్తాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు మొదలుపెట్టామని లాహోర్ డిప్యూటీ కమిషనర్ దానిశ్ అఫ్జల్ చెప్పారు.

ఈ అక్రమ కార్యకాలాపాల్లో భాగమైనవారిలో ఇదివరకు 'ఎమ్‌పీఓ' చట్టం కింద అదుపులోకి తీసుకున్న నలుగురు వ్యాపారులు కూడా ఉన్నారు.

Image copyright Getty Images

సాధారణంగా ఈ చట్టాన్ని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై ప్రయోగిస్తారు.

చక్కెర నిల్వ ఉంచడం వ్యాపారంలో చాలా అవసరమని వర్తకులు అంటున్నారు. అయితే, అసలు ఇలా ఎంత చక్కెర నిల్వ ఉంచుకోవచ్చనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది.

చక్కెర నిల్వ పెట్టుకోవడం సాధారణమైన విషయంలా అనిపించవచ్చు. కానీ, ఎమ్‌పీఓ చట్టం ప్రయోగించేంతగా పాకిస్తాన్‌ను అది కలవరపెడుతోంది.

చక్కెర ధరలు ఎందుకు పెరిగాయన్నది అర్థం చేసుకోవడం చాలా తేలిక.

దేశ అవసరాలకు తగ్గట్లుగా మిల్లుల్లో చక్కెర తయారైతే, ధరలు స్థిరంగా ఉంటాయి. ఇంకా తగ్గొచ్చు కూడా. కానీ, కొందరు ఎక్కువ లాభం చేసుకుందామనుకునేవాళ్లు ఉంటారు. వాళ్లు చక్కెరను పెద్ద మొత్తంలో నిల్వ చేస్తుంటారు.

చక్కెర మార్కెట్‌కు సరిగ్గా చేరుకోని పరిస్థితి రాగానే వీళ్లు ఆట మొదలుపెడతారు. డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ధర పెరుగుతుంది. అప్పుడు ఆ చక్కెరను ఎక్కువ ధరకు అమ్ముకుని లాభం పొందుతారు.

Image copyright Getty Images

జనవరి నెల 9 నుంచి అధికారులు చక్కెర నిల్వలపై దాడులు మొదలుపెట్టారు. మొదటి రోజు 6,410 బస్తాలు పట్టుకున్నట్లు లాహోర్ డిప్యూటీ కమిషనర్ దానిశ్ అఫ్జల్ చెప్పారు.

ఆహార శాఖ నుంచి లైసెన్సు పొందినవారికే చక్కెర నిల్వ ఉంచుకునే అధికారం ఉంటుందని ఆయన చెప్పారు.

లైసెన్సు లేకుండా చక్కెర నిల్వ చేసుకున్నా, లైసెన్సు తీసుకుని కూడా తమ దగ్గర ఎన్ని బస్తాలున్నాయన్నది పారదర్శకంగా వెల్లడించపోయినా.. నేరమే అవుతుంది.

''లైసెన్సు వెయ్యి బస్తాలకైనా ఉండొచ్చు. 2-3 వేల బస్తాలకైనా ఉండొచ్చు. కానీ, వాళ్లందరి సమాచారం బహిరంగంగా ఉండాలి. లైసెన్సును మించి చక్కెర నిల్వ చేసుకుంటే, నేరం అవుతుంది'' అని అన్నారు.

ఓ పెళ్లి మండపంపై దాడి చేసినప్పుడు తమకు 1500 చక్కెర బస్తాలు దొరికాయని, అవన్నీ లైసెన్సు లేకుండానే నిల్వ చేశారని దానిశ్ అఫ్జల్ తెలిపారు.

Image copyright Getty Images

3-4 సంచులు ఉంచుకున్నా నేరమేనా?

దుకాణదారులు ఎంతో కొంత చక్కెర నిల్వ ఉంచుకోవడం అవసరం. ఇంట్లో కూడా కొందరు ఒకటో, రెండో బస్తాలు కొని పెట్టుకోవచ్చు.

వీళ్ల దగ్గర లైసెన్స్ ఏమీ ఉండదు. మరి, చట్టప్రకారం ఇది కూడా నేరం అవుతుందా?

''సందర్భాన్ని బట్టి ఇది మారుతుంది. ఇదేమీ సమస్య కాదు. బాగా పెద్ద మొత్తంలో నిల్వ చేసినప్పుడే, నేరం అవుతుంది. ఎవరైనా సరైన కారణం చూపకుండా, 100 బస్తాలకు మించి నిల్వ పెట్టుకుంటే అక్రమంగా పరిగణించొచ్చు'' అని దానిశ్ అఫ్జల్ ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చారు.

ఇంట్లోగానీ, రహస్యంగా గానీ అక్రమంగా చక్కెర నిల్వ పెట్టుకుంటే దాన్ని ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది?

పాత రికార్డులను దృష్టిలో పెట్టుకుని కొందరిపై ప్రభుత్వం నిఘా పెట్టొచ్చు. ఇందుకోసం ఓ యంత్రాంగం పనిచేస్తుందని దానిశ్ అఫ్జల్ చెప్పారు.

Image copyright Getty Images

ప్రతి దుకాణానికి గోదాం ఉండటం, వాటిలో చక్కెర నిల్వఉంచుకోవడం సాధారణమేనని.. ఇదేమీ దొంగతనంగా చేసే పని కాదని పాకిస్తాన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ అధికార ప్రతినిధి చౌధరీ అబ్దుల్ హమీద్ బీబీసీతో చెప్పారు.

''ప్రభుత్వ యంత్రాంగానికి ఆ అధికారం ఉంది. కానీ, కొన్ని సార్లు వందల సంఖ్యలో బస్తాలను వదిలేస్తున్నారు. కొన్నిసార్లేమో 100-200 బస్తాలను కూడా పట్టుకుంటున్నారు'' అని ఆయన అన్నారు.

కొన్ని చక్కెర మిల్లుల్లోనూ అక్రమ నిల్వలు చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

మిల్లుల నుంచి మార్కెట్‌లోకి చక్కెర రాకపోతే, డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా ధర కూడా పెరుగుతుంది. మిల్లులు ఇలా లాభం పొందొచ్చు.

పంజాబ్ రాష్ట్రంలో చక్కెర సంక్షోభం లేదని చౌధరీ అబ్దుల్ హమీద్ అంటున్నారు.

''చక్కెర దొరక్కపోతే సంక్షోభం అవుతుంది. కానీ, చక్కెర అందుబాటులో ఉంది. ధర మాత్రం పెరిగిందంతే'' అని ఆయన చెప్పారు.

ఇప్పుడు ధరలు పెరగడానికి కారణం మిల్లుల్లో అక్రమ నిల్వలేనా?

''మిల్లుల్లో ఉన్న చక్కెర గురించి రోజూవారీ రికార్డులు అధికారులకు సమర్పిస్తాం. గతంలో నెలవారీగా రికార్డులు ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడైతే రోజువారీగానే సాగుతోంది'' అని చౌధరీ అబ్దుల్ హమీద్ అన్నారు.

చెరకు గడల ధరలతోపాటు విక్రయ పన్ను (సేల్స్ ట్యాక్స్) పెరగడమే చక్కెర ధర పెరగడానికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

దిల్లీ హింస: అశోక్ నగర్‌లో మసీదుపై జాతీయ జెండా, కాషాయ జెండా ఎగరేసింది ఎవరు - గ్రౌండ్ రిపోర్ట్

బాలాకోట్ వైమానిక దాడి జరిగి ఏడాది.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు

దిల్లీ హింస: ‘దేశాన్ని ప్రేమించేవాళ్లంతా మీ పొరుగువాళ్లను, సమాజాన్ని కూడా ప్రేమించండి’ - అజిత్ డోభాల్

హోస్నీ ముబారక్: కటిక పేదరికంలో పుట్టారు, 30 ఏళ్లు దేశాన్ని ఏలారు.. ఆ తర్వాత కటకటాల పాలయ్యారు

దిల్లీ హింస: అల్లర్ల నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారా.. రాష్ట్ర పరిధిలో ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవా

కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం

పాకిస్తాన్ ఎవరికి భయపడి భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టింది

దిల్లీ హింస వెనక కుట్ర ఉందన్న సోనియా గాంధీ; 20కి చేరిన మృతులు