కంబోడియా: ఇరవై లక్షల మందిని చంపేసిన ప్రభుత్వం నుంచి తప్పించుకుని వందేళ్ల వయసులో కలుసుకున్న అక్కాచెల్లెళ్లు

  • 23 ఫిబ్రవరి 2020
అక్కాచెల్లెళ్లు బున్ సెన్(ఎడమ), బున్ చియా(కుడి) Image copyright ccf
చిత్రం శీర్షిక అక్కాచెల్లెళ్లు బున్ సెన్(ఎడమ), బున్ చియా(కుడి)

వారిద్దరూ అక్కచెల్లెళ్లు.. అక్క వయసు 101, చెల్లెలు వయసు 98 ఏళ్లు. చనిపోయారనుకున్న వారిద్దరూ 47 ఏళ్ల తరువాత కలుసుకున్నారు.

కంబోడియాలో 1970ల నాటి ఖెమెర్ రూజ్(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ కంపూచియా ప్రభుత్వం) అరాచక పాలనా కాలంలో చనిపోయిన సుమారు 20 లక్షల మందిలో తన సోదరి కూడా ఉండిఉండొచ్చని ఇద్దరూ ఎవరికి వారు అనుకుని ఆశలు వదులుకున్నారు.

ఖెమెర్ రూజ్ పాలనకు నేతృత్వం వహించిన పోల్ పాట్ 1975లో అధికారం చేజిక్కించుకోవడానికి రెండేళ్ల ముందు 1973లో ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు చివరిసారి కలుసుకున్నారు.

కాగా అక్కచెల్లెళ్లలో ఒకరైన బున్ సెన్(98) ఇప్పుడు తమ సోదరుడిని(92) కూడా కలుసుకోగలిగారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పోల్ పాట్

20 లక్షల మంది మరణం

ఖెమెర్ రూజ్ పాలనాకాలంలో సుమారు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో వేలాది కుటుంబాలు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యాయి. వేలాది మంది చిన్నారులు తమ తల్లిదండ్రులకు దూరమయ్యారు.

పోల్ పాట్ అధికారంలో ఉన్నప్పుడు బున్ సెన్ తన భర్తను కోల్పోయారు. ఆ తరువాత రాజధాని ఫ్నామ్ పెన్‌లోని స్టంగ్ మీంచె మున్సిపల్ డంప్‌యార్డ్ ప్రాంతంలో ఆమె స్థిరపడ్డారు.

అక్కడే చెత్తలో రీసైకిలబుల్ వస్తువులు సేకరించి అమ్ముకుంటూ.. సమీపంలోని కాలనీల్లో పిల్లలను ఆడించే పనిచేస్తూ జీవించారు.

ఆమె ఎప్పుడూ అక్కడికి 130 కిలోమీటర్ల దూరంలోని కాంపాంగ్ చాంప్ ప్రావిన్స్‌లోని తన సొంత ఇంటికి తిరిగి వెళ్లడం గురించి మాట్లాడుతుండేవారు.

కానీ, ఆమె వయసు, నడిచే శక్తి లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల ఆమె మళ్లీ తన సొంతింటికి తిరిగి వెళ్లలేకపోయారు.

Image copyright ccf

13 మంది బంధువులను చంపేశారు

కంబోడియన్ చిల్డ్రన్స్ ఫండ్ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ ఒకటి 2004 నుంచి బున్ సెన్ పోషణ బాధ్యత చూడడం ప్రారంభించింది. ఆ సంస్థ ఆమెను తన సొంతింటికి తీసుకెళ్లాలని తలపోసింది.

ఆ ప్రయత్నాల్లో భాగంగా అక్కడ సొంతూరిలో బున్ సెన్ అక్క, తమ్ముడు ఉన్నట్లు గుర్తించింది.

ఆ తరువాత బున్‌సెన్‌ను అక్కడికి తీసుకెళ్లడంతో 47 ఏళ్ల తరువాత ఆమె తన అక్కను, తమ్ముడిని కలుసుకోగలిగారు.

Image copyright ccf
చిత్రం శీర్షిక సోదరుడితో బున్ సెన్

''ఎన్నో ఏళ్ల కిందట నేను ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. తరువాత మళ్లీ తిరిగి రాలేకపోయాను. అక్క, తమ్ముడు చనిపోయి ఉంటారని అనుకున్నాను'' అన్నారామె.

''నా అక్కను హత్తుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది.. తమ్ముడి చేయి తగలగానే ఏడుపొచ్చేసింది'' అంటూ భావోద్వేగానికి గురయ్యారామె.

ఇక బున్ సెన్ అక్క 102 ఏళ్ల బున్ చియా కూడా తన చెల్లెలు చనిపోయి ఉంటుందనే ఇంతకాలం అనుకున్నారు.

బున్ చియా భర్తను పోల్ పాట్ ప్రభుత్వం చంపేయడంతో 12 మంది పిల్లలతో ఆమె ఒంటరిగా బతుకు సాగించారు.

Image copyright ccf
చిత్రం శీర్షిక రాజధాని పర్యటనలో అక్కాచెల్లెళ్లు

''పోల్ పాట్ మా బంధువుల్లో 13 మందిని చంపేశాడు. చెల్లెలు కూడా ఆ సమయంలోనే చనిపోయి ఉంటుందనుకున్నాం'' అన్నారు బున్ చియా.

ఇంతకాలం అనుభవించిన ఎడబాటును వారిప్పుడు భర్తీ చేసుకుంటున్నారు. అక్కచెల్లెళ్లిద్దరూ కలిసి ఇటీవలే రాజధాని ఫ్నామ్ పెన్‌ పర్యటనకు వెళ్లారు.

Image copyright Bettmann/gettyimages
చిత్రం శీర్షిక పోల్ పాట్

ఇంతకీ ఖెమెర్ రూజ్ పాలకులు అంటే ఎవరు?

* కంబోడియాలో 1975-79 మధ్య ఖెమెర్ రూజ్‌ క్రూర పాలన సాగింది. ఆ సమయంలో సుమారు 20 లక్షల మందిని హతమార్చారు.

* పోల్ పాట్ పాలనలో కంబోడియాను మధ్య యుగాల కాలానికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగాయి. నగరాలు, పట్టణాల్లోని లక్షలాది మందిని బలవంతంగా పల్లెటూర్లకు తరలించి అక్కడి పొలాల్లో పనిచేయించారు.

* ఖెమెర్ రూజ్ కాలం నాటి నాయకుల్లో ప్రస్తుతం జీవించి ఉన్నవారిని విచారించడానికి 2009లో ఐరాస ఒక ట్రైబ్యునల్ ఏర్పాటుకు సహకరించింది.

* ఖెమెర్ రూజ్ పాలకుల్లో ముగ్గురికి మాత్రమే శిక్ష పడింది. ఆ కాలంలో అరాచకాలకు నిలయమైన త్యుయోల్ స్లెంగ్ జైలు బాధ్యతలు చూసిన కైంగ్ గ్యుయెక్ ఈవ్, ఖెమెర్ రూజ్ పాలనలో అధ్యక్షుడిగా ఉన్న ఖియూ సంఫాన్, అప్పటి ప్రధాని పోల్ పాట్‌కు డిప్యూటీగా పనిచేసిన న్యూయాన్ చియాలను జైలుకు పంపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా

కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో 34 కొత్త కేసులతో 226కు చేరిన కోవిడ్ బాధితులు

కరోనావైరస్: ఇండొనేసియాలో క్షణం క్షణం... భయం భయం

కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు

కరోనావైరస్ లాక్‌డౌన్: 'ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు మాత్రమే ఆఫ్ చేయాలి'

కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు? ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?

కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణులు, ఇతర రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'