జర్మనీలో రెండుచోట్ల తుపాకీ కాల్పులు, తొమ్మిది మంది మృతి

జర్మనీలో కాల్పులు

జర్మనీలోని హనావు నగరంలోని హుక్కా బార్ల దగ్గర జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో 9 మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

హుక్కా బార్ల దగ్గరకు వచ్చిన తుపాకులు ధరించిన వ్యక్తి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు కాల్పులు ప్రారంభించారని పోలీసులు బీబీసీకి తెలిపారు.

అతను అతివాది అని, టర్కీ మూలాలున్న వ్యక్తుల్ని కాల్చి చంపాడని పోలీసులు చెబుతున్నారు.

ఉగ్రవాద కేసుగా దీనిని పరిగణిస్తున్నారు.

కాల్పులు జరిపింది 43 ఏళ్ల టొబియాస్ ఆర్ అని స్థానిక మీడియా పేర్కొంది. ఇతను జర్మన్ అని వెల్లడించింది.

కాల్పులకు పాల్పడ్డట్టు అనుమానిస్తున్న ఇతని మృతదేహం అతని ఇంట్లో లభించింది. అతని తల్లి మృతదేహం కూడా పక్కనే ఉంది.

కొన్ని రోజుల కిందట ఇతను ఒక వీడియోలో అతివాద కుట్ర సిద్ధాంతాలను వివరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో పెట్టిన ఈ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు.

వర్ణ వివక్ష విషం లాంటిదని, సమాజంలో ఉన్న ఈ విషం ఇప్పటికే చాలా నేరాలకు కారణమైందని జర్మనీ ఛాన్స్‌లర్ ఏంగెలా మెర్కెల్ అన్నారు.

అనుమానితుల కోసం వెతుకుతున్నామని, వారు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.

మొదటి కాల్పుల ఘటన నగరం మధ్యలో ఉన్న ఓ బార్ వద్ద జరగగా, రెండోది కెస్సెల్‌స్టాట్ వద్ద జరిగింది.

ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో పోలీసులు, హెలీకాప్టర్లు పెట్రోలింగ్ చేస్తున్నాయి.

"మొదటి ప్రదేశంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఆ తర్వాత వారు రెండో ప్రదేశానికి చేరుకుని అక్కడ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు" అని స్థానిక మీడియా హెసెన్స్‌చౌ తెలిపింది.

ముదురు రంగు వాహనం ఒకటి ఈ ప్రాంతాల నుంచి వెళ్లడం కనిపించింది.

హెసెన్ రాష్ట్రంలోని హనావు నగరం ఫ్రాంక్‌ఫర్ట్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)