ట్రంప్ భారత పర్యటన: ప్రవాస భారతీయుల ఓట్లు రాబట్టుకోవాలన్న కోరిక నెరవేరుతుందా?

  • ఫైజల్ మొహమ్మద్ అలీ
  • బీబీసీ ప్రతినిధి
ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

డోనల్డ్ ట్రంప్ తన ప్రతిపాదిత భారత పర్యటన సందర్భంగా లక్షలాది ప్రజల గురించి మాట్లాడారు. ప్రధాన మంత్రి మోదీ అయితే విమానాశ్రయం(అహ్మదాబాద్) నుంచి స్టేడియం వరకూ జరిగే రోడ్‌ షోకు 50-70 లక్షల మంది హాజరవుతారని అన్నట్లు చెప్పారు.

బహుశా, ట్రంప్ మనసులో హ్యూస్టన్‌లో 'హౌడీ మోడీ కార్యక్రమానికి హాజరైన దాదాపు 50 వేల మంది భారత, అమెరికన్ల మధ్య భారత ప్రధాని మోదీ తన చిరపరిచిత శైలిలో 'అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్'(ఈసారీ ట్రంప్ ప్రభుత్వాన్ని గెలిపించండి) అనడం గుర్తొచ్చే ఉంటుంది.

అయితే 'ద న్యూయార్క్ టైమ్స్' లాంటి చాలా అమెరికా పత్రికలు ఈ ర్యాలీలో అమెరికా అధ్యక్షుడిని మోదీ హ్యాంగర్‌లా వర్ణించింది. కానీ డోనల్డ్ ట్రంప్‌కు మాత్రం, భారత సంతతి వారైన 40 లక్షల అమెరికన్లు ముఖ్యం. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి.

అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన, దాని వల్ల ట్రంప్‌కు లభించపోయే మూడు అతిపెద్ద ప్రయోజనాల గురించి మాట్లాడిన 'ద హిందూ' దౌత్య అంశాల ఎడిటర్ సుహాసిని హైదర్ "ఈ పర్యటన ప్రవాసుల ఓట్లను ప్రభావితం చేస్తుందని ట్రంప్ అనుకుంటున్నాట్లు" చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

నరేంద్ర మోదీ, డోనల్డ్ ట్రంప్

కశ్మీర్ 'వైల్డ్ కార్డ్'

డోనల్డ్ ట్రంప్ వ్యాపార ఒప్పందాలు, దౌత్య సంబంధాలను చెడగొట్టిన తన ఇమేజ్‌ను సరిదిద్దుకునే ప్రయత్నాలతోపాటు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం కూడా చేస్తారు. సుహాసినీ హైదర్ చెబుతున్నదాన్ని బట్టి ఈ పర్యటనలో కశ్మీర్ 'వైల్డ్ కార్డ్' అవుతుంది.

ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమయ్యే అమెరికా అధ్యక్షుడి భారత పర్యటనకు కొన్ని రోజుల ముందే నలుగురు అమెరికా ఎంపీలు, తమ విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోకు లేఖ రాశారు. భారత్‌లో ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ లేనంతగా సుదీర్ఘ ఇంటర్నెట్ నిషేధం, సామాన్యులు, నేతల సుదీర్ఘ నిర్బంధం గురించి గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ లేఖ రాసిన ఎంపీల్లో ఇద్దరు అధ్యక్షుడు ట్రంప్ పార్టీ రిపబ్లికన్‌ వారు కాగా, మరో ఇద్దరు ప్రతిపక్ష డెమోక్రాట్ పార్టీ వారు.

ట్రంప్ ఇంతకు ముందు కశ్మీర్ అంశంలో భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని చొరవ చూపారు. అయితే భారత్ దానిని స్పష్టంగా తిరస్కరించింది.

పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత్ దాడి చేసినప్పుడు పట్టుబడిన ఎయిర్‌ఫోర్స్ పైలెట్ అభినందన్‌ను విడుదల చేయించడంలో కూడా కీలక పాత్ర పోషించినట్టు అప్పట్లో అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు మళ్లీ దానికి ప్రయత్నించవచ్చు.

ట్రంప్ ముఖ్యమైన నినాదాల్లో 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' ఒకటి.

ఇప్పటివరకూ జరిగిన సర్వేల్లో డోనల్డ్ ట్రంప్ పాపులారిటీ గణాంకాలు 50 లోపలే ఉన్నాయి. అమెరికాకు కీలకంగా అనిపించే ఎలాంటి నిర్ణయం అయినా ఆ గణాంకాలను మరింత పైకి తీసుకెళ్లడానికి చాలా సహకరిస్తుంది.

ఫొటో సోర్స్, EPA

రక్షణ, మిగతా ఒప్పందాలు

రాయిటర్స్ వివరాల ప్రకారం ఫిబ్రవరి 24న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిల్లీలో వివిధ రంగాలకు చెందిన కొందరు భారత ప్రముఖులను, పెద్ద కంపెనీల ప్రతినిధులను కలవబోతున్నారు.

ముఖ్యంగా, ఎన్నికల వేళ అమెరికా నిర్మాణ రంగాన్ని బలోపేతం చేయడం, అక్కడ కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించడం ట్రంప్ ప్రభుత్వానికి చాలా కీలకం.

అమెరికాలో ఐదు నెలల వరుస మందగమనం తర్వాత ఇటీవల జనవరిలో నిర్మాణ రంగం గణాంకాలు మెరుగుపడ్డాయి. కానీ ఆర్థికవ్యవస్థ పూర్తి పునరుద్ధరణ లక్ష్యం ఇంకా దూరంగానే ఉంది.

మహీంద్రా అండ్ మహీంద్రా అమెరికాలో ఒక బిలియన్ డాలర్ పెట్టుబడుల గురించి, దానివల్ల ఏర్పడే కొత్త అవకాశాల గురించి చెప్పింది. 100 బిలియన్ డాలర్ల విలువ చేసే 13 టాటా గ్రూప్ కంపెనీలు అమెరికాలో ఉన్నాయి. వాటిలో 35 వేల మంది పని చేస్తున్నారు.

వ్యాపార సంస్థ సీఐఐ అధ్యయనం ప్రకారం అమెరికాలో దాదాపు 100 భారత కంపెనీలు ఉన్నాయి. అక్కడ మొత్తం 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిలో లక్ష మందికి పైగా అమెరికా కార్మికులు ఉపాధి పొందారు.

అధ్యక్షుడు ట్రంప్‌ను కలవబోతున్న పారిశ్రామిక వేత్తల జాబితాను క్లియరెన్స్ కోసం అమెరికా అధ్యక్ష కార్యాలయానికి పంపించారని, దిల్లీలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం దానిని పర్యవేక్షిస్తోందని పీటీఐ చెప్పింది.

ట్రంప్ పర్యటన సందర్భంగా భారత స్టీల్, అల్యూమినియంపై విధించిన పన్నులు తగ్గించాలని, వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాలు, ఆటో రంగంలో ఎక్కువ ఉదార విధానాలు పాటించాలని, అమెరికా వైపు నుంచి సుంకం తగ్గించాలని డిమాండ్లు ఉండవచ్చు.

అమెరికా నుంచి భారత్ 24 యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలు చేయడానికి 2.6 మిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాన్ని కూడా ఫైనల్ చేస్తుందని కూడా ఆశిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

భారత-అమెరికన్ల ఓటు

ట్రంప్ ఆశలు, ఎంతోమంది విశ్లేషకుల వాదనలు పక్కన పెడితే, భారత సంతతి అమెరికన్ల నుంచి ఆయనకు ఎన్ని ఓట్లు పడతాయి.. అనేదానిపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.

'ఏషియన్ అమెరికన్ లీగల్ డిఫెన్స్, ఎడ్యుకేషన్ ఫండ్' సంస్థ వివరాల ప్రకారం ఎక్కువ మంది ప్రవాస భారతీయులు డెమోక్రాట్స్ ఓటర్లుగా రిజిస్టరై ఉన్నారు. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో వీరిలో 77 శాతం మంది హిల్లరీ క్లింటన్‌కు తమ ఓట్లు వేశారని ప్రముఖ పత్రిక 'ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ' చెప్పింది.

అయితే ఇటీవల కొన్నేళ్లుగా ఆ దేశంలో 'అమెరికా రిపబ్లికన్ హిందూ కొలిషన్' లాంటి సంస్థలు విస్తరిస్తున్నాయి.

రాజకీయ పరంగా అధ్యక్షుడికి ఇవి ఎంత వరకూ సహకరిస్తుంది అనేది చెప్పడం కష్టం అని ప్రవాస భారతీయుల సంస్థ ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషీపురా చెప్పారు.

ఇద్దరు నేతల మధ్య సన్నిహిత సంబంధాలను ఓటరు ఎలా చూస్తాడనేది వారిపైనే ఆధారపడి ఉంటుందని సంజీవ్ చెప్పారు.

"కానీ, తన ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకునేటపుడు, అధ్యక్షుడు ట్రంప్ వారి గురించి చేసిన ప్రకటనలు, చర్యలు, అమెరికా వీసాను కష్టతరం చేయడం లాంటి విషయాలు ఓటరు మనసులో ఎక్కడో ఒక చోట కచ్చితంగా తిరుగుతాయి. భారత్ లాంటి దేశాల నుంచి అక్కడికి వెళ్లిన వృత్తి నిపుణులపై వాటన్నిటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)