కరోనావైరస్: దక్షిణ కొరియాలో ఒకే రోజులో రెట్టింపైన రోగుల సంఖ్య

రోగులు

ఫొటో సోర్స్, AFP

తమ దేశంలో కరోనావైరస్ బాధితుల సంఖ్య ఒక్క రోజులోనే రెట్టింపయిందని దక్షిణ కొరియా తెలిపింది. ఒక్క శనివారమే 229 కొత్త కేసులు నిర్ధరణ కావడంతో బాధితుల సంఖ్య 433కి పెరిగిందని అక్కడి అధికారులు వెల్లడించారు.

వైరస్ వ్యాప్తి కొత్త దశలోకి వచ్చిందని దక్షిణ కొరియా ఆరోగ్య శాఖ ఉప మంత్రి కిమ్ గాంగ్-లిప్ అన్నారు.

కొత్త కేసుల్లో చాలా వరకు డేగు నగర సమీపంలో ఉండే ఒక ఆసుపత్రి, ఒక మతానికి చెందినవారున్నారని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే ఇద్దరు కరోనా రోగులు మరణించగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

చియాంగ్డోకు సమీపంలో ఉన్న డేగు నగరంలో ఈ ఆసుపత్రి ఉంది. ఈ ప్రాంతాన్ని అక్కడి ప్రభుత్వం స్పెషల్ కేర్ జోన్‌గా ప్రకటించింది. డేగు నగర వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.

ఫొటో సోర్స్, Chung Sung-Jun/gettyimages

చైనా వెలుపల అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నిర్ధారణయింది దక్షిణ కొరియాలోనే. చనిపోయిన 2,345 మందితో కలిపి చైనాలో మొత్తం 76,288 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ కాగా జపాన్ తీరంలో నిలిపివేసిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో 600 మందికిపైగా ఈ వైరస్ సోకింది.

అయితే, చైనాలో కొత్త కేసులు, మరణాలు రెండూ తగ్గుముఖం పట్టినట్లు శనివారం అక్కడి అధికారులు చెప్పారు.

చైనాతో ఎలాంటి సంబంధం లేకుండా దక్షిణకొరియాలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రియేసస్ ఆందోళన వ్యక్తంచేశారు.

ఆఫ్రికా ఖండంలోని బలహీనమైన ఆరోగ్య సేవల వ్యవస్థలున్న దేశాల్లో ఈ వైరస్ ప్రబలితే కలిగే మరింత ప్రమాదమనని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

చైనా కాకుండా 26 దేశాల్లో 1200 కేసులు నమోదయ్యాయని.. కనీసం 8 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

మిగతా దేశాల్లో..

* క్రూయిజ్ షిప్‌లో ఉన్న బ్రిటిష్, ఇతర ఐరోపా దేశాలకు చెందిన పాసింజర్లను తీసుకొచ్చిన విమానం ఇంగ్లండ్ చేరుకుంది.

* కరోనా వైరస్ కారణంగా తమ దేశంలో ఇద్దరు మరణించారని ఇటలీ ప్రకటించింది.

* తమ దేశంలో అయిదుగురు చనిపోయినట్లు ఇరాన్ వెల్లడించింది. అక్కడి కోమ్ నగరంలో ఈ వైరస్ ప్రబలినప్పటికీ ఇప్పటికే అది దేశంలోని మిగతా అన్ని నగరాలకూ వ్యాపించి ఉంటుందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, JUNG YEON-JE/gettyimages

ఫొటో క్యాప్షన్,

కొత్తగా వైరస్ సోకినవారిలో 62 మంది డేగులోని షిన్‌చియోంజీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే క్రైస్తవ మత శాఖకు చెందినవారని కేసీడీసీ వెల్లడించింది.

దక్షిణ కొరియాలో ఏమైంది?

దక్షిణకొరియా వైద్యాధికారులు శనివారం తొలుత 142 కొత్త కేసులు రికార్డయినట్లు చెప్పారు.. అక్కడికి కొద్ది గంటల్లోనే మరో 87 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణయిందని ప్రకటించారు.

శనివారం నిర్ధరణయిన 229 కేసులతో చియాంగ్డోలోని డీనమ్ హాస్పిటల్‌‌లోనే 95 మంది ఉన్నారని కొరియా సెంటర్స్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(కేసీడీసీ) అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో మొత్తం 114 మందికి కరోనా ఉందని, వారిలో 9 మంది సిబ్బంది కాగా మిగతా వారు పేషెంట్లని చెప్పారు.

బాధిత రోగుల్లో అత్యధికులు మానసిక ఆరోగ్య సమస్యలతో ఉన్నవారని.. వైరస్ బాధితులు, బాధిత ప్రాంతాలతో ఎలాంటి సంబంధం లేనివారికీ సోకిందని, అదెలా సాధ్యమైందో తెలియడం లేదని మంత్రి కిమ్ చెప్పారు.

బుధవారం ఒకరు, శుక్రవారం మరొకరు ఈ హాస్పిటల్‌లో చనిపోయారని యోనాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

కొత్తగా వైరస్ సోకినవారిలో 62 మంది డేగులోని షిన్‌చియోంజీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే క్రైస్తవ మత శాఖకు చెందినవారని కేసీడీసీ వెల్లడించింది. ఈ శాఖ వ్యవస్థాపకుడి సోదరుడు చనిపోగా ఆయన అంత్యక్రియలకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 మధ్య పెద్ద సంఖ్యలో ఆ శాఖకు చెందినవారు హాజరయ్యారని అధికారులు చెప్పారు.

షిన్‌చియోంజీ శాఖకు చెందిన 9,336 మంది సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండగా వారిలో 500 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

డాక్టర్ టెడ్రోస్

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది?

డాక్టర్ టెడ్రోస్ శనివారం మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ వైరస్ సోకిన వారు ఎవరైనా ఉంటే గుర్తించి, చికిత్స చేయడానికి గాను వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తూ పరికరాలు సిద్ధం చేస్తోందని చెప్పారు.

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాలు ఎబోలా వైరస్ పరీక్షలు చేసిన అనుభవాన్ని ఉపయోగించి ఇప్పుడు కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు పరీక్షలు చేయిస్తున్నాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)