ఘోస్ట్ హ్యూమన్స్.. ఆఫ్రికాలో అంతు చిక్కని మానవ జాతి ఆధారాలు కనుగొన్న పరిశోధకులు

అంతు చిక్కని మానవ జాతి గుట్టు తెలిసింది

ఫొటో సోర్స్, SPL

ఫొటో క్యాప్షన్,

గుర్తు తెలియని ఆదిమజాతికి సంబంధించిన జన్యువుల్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

ఆదిమ కాలంలో అంతు చిక్కని మానవ జాతి కూడా ఒకటి ఉండేదా..? అవుననే అంటున్నారు పరిశోధకులు. తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో మానవ జాతి ఆరంభదశలో పశ్చిమాప్రికా ప్రాంతంలో ఘోస్ట్ పాపులేషన్ పేరుతో ఓ రహస్యమైన జాతి ఉండేదనడానికి ఆధారాలు లభించాయని వెల్లడించారు.

అంతే కాదు...వారికి సంబంధించిన జన్యుపరమైన లక్షణాలు సుమారు 2 నుంచి 19 శాతం ఆధునికయుగపు పశ్చిమాఫ్రికా పూర్వీకుల్లో కూడా ఉండొచ్చన్నది పరిశోధకుల మాట.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మున్ముందు మరిన్ని రహస్యాలను తెలుసుకోవచ్చంటున్న శాస్త్రవేత్తలు

ఏ ఏ ప్రాంతాల జాతుల్లో ఈ లక్షణాలున్నాయ్ ?

సుమారు 43 వేల ఏళ్ల క్రితం ఈ ఇంటర్‌బ్రీడింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. సియెర్రా లియోనీలోని మెండె జాతి ప్రజలు, నైజీరియాలోని యోర్బా అలాగే ఇసాన్ జాతి ప్రజల్లోనూ, అలాగే గాంబియాలోని ఇతర జాతుల్లోనూ నాటి అంతు చిక్కని మానవ జాతి లక్షణాలు ఇంకా మిగిలి ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

అంటే యూరోపియన్లు ఎలాగైతే నియాండర్టాల్ అంటే సుమారు 40వేల ఏళ్ల క్రితం యురేషియా ప్రాంతంలో నివసించిన జాతితోనూ, అలాగే ఓషియానిక్ అంటే మధ్య, దక్షిణ పసిఫిక్ ప్రాంతాల్లో నివసించే వారికి డెనిసోవెన్స్‌తోనూ జతకలిసారో... అలాగే ఆధునిక పశ్చిమాఫ్రికాకు చెందిన పూర్వీకులు కూడా గుర్తు తెలియని ఆ పురాతన జాతితో జతకలిసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇప్పటికీ ప్రపంచానికి అంతంత మాత్రంగానే అర్థమవుతూ, జన్యు పరంగా అత్యంత వైవిధ్యం కనిపించే ఆఫ్రికన్లతో ఈ అతి ప్రాచీన మానవులు ఎలా జతగూడారన్న విషయం తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు తాజా పరిశోధన మరింత దృష్టి కేంద్రీకరించే అవకాశం లభించిందని చెప్పొచ్చు.

మూలాలు ఎక్కడున్నాయ్ ?

వందల వేల ఏళ్ల క్రితం మానవుల్లో మోడ్రన్ హ్యూమన్స్, నియాండర్టాల్, డెనీ సోవెన్స్ సహా అనేక జాతులుండేవి. శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన ఘోస్ట్ పాపులేషన్ కూడా ఆ సమూహాల నుంచి పుట్టుకొచ్చి ఉండొచ్చు.

మున్ముందు ఇలాంటి సమూహాల్ని మరిన్ని గుర్తించే అవకాశం ఉందని లాస్ ఏంజెల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన కంప్యూటేషనల్ బయాలజిస్ట్‌, ఈ పరిశోధనకు నాయకత్వం వహిస్తున్న శ్రీరామ్ శంకర్‌రామన్ బీబీసీ న్యూస్ డేతో చెప్పారు.

ప్రస్తుతం పశ్చిమాఫ్రికన్ల జన్యువుల్ని పరిశోధనలు చేస్తున్న సమయంలో గుర్తు తెలియని ఆదిమజాతికి సంబంధించిన డీఎన్ఏలను గుర్తించామన్నారు. విభిన్న జాతులకు చెందిన మరింత కచ్చితమైన సమాచారం లభిస్తే తద్వారా మరింత లోతైన పరిశోధనలు నిర్వహించగలమని అప్పుడే ఈ అంతు చిక్కని జాతి రహస్యాలను ఛేదించే అవకాశం ఉంటుందని శంకర్‌ రామన్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)