కరోనావైరస్: చైనాలో 92 శాతం పడిపోయిన కార్ల అమ్మకాలు

కార్ల పరిశ్రమ

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన చైనాలో కరోనావైరస్ వ్యాప్తి కార్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఫిబ్రవరి ప్రథమార్ధంలో కార్ల అమ్మకాలు 92 శాతం పడిపోయాయని 'చైనా ప్యాసింజర్ కార్ అసోసియేషన్(సీపీసీఏ)' తెలిపింది.

వైరస్ వ్యాప్తి నివారణ చర్యల నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. డీలర్లు షోరూంలు మూసి ఉంచారు.

ఫిబ్రవరి మొదటి వారంలో దేశవ్యాప్తంగా కార్ల అమ్మకాలు 96 శాతం క్షీణించాయి. సగటున రోజుకు కేవలం 811 కార్లే అమ్ముడయ్యాయి.

మొదటి వారంలో షోరూంలకు కొనుగోలుదారులు దాదాపు ఎవరూ రాలేదని సీపీసీఏ సెక్రటరీ జనరల్ కుయీ డాంగ్‌షూ చెప్పారు.

మరిన్ని షోరూంలను తిరిగి తెరిచినందున అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు సీపీసీఏ చెప్పింది.

డీలర్లు కార్యకలాపాలను క్రమంగా తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ నెల ద్వితీయార్ధంలో అమ్మకాలు పెరుగుతాయని సీపీసీఏ ఆశిస్తోంది.

చైనా కార్ల తయారీదారు జీలీ ఆన్‌లైన్లో కార్లను కొనే సదుపాయాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ ఆన్‌లైన్లో కారును కొంటే దానిని నేరుగా ఇంటి వద్దకు పంపిస్తోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన చైనాలో 'స్టాటిస్టా' సమాచారం ప్రకారం గత ఏడాది రెండు కోట్ల పది లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి.

కార్ల మార్కెట్లలో చైనా తర్వాతి స్థానంలో అమెరికా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఆర్థిక వృద్ధి మందగమనం, అమెరికాతో వాణిజ్య ఘర్షణ కారణంగా కరోనావైరస్ వ్యాప్తికి ముందే చైనాలో కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.

ఆర్థిక వృద్ధి మందగమనం, అమెరికాతో వాణిజ్య ఘర్షణ కారణంగా కరోనావైరస్ వ్యాప్తికి ముందే చైనాలో కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.

చైనాలో అమ్మకాలు పడిపోవడమే కాదు, కార్ల ఉత్పత్తి కూడా దెబ్బతింది.

చైనాలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన కార్ల తయారీసంస్థలు పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయడానికి అనుకున్నదాని కన్నా చాలా ఎక్కువ కాలమే పడుతుందని చెబుతున్నాయి.

చైనాలో ఇతర పరిశ్రమలు, రంగాలపైనా కరోనావైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది.

వైరస్ వ్యాప్తి ప్రభావం ఐఫోన్ ఉత్పత్తి, అమ్మకాలపై పడిందని ఆపిల్ సంస్థ ఇటీవల ప్రకటించింది.

చైనాలో కరోనావైరస్ వ్యాధి(కోవిడ్19)తో 2,345 మంది చనిపోయారు. వీరితో కలిపి దేశంలో 76,288 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)