ఐఫోన్లకు కరోనా వైరస్ దెబ్బ.. ఉత్పత్తి, అమ్మకాలు, ఆదాయంపై ప్రభావం పడిందన్న ఆపిల్

మాస్క్ ధరించి ఐఫోన్ చూస్తున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

చైనాని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఐఫోన్ ఉత్పత్తి, అమ్మకాలపై కూడా పడిందని టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ ప్రకటించింది.

దీంతో మార్కెట్లో ఐఫోన్ల లభ్యత తాత్కాలికంగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ తమ ఆదాయంపై ప్రభావం చూపిస్తుందని ప్రకటించిన యుఎస్ కంపెనీల్లో ఆపిల్ మొదటిది.

ఈ ఆర్ధిక త్రైమాసికంలో ఆపిల్ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా 6700 కోట్ల రూపాయిల ఆదాయం వస్తుందని అంచనా వేసినప్పటికీ కరోనా వైరస్ ప్రభావంతో ఈ మొత్తం సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించటం లేదని పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ సాధారణ స్థితి నెలకొనడానికి సమయం పడుతుందని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో చెప్పింది.

చైనాలో కొన్ని ప్రాంతాలలో చాలా ఐఫోన్ స్టోర్లు పూర్తిగా మూసివేయడం వలన లేదా తక్కువ సమయం తెరిచి ఉంచడం వలన అమ్మకాల పై ప్రభావం పడిందని తెలిపింది.

ఐఫోన్ల తయారీ కంపెనీలు కరోనా వైరస్‌ పుట్టిన హుబే ప్రాంతానికి అవతల ఉన్నప్పటికీ ఉత్పత్తి అనుకున్నంత వేగంగా జరగటం లేదని తెలిపింది.

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ఆపిల్ స్టోర్లు, పార్టనర్ స్టోర్లు తెరవలేదు. తెరిచి ఉంచిన కొన్ని స్టోర్లు కూడా చాలా తక్కువ సమయం మాత్రమే పని చేయడం వలన, వినియోగదారుల సంఖ్య కూడా తగ్గిందని కంపెనీ ప్రకటనలో పేర్కొంది. ఈ స్టోర్లను నెమ్మదిగా తెరవడం ప్రారంభిస్తామని చెప్పింది.

ఐఫోన్లకి అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన చైనాలో కరోనా వైరస్ ప్రభావంతో తొలి త్రైమాసికంలో ఐఫోన్లకి డిమాండ్ తగ్గవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఇబ్బందుల వలన కార్ల పరిశ్రమ మీద కూడా ఈ ప్రభావం ఉండవచ్చని పేర్కొన్నారు. భారీ యంత్ర సామాగ్రిని తయారుచేయడానికి కావల్సిన కొన్ని పరికరాల కొరత కారణంగా బ్రిటన్‌లో తమ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు జె సి బి కంపెనీ ప్రకటించింది.

కరోనా వైరస్ ప్రభావం ఐఫోన్ల అమ్మకాల పై ప్రభావం చూపిస్తుందని ముందుగానే అంచనా వేసినప్పటికీ, ఫిబ్రవరి మధ్య వారానికి కనిపిస్తున్న ఆదాయ వివరాలని పరిశీలిస్తే ప్రభావం అనుకున్నదాని కంటే ఎక్కువగా ఉందని తెలుస్తుందని వెడ్ బుష్ విశ్లేషకుడు డేనియల్ ఇవ్స్ చెప్పారు.

వైరస్ వ్యాప్తి కేంద్రీకృతమైన ప్రాంతానికి వెలుపల గత 13 రోజుల నుంచి కరోనా వైరస్ కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. గత వారంలో 450 కేసులు నమోదు కాగా ఈ వారం అవి 115కి తగ్గాయి.

ఫ్యాక్టరీలు, షాప్‌లు నెమ్మదిగా తెరుస్తున్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావం మాత్రం చైనా ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆపిల్ ఇచ్చిన హెచ్చరిక మాత్రం నిర్లక్ష్యం చేయడానికి లేదు.

కరోనా వైరస్ వలన ప్రపంచ వృద్ధిలో ఆర్ధికంగా 0.1 - 0.2 శాతం తగ్గుదల ఉండవచ్చని, కానీ ఈ వైరస్ ప్రభావం గురించి చాలా అనిశ్చితి ఉందని, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అధికారి క్రిస్టలీనా జార్జీవ అన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)