పంటలను నాశనం చేస్తున్న మిడతలతో ఆకలి తీర్చుకుంటున్న యుగాండా ప్రజలు

మిడతలు

ఆఫ్రికాలో యుగాండాలోని ఉత్తర ప్రాంతంలో పంటలను ఎడారి మిడతలు నాశనం చేయడంతో దిగుబడి బాగా తగ్గిపోయింది. దీంతో స్థానికులు ఆ మిడతలను ఆహారంగా తీసుకొంటున్నారు.

కిట్గుమ్ జిల్లాలో ఈ పరిస్థితి ఏర్పడిందని యుగాండా రేడియో నెట్‌వర్క్(యూఆర్‌ఎన్) వార్తాసంస్థ తెలిపింది.

మిడతలను ఆహారంగా తీసుకోవడంపై భయాందోళన కూడా వ్యక్తమవుతోంది. మిడతలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకొనేందుకు మిడతల బాధిత ప్రాంతాల్లో యుగాండా ప్రభుత్వం రసాయనిక మందులు పిచికారీ చేయిస్తోంది. అందువల్ల మిడతలను ఆహారంగా తీసుకొంటే ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మిడతలను పట్టుకొని, నీటిలో ఉడికించి, ఎండబెట్టి తర్వాత వాటిని వేయించుకొని తింటున్నామని స్థానికులు చెప్పారు.

మిడతలను స్థానికులు వంటకు సిద్ధం చేస్తున్న ఫొటోలను ది అబ్జర్వర్ పత్రిక పబ్లిష్ చేసింది.

మిడతలను తినొచ్చని పెద్దవారు చెప్పారని, రుచి చూసేందుకు వాటిని పట్టుకోవాలనుకొంటున్నానని గోగో గ్రామానికి చెందిన క్రిస్టీన్ అబాలో అనే మహిళ యూఆర్‌ఎన్‌తో చెప్పారు. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉన్నారు.

తాను రెండు బేసిన్ల నిండా మిడతలు పట్టుకున్నానని బీట్రిస్ అలాన్యో అనే మరో మహిళ చెప్పారు. మిడతలపై రసాయన మందులు చల్లుతున్న నేపథ్యంలో వాటిని తినడం సురక్షితమో, కాదో జిల్లాస్థాయి నాయకులు చెప్పాక ఏం చేయాలనేది నిర్ణయించుకుంటానని ఆమె తెలిపారు.

మిడతల నియంత్రణ విధుల్లో పాలుపంచుకొంటున్న కిట్గుమ్ జిల్లా స్థాయి అధికారి జాన్ బోస్కో కోమకెచ్ యూఆర్‌ఎన్‌తో మాట్లాడుతూ- ఎడారి మిడతలు తినడం హానికరం కాదని, స్థానికులు పట్టుకొన్న మిడతలపై ఇంకా మందు పిచికారీ చేయలేదని చెప్పారు.

ఆఫ్రికాలో యుగాండాతోపాటు సొమాలియా, టాంజానియా, ఇథియోపియా, దక్షిణ సుడాన్ దేశాల్లో ఈసారి మిడతల దండ్లు పంటలను పెద్దయెత్తున నాశనం చేశాయి. గత 25 ఏళ్లలో మిడతలు ఎప్పుడూ ఇంత తీవ్రంగా పంటలను దెబ్బతీయలేదని చెబుతున్నారు.

సొమాలియా మధ్య ప్రాంతంలోని అడాబో పట్టణంలోనూ స్థానికులు మిడతలను వేయించుకొని అన్నం, పాస్తాతో కలిపి తింటున్నట్లు డిసెంబరులో వార్తలు వచ్చాయి. చేపల కంటే మిడతలు రుచిగా ఉన్నాయని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు.

మిడతల దాడులతో సొమాలియా ప్రభుత్వం ఇటీవల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

ఎర్ర సముద్రం మీదుగా యెమెన్ నుంచి ఈ కీటకాలు తూర్పు ఆఫ్రికాలోకి ప్రవేశించాయి. 2019 చివర్లో వానలు భారీగా కురవడంతో కీటకాలు వృద్ధి చెందడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఒక్క రోజులో మిడతలు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. రోజులో ఒక మిడత తన బరువుకు సమానమైన ఆహారాన్ని తినగలదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)