క్వాడన్ బేల్స్: ‘పొట్టిగా ఉన్నానని స్కూల్లో ఏడిపిస్తున్నారు, చచ్చిపోవాలనిపిస్తోంది’ అన్న బాలుడికి అండగా నిలిచిన ప్రపంచం

  • 22 ఫిబ్రవరి 2020
క్వాడన్ బేల్స్ Image copyright YARRAKA BAYLES
చిత్రం శీర్షిక క్వాడన్ బేల్స్ ఏడుస్తున్న వీడియోను ఆన్‌లైన్‌లో లక్షలాది మంది చూశారు

స్కూల్లో ఏడిపించారని తొమ్మిదేళ్ల ఆస్ట్రేలియా బాలుడు బాధపడుతున్న వీడియో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆ చిన్నారికి అండగా నిలుస్తున్నారు.

పొట్టిగా ఉన్నాడని స్కూల్లో ఆటపట్టించడంతో ఏడుస్తున్న కొడుకు క్వాడన్ వీడియో క్లిప్‌ను అతడి తల్లి యర్రక బేల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

"ఏడిపించడం వల్ల ఇలాగే జరుగుతుంది" అని ఆమె ఆ వీడియోలో చెప్పారు. అందులో ఆమె కొడుకు "నాకు చచ్చిపోవాలని అనిపించింది" అని కూడా చెబుతాడు.

ఈ వీడియోను కోటీ 40 లక్షల మందికి పైగా చూశారు. "#WeStandWithQuaden" అనే హ్యాష్‌టాగ్‌తో ఎంతోమంది అతడికి సందేశాలు పంపుతూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

హాలీవుడ్ నటుడు హ్యూ జాక్‌మన్, బాస్కెట్ బాల్ ఆటగాడు ఎనెస్ కాంటెర్ దీనిపై మాట్లాడారు. ఇతర దేశాల్లో ఉన్న చాలామంది తల్లిదండ్రులు కూడా అతడికి ధైర్యం చెబుతూ తమ పిల్లలతో వీడియో సందేశాలు చేయించి షేర్ చేస్తున్నారు.

జాక్‌మాన్ తన ట్విటర్‌లో క్వాడన్‌తో "నువ్వు నీకు తెలిసిన దానికంటే బలవంతుడివి" అన్నాడు. అందరూ దయతో ఉండాలని కోరాడు.

ఆరు నిమిషాల ఈ వీడియోను మంగళవారం పోస్ట్ చేశారు. తన కొడుకు క్వాడన్‌ను స్కూల్లో ప్రతిరోజూ దారుణంగా ఏడిపిస్తున్నారని అతడి తల్లి చెప్పారు. ఈ కుటుంబం క్వీన్స్‌లాండ్‌లో నివసిస్తోంది.

కొడుకు గట్టిగా ఏడుస్తుంటే "నేను నా కొడుకును ఇప్పుడే స్కూలు నుంచి తీసుకొచ్చాను. తనను ఏడిపించడం కళ్లారా చూశాను. ప్రిన్సిపల్‌కు ఫోన్ చేశాను. ఆటపట్టించడం వల్ల ప్రభావం ఇలాగే ఉంటుందని తల్లిదండ్రులు, చదువుకున్నవారు, ఉపాధ్యాయులు అందరికీ తెలియాలని అనుకుంటున్నాను’’ అని క్వాడన్ తల్లి చెప్పారు.

"ప్రతి రోజూ ఏదంటే అది అని ఏడిపించడం, తిట్టడం, లేదంటే మారుపేర్లు పెట్టడం.. ఇలా ఏదో ఒకటి జరుగుతోంది. మీరు దయచేసి మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీ స్నేహితులకు మంచిబుద్ధులు నేర్పండి" అన్నారు.

స్పందన ఎలా ఉంది?

ఈ వీడియో వైరల్ అవడంతో శుక్రవారం #StopBullying సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. చాలామంది తమ సొంత అనుభవాలను చెబుతూ క్వాడన్‌కు ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు.

వివిధ దేశాల్లో ఉన్న పిల్లలు కూడా క్వాడన్‌కు స్నేహ సందేశాలు పంపిస్తున్నారు.

మరుగుజ్జు తనంతో ఇలాంటి వేధింపులే భరించిన అమెరికా హాస్యనటుడు బ్రాడ్ విలియమ్స్.. క్వాడన్ కుటుంబాన్ని డిస్నీలాండ్ పంపించేందుకు ఒక్క రోజులో 130 వేల డాలర్లు(93 లక్షలకు పైనే)పైగా సేకరించానని చెప్పాడు.

ఆయన "ఇది క్వాడన్‌కే కాదు, తమ జీవితంలో వేధింపులు ఎదుర్కొని, తమ దగ్గర తగిన స్థోమత లేదని బాధపడే ఎవరికైనా అందుతుంది. ప్రపంచంలో మంచి కూడా ఉందని క్వాడన్‌కు, మిగతా వారికి చూపిద్దాం" అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కొడుకు ఎరిక్ ట్రంప్ "ఈ వీడియో తన గుండె పిండేసిందని" చెప్పాడు.

బాస్కెట్ బాల్ ఆటగాడు ఎనస్ కాంటెర్ ప్రపంచమంతా నీ వెనక ఉందని చెప్పాడు. క్వాడన్ కుటుంబాన్ని తన ఎన్‌బీఏ గేమ్‌కు ఆహ్వానించాడు.

ఆస్ట్రేలియా క్రీడా జట్లు కూడా క్వాడన్ వెంట నిలిచాయి. దేశీయ రగ్బీ లీగ్ ఈ వారాంతంలో జరిగే ఒక మ్యాచ్‌లో తమ జట్టు ముందు లీడ్ చేయాలని బాలుడిని ఆహ్వానించాయి.

క్వాడన్ బేల్స్‌కు రూ.2.1 కోట్ల విరాళాలు

ఈ వీడియో వైరల్ కావడంతో అమెరికాకు చెందిన కమెడియన్ బ్రాడ్ విలియమ్స్ ‘గో ఫండ్ మి’లో ఒక పేజీని ప్రారంభించి క్వాడన్ బేల్స్ కోసం విరాళాల సేకరణ ప్రారంభించారు.

క్వాడన్‌ను డిస్నీలాండ్ పంపించేందుకు 10 వేల అమెరికన్ డాలర్లు (సుమారు రూ.71 లక్షలు) లక్ష్యంగా ఈ పేజీని ప్రారంభించగా.. అనుకున్న దానికంటే 30 రెట్లు ఎక్కువగా 3 లక్షల అమెరికన్ డాలర్లు (సుమారు రూ.2.1 కోట్లు) విరాళాలు సమకూరాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: ప్రపంచవ్యాప్తంగా 8,00,000 దాటిన కోవిడ్ బాధితులు, 37,000 దాటిన మృతులు

కరోనావైరస్: వృద్ధులు చేయాల్సిన, చేయకూడని పనులు

కరోనావైరస్‌తో పోరాటం కోసం ఏర్పాటైన PM CARES ఫండ్‌పై ప్రశ్నలు

కరోనావైరస్: భారత సైన్యం రాత్రికి రాత్రే 1,000 పడకల ఆస్పత్రి నిర్మించిందా? ఏది నిజం? - BBC FactCheck

కరోనావైరస్: ప్రభుత్వం, సమాజం స్పందించే తీరులో వర్ణ వ్యవస్థ ఛాయలు - అభిప్రాయం

కరోనావైరస్‌లో ఏముంది... అది ఎందుకంత ప్రమాదకరం?

కరోనా లాక్‌డౌన్ కుటుంబ సంబంధాల ప్రాధాన్యాన్ని గుర్తు చేసిందా?

కరోనావైరస్‌: తెలంగాణలో దిల్లీ నిజాముద్దీన్ మత కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన ఆరుగురు మృతి

కరోనావైరస్:‌ వేలం వెర్రిగా సాగిన టాయిలెట్ రోల్స్ కొనుగోళ్ళ వెనుక అసలు కథేంటి?