కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు?

థాయిలాండ్ పర్యాటక ప్రాంతాలను చూపిస్తున్న ప్రకటన పక్కనుంచి వెళ్తున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

ఏడాది పొడవునా, ముఖ్యంగా నవంబర్ నుంచి ఏప్రిల్ నెలల మధ్యలో పర్యటక రంగానికి డిమాండ్ ఉండే థాయిలాండ్‌లో ఆలయాలు, బీచ్‌లు, రిసార్టులు సందర్శకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

కానీ, ఇపుడు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. సాధారణంగా యాత్రికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశాలు, ఇప్పుడు వారు లేక బోసిపోతున్నాయి.

బ్యాంకాక్ , పట్టాయ, ఫుకెట్, చియాంగ్ మాయ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే చైనీస్ సందర్శకులు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయారు.

కోవిడ్-19 కేసులు నమోదైన దేశాల్లో చైనా తర్వాత థాయిలాండ్ ఐదో స్థానంలో ఉంది. దీని ప్రభావం థాయ్ పర్యాటక రంగంతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా పడింది.

థాయిలాండ్‌లో 35 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.

గతేడాది థాయిలాండ్‌ని సందర్శించిన పర్యటకుల సంఖ్య దాదాపు 4 కోట్ల మంది అయితే, అందులో చైనా నుంచి వచ్చిన వారు 27 శాతం ఉన్నారు.

పర్యటకుల సంఖ్య తగ్గడంతో ఆ ప్రభావం తమ వ్యాపారంపై పడిందని పూల వ్యాపారుల నుంచి టూరిస్టు గైడ్‌ల వరకు, వీధి వ్యాపారుల నుంచి హోటల్ యజమానులు వరకు అంతా బాధపడుతున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల పర్యటనలపై కూడా చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

చైనా సందర్శకులు ఎక్కువగా వచ్చే థాయిలాండ్ పర్యాటక రంగానికి ఇది ఒక పెద్ద దెబ్బ. థాయిలాండ్ స్థూల జాతీయ ఉత్పత్తిలో పర్యటక రంగం వాటా 13 నుంచి 14 శాతం ఉంటుందని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా.

థాయిలాండ్ వచ్చే యూరోపియన్ సందర్శకుల సంఖ్య గత ఏడాది నుంచి తగ్గుతూ వస్తున్నా, చైనా యాత్రికుల సంఖ్య మాత్రం పెరుగుతోంది.

కొన్ని దేశాలు చైనా నుంచి వచ్చే యాత్రికులపై ఆంక్షలు విధించినా, థాయిలాండ్ మాత్రం చైనా నుంచి వచ్చేవారిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. థాయిలాండ్ ప్రభుత్వ సంస్థలు, వ్యాపార వర్గాలు పర్యటకుల రాకకు స్వాగతం పలుగుతున్నాయి.

అది చైనా మెప్పు పొందే ప్రయత్నమో, లేక మద్దతు ప్రకటించడానికో చేస్తోంది కాదు.

చైనాలో కరోనా వైరస్ ప్రభావం త్వరగా నియంత్రించకపోతే ఇది థాయిలాండ్ ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, AFP

కరోనా వైరస్ ప్రభావం వల్ల 2020 మొదటి త్రైమాసికంలో థాయ్ పర్యాటక రంగానికి రూ.170 కోట్ల నష్టాలు ఉంటాయని 'ది అసోసియేషన్ అఫ్ థాయ్ ట్రావెల్ ఏజెంట్స్' అంచనా వేసింది.

ఏడాది అంతటికీ కలిపి ఈ నష్టం రూ.960 కోట్ల రూపాయిలు ఉండొచ్చని అంచనా వేశారు.

"మాకు చైనా యాత్రికులే హీరోలు. ఇపుడు వారి సంఖ్య సున్నాకి పడిపోయింది" అని థాయ్ - చైనీస్ టూరిజం అలయన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రొన్నారోన్గ్ చెవిన్ సిరియమ్ నూయి అన్నారు.

"ఈ ఆంక్షలు ఎపుడు ముగుస్తాయో తెలియదు. కానీ, ఇవి మా వ్యాపారం మీద చాలా ప్రభావం చూపించాయి. దీంతో ఇక్కడ ఉద్యోగాలకి కూడా నష్టం జరిగిందని మాకు అర్ధమవుతోంది" అని అయన అన్నారు.

"సుమారు 25 వేల మంది టూరిస్ట్ గైడ్‌లు ఉన్న థాయిలాండ్‌లో ఈ ప్రభావంతో ఇప్పటికే చాలా ఉద్యోగాలపై పడింది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక టూరిజం గైడ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

అందమైన సముద్ర తీరం, ఖాళీగా హోటళ్లు

థాయిలాండ్ తూర్పు ప్రాంతంలో అందమైన తీరాలు ఉండే పట్టాయ చైనా ప్రజలను ఆకట్టుకునే బీచ్‌గా పేరు పొందింది.

కానీ, గత వారంలో 300 గదులు ఉన్న ఒక హోటల్లో కేవలం 4 గదులు మాత్రమే నిండాయని బీబీసీ థాయ్‌కి తెలిసింది. వీరిలో ఒక్క చైనా యాత్రికుడు కూడా లేరు.

చైనా యాత్రికులు అత్యధికంగా సందర్శించే హిందూ ఆలయం ఎరావంకికి పర్యాటకుల తాకిడి తగ్గిపోవడంతో తన వ్యాపారం సగానికి పడిపోయిందని, ఆ ఆలయం దగ్గర పూలు అమ్ముకునే ఇద్దరు పిల్లల తల్లి ఒకరు చెప్పారు.

"కరోనా వైరస్ వ్యాపించక ముందు నేను రోజుకి 32 డాలర్లు(రూ.2200కు పైగా) సంపాదించేదానిని. ఇపుడు కేవలం 16 డాలర్లు(రూ.1144) మాత్రమే వస్తున్నాయని" ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఆమె చెప్పింది.

ఈ ఆలయంలో చతుర్ముఖ బుద్ధుడిని సందర్శించడానికి వచ్చే చైనా యాత్రీకులు తన దగ్గర ఎక్కువ పూలు కొనేవారని చెప్పింది.

ఒంటరిగా నాట్యం

ఆ ఆలయం దగ్గర శాస్త్రీయ నృత్యం చేసే ఇద్దరు కళాకారులు కూడా బీబీసీతో తమ వేదనని పంచుకున్నారు

"నా ఆదాయం కూడా సగానికి పైగా పడిపోయింది. నాకు వేరే దారి లేదు. ఈ పరిస్థితి వచ్చే రెండు నెలల్లో మారుతుందేమో అని ఆశ ఉంది. లేదంటే నేను దాచుకున్న డబ్బులు కూడా ఖర్చైపోతాయి. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది" అని సువణ్ణా తొంగ్ఫై చెప్పారు

"శుక్రవారం అయితే మేము కనీసం 200 నుంచి 250 డాన్స్‌లు చేస్తాం. ఇవాళ శుక్రవారం... మధ్యాహ్నం 2 గంటలు దాటింది. ఇప్పటికి 120 డాన్సులే చేశాం" చెప్పింది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

వాట్ అరుణ్ మందిరం

పర్యాటకులు తగ్గడంతో తన సిబ్బందిని కూడా పనిలోంచి తొలగించవలసి వచ్చిందని, అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో సీ ఫుడ్ అమ్మే వ్యాపారి పాట్ పాట్సోర్న్ తాన్యాతనవాంగ్ చై కూడా చెప్పింది.

గతంలో పది మంది సిబ్బంది ఉండేవారు. ఇపుడు ఇద్దరిని పనిలోకి రావద్దని చెప్పానని ఆమె చెప్పారు.

సోషల్ మీడియాలో ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితో థాయ్ ప్రజా ఆరోగ్య శాఖ మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ , చైనా నుంచి వచ్చే యాత్రీకులకు 'వీసా ఆన్ అరైవల్' తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. కానీ థాయ్ ప్రభుత్వం ఈ సూచనని తిప్పి కొట్టింది.

పర్యటకులపై ఆంక్షల కంటే ప్రయాణికుల వైద్య పరీక్షలు, స్క్రీనింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు థాయిలాండ్ ఆరోగ్య మంత్రి చెప్పారు.

మెకాంగ్ బ్లూస్

జియాంగ్ గుయెన్ , బీబీసీ వియత్నమీస్ ఎడిటర్

కరోనా వైరస్ ప్రభావానికి గురైన దేశాలలో థాయ్‌లాండ్‌తో పాటు మరి కొన్ని దేశాలు మెకాంగ్ నదీ ప్రాంతంలో ఉన్నాయి. వైరస్ ప్రభావానికి గురై తీవ్రం నష్టపోయిన దేశాల్లో వియత్నాం ఒకటి.

కరోనా వైరస్ ప్రభావం పడక ముందు వియత్నాం, చైనాల మధ్య 10,600 కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది.

2019 లో వియత్నాంని సందర్శించిన కోటీ 55 లక్షల మంది విదేశీ యాత్రికులలో 30 శాతం మంది చైనా పర్యటకులే ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

గోల్డెన్ బ్రిడ్జ్, వియత్నాం

కొత్త సంవత్సరానికి ముందు వియత్నాం వచ్చే యాత్రీకుల సంఖ్య ఒక్క నెలలోనే 72.6 శాతం పెరిగిందని, వియత్నాం వార్తా పత్రిక జింగ్ పేర్కొంది.

జాతీయ స్థాయిలో చైనా సందర్శకుల రాకపై వియత్నాంలో ఎలాంటి ప్రత్యేక ఆంక్షలు లేనప్పటికీ, కరోనా వైరస్ ప్రభావంతో వియత్నాంకి వచ్చే పర్యటకుల సంఖ్య కూడా తగ్గిపోయింది.

చైనా కూడా వియత్నాంకు వెళ్లే విమాన సేవలని నిలిపివేసింది.

వియత్నాం ఆర్ధిక వ్యవస్థలో పర్యటక రంగం వాటా 3000 కోట్ల రూపాయలు.

వియత్నాంపై కరోనా వైరస్ ప్రభావం ఏ మేరకు ఉంది అనేది చెప్పడానికి అధికారిక అంచనాలు లేవు.

ఫొటో సోర్స్, EPA

థాయిలాండ్ ప్రభుత్వ నిర్ణయాన్ని థాయ్ - చైనీస్ టూరిజం అలియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రొన్నారోన్గ్ చెవిన్ సిరియమ్ నూయి సమర్ధించారు. ఇది చైనాతో సుహృద్భావ సంబంధాలు కొనసాగించడానికి సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు

"చైనీయులకు మా దేశం సరిహద్దులు తెరిచి ఉంచడం ద్వారా, ఆ దేశంతో మా స్నేహ సంబంధాలు ఎంత గొప్పవో మేం చాటుతున్నాం" అన్నారు.

ఈ నిర్ణయాన్ని అందరూ సమర్ధించటం లేదు.

"హెల్త్ ఎమర్జెన్సీకి అంతర్జాతీయ సంబంధాలకి పొంతన లేదని, ఇలాంటి ఆరోగ్య విపత్తు సమయంలో ఆంక్షలు విధించడంలో తప్పు లేదని" ధమ్మసత్ యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ప్రాజక్ కొంగకిరాతి అన్నారు.

దేశాల మధ్య స్నేహం చాటడానికి సేవా కార్యక్రమాలు చేపట్టవచ్చని ఆయన చెప్పారు.

థాయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, వ్యాధి నివారణ చర్యలు, అంతర్జాతీయ సంబంధాల వ్యవహారాల నిర్వహణ పట్ల వారి నిర్లక్ష్య ధోరణిని చూపిస్తోందని చెప్పారు.

థాయిలాండ్ ప్రజలు మాత్రం ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు కనిపించటం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)